Hyderabad real estate market
-
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది. పట్టణాల వారీగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం ‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
ఏడు నెలల్లో 46 వేల ఇళ్లు రిజిస్ట్రేషన్..ఎక్కడంటే..
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఇన్వెస్టర్లు రియల్టీలో పెట్టుబడులను మాత్రం ఆపడంలేదు. 2024లో జులై నెలాఖరు వరకు హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన గృహాల సంఖ్య ఏకంగా 46,000గా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే రెవెన్యూ పరంగా 40 శాతం వృద్ధి చెందినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్న భౌగోళిక అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు అంత సురక్షితం కాదని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దాంతో ఎక్కువ ఒడిదొడుకులకు లోనుకాని, స్థిరంగా పెరిగే రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ వేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ వంటి నగరాలవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో స్థానికంగా రియల్టీ రంగం జోరందుకుంది.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ప్రకారం.. భాగ్యనగరంలో 2024 జనవరి నుంచి జులై చివరి నాటికి ఏకంగా 46,368 గృహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. రెవెన్యూలో మాత్రం 40 శాతం వృద్ధి కనిపించింది. జులై నెలలోనే రూ.4,266 కోట్ల ఇళ్లు నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం వృద్ధి చెందింది. గృహాల సంఖ్యాపరంగా 7,124 ఇళ్లతో 28 శాతం వృద్ధి కనబరిచింది.20245 జులైలో రూ. 50 లక్షల ధర కేటగిరిలో రిజిస్టర్ అయిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూలై 2023లో 69 శాతంగా ఉండేది. అదే 2024 జూలై నాటికి అమ్మకాలు 61 శాతానికి తగ్గింది. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ఎక్కువ ధర కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా గణనీయంగా పెరిగి 13కి పెరిగింది. -
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉద్భవించింది. పుణె, కోల్‌కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్‌లో 5% నుంచి హైదరాబాద్‌లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్‌కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్‌సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
హైదరాబాద్‌లో అలాంటి ఇళ్లకు పెరిగిన డిమాండ్!
హైదరాబాద్ నగరంలో రూ.1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. నగరంలోని రెసిడెన్షియల్ అమ్మకాలు, లాంచ్‌లలో దాదాపు సగం వాటాను ఈ హై-ఎండ్ హౌసింగ్ సెగ్మెంట్ కలిగి ఉందని సీబీఆర్ఈ, క్రెడాయ్ తెలంగాణ సంయుక్త నివేదిక పేర్కొంది.నివేదిక ప్రకారం.. 2021 వరకు 30% వాటాను కలిగి ఉన్న రూ.1-2 కోట్ల విభాగంలో అమ్మకాలు 2022 నుంచి 50 కంటే ఎక్కువ శాతానికి పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేటగిరీలో లాంచ్‌లు 2022 నుంచి 55-65% వాటాను కలిగి ఉన్నాయి. ఇవి కోవిడ్ మహమ్మారికి ముందు ప్రతి సంవత్సరం 20% కంటే తక్కువగా ఉండేవి.ఇదే క్రమంలో ప్రీమియం ( రూ. 2-4 కోట్లు), లగ్జరీ (రూ. 4 కోట్లకు పైగా) విభాగాలు గతంలో 2021 వరకు మొత్తం లాంచ్‌లలో 5% కంటే తక్కువగా ఉండగా 2023, 2024 ప్రథమార్థంలో నగరం మొత్తం లాంచ్‌లలో 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.మరోవైపు యాదృచ్ఛికంగా 2021 వరకు 50% వాటా ఉన్న మిడ్-సెగ్మెంట్ ( రూ.45 లక్షల నుంచి రూ.1 కోటి) అమ్మకాలు 2024 ప్రథమార్థంలో 25% కంటే తక్కువకు పడిపోయాయి. తత్ఫలితంగా ఈ సెగ్మెంట్లో లాంచ్‌ల వాటా కూడా పడిపోయింది. కోవిడ్‌కు ముందు కాలంలో దాదాపు 60-70%తో పోలిస్తే దాదాపు 25%కి క్షీణించిందని నివేదిక పేర్కొంది. -
రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్‌లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్‌ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కార్యాలయాల స్థూల లీజింగ్ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్‌కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్ మార్కెట్ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్‌ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
హైదరాబాద్ రియల్టీ రయ్..రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా కాలంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్-హెచ్1) నగరంలో 11,974 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4,782 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 150 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా ఈ ఏడాది హెచ్1లో కొత్తగా 16,712 యూ నిట్లు లాంచింగ్ కాగా.. గతేడాది ఇదే సమయంలో 4,422 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 278 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ జనవరి–జూన్ 2021’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది హెచ్1లో చదరపు అడుగు ధర సగటున రూ.4,673లుగా ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి ఒక శాతం పెరిగి రూ.4,720లకు చేరింది. ఇక అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది 4,037 యూనిట్లుండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 195 శాతం వృద్ధి చెంది 11,918 గృహాలకు చేరాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఈ ఏడాది హెచ్1లోను హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల హవానే కొనసాగిందని చెప్పారు. గృహాల విక్రయాలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరల సూచి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించడం ఈ వృద్ధికి కారణమని తెలిపారు. ప్రీమియం గృహాలదే హవా.. ఈ ఏడాది హెచ్1లో అన్ని తరగతుల వారి గృహాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూన్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే గృహాలు రికార్డ్ స్థాయిలో 240 శాతం, రూ.1–2 కోట్ల గృహాలు 158 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ప్రీమియం గృహాలకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది హెచ్1లో డెవలపర్లు ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గుచూపారు. గతేడాది హెచ్1లోని గృహాల లాంచింగ్స్‌లో రూ.1–2 కోట్ల ధర ఉండే యూనిట్లు 1,544 (18 శాతం) ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 4,444లకు (27 శాతం) పెరిగాయి. పశ్చిమ జోన్లోనే ఎక్కువ.. గృహాల విక్రయాలు, లాంచింగ్స్ రెండింట్లోనూ కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. అమ్మకాలలో 63 శాతం, ప్రారంభాలలో 64 శాతం వాటా వెస్ట్ జోన్ నుంచే ఉన్నాయి. గతేడాది హెచ్1 విక్రయాలలో నార్త్ జోన్ వాటా 16 శాతం ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. అలాగే లాంచింగ్స్‌లో 17 శాతం వాటా నుంచి 20 శాతానికి పెరిగింది. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు విక్రయం కాగా.. ఇందులో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజగుట్ట వంటి సెంట్రల్ జోన్లో 1,007 గృహాలు, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్ వంటి వెస్ట్ జోన్లో 7,505, ఉప్పల్, మల్కజ్గిరి, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్లో 862, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్ వంటి నార్త్ జోన్లో 2,145, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి సౌత్ జోన్లో 455 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 16,712 యూనిట్లు లాంచింగ్ కాగా.. సెంట్రల్ జోన్లో 933, వెస్ట్‌లో 10,767, ఈస్ట్‌లో 1,115, నార్త్‌లో 3,395, సౌత్జోన్లో 503 యూనిట్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా.. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో గృహాల విక్రయాలలో 67 శాతం, లాంచింగ్స్‌లో 71 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది హెచ్1లో 99,416 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో 59,538 గృహాలు సేల్ అయ్యాయి. 2021 హెచ్1లో కొత్తగా 1,03,238 గృహాలు ప్రారంభం కాగా.. గతేడాది ఇదే సమయంలో 60,489 యూనిట్లుగా ఉన్నాయి. -
2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: గతేడాది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ హైదరాబాద్‌లోనే జరిగింది. నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగి ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 18 ఎకరాలను నేరుగా కొనుగోలు చేయగా.. మిగిలిన 7 ఎకరాలను జాయింట్ డెవలప్మెంట్ కింద దక్కించుకుందని ఈ డీల్‌లో భాగస్వామ్యమైన సీబీఆర్ఈ ఇండియా తెలిపింది. గతేడాది హైదరాబాద్ వ్యవస్థీకృత రియల్టీ మార్కెట్లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వచ్చే త్రైమాసికాల్లో 50 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. ఆయా పెట్టుబడుల్లో ఎక్కువ శాతం వాణిజ్య స్థలాల అభివృద్ధి, రెసిడెన్షియల్ హైరైజ్ బిల్డింగ్స్ విభాగంలోకి వచ్చాయని తెలిపింది. ఈ స్థలంలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచే ప్రీమియం రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నట్లు రాజపుష్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. చదవండి: రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్ -
ధరలు తగ్గే అవకాశమే లేదు..
ఇప్పటికే 30-40 శాతం నష్టాల్లో స్థిరాస్తి అమ్మకాలు సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పరిణామాలు హైదరాబాద్ స్థిరాస్తి విపణిపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపాయని, ఈ ఏడాది నమోదైన రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జనరల్ సెక్రటరీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. 2010 నుంచి చూస్తే ప్రతి ఏటా హైదరాబాద్ మార్కెట్లో సగటున 4.9 శాతం వృద్ధి నమోదైతే.. ఈ ఏడాది మాత్రం 30-40 శాతం వరకు నష్టాల్లోనే స్థిరాస్తి అమ్మకాలున్నాయని పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగం విస్తరించి ఉన్న నగరాలన్నింటిలో కంటే హైదరాబాద్‌లోనే రియల్ ధరలు తక్కువగా ఉన్నాయని, అందుకే ధరలు ఇంకా తగ్గే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది.. ఇక రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధే ప్రధాన ధ్యేయం కాబట్టి మళ్లీ స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గురించి క్రేడాయ్ జనరల్ సెక్రటరీ ఎస్. రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి ఇలా దాదాపు 22 ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. దీనికి ఎంతలేదన్నా మూడేళ్ల సమయం పట్టడంతో పాటు చేతిచమురూ వదులుతోంది. పెపైచ్చు ఒక్కో ప్రాజెక్ట్‌పై 40 శాతం వడ్డీ భారం పడుతోంది. అదే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-గిఫ్ట్‌లో అయితే అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక్క ఎన్ఓసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు భారం తగ్గడంతో పాటు పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలూ ముందుకొస్తాయి. అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ ఒకే ఎన్ఓసీ, ఆన్లైన్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకునే వెసులుబాటును కల్పించాలి. అప్పుడే స్థిరాస్తి అమ్మకాలు జోరందుకుంటాయి. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ స్థిరమైన ప్రభుత్వాలుండటం, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో 2015లో స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగానికి పైగా రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది. అంటే హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతగా వృద్ధిపథంలోకి వెళ్తుందన్నమాట. అందుకే హైదరాబాద్‌లో పటిష్టమైన పోలీస్ విభాగం, హైవేలు, స్కైవేలు, మల్టీలేయర్ ఫ్లై ఓవర్లు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలను కలుపుతూ మరో రీజనల్ రింగ్ రోడ్డు, నగరానికి ఉత్తరాన మరో అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం చుట్టూ సినిమా, ఫార్మా, హెల్త్, స్పోర్ట్స్ వంటి సిటీల నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీ, ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. 2015 సంవత్సరంలో ఆయా ప్రాజెక్ట్‌లు 20-30 శాతం నిర్మాణ దశలోకి వచ్చినా సరే.. ఇక స్థిరాస్తి రంగాన్ని ఎవరూ ఆపలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన నేపథ్యంలో ఆరేడు నెలలుగా హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీకి వెళ్లాయి. మరో ఐదు నెలల్లో ఏపీలో రాజధాని కేటాయింపు, భూసేకరణ వంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిన పెట్టుబడుల్లో కొంత మళ్లీ నగరానికే వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. కంపెనీలు, ఉద్యోగాలూ ఉన్నాయి. మరోవైపు నగరంలో కంపెనీల స్థాపనకు, విస్తరణకూ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం కల్పిస్తున్నందున హైదరాబాద్‌లోని ఐటీ, బీపీఓ, ఫార్మా కంపెనీలు తమ కార్యాలయాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంఖ్య 25 శాతం పెరగవచ్చని, అదే సమయంలో అమ్మకాలు 15 శాతం మేరకు పెరుగుదల ఉంటుందని అంచనా. ఏపీ ప్రభుత్వం తరహాలోనే ‘మీ సేవ’, ఆన్లైన్ ద్వారా.. కావాల్సిన పరిమాణం నమోదు చేసుకుంటే నేరుగా వినియోగదారుల ఇంటికే ఇసుకను పంపించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా డిపోలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ, ఇసుక కొనుగోళ్లపై ఆయా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలి. అలా కాకుండా డ్వాక్రా సంఘాలకు, గ్రామ పంచాయతీలకు అధికారమిస్తే స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మకై విధానం పక్కదారిపట్టే ప్రమాదముంది. ప్రభుత్వ ఆదాయం పెరిగేలా తీసుకొస్తున్న విధానం కనుక అది నిర్మాణ రంగం, పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేలా ఉండాలి. నదుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, జీపీఎస్ సాంకేతికతను వినియోగించాలి. వే బిల్లుల జారీని పక్కాగా అమలు చేయాలి. ఫిబ్రవరిలో మరో రెండు ప్రాజెక్ట్‌లు.. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదర్‌నగర్‌లో 9 ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఎస్ఎంఆర్ ఫౌంటెన్హెడ్’ దాదాపు పూర్తయ్యింది. మొత్తం 975 ఫ్లాట్లు. 30-40 ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధర చ.అ.కు రూ.3,800. బండ్లగూడలో 15 ఎకరాల్లో ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనికౌంటీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. తొలి దశలో 450 ఫ్లాట్లొస్తాయి. మరో 15 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ధర చ.అ.కు రూ.3,200. ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను, బెంగళూరులో మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.