సాధారణంగా 16 ఏళ్ల వయస్సులో పిల్లలు పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఏం చదవాలో నిర్ణయించుకునే పరిస్థితిల ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు.. అప్పటికే కోట్లాది రూపాయల కంపెనీని స్థాపించింది. చిన్న వయసులోనూ అద్భుత విజయాలు సాధించవచ్చిన నిరూపించింది. స్ఫూర్తిదాయకమైన ఆ జీనియస్ అమ్మాయి విజయగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రాంజలి అవస్తీ అమెరికాలో ఉంటుంది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఙానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె 16 సంవత్సరాల వయస్సులోనే 2022లో తన ఏఐ స్టార్టప్, డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI)ని స్థాపించింది. ఆమె వినూత్న ఆలోచనలు, అంకితభావం తన స్టార్టప్‌ను అతి తక్కువ సమయంలోనే అస్థిరమైన ఎత్తులకు చేర్చాయి. ప్రస్తుత దీని విలువ రూ. 100 కోట్లు.
రెండేళ్లు కంప్యూటర్ సైన్స్, గణితాన్ని అభ్యసించిన తరువాత, అవస్తి 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మనసులో డెల్వ్ డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది. మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది. అనేక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ కీలకమని గ్రహించింది.
డెల్వ్ డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్‌ట్రాక‌్షన్ మెరుగుపరచడం, డేటా సిలోస్‌ను తొలగించడం చేస్తుంది. ఆన్‌లైన్ కంటెంట్ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చర్లకు సహాయం చేస్తుంది. గతేడాది ప్రాంజలి స్టార్టప్‌కు రూ.3.7 కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. 10 మంది ఉద్యోగులు దాకా ఇక్కడ పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment