
రోనక్ కుమార్ సామంత్రాయ్‌తో సిద్ధార్థ దురైరాజన్
చేతులు కలిపిన హైలెనర్, టేక్‌మీ2స్పేస్
సాక్షి, హైదరాబాద్: ఉపగ్రహాలతో శాటిలైట్ టీవీలు మొదలుకొని ఖనిజాల గుర్తింపు వరకూ అనేక ప్రయోజనాలున్నాయి. అయితే భూమికి దూరంగా కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు పని చేయాలంటే విద్యుత్తు కావాలి. ఇప్పటివరకూ బరువైన సోలార్ ప్యానెల్స్ లేదా బ్యాటరీలతో ఈ విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఇలా కాకుండా... రేడియో ధార్మిక పదార్థాలు వెలువరించే వేడినే విద్యుత్తుగా మార్చగలిగతే? ఎన్నో ప్రయోజనాలుంటాయి. హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ హైలెనర్ టెక్నాలజీస్ అచ్చంగా ఇదే పనిలో ఉందిప్పుడు. ఈ దిశగా టేక్‌మీ2స్పేస్ అనే కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వేడిని విద్యుత్తుగా మార్చేందుకు ఇప్పటికే థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ.. వీటితో అధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కష్ట సాధ్యం. మరోవైపు హైలెనర్ టెక్నాలజీస్ సంస్థ ప్రపంచంలో మొదటిసారి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా కాలుష్యం ఏమాత్రం లేని విద్యుత్తును ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. టేక్‌మీ2 స్పేస్ భూ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు కంపెనీలిప్పుడు చేతులు కలిపాయి. ఉపగ్రహాలకు విద్యుత్తును అందించేందుకు హైలెనర్ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థలను పరీక్షించేందుకు నిర్ణయించాయి. వేడిని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడం.. ఉపగ్రహాల్లోని కంప్యూటర్లను నడిపించడం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.
‘‘లెనర్ టెక్నాలజీ అంతరిక్షంలోనూ పనిచేస్తుందని నిరూపించడం చాలా కీలకం. టేక్‌మీ2స్పేస్ నైపుణ్యం, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో ఈ విషయాన్ని నిరూపించేందుకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని హైలెనర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే.. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లోనూ అక్కడక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఏర్పడుతుంది. అది కూడా వృథా అవుతున్న వేడి సాయంతో!!
ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!
‘‘ఉపగ్రహాల్లో వేడిని తగ్గించడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. హైలెనర్ టెక్నాలజీస్ ఉత్పత్తులు ఈ ఘనత సాధిస్తే అతితక్కువ స్థలంలో దీర్ఘకాలం పనిచేయగల ఒక ఇంధన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’’ అని టేక్‌మీ2 స్పేస్ వ్యవస్థాపకుడు రోనక్ కుమార్ సామంత్రాయ్ తెలిపారు. సౌర విద్యుత్తు, బరువైన బ్యాటరీల వాడకాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వివరించారు.