కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరో
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్‌లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో కొత్త మైక్రో మార్కెట్..
ముంబైలో స్థిరంగా ధరలు..
ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్‌కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment