హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా కాలంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్-హెచ్1) నగరంలో 11,974 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4,782 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 150 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా ఈ ఏడాది హెచ్1లో కొత్తగా 16,712 యూ నిట్లు లాంచింగ్ కాగా.. గతేడాది ఇదే సమయంలో 4,422 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 278 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ జనవరి–జూన్ 2021’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది హెచ్1లో చదరపు అడుగు ధర సగటున రూ.4,673లుగా ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి ఒక శాతం పెరిగి రూ.4,720లకు చేరింది. ఇక అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది 4,037 యూనిట్లుండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 195 శాతం వృద్ధి చెంది 11,918 గృహాలకు చేరాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఈ ఏడాది హెచ్1లోను హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల హవానే కొనసాగిందని చెప్పారు. గృహాల విక్రయాలు, పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరల సూచి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించడం ఈ వృద్ధికి కారణమని తెలిపారు.
ప్రీమియం గృహాలదే హవా..
ఈ ఏడాది హెచ్1లో అన్ని తరగతుల వారి గృహాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూన్‌లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే గృహాలు రికార్డ్ స్థాయిలో 240 శాతం, రూ.1–2 కోట్ల గృహాలు 158 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ప్రీమియం గృహాలకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది హెచ్1లో డెవలపర్లు ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గుచూపారు. గతేడాది హెచ్1లోని గృహాల లాంచింగ్స్‌లో రూ.1–2 కోట్ల ధర ఉండే యూనిట్లు 1,544 (18 శాతం) ఉండగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 4,444లకు (27 శాతం) పెరిగాయి.
పశ్చిమ జోన్‌లోనే ఎక్కువ..
గృహాల విక్రయాలు, లాంచింగ్స్ రెండింట్లోనూ కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. అమ్మకాలలో 63 శాతం, ప్రారంభాలలో 64 శాతం వాటా వెస్ట్ జోన్ నుంచే ఉన్నాయి. గతేడాది హెచ్1 విక్రయాలలో నార్త్ జోన్ వాటా 16 శాతం ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. అలాగే లాంచింగ్స్‌లో 17 శాతం వాటా నుంచి 20 శాతానికి పెరిగింది. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు విక్రయం కాగా.. ఇందులో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజగుట్ట వంటి సెంట్రల్ జోన్‌లో 1,007 గృహాలు, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్ వంటి వెస్ట్ జోన్‌లో 7,505, ఉప్పల్, మల్కజ్‌గిరి, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్‌లో 862, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్ వంటి నార్త్ జోన్‌లో 2,145, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి సౌత్ జోన్‌లో 455 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 16,712 యూనిట్లు లాంచింగ్ కాగా.. సెంట్రల్ జోన్‌లో 933, వెస్ట్‌లో 10,767, ఈస్ట్‌లో 1,115, నార్త్‌లో 3,395, సౌత్‌జోన్‌లో 503 యూనిట్లు ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా..
ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలలో గృహాల విక్రయాలలో 67 శాతం, లాంచింగ్స్‌లో 71 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది హెచ్1లో 99,416 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో 59,538 గృహాలు సేల్ అయ్యాయి. 2021 హెచ్1లో కొత్తగా 1,03,238 గృహాలు ప్రారంభం కాగా.. గతేడాది ఇదే సమయంలో 60,489 యూనిట్లుగా ఉన్నాయి.
హైదరాబాద్ రియల్టీ రయ్..రయ్!
Published Fri, Jul 16 2021 12:20 AM | Last Updated on Fri, Jul 16 2021 12:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment