స్పోర్ట్స్, డిస్నీ, గ్రీనరీ ఇతివృత్తంతో వసతులు, ఇంటీరియర్
హైదరాబాద్‌లో థీమ్ ఆధారిత లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలకు ఆసక్తి
దీంతో ఆ తరహా ఇళ్ల నిర్మాణానికే డెవలపర్ల మొగ్గు
కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు
ఒకే రకమైన అభిరుచులున్న నివాసితులు ఒకే చోట ఉండటమే వీటి ప్రత్యేకత
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్‌గా మారిపోయాయి.
థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్‌లు, హోటళ్లు, పార్క్‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.
థీమ్ బేస్డ్ అంటే?
స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్‌నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే..
కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.
మౌలిక వసతులూ మెరుగ్గానే..
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సరైనవి.
థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్‌లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్‌గా మారాయి.
ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.
2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి.
ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.
3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్‌లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్‌షిప్‌లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి.
Comments
Please login to add a commentAdd a comment