
మార్కెట్ బాగుండాలంటే.. కావాల్సింది బయ్యర్లే.. ఇన్వెస్టర్లు కాదు!
ఏడాదిన్నర కాలంగా ప్రతికూలంగా మార్కెట్..
దీంతో ఈ ఏడాది ప్రాపర్టీ ధరల స్థిరీకరణ
పెట్టుబడిదారులతో తాత్కాలిక రియల్ బూమ్
తుది గృహ కొనుగోలుదారులతోనే స్థిరమైన వృద్ధి
దక్షిణ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు
ఆయా ప్రాంతాల్లో భూములు, ప్రాపర్టీలకు డిమాండ్
ఐదేళ్లుగా సామాన్య, మధ్యతరగతి కొనలేని స్థితికి చేరిన గృహాల ధరలకు ఈ ఏడాది కాస్త బ్రేక్ పడనుంది. ఇది తుది గృహ కొనుగోలుదారులకు ఎంతో మేలు చేకూర్చే విషయం. సామాన్యులు సొంతింటి కలను సాకారం చేసుకునే సమయమిదే.. ఇన్నాళ్లూ పెట్టుబడిదారుల మార్కెట్‌గా ఎదిగిన నగర రియల్టీ క్రమంగా తుది గృహ కొనుగోలుదారుల చేతికి అందిందని ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
రియల్ ఎస్టేట్‌లో రెండు విభాగాల కస్టమర్లు ఉంటారు. సొంతంగా తాము ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేసే తుది గృహ కొనుగోలుదారులు, లాభాలను ఆశించి ప్రాపర్టీలను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు. స్థిరాస్తి పరిశ్రమ స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ఎండ్ కస్టమర్లే అవసరం. ఇన్వెస్టర్లతో మార్కెట్‌లో తాత్కాలిక బూమ్ వస్తుందే తప్ప స్థిరమైన వృద్ధి జరగదు. లాభాలు, ఆదాయం కోసం పాకులాడే ఇన్వెస్టర్లతో రాత్రికి రాత్రే ధరలు పెరుగుతాయి. వచ్చే 6–12 నెలల్లో నిర్మాణం పూర్తికానున్న ప్రాజెక్ట్‌ల్లో ధరలు స్థిరపడ్డాయి. ప్రత్యేకించి సెమీ లగ్జరీ విభాగంలో అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.8–10 వేలుగా ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపు, అద్దె ఒప్పందాలు, ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు వంటి వాటితో డెవలపర్లూ అదనపు ఆఫర్లను అందిస్తున్నారు.
ఇన్వెస్టర్లు గాయబ్..
సాధారణంగా హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయాల్లో 5–20 శాతం వరకు పెట్టుబడిదారుల వాటా ఉంటుంది. కానీ, కరోనా తర్వాత వీరి వాటా 30 శాతానికి మించిపోయింది. నగదు ప్రవాహం పెరగడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా రియల్ బూమ్ నెలకొంది. అప్పటి వరకు పశ్చిమ హైదరాబాద్‌లో రూ.1.5 కోట్ల ధరలు ఉండే అపార్ట్‌మెంట్లు.. క్రమంగా రూ.2.5–3.5 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఫ్లాట్ల విస్తీర్ణాలూ పెరిగాయి. డిమాండ్‌కు మించి 2 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణమైన అపార్ట్‌మెంట్ల సరఫరా పెరిగింది. ఏడాదిన్నర కాలంగా మార్కెట్ ప్రతికూలంలో ఉండటంతో చాలా వరకు రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ తగ్గడంతో ధరలు స్థిరపడ్డాయి. విక్రయాలు లేకపోవడం, నగదు ప్రవాహం తగ్గడం, వడ్డీలు, నిర్వహణ భారం తదితర కారణాలతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
నలువైపులా వృద్ధిపై ఫోకస్..
ఐదేళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ నగరమైనా నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. దురదృష్టవశాత్తు అది జరగలేదు. గత ప్రభుత్వం కేవలం పశ్చిమంవైపే దృష్టి పెట్టింది. దీంతో మౌలిక వసతులు, అభివృద్ధి అంతా వెస్ట్‌లోనే కేంద్రీకృతమైపోయింది. దీని ప్రభావం నగరం మూడు దిశల్లో పడే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం తాజా ప్రభుత్వమైనా నగరం నలువైపులా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం దక్షిణ హైదరాబాద్ మీదనే దృష్టిసారించింది. ఇతర జోన్లలో మార్కెట్ కుంటుపడకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉండాలి. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్‌లో రేడియల్ రోడ్లు, ఐటీ, ఇండ్రస్టియల్ పార్క్‌ల వంటి అభివృద్ధి పనులను చేపట్టాలి.
ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?
రాయితీలతో కల సాకారం..
ఐదేళ్లలో మార్కెట్‌లోకి విపరీతంగా సప్లయి వచ్చింది. దీనికి తగినట్లుగా డిమాండ్ డెవలప్ కాలేదు. సప్లయి తగినట్లు డిమాండ్ ఉండాలంటే ప్రభుత్వం నుంచి సానుకూల విధానాలు, ప్రోత్సాహం, కార్యాచరణ ఉండాలి. గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించాలి. ఆదాయ పన్ను మినహాయింపులు, జీఎస్టీని 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడంతో పాటు స్టాంప్ డ్యూటీలో 1 శాతం రాయితీ అందించాలి. దీంతో ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులు ముందుకు వస్తారు. సొంతింటి కలను సాకారం చేసుకుంటారు.
- నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment