హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డు.. | Hyderabad real estate sees surge in prices of ultra luxury homes | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డు..

Published Sat, Feb 15 2025 2:37 PM | Last Updated on Sat, Feb 15 2025 3:32 PM

Hyderabad real estate sees surge in prices of ultra luxury homes

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్‌ గ్రూప్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..

  • హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్‌ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.

దేశంలోని సగటు..
2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.

అందుబాటు గృహాల్లో 15 శాతం.. 
ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్‌ కేటగిరీలో ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.  ఐదేళ్ల కాలంలో టాప్‌–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్‌ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement