
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండీషన్స్ అప్లయి అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం.
–సాక్షి, సిటీబ్యూరో
అభివృద్ధిని ముందుగానే అంచనా వేయాలి..
ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాల్లో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే.. 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఓఆర్‌ఆర్ దుండిగల్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలు, పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది.
కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్‌ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్‌మెంట్ లేదా విల్లా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
భూమి ధర మేరకే నిర్ణయం...
శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్‌మెంట్, విల్లా వంటి ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్లు నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.5,500 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20 కోట్లు–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చదరపు అడుగుకు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు.
రేపటి అవసరాన్ని గుర్తించి కొనాలి..
ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ, ఒడిదుడుకుల మార్కెట్‌లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు వంటి అంశాలను చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
భవిష్యత్తు అవసరాన్ని గుర్తించి వినియోగదారులు గృహాలను కొనుగోలు చేయాలి. చాలామంది ప్రస్తుతం సంపాదించే ఆదాయానికి పరిమితమై నిర్ణయం తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు. పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈ రోజు 2 బీహెచ్‌కే కొనేచోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment