
హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్‌మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్‌ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక విడుదల చేసింది.
హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి వాటా 69%. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి టాప్
నైట్ ఫ్రాంక్ ప్రకారం.. జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్‌గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర 2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్‌గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.
గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్‌లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కాగా, రెండు రిజిస్ట్రేషన్‌లు సెంట్రల్ హైదరాబాద్‌లో జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment