హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.
ప్రీమియం ప్రాపర్టీస్
హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.
జిల్లాల వారీగా..
రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.
ప్రాపర్టీ పరిమాణాల వారీగా..
ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.
ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్‌కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment