home buyers
-
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్‌లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్‌లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్‌లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్‌లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్‌లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు. వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్లో ఎన్బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు సీనియర్ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు. రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. -
ట్విన్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్!
న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్ జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన నిపుణుల సమక్షంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు. దశలవారీగా ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
ట్రెండ్ మారింది.. గ్రేటర్లో ఒక్కసారిగా ఆ గృహాలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. కరోనా కంటే ముందు తక్కువ విస్తీర్ణం ఉండే అందుబాటు గృహాలను కొనుగోలు చేసేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి భౌతిక దూరం తప్పనిసరి కావటంతో ఇంటి విస్తీర్ణం పెరిగింది. దీంతో చవక గృహాల నుంచి మధ్య తరహా ఇళ్ల వైపు దృష్టిసారించారు. ఫలితంగా రూ.25–50 లక్షల మధ్య ధర ఉండే గృహాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. గ్రేటర్లో గత నెలలో రూ.2,841 కోట్ల విలువ చేసే 5,408 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇందులో 53% ఈ తరహా ఇళ్లే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. 25 శాతం క్షీణత: గతేడాది జూన్‌లో జరిగిన 7,251 రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూన్ నాటికి 25 శాతం తగ్గుదల కనిపించింది. త్రైమాసికాల వారీగా గమనిస్తే.. ఈ ఏడాది జనవరి – మార్చి (క్యూ1)లో రూ.9,230 కోట్ల విలువ చేసే 21,488 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్యూ2 నాటికి రూ.8,685 కోట్ల విలువ చేసే 17,074 ప్రాపర్టీలు రిజిస్ట్రేషనయ్యాయి. రూ.25 లక్షల లోపు ధర ఉన్న సామాన్య గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతుంది. గతేడాది జూన్‌లో వీటి వాటా 40 శాతంగా ఉండగా.. ఈ జూన్ నాటికి 16 శాతానికి క్షీణించింది. ఇక గతేడాది జూన్‌లో మధ్య తరహా ఇళ్ల వాటా 35 శాతంగా ఉంది. 81 శాతం గృహాల వాటా వీటిదే: రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాలకు 2021 జూన్‌లో 25 శాతం ఉండగా.. గత నెలలో 32 శాతానికి పెరిగింది. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాలకు గతేడాది జూన్‌లో 7 శాతం వాటా ఉండగా.. ఇప్పుడవి 9 శాతానికి పెరిగింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 81 శాతం ప్రాపర్టీలు 2 వేల చ.అ. లోపు విస్తీర్ణం ఉన్నవే. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్నవి 9 శాతం, 3 వేల కంటే ఎక్కువ ఉన్నవి 2 శాతం ప్రాపర్టీలున్నాయి. చదవండి: Yamaha Rx 100: ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది! -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్ ఏర్పడింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చు. -
రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: గృహ కొనుగోలు దారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తమ అధికార పరిధిలో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) (రెరా) చట్టం, 2016 నిబంధనల అమలుపై కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సోమవారం ఆదేశించింది. రెరా చట్టం కింద నోటిఫై చేయబడిన అమ్మకపు నిబంధనల ఒప్పందం, వాటి అమలు గురించి నిర్దిష్ట సమాచారం కోరుతూ 2022 మార్చిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిందని, అయితే ఇప్పటి వరకు కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే స్పందించాయని జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘రియల్టీకి సంబంధించి కేంద్రం నిర్వహించే కసరత్తును సులభతరం చేయడానికి, మే 15 లేదా అంతకు ముందు రెరా నిబంధనలపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రతిస్పందించాలని మేము అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశిస్తున్నాము‘ అని బెంచ్ పేర్కొంది. రాష్ట్రాల నుండి సంబంధిత సమాచారాన్ని స్వీకరించిన తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఈ అంశంలో అమికస్ క్యూరీ దేవాశిష్ భారుకా ధర్మాసనానికి ఒక నివేదిక సమర్పిస్తారని కూడా బెంచ్ పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై మూడవ వారానికి వాయిదా వేసింది. అమికస్ దేవాశిష్ ఏమి చెప్పారంటే... రెరా నిబంధనలపై నివేదిక ఎంత వరకూ వచ్చిందని అమికస్ను తొలుత బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు కొన్ని స్పందనలు వచ్చాయని, వాటిలో కొన్ని వైరుధ్యాలు కనిపించాయని ఈ సందర్భంగా అమికస్ తెలిపారు. ఈ వైరుధ్యాలకు కారణాలు ఏమిటని తాము కోరినట్లు కూడా ఆయన వివరించారు. కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలకు కేవలం ఐదు రాష్ట్రాలే స్పందించాయని తెలిపారు. నివేదిక సిద్ధమైన తర్వాత దానిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశిస్తామని ఆదేశిస్తామని ఈ సందర్భంగా బెంచ్ పేర్కొంది. నోటిఫై చేయని కొన్ని రాష్ట్రాలు... రెరా అమల్లోకి వచ్చిన తర్వాత 2016లో ‘అగ్రిమెంట్ ఫర్ సేల్’ ముసాయిదాను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపి కేంద్రం పంపి వాటిపై అభిప్రాయాలను కోరింది. కొన్ని రాష్ట్రాలు వీటిని నోటిని చేశాయి. పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అసలు ఈ నిబంధనలను నోటిఫై చేయలేదు. రియల్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాలు కొన్ని మార్పులు చేసి నోటిఫై చేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ భాటి గతంలో కోర్టుకు తెలియజేశారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందం ఆవశ్యకతను ఉన్నత న్యాయస్థానం జనవరి 17న ఉద్ఘాటించింది. రెరా నిబంధనల ప్రకారం ఏకరీతి నిబంధనలను రూపొందించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిని రాష్ట్రాలకు వదిలివేయడానికి బదులుగా మోడల్ బిల్డర్–బైయర్ ఒప్పందం, మోడల్ ఏజెంట్–కొనుగోలు ఒప్పందాన్ని దేశం మొత్తానికి వర్తింపజేసేలా చర్చలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యేకించి ప్రాథమిక నిబంధనలు, షరతుల విషయంలో కొంత ఏకరూపత ఉండేలా చర్యలు అవసరమని తెలిపింది. ఫ్లాట్ కొనుగోలుదారులు దోపిడీకి గురికాకుండా ఉండేలా కేంద్ర సలహా మండలి రూపొందించిన మోడల్ బిల్డర్–కొనుగోలుదారుల ఒప్పందాన్ని రూపొందించడం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశమని పేర్కొంది. కేంద్రం అఫిడవిట్ ఏమి చెబుతోందంటే.. ఈ వ్యాజ్యంలో కేంద్రం తన అఫిడవిట్‌ను దాఖలు చేస్తూ, ‘‘రియల్టీకి సంబంధించి ఒక బలమైన నియంత్రణ యంత్రాంగం ఉంది. గృహ కొనుగోలుదారుల హక్కులు, ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్న రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనల ప్రకారం విక్రయానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందం ఇప్పటికే రూపుదిద్దుకుంది. ప్రమోటర్లలో జవాబుదారీ, పారదర్శక విధానాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం’’ అని పేర్కొంది. ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్, అమ్మకం ముందే రియల్టీ ప్రాజెక్టుల రిజిస్టేషన్ను, సకాలంలో యూనిట్ల డెలివరీని చట్టం నిర్దేశిస్తున్నట్లు తెలిపింది. నిధుల మళ్లింపును నివారించడానికి పటిష్ట నియంత్రణలు విధించినట్లు వివరించింది. వినియోగదారుల రక్షణ కోసం రియల్ ఎస్టేట్ రంగంలో మోడల్ బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యమని గతేడాది అక్టోబర్ 4న సుప్రీం కోర్టు పేర్కొంది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. పిల్ నేపథ్యం... రెరా చట్టం కింద వివిధ రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలు గృహ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఈ విషయంలో గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2016లో కేంద్రం రూపొందించిన నిబంధనలకు– రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలకు ఏమైనా తేడాలున్నాయా అని పరిశీలించి 2022 మే మొదటి వారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ విషయంలో న్యాయవాది దేవాశిష్ భారుకాను అమికస్ క్యూరీగా (కేసు విచారణలో న్యాయ సలహాదారు) నియమించింది. రాష్ట్రాలు రూపొందించన నిబంధనలను పరిశీలించడానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సహాయం చేయాలని దేవాశిశ్ భారుకాకు సూచించింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్డర్–బయ్యర్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) విచారణలో భాగంగా అత్యున్నత ధర్మాసనం ఈ చొరవ తీసుకుంది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఏకరూపత ఒప్పందాలను అన్ని రాష్ట్రాలూ అమ లు చేసేలా చర్యలు ఉండాలని ఆయన కోరారు. రెరా చట్టం, 2016 ప్రకారం కస్టమర్లను రక్షించడానికి, రియల్టీ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి బిల్డర్లు, ఏజెంట్, కొనుగోలుదారు ల కోసం మోడల్ ఒప్పందాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి: రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్! -
తెలంగాణ నంబర్4
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యకలాపాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదులో దేశంలోనే తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. టీఎస్ రెరాలో 4,002 రియల్టీ ప్రాజెక్ట్‌లు, 2,017 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,248 ప్రాజెక్ట్‌లు, 151 మంది మధ్యవర్తులు నమోదయ్యా రు. దేశవ్యాప్తంగా 74,088 ప్రాజెక్ట్‌లు, 58,790 మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 33,154 ప్రాజెక్ట్‌లు 11,231 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. గుజరాత్లో 9,689 ప్రాజెక్ట్‌లు, 2,695 మంది మధ్యవర్తులు, మధ్యప్రదేశ్‌లో 4,016 ప్రాజెక్ట్‌లు 935 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక రెరాలో వెయ్యికి పైగా ప్రా జెక్ట్లు రిజిస్టరయ్యాయి. అత్యల్పంగా ఎన్సీఆర్ రెరాలో 34, పాండిచ్చేరి రెరాలో 194, ఉత్తరాఖండ్‌లో 332 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. శాశ్వత అథారిటీ లేదు.. తెలంగాణ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే శాశ్వత రెరా అథారిటీ లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఇంటెర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రెరాను ఏర్పాటు చేయని రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. -
Telangana: రెరా లేకుండానే విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, పెట్టుబడులకు రక్షణ కల్పించే టీఎస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) లక్ష్యానికి కొందరు డెవలపర్లు తూట్లు పొడుస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్) కింద య«థేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. కొందరు డెవలపర్లయితే స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. తనది కాని స్థలంలో ఆకాశహర్మ్యం నిర్మిస్తామని మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రతిపాదిత హెచ్ఎండీఏ అనుమతులు అని బ్రోచర్లో ముద్రించి యూడీఎస్ కింద విక్రయాలనే చేస్తోంది కరోనా సమయంలో పుట్టుకొచ్చిన ఓ నిర్మాణ సంస్థ. మేడ్చల్‌లో 3.04 ఎకరాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ప్రకటించింది. 1,100 నుంచి 1,525 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 273 రెండు, మూడు పడక గదులను నిర్మిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు నిర్మాణ అనుమతులు రాలేదు, టీఎస్ రెరాలో నమోదు కాకుండానే 60–80 వరకు గృహాలను విక్రయించడం గమనార్హం. విక్రయ ధర కూడా వేర్వేరుగా ఉంటుందట. రెగ్యులర్ ధర రూ.3,499 కాగా.. ఆఫర్ కింద రూ.2,200కే విక్రయిస్తుందంట. అంటే 2 బీహెచ్‌కే ధర రూ.24.20 లక్షలు. అదే బ్యాంక్ రుణం ద్వారా కొనుగోలు చేస్తే.. చ.అ.కు రూ.2,600 అంట. 2 బీహెచ్కేకు రూ.28.60 లక్షలు అవుతుంది. ఇందులోను 50 శాతం ముందస్తు సొమ్ము చెల్లించాలని, మిగిలిన సొమ్ముకు మాత్రమే లోన్‌కు వెళ్లాలనే షరతు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. -
క్లబ్‌హౌస్‌లలో వర్క్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైనా సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.ల ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటివి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చని ఆర్వీ నిర్మాణ్ ఎండీ సీహెచ్ రామచంద్రా రెడ్డి తెలిపారు. -
రాయితీలుంటేనే గృహ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు వైఖరిలో మార్పులు వచ్చాయి. కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను కస్టమర్లు కోరుకుంటున్నారని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 3 వేల మంది కస్టమర్లతో సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం గతంతో పోలిస్తే పెట్టుబడి సరైన సాధనంగా రియల్ ఎస్టేట్ అని భావించే వారి శాతం పెరిగింది. గతంలో 35% ఉండగా.. ఇప్పుడది 43 శాతానికి పెరిగింది. గతంలో స్టాక్ మార్కెట్లు సరైన ఇన్వెస్ట్‌మెంట్స్‌గా 15%మంది భావించగా.. ఇప్పుడది 20 శాతానికి చేరింది. కాగా.. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), బంగారంలో పెట్టుబడులపై కస్టమర్ల ఆసక్తి క్షీణించింది. గతంలో 22 శాతం మంది ఎఫ్డీలు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని భావించగా.. ఇప్పుడు 19 శాతానికి, గతంలో బంగారంలో పెట్టుబడులకు 28 శాతం మంది ఆసక్తి కనబర్చగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 71% మంది కొనుగోలు నిర్ణయాలను తీసుకునేలా, ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించే విధంగా డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ చెల్లింపు విధానాలను కోరుకుంటున్నారు. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ), సరఫరా ఎక్కువ ఉన్న డెవలపర్లు డిస్కౌంట్లను అందిస్తున్నారని, రుణ చెల్లింపులు, ఇతరత్రా నిర్వహణ కోసం తప్పదని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని చెప్పారు. ఇప్పటికే డెవలపర్లు తక్కువ మార్జిన్లలో ఉన్నారని పేర్కొన్నారు. డిమాండ్–సరఫరాలను బట్టి ధరలపై నియంత్రణ ఉంటుందన్నారు. చాలా మంది కస్టమర్లు పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతుండటం, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడం కారణంగా ఇళ్లకు డిమాండ్ పెరిగిందని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి కూడా డిమాండ్‌కు ఊతమిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో హోమ్బయ్యర్లు ఇళ్ల కోసం వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. 33 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలు ఒత్తిడిలోనే..: అనరాక్ కాగా, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి 100 బిలియన్ డాలర్ల రుణాలను అందించాయని.. వీటిలో 67 శాతం లోన్లు మాత్రమే సురక్షిత జోన్లో ఉండగా.. మిగిలిన 33 శాతం (33 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఆ 33 శాతంలో 15 శాతం (15 బిలియన్ డాలర్లు) కొంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ రికవరీకి అవకాశం ఉందని.. 18 శాతం (18 బిలియన్ డాలర్లు) రుణాలు మాత్రం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. ఆయా డెవలపర్ రుణగ్రహీతలు అధిక పరపతి కలిగి ఉన్నారని తెలిపింది. 2019 ముగింపు నాటికి 93 బిలియన్ డాలర్ల రియల్టీ రుణాలలో 16 శాతం తీవ్రమైన ఒత్తిడి లోన్లని పేర్కొంది. దేశీయ రియల్టీ రుణాలలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ), ట్రస్టీషిప్స్ వాటా 63 శాతం వరకున్నాయని తెలిపింది. శాఖల వారీగా చూస్తే. బ్యాంక్‌ల వాటా 37 శాతం, హెచ్ఎఫ్సీలు 34 శాతం, ఎన్‌బీఎఫ్‌సీల వాటా 16 శాతం, ట్రస్టీషిప్స్ వాటా 13 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంక్‌లు, హెచ్ఎఫ్సీల లోన్ బుక్‌లలో వరుసగా 75, 66 శాతంతో సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలలో 46 శాతం వాచ్‌లిస్ట్ జాబితాలో ఉన్నాయని పేర్కొంది. గ్రేడ్–ఏ డెవలపర్లకు ఇచ్చే లోన్లలో 75 శాతం సురక్షిత జోన్లోనే ఉన్నాయని.. రియల్టీ రంగానికి పంపిణీ చేసే మొత్తం రుణాలలో 73 బిలియన్ డాలర్లు గ్రేడ్–ఏ బిల్డర్లకే అందుతాయని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. పుణే ఎన్సీఆర్, ముంబై నగరాలలోని మొత్తం రుణాలలో వరుసగా 40, 39, 37 శాతం లోన్లు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత బెంగళూరులో 15 శాతం, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలలో 3–4 శాతం లోన్లు ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. -
అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్ సబ్వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్ బాడీ ఏర్పాటు వంటి వాటితో రియల్టీలో జోష్ నింపుతుందనుకున్న బడ్జెట్ నీరుగార్చింది. అందుబాటు గృహ కొనుగోలుదారులు, వాటి నిర్మాణదారులకు మినహా రియల్టీ రంగానికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. లాజిస్టిక్ పాలసీ, కొత్త యూనివర్సీటీలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార అవకాశాలను కల్పించారు. రవాణా, మౌలిక రంగ వసతుల కేటాయింపులతో దీర్ఘకాలంలో గృహ విభాగానికి డిమాండ్ వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటు గృహాల మీదే ఫోకస్.. తొలిసారి ఇల్లు కొనే వారికి అందించే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువును మరొక ఏడాది పొడిగించారు. అంటే అఫోర్డబుల్ హౌజింగ్ వడ్డీ రాయితీని 2021 మార్చి వరకు పొందే వీలుందన్నమాట. అందుబాటు గృహాల నిర్మాణదారులకు లాభాల మీద 100 శాతం పన్ను మినహాయింపు లను మరో ఏడాది పొడిగించింది. పెరిగిన ఏడాది పన్ను మినహాయింపు లాభాలను పూర్తి స్థాయిలో వినియోగిం చుకునేందుకు కొనుగోలుదారులు, డెవలపర్లు ముందుకొస్తారు కాబట్టి అఫోర్డబుల్ హౌజింగ్స్‌కు డిమాండ్ పెరుగుతుందని నరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ నిరంజన్ హిర్‌నందానీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపన్ను శాతాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఇది ఆయా పన్ను చెల్లింపుదారులకు రియల్టీ పెట్టుబడులకు అవకాశమిస్తుందని టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. రియల్టీకి కొత్త ఇన్వెస్ట్మెంట్ దారులు.. డేటా సెంటర్లు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అవకాశాలు మెరుగవుతాయని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ అన్నారు. ఢిల్లీ–ముంబై, బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేస్, బెంగళూరు సబర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాజెక్ట్‌లతో మౌలిక రంగంలో స్కిల్ డెవలప్మెంట్ పెరగడంతో పాటూ ఆయా మార్కెట్లలో డెవలపర్లకు కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. కొత్తగా వంద విమానాశ్రయాలు, ఐదు స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్ రియల్టీకి అవకాశాలు వస్తాయని తెలిపారు. 2024 నాటికి పరిశ్రమ ఆదాయం 3.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. లాజిస్టిక్ బూస్ట్.. నేషనల్ లాజిస్టిక్ పాలసీ ప్రకటనతో వేర్‌హౌజ్, లాజిస్టిక్ రంగంలో సరఫరా పెరుగుతుంది. గతేడాది దేశంలో 21.1 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌజ్ సప్లయి 2023 ముగింపు నాటికి 37.9 కోట్ల చ.అ.లకు చేరుతుందని అనరాక్ కన్సల్టెన్సీ అంచనా వేసింది. సింగిల్ విండో క్లియరెన్స్‌తో వేర్‌హౌజ్ అనుమతుల సమయం 6 నెలలకు తగ్గిపోతుంది. 2019లో దేశంలోని ప్రధాన నగరాల్లో 3.6 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ నికర లావాదేవీలు జరిగాయి. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ (సర్ఫాసీ చట్టం) కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల అసెట్స్ నిర్వహణను రూ.500 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు. దీంతో మధ్యలోనే ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల నిధులను రికవర్ చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించాలి. -
ఇల్లు చక్కదిద్దండి..!
దేశీయంగా రియల్టీ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో రెండో స్థానంలో ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా సుమారు 10 శాతం. రియల్టీ రంగంలో కమర్షియల్ లీజింగ్, లావాదేవీల వృద్ధి మెరుగ్గానే ఉన్నా.. రెసిడెన్షియల్ రంగం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాజెక్టుల జాప్యం, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కుదేలవడం తదితర అంశాలతో గృహాల కొనుగోలుదారులు.. కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటూ ఉన్నారు. అటు బ్యాంకులు కూడా మొండిబాకీల వసూలు పనిలో పడి కొత్త, పాత ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో ఆఖరు దశలో నిల్చిపోయిన ప్రాజెక్టులకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 25,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయడం రియల్టీ రంగానికి కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో పాటు రాబోయే బడ్జెట్లో ఈ రంగానికి ఊతమిచ్చేలా తీసుకోతగిన మరిన్ని చర్యల గురించి అంచనాలు నెలకొన్నాయి. ►అన్నింటికన్నా ముందుగా కొనుగోలుదారుల్లో సెంటిమెంటు మెరుగుపర్చాలి. ఇందుకోసం గృహ రుణాలకు సంబంధించి పరిమితంగా కనీసం ఏడాది వ్యవధికైనా వడ్డీ/అసలుపై గణనీయంగా ఆదాయపు పన్ను మినహాయింపులు కల్పించవచ్చు. ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉన్న మినహాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్లు కొనుగోలు చేసే అందరికీ రూ. 7.5 లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో డిమాండ్, అమ్మకాలకూ ఊతం లభించగలదు. రూ. 1.5 కోట్లు – రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే ఇళ్ల కొనుగోలుదారులకు కూడా ప్రోత్సాహకంగా ఉండగలదు. ►2020 మార్చి 31లోగా కుదుర్చుకున్న, నమోదు చేసుకున్న రియల్టీ లావాదేవీలపై స్టాంపు డ్యూటీ 50% తగ్గించాలి. ►గృహ రుణాలపై వడ్డీ రేట్లను వార్షికంగా 7 శాతం స్థాయికి తగ్గించాలి. ►బ్యాంకులు తమ విచక్షణాధికారంతో రుణాల ను పునర్వ్యవస్థీకరించడం లేదా మొండిబాకీలకు సంబంధించి వన్‌టైమ్ రోలోవర్ అవకాశా లను రియల్టీ రంగానికి కూడా వర్తింపచేయాలి. ►పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు రెంటల్ హౌసింగ్ విధానానికి ఊతమివ్వాలి. ►నిధుల లభ్యతపరమైన సవాళ్ల నుంచి రియల్టీ రంగాన్ని గట్టెక్కించాలి. ఇందుకు ద్రవ్యవిధానాలపరంగా సాహసోపేతమైన చర్యలు అవసరం. ►పొజెషన్ ఇచ్చే దాకా వడ్డీని డెవలపరే భరించేలా వడ్డీ రాయితీ పథకాలను పునరుద్ధరించాలి. ►అఫోర్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని సవరించాలి. రూ. 45 లక్షల ధర పరిమితిని తక్షణమే తొలగించి, 60/90 చ.మీ. కన్నా తక్కువ ఉన్న అన్ని ఇళ్లకు ప్రయోజనాలు వర్తింపచేయాలి. ►నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల విషయంలో ఆదాయపు పన్ను మినహాయింపుపరమైన మినహాయింపులు లభించకపోతుండటంతో ఆ వర్గం కొనుగోలుదారులకు సమస్యాత్మకంగా ఉంటోంది. పెండింగ్ ప్రాజెక్టులు మూడు–నాలుగేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న దరిమిలా.. ఆ మేరకు కొనుగోలుదారులకు కూడా పన్నుపరమైన ఊరట కల్పించవచ్చు. ►వాణిజ్యపరమైన రియల్టీ ప్రాజెక్టుల వస్తు,సేవల పన్ను (జీఎస్టీ)పై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలి. లీజింగ్ కోసం అభివృద్ధి చేసిన ప్రాపర్టీలను సర్వీస్ కింద పరిగణించి 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయాలు పెరిగిపోతున్నాయి. పన్ను ప్రయోజనాలు మరిన్ని కల్పించాలి: సీఐఐ న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు ఊతమిచ్చేలా గృహాల కొనుగోలుదారులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. కనీసం 6–7% జీడీపీ వృద్ధి సాధించాలంటే రియల్టీ రంగానికి తోడ్పడేలా స్పష్టమైన ప్రణాళిక అవసరమని పేర్కొంది. దీనితో సంఘటిత, అసంఘటిత రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని వివరించింది. రియల్టీకి నిధులపరమైన మద్దతుతో పాటు డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలు అవసరమని వివరించింది. ‘అన్ని ప్రాపర్టీలపై తీసుకున్న గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై గరిష్ట పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000కు పెంచాలి‘ అని పేర్కొంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకానికి ఎంఐజీ1,2 కేటగిరీల వారి ఆదాయ పరిమితిని ఇప్పుడున్న రూ.12–18 లక్షల నుంచి రూ. 18–25 లక్షలకు పెంచాలని తెలిపింది. -
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లోనే కొంటాం
సాక్షి, హైదరాబాద్: గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లకే నగరవాసులు జై కొడుతున్నారు. 44 శాతం కస్టమర్లు రెడీ టు హోమ్స్‌లో కొనేందుకు లేదా 24 శాతం మంది కనీసం 6 నెలల్లోపు పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. నిర్మాణం పూర్తయిన గృహాలకు జీఎస్టీ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2013, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు సుమారు 5.76 లక్షల వరకుంటాయని అనరాక్ డేటా తెలిపింది. గత రెండేళ్లుగా నగరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. -
రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!
సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలకు గృహకొనుగోలుదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ, పీఎంసీ బ్యాంకు స్కాంకు ప్రధాన కారణమై హెచ్‌డీఐల్ వినియోగదారులు రోడ్డెకారు. 350 కోట్ల రూపాయల మేర ఇరుక్కుపోయాం కాపాడమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొంతమంది గృహ కొనుగోలుదారులు లేఖ రాశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాజక్టులో చిక్కుకున్నామని వాపోయారు. సబర్బన్ ములుండ్ ప్రాజెక్టులోని 450 మంది హెచ్డిఐఎల్ బాధితులు ఈ లేఖ రాశారు. దివాలా తీసిన హెచ్‌డీఐఎల్ రియల్టర్‌కు మొత్తం 350 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తమను ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలని, విస్పరింగ్ టవర్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. 2010లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో బుకింగ్ చేసుకున్నామనీ, అయితే గత తొమ్మిదేళ్లలో 46 అంతస్తుల టవర్‌లో 18 అంతస్తులు మాత్రమే నిర్మించారనీ, రెండవ దశలో కూడా పనులు ప్రారంభించలేదని అసోసియేషన్ ఆరోపించింది. ముంబై ప్రాజెక్టు కోసం రియల్టర్లు అలహాబాద్ బ్యాంక్, జెఅండ్‌కె బ్యాంక్, సిండికేట్ బ్యాంకునుంచి రూ .517 కోట్లు తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. మరో 525 కోట్ల రూపాయలను హెచ్డిఐఎల్ సమీకరించిందని, ఆ ఇంటి యజమానులు భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగాఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో తమ సొమ్ము ఇరుక్కుపోయిందని ఆందోళనవ్యక్తం చేశారు. గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్ల అమ్మకాలపై అలహాబాద్ బ్యాంకుకు తెలియజేయకుండా హెచ్‌డీఐఎల్ మోసం చేసిందని, వివిధ రుణదాతల నుండి గృహ రుణాలు తీసుకున్నందుకు బ్యాంకు నుండి ఎన్ఓసిలను జారీ చేయకుండా వినియోగదారులను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.6,500 కోట్ల ఈ స్కాంనకు సంబంధించిన కేసులో అక్టోబర్ 3న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు, రాకేశ్ వాధవన్ అతని కుమారుడు సారంగ్ వాధవన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ రుణాలే ముంచాయ్! -
చోక్సికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన గృహ కొనుగోలుదారులు
ముంబై : ఇటీవల యావత్ దేశం మొత్తంలో పెను సంచలనంగా మారిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి కుంభకోణంలో కేవలం బ్యాంకులు మాత్రమే కాక, గృహకొనుగోలు దారులు కూడా భారీగా నష్టపోయారట. లగ్జరీ రెసిడెన్షియల్ గృహాలు కట్టి ఇస్తానని చెప్పిన మెహుల్ చోక్సి, వారి వాగ్ధానాలను నేరవేర్చకుండా.. పీఎన్బీలో భారీ కుంభకోణం జరిపి దేశం విడిచి పారిపోయాడు. దీంతో పీఎన్బీ బ్యాంక్‌తో పాటు తమకు అన్యాయం జరిగింది అంటూ.. గృహ కొనుగోలుదారులు కూడా రోడ్డుపైకి వచ్చారు. డైమండ్ కింగ్ నీరవ్ మోదీ మేనమామ అయిన మెహుల్ చోక్సి గీతాంజలి జువెల్లరీ సంస్థలతో పాటు గీతాంజలి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌ను కూడా నిర్వహిస్తుండేవాడు. ఈస్ట్ బోరివ్లిలోని తత్వా టవర్స్‌ను కట్టేందుకు ఈ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. 2010లో ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ తత్వాను గీతాంజలి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ప్రారంభించింది. 20, 21 అంతస్తుల చొప్పున రెండు టవర్లలో దీన్ని కట్టాల్సి ఉంది. మొత్తం 155 అపార్ట్మెంట్లు ఉంటాయి. 2013 వరకు వీటిని గృహకొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. కానీ 2013 డిసెంబర్లో తొలుత తన వాగ్దానాన్ని బ్రేక్ చేసి, 2015 వరకు తుది గడువును పొడిగించింది మెహుల్ చోక్సి సంస్థ. ఆ అనంతరం ఆ గడువును మరింత కాలం అంటే 2017 డిసెంబర్‌కు పొడిగించింది. ఇలా ఫ్లాట్స్‌ను అందించడంలో జాప్యం చేస్తూనే ఉంది. దీంతో విసుగెత్తిన గృహకొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా), నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్ రెడ్రిషల్ కమిషన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. గృహకొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు ఈ డిసెంబర్ వరకు ఫ్లాట్లను ఎలాగైనా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ పీఎన్బీ స్కాం ఎఫెక్ట్‌తో చోక్సి దేశం విడిచి పారిపోయాడు. చోక్సి విదేశాలకు జంప్ చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌ను సైతం కొత్త డెవలపర్ లక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్‌ను నియమించారు అలాటీస్. తత్వా టవర్స్‌కు బయట ఒక నోటీసు బోర్డు ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని గృహకొనుగోలుదారులంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం ఆపివేశారని, ఎవరూ ఈ ప్రాజెక్ట్‌కు బాధ్యత వహించడం లేదని, చోక్సి కూడా దేశం విడిచి పారిపోయాడని పేర్కొంటున్నారు. నిర్మాణం కావాల్సిన ప్రాజెక్ట్ వద్దే గృహకొనుగోలుదారులు తమకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్తులను వేలం వేస్తాం: తీవ్రంగా హెచ్చరించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ సంస్థ యూనిటెక్ కస్టమర్లు కొనుగోలు చేసిన ఇంటిని స్వాధీనం చేయకుండా మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఇప్పటికే పలుసార్లు ఆదేశించిన సుప్రీం సోమవారం మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గృహ కొనుగోలు దారులను దారుణంగా మోసం చేశారంటూ యూనిటెక్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు కొనుగోలుదారులకు సొమ్మును తిరిగి చెల్లించే నిమిత్తం యునిటెక్‌కు చెందిన ఆస్తులను వేలం వేస్తామని సుప్రీం గట్టిగా హెచ్చరించింది. ఇందుకుగాను బోర్డు డైరెక్టర్లు వ్యక్తిగత ఆస్తులు సహా సంస్థ ఇతర దేశీ, విదేశీ ఆస్తుల వివరాలను అందించాలని ఆదేశించింది. కాగా మార్చి 5 న, ఆస్తుల పూర్తి వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాలని కంపెనీని కోర్టు కోరింది. అయితే ఈ జాబితా అసంపూర్తిగా ఉందని సంస్థ పేర్కొంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సుప్రీం ధర్మాసనం దీనికి సంబంధించిన పూర్తి జాబితాను 15రోజుల్లో సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. జెఎం ఫైనాన్స్, ఏఆర్సీకి జరిమానా అలాగే కేసును జెఎం ఫైనాన్స్ లిమిటెడ్,ఏ ఆర్సీ లిమిటెడ్‌కు సుప్రీం మరో షాక్ ఇచ్చింది. కోర్టును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ జెఎం ఫైనాన్స్ లిమిటెడ్, ఏఆర్‌సీపై సుప్రీం మండిపడింది. కస్టమర్లకు తిరిగి డబ్బులు చెల్లించేందుకు కోర్టులో సొమ్మును డిపాజిట్ చేస్తారని విశ్వసించాం. కానీ కస్టమర్లను సమస్యనుంచి పక్కదారి పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్
తొలిసారి గృహ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్(సీఎల్ఎస్ఎస్) వాడుకుని గృహాలు కొనుగోలు చేసే వారికి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. కుటుంబ ఆదాయం వార్షికంగా రూ.18 లక్షల వరకు ఉండి.. తొలిసారి గృహాన్ని కొనుగోలు చేసే వారు రూ.2.7 లక్షల వరకు ప్రయోజనానికి అర్హులవుతారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. అయితే సీఎల్‌ఎస్‌ఎస్‌కు అర్హులు కాని వారు, 12శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని తెలిపింది. క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ కింద 150 చదరపు మీటర్ల వరకు కార్పెంట్ ఏరియాను వారు కొనుగోలు చేసుకోవచ్చు. కార్పెట్ ఏరియా అంటే గోడల వెలుపల ఉన్న ప్రాంతం. గత నవంబర్లోనే సీఎల్ఎస్ఎస్ కింద అర్హులైన గృహాలకు కార్పెట్ ఏరియాను పెంచడాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇది కేవలం మధ్యతరగతి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారికే. మధ్యతరగతి ఆదాయ వర్గాన్ని కూడా కేంద్రం రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయమున్న వారిని ఎంఐజీ-1 కేటగిరీ కిందకి తెచ్చి... వీరికి రూ.9 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. వీరికి 4 శాతం ఇంటరెస్ట్ సబ్సిడీ అందుబాటులో ఉంది. రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయమున్న వారిని ఎంఐజీ-2 కేటగిరీ కిందకి తెచ్చి.. వీరికి రూ.12 లక్షల రుణం అందిస్తున్నారు. వీరికి 3 శాతం ఇంటరెస్ట్ సబ్సిడీని అందిస్తుంది. 2022 వరకు పట్టణ ప్రాంతంలోని పేద వారందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పనిచేస్తోంది. -
మోసపోతున్న గృహ కొనుగోలుదారులు
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారులు వంచనకు గురవుతున్నారంటూ సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం ముందుగా నిర్ణయించిన సమయానికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయనందుకుగాను కొనుగోలుదారులకు రూ.50 లక్షల మధ్యంతర నష్టపరిహారాన్ని అందజేయాల్సిందిగా జేపీ గ్రూప్‌ను కోర్టు ఆదేశించింది. గృహ కొనుగోలుదారులను సామాన్య పెట్టుబడిదారులుగా చూడకూడదనీ, వారు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును ఇంటిపై ఖర్చు పెడుతున్నారని, వారిని మోసం చేయడం భావ్యం కాదంది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది. జాప్యం చేసే ప్రాజెక్టులపై గృహ కొనుగోలుదారులకు చెల్లించే వడ్డీరేట్టు 10 శాతంగా నిర్ధారించినట్టు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్(ఆర్ఈఆర్ఏ) తెలిపింది. సేల్స్ అగ్రిమెంట్ లో భాగంగా హౌజింగ్ ప్రాజెక్టులు జాప్యమవుతున్నట్టు తాము పెట్టుబడి పెట్టిన మొత్తంపై కొనుగోలుదారులు ఈ మొత్తాన్ని పొందవచ్చు. అంతకముందు ఒక్కో చదరపు అడుగులకు 5గా ఉన్న రేటు, దీని ప్రకారం ప్రస్తుత రేటు 10గా నిర్ణయించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ చట్టం అమలవుతుందని, మరో 14 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలుచేసే ప్రక్రియ జరుగుతుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ఈ చట్టం కింద ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ వద్ద ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ జూలై ఆఖరికల్లా రిజిస్ట్రర్ చేసుకోవాలని హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఆల్లేవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. ఈ చట్టం ఆపరేటర్ల బారిన పడుతున్న కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. 2016 మార్చిలో ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందగా.. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నోటిఫై అయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీష్ ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఐలాండ్స్, చంఢీఘర్, దాద్రా అండ్ నగేర్ హవేళి, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్ లు ఉన్నాయి. మే 1వరకు కూడా తాము నిర్మించబోయే, నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్ పొందనివారు మూడు నెలల్లో పొందాల్సి ఉంటుందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లాట్లను డెవలపర్లు జూలై వరకు విక్రయించాలని కూడా రెగ్యులేటరీ ఆదేశించింది. -
గృహ రుణాలపై ఐఓబీ, ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక వడ్డీ ఆఫర్లు
చెన్నై: గృహ రుణాల్లో భారీ వృద్ధి నమోదుపై ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ మేరకు శుక్రవారం పరిమిత కాలపు ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్లను ప్రకటించాయి. తమ ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపాయి. వివరాలివీ... ఇండియన్ బ్యాంక్: 10.20 శాతం వడ్దీరేటుకు గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా ఈ వడ్డీరేటు మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఇక ఐఓబీ విషయానికి వస్తే - మహిళలు లక్ష్యంగా బ్యాంక్ ప్రత్యేక పథకాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా శుభ గృహ పథకం కింద 10.25 శాతం వడ్డీపై గృహ రుణాన్ని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇతర రుణ గ్రహీతలకు సంబంధించి రూ.75 లక్షల వరకూ రుణ రేటు 10.25 శాతం వరకూ ఉంటుంది. రూ.75 లక్షలు దాటితే ఈ రేటు 10.50 శాతం. ఐఓబీ ‘కనెక్ట్ కార్డ్’ కాగా యువత లక్ష్యంగా ఐఓబీ శుక్రవారం ‘కనెక్ట్ కార్డ్’ను ఆవిష్కరించింది. ఇది ఏటీఎం వినూత్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్. వీసా భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ కార్డును ఆవిష్కరించింది. దాదాపు ఐదు లక్షల దుకాణాల్లో ఈ-కామర్స్‌కు అవకాశం కల్పించడం ఈ కార్డు ప్రత్యేకం. ఐఓబీ కస్టమర్లు అందరికీ ఈ కార్డును అందిస్తున్నప్పటికీ, 10 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్కులకు సేవలు అందజేయడం దీని ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ప్రకటన తెలిపింది. ఈ-షాపింగ్, ఈ-పేమెంట్ విధానం ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ (మార్చి వరకూ) ఐదుశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సౌలభ్యాన్ని సైతం బ్యాంక్ అందిస్తోంది. కాగా ప్రత్యేకించి సప్లై చైన్ భాగస్వాముల ఫైనాన్సింగ్‌కు వీలు కల్పించే ‘చానెల్ ఫైనాన్సింగ్’ వ్యవస్థను సైతం ఐఓబీ ఆవిష్కరించింది. కార్పొరేట్, వ్యవస్థాగత, చిన్న-మధ్యతరహా రుణ కస్టమర్ల ప్రయోజనాలకు దీన్ని ఉద్దేశించారు.