ఉద్యోగస్తుల కోసం వర్క్ ఫ్రం హోమ్ స్పేస్
పార్కింగ్‌లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
పిల్లల కోసం స్టడీ, డిజిటల్ క్లాస్ రూమ్
టెర్రస్, క్లబ్‌హౌస్‌పై సౌర విద్యుత్ సౌకర్యం
పెంపుడు జంతువుల కోసం పెట్‌పార్క్
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్‌హౌస్‌పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్‌డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్‌పార్క్, గోల్ఫ్‌కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు.
–సాక్షి, సిటీబ్యూరో
పెట్ పార్క్, స్పా..
జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్‌పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.
సోలార్, హోమ్ గార్డెనింగ్
సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్‌కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్‌డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్‌హౌస్‌పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.
ఈవీ చార్జింగ్ స్టేషన్లు
పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.
వసతులు ఇలా..
నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు.
జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్‌పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో
అందుబాటులో ఉంటాయి.రిచ్‌మ్యాన్ గేమ్‌గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్‌లు కాస్త ఔట్‌డోర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.
వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్‌ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment