‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్
నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో.. కుదిరితే ఏ అపార్ట్‌మెంట్‌లోనో ఓ ఫ్లాట్ కొనుక్కుని బతుకు బండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తింట్లో అడుగుపెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన ‘బ్యాంకింగ్ ఆన్ బ్రిక్స్’అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
ఇదీ చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
79% రుణాలపైనే భారం
దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్నవారిపై లండన్‌కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 79 శాతం మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిపారు. 52 శాతం మంది అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది స్టూడియో (చిన్నపాటి) అపార్ట్‌మెంట్లు, 17 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7 శాతం మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5 శాతం మంది మాత్రం ఖాళీ భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు.
సొంతిళ్లే కావాలి
సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19 శాతం మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. 1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. బేబీ బూమర్స్ (1946–1964 మధ్య పుట్టిన వారు) 79 శాతం మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు)లో 80 శాతం మంది, మిలీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు)లో 82 శాతం మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్–జీ (1997–2012) మధ్య జన్మించిన వారిలో 71 శాతం సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.
సొంతిల్లు ఎందుకంటే?
సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా.. అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జెనరేషన్‌కు చెందినవారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలీనియల్స్ జెనరేషన్ వాళ్లు మాత్రం వారి సంపదను మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్‌లో 29 శాతం మంది ఇల్లు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తే.. 15 శాతం మంది మాత్రం రిటైర్‌మెంట్ ప్లాన్‌గా కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలు
సర్వేలో పాల్గొన్న వారందరిలో 37 శాతం మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా, ఇప్పుడు దేశంలోని ప్రథమ శ్రేణి నగరాలన్నింటిలో కనిపిస్తోంది. 32 శాతం మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని చెప్పారు. 25 శాతం మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7 శాతం మంది రిటైర్‌మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొన్నామని వివరించారు.
ప్రీమియం వైపు ఆలోచనలు..
దేశంలో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా మేం జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. దాదాపు 80 శాతం మంది సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కట్టుకోవాలనే ట్రెండ్ పెరుగుతోంది. కేవలం దేశ ఆర్థిక వృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనకు మాత్రమే దేశ స్థిరాస్తి రంగం ఉపయోగపడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కొనేవారి ప్రాధాన్యాలను కూడా అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
– శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా, చైర్మన్, ఎండీ
ఇదీ చదవండి: థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
Comments
Please login to add a commentAdd a comment