హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు | Data centers growth in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు.. ఆ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ హుషారు

Published Sun, Mar 2 2025 7:13 PM | Last Updated on Sun, Mar 2 2025 7:13 PM

Data centers growth in Hyderabad

దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్‌ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.  - సాక్షి, సిటీబ్యూరో

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్‌ సర్వీస్‌ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి.

ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు 
నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.

రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు..  

  •     ప్రత్యేకమైన డేటా సెంటర్‌ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. 

  •     డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్‌ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. 

  •     విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్‌ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. 

  •     సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్‌ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లను ప్రోత్సహిస్తున్నాయి.

చెన్నై, బెంగళూరులో.. 
    జలాంతర్గామి కేబుల్‌ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్‌ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్‌ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. 

బెంగళూరు: సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.

ఐఓటీతో డిమాండ్‌.. 
5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), క్లౌడ్‌ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్‌ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్‌ మరింత పెరుగుతుందని కొల్లియర్స్‌ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్‌ హెడ్‌ స్వాప్నిల్‌ అనిల్‌ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement