Home purchase
-
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
ఏం కొంటాంలే! తగ్గుముఖం పట్టిన ఇళ్ల కొనుగోళ్లు..
భారత్‌లో పండుగల సీజన్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న గృహ రుణాల విలువ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో ఇది స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే కాలంలో ఆటో, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వ్యక్తిగత రుణాలు స్థిరమైన వృద్ధిని సాధించగా, గృహ రుణాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. వాహన రుణాల్లో గణనీయ వృద్ధి క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్ అయితే మూడో త్రైమాసికం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఆటో, ద్విచక్ర వాహన రుణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, ఈ కాలంలో గృహ రుణాలు 2. 6 శాతం తగ్గిపోయాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో గృహ రుణాలకు సంబంధించి అత్యంత నిరాశాజనక పండుగ త్రైమాసికం. అయితే గృహ రుణాల తగ్గుదలకు వడ్డీ రేట్ల పెరగడం కారణంగా భావించవచ్చు. వాహన రుణాలు ఆరిజినేషన్స్ (విలువ)లో 24 శాతం పెరుగుదలను ప్రదర్శించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇవి రూ.60,900 కోట్లు ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.75,500 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలు 34. 5 శాతం వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,100 కోట్ల నుంచి 2023 ఆర్థికేడాది మూడో త్రైమాసికానికి రూ.23,000 కోట్లకు పెరిగాయి. పర్సనల్ లోన్ విభాగం కూడా 20. 2 శాతం వృద్ధిని సాధించింది. 2022 ఆర్థిక ఏడాది క్యూ3లో రూ.1,58,500 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,90,500 కోట్లకు చేరుకుంది. We today announced the second edition of the How India Celebrates Report on Festive Lending in India. Discover key trends and insights into major consumer lending products. Get the full report at: https://t.co/9cSuZdbuSW#CRIF #HowIndiaCelebrates #FestiveLoans #Insights pic.twitter.com/6DOu8jkGJh — CRIF India (@CRIF_India) June 14, 2023 -
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్‌ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
మహిళల ఓటు రియల్ ఎస్టేట్‌కే
న్యూఢిల్లీ: దేశంలో మెజారిటీ మహిళలు సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము రియల్టీలో పెట్టుబడులు పెడతామని 65 శాతం మంది మహిళలు ఓ సర్వేలో భాగంగా చెప్పారు. 20 శాతం మంది తాము స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించగా, 8 శాతం మంది బంగారానికి ఓటు చేశారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ ఈ సర్వేని నిర్వహించింది. 5,500 మంది వినియోగదారుల అభిప్రాయాలను అనరాక్ సర్వే తెలుసుకుంది. ఇందులో సగం మంది మహిళలు పాల్గొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తామని 7 శాతం మంది చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిన వారిలో 83 శాతం మంది రూ.45 లక్షలకు పైన ధర కలిగిన వాటిని తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇంటిని కొనుగోలు చేయాలనుకునే మహిళల్లో 33 శాతం మంది రూ.45–90 లక్షల శ్రేణిలో ఉన్న వాటికి అనుకూలంగా ఉన్నారు. 27 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్లో చూస్తున్నారు. ఇక 20 శాతం మంది రూ.1.5 కోట్లకుపైన ఉన్న విలాసవంతమైన ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.45 లక్షల్లోపు ధరలోని అందుబాటు ధరల ఇళ్లు చాలా తక్కువ మంది ఎంపికగా ఉన్నాయి’’అని అనరాక్ వెల్లడించింది. గతంలో మహిళలు ఇళ్లను 77 శాతం మేర నివాసం కోసమే తీసుకోగా, తాజాగా అది 82 శాతానికి చేరింది. మిగిలిన వారు పెట్టుబడుల కోణంలో తీసుకుంటున్నారు. పలు ప్రయోజనాలు.. మహిళలు తమ పేరిట ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చని అనరాక్ సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరిట యాజమాన్య హక్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. 2015లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ప్రయోజనాలు పొందాలంటే ప్రాపర్టీ మహిళల పేరిట నమోదు చేయడం లేదంటే సహ యజమానిగా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడాన్ని కూడా పేర్కొంది. బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలను ఇస్తున్నట్టు తెలిపింది. -
బాబోయ్ అదిరిపోయే బంపరాఫర్.. పాత ఇళ్లు ఇచ్చి కొత్త ఇళ్లు తీసుకోండయ్యా!
పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యమైనవి, అలాగే కష్టంతో కూడుకున్నవి కాబట్టి. పెళ్లి టాపిక్ పక్కన్న పెట్టి ఇంటి విషయంలోకి వెళ్దాం. సమాజంలో ప్రతి ఒక్కరూ కనే కల తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలనుకోవడం. ఇందుకోసం కొన్నేళ్లు కష్టపడేవాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొందరి కల కలగానే మిగిలిపోతే, మరికొందరు కష్టపడి సాధించుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటిని పండుగ సీజన్లో ఓ బంపరాఫర్ ద్వారా మన సొంతం చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా! ఈ ఆఫర్ ఎక్కడో తెలుసా! కొత్త అపార్ట్మెంట్ల విక్రయాల జోరును కొనసాగించేందుకు, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI)- మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ (MCHI) ఓ ఆఫర్‌ని ప్రకటించాయి. అయితే, ఈ ఆఫర్ ముంబైలోని వారికి మాత్రమే వర్తిస్తుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని ఎంఎంఆర్డీఏ (MMRDA) గ్రౌండ్స్‌లో (CREDAI-MCHI) 30వ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 100 మందికి పైగా రియల్టీ డెవలపర్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ అక్టోబర్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం కోసం, ప్రోప్‌టెక్ స్టార్టప్ జాప్కీ (Zapkey) CREDAI-MCHIతో జతకట్టింది. ఆఫర్ ఏంటంటే! జాప్కీ పాత ఇళ్లు అమ్మాలనుకునే వారికి కొంత టోకన్ అమౌంట్ ఇస్తుంది. వారికి 90 రోజుల్లోగా ఆ ఇంటిని కచ్చితంగా అమ్మిపెడుతుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు తమ పాత ఇంటికి ఎక్స్చేంజ్గా కొత్త అపార్ట్‌మెంట్‌ని అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌పై జాప్కీ కో వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ‘‘మేము టోకెన్ డబ్బులు ఇచ్చి కస్టమర్ల ఇంటిని మార్కెట్ ధరకే అమ్ముతాము. అది కూడా 90 రోజుల్లోనే. ఒకవేళ ఆ ప్రాపర్టీని అమ్మలేకపోతే ఆ ఇంటిని మేమే కొనడం లేదా టోకెన్ అమౌంట్‌ను వదులుకుంటాం. ₹1 కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తుల కోసం కస్టమర్లు ₹1 లక్ష, ₹1 కోటి కంటే తక్కువ విలువ కలిగిన ఆస్తులకు ₹50,000 టోకెన్ అమౌంట్‌గా చెల్లిస్తాం. 20 సంవత్సరాల కంటే పాత ఆస్తిని తీసుకోము, కానీ కొన్ని సందర్భాల్లో భవనం మంచి స్థితిలో ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లయితే, మేము దానిని తీసుకోవచ్చు. అది కూడా ఆస్తిని భౌతికంగా సందర్శించిన తర్వాత విక్రయిస్తామని," చెప్పారు. అలాగే పాత ప్రాపర్టీని అమ్మి పెడుతున్నందుకు బ్రోకరేజ్ ఛార్జీలుగా 2 శాతాన్ని తాము వసూలు చేయనున్నామని ఈ ప్రాప్‌టెక్ సంస్థ తెలిపింది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. ► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు. -
ధర తగ్గిస్తే ఇల్లు కొంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనాలంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. అలాగే సులభ వాయిదాలూ ఉండాల్సిందేనని 73 శాతం కస్టమర్లు చెబుతున్నారని హౌజింగ్.కామ్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 3,000 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2022 జనవరి–జూన్ రెసిడెన్షియల్ రియల్టీ కన్జూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ ప్రకారం.. రియల్టీలో పెట్టుబడులకు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇదే అత్యధికం. 2020 జూలై–డిసెంబర్ కాలానికి చేపట్టిన సర్వేలో ఇల్లు, స్థలంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినవారి సంఖ్య 35 శాతం మాత్రమే. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు 57 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. విశ్వసనీయత లేమి కారణంగా కాబోయే కొనుగోలుదార్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఫ్లాట్‌ను బుక్ చేయడానికి ఇప్పటికీ జాగ్రత్తగానే ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నరెడ్కో చెబుతోంది. డెవలపర్లు తమ నిబద్ధతతో కూడిన గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారిస్తుండటంతో పరిస్థితి మారవచ్చని వివరించింది. ధరలు పెరుగుతాయ్..: ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్నందున వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు అధికం అవుతాయని 51 శాతం మంది వినియోగదార్లు భావిస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత వినియోగంలో వేగం ఊపందుకుంది. ఆన్లైన్లో ఇల్లు చూసి కొనడం లేదా ఒకసారి ఇంటిని పరిశీలించిన వెంటనే ఒప్పందాన్ని పూర్తి చేయడానికి 40 శాతం మంది కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది ప్రధాన నగరాల్లోని గృహ కొనుగోలుదారులు విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోద స్థలాలకు సమీపంలో ఇంటిని కోరుకుంటున్నారు. అత్యధికులు తమ ఇళ్ల నుండి 1–1.5 కిలోమీటరు దూరంలో ఇటువంటి సౌకర్యాలు ఉండాలంటున్నారు. గృహ రుణాల వడ్డీపై రిబేట్ పెంపు, నిర్మాణ సామగ్రిపై గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ లభ్యత విస్తరణ, స్టాంప్ డ్యూటీ కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని హౌజింగ్.కామ్, నరెడ్కో చెబుతున్నాయి. కోవిడ్ ముందస్తు స్థాయికి..: రానున్న 6 నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని 79% మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో 41%తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుందని 21% మంది మాత్రమే సూచించారు. 63% మంది గృహ కొనుగోలుదారులు రాబోయే 6 నెలలకు తమ ఆదాయంపై నమ్మకంతో ఉన్నారు. డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో 2021 లో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయిలను దాటతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని హౌజింగ్.కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
ప్రియాంక ఇంటిని కొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవలే ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు ఏడు కోట్ల రూపాయలని సమాచారం. ఇంత కాలం ముంబైలో అద్దె ఇంట్లో ఉండేది జాక్వెలిన్. ఇప్పుడు ముంబైలోని జూహూ ప్రాంతంలో కొత్త ఫ్లాట్ తీసుకుంది. సముద్రం కనిపించే వ్యూతో బాల్కనీ, ఐదు బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ ఏరియా ఈ ఇంటి స్పెషాలిటీ. గతంలో ఈ ఫ్లాట్‌లో ప్రియాంకా చోప్రా నివసించేది. హాలీవుడ్‌కి వెళ్లకముందు ప్రియాంక ఆ ఇంట్లోనే ఉండేది. నిక్‌తో వివాహం అయ్యాక లాస్ ఏంజెల్స్‌కి మకాం మార్చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఇల్లు అమ్మింది. జాక్వెలిన్ సినిమాల విషయానికొస్తే.. 2009లో అలాదిన్ సినిమాతో వెండితెరపై కాలు మోపింది. 'కిక్', 'రేస్ 3' సినిమాల్లో సల్మాన్‌తో నటించింది. 'కిక్' సీక్వెల్లో ఈ ఇద్దరూ మరోసారి జోడి కట్టనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ’బచ్చన్ పాండే’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ కల్యాణ్- క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఓ చిత్రంలోనూ ఈ భామ కనిపించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అంగూర్’ నవ్వించడానికి రెడీ టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ -
ఆఫర్లతో కస్టమర్లకు వల
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనే కాదు డిస్కౌంట్లు, ఆఫర్లు రియల్టీ రంగంలోనూ దూకుడును పెంచేశాయి. రెరా, జీఎస్టీ కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలను తగ్గించిన డెవలపర్లు.. ఇన్వెంటరీని విక్రయించడం మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. నో జీఎస్టీ, ఉచిత రిజిస్ట్రేషన్, ఫ్రీ పార్కింగ్, హోమ్ ఫర్నీషింగ్ ఇలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ, రెరా, ఆర్ధిక మందగమనంతో రియల్టీ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎన్బీఎఫ్సీ సంక్షోభంతో ద్రవ్య లభ్యత తగ్గింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను గట్టేక్కించేవి పండగ సీజన్లే. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. పండుగ సీజన్స్‌లో కొత్త వాహనాలకే కాదు గృహ కొనుగోళ్లు, ప్రవేశాలకూ శుభ ముహూర్తాలే. డిస్కౌంట్స్ గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రధాన ఆస్త్రం నగదు రాయితీ. చ.అ. లెక్కన క్యాష్ డిస్కౌంట్ చేస్తుంటారు. ఉదాహరణకు బ్రోచర్లో చ.అ.కు రూ.4 వేలుంటే.. క్యాష్ డిస్కౌంట్ కింద చ.అ.కు రూ.200లు తగ్గిస్తారు. అంటే 1,000 చ.అ. ఫ్లాట్‌కు క్యాష్ డిస్కౌంట్ రూ.2 లక్షలొస్తుందన్నమాట. ఉత్పత్తులు ఆఫర్స్ ప్రతి ఫ్లాట్ బుకింగ్ మీద ఇంటికి అవసరమైన ఉత్పత్తులను ఉచితంగా అందిస్తుంటారు. ఎయిర్ కండీషర్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మాడ్యులర్ కిచెన్స్, హోమ్ ఫర్నిషింగ్, గృహోపకరణాలు లేదా టెలివిజన్, ఐఫోన్ వంటి ఉత్పత్తులు లేదా విదేశీ ట్రిప్, బంగారు నాణేలు, ఉచిత క్లబ్ మెంబర్షిప్స్, ఫ్రీ కార్ పార్కింగ్ వంటివి కూడా అందిస్తుంటారు. ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీషింగ్ వంటి ఆఫర్లు వద్దనుకుంటే వాటి బదులుగా నగదు రాయితీ ఇవ్వమని డెవలపర్లను అడొగొచ్చు. ఉదాహరణకు డెవలపర్ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో రెండు గదులకు ఏసీలను ఆఫర్ చేస్తున్నాడనుకుందాం. వీటి బదులుగా రూ. లక్ష నగదు రాయితీ తీసుకోవచ్చు. నో రిజిస్ట్రేషన్, జీఎస్టీ చార్జీలు కొంత మంది డెవలపర్లు ఫ్లాట్ బుక్ చేస్తే జీఎస్టీ చార్జీలు తీసుకోమని ఆఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం అఫడబుల్ హౌసింగ్లకు 1 శాతం, ఇతర గృహాలకు 5 శాతం జీఎస్టీ ఉంది. కస్టమర్ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఆయా రాష్ట్రాలను బట్టి స్టాంప్ డ్యూటీ 3 నుంచి 10 శాతం, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.25 లక్షల పైన ఉండే ప్రాపర్టీలకు 1.1 శాతంగా ఉన్నాయి. కొంతమంది డెవలపర్లు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలను కూడా ఆఫర్ చేస్తున్నారు. -
ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోనే వృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఐటీ కేంద్రాలకు దగ్గరగా ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు విస్తృతమైన అనుసంధానం, మెట్రో రైల్‌కు సులువుగా చేరుకునే వీలుండటంతో హైదరాబాద్‌లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రియల్ పరుగులు పెడుతోంది. గచ్చిబౌలి, కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, మణికొండ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ క్యూ4 నివేదిక తెలిపింది. ఓఆర్ఆర్తో అనుసంధానమై ఉండటంతో కొంపల్లి, ఆదిభట్ల, తెల్లాపూర్, పటాన్చెరు వంటి రియల్ జోష్ అందుకుంది. హైదరాబాద్‌లో 47 శాతం మంది చ.అ.కు రూ.4 వేల లోపు ధర ఉన్న గృహాల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 37 శాతం మంది రూ.4,000 – రూ.6,000 ధర ఇళ్ల వైపు చూస్తున్నారని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన నగరంలో గృహాల ధరలు 15.1 శాతం వృద్ధి చెందాయి. మార్కెట్ సెంటిమెంట్, రాజకీయ స్థిరత్వం, మౌలిక వసతులు మెరుగవటం ఇందుకు కారణాలని పేర్కొంది. -
ధర, వాస్తు, నీళ్లకే ప్రాధాన్యం
అందుబాటు ధర, వాస్తు, మెరుగైన నీటి సరఫరా.. ఇవే గృహాల కొనుగోళ్లలో కస్టమర్ల ప్రధాన ఎజెండాలు. ఆ తర్వాతే రవాణా సౌకర్యాలు, ఆధునిక వసతులను కోరుకుంటున్నారని రియల్టీ పోర్టల్ నోబ్రోకర్.కామ్ తెలిపింది. రూ.60 లక్షల లోపు దర, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు. భద్రత, స్కూల్స్, ఆసుపత్రుల వంటి సోషల్ ఇన్ఫ్రా కస్టమర్లూ ఉన్నారండోయ్! సాక్షి, హైదరాబాద్: నోబ్రోకర్.కామ్ ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని 70 లక్షల రిజిస్టర్ యూజర్లతో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీటిలో 84 శాతం మంది అందుబాటు ధర, 83 శాతం మంది నీటి సరఫరా, 73 శాతం మంది గృహ వాస్తు, 59 శాతం మంది మెరుగైన రవాణా సౌకర్యాలున్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. 53 శాతం మంది కార్ పార్కింగ్, 42 శాతం మంది భద్రత, 24 శాతం మంది లిఫ్ట్, 19 శాతం స్కూల్స్, 13 శాతం మంది ఆసుపత్రులు, 9 శాతం మంది జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉండాలని కోరుకున్నారు. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, ఉప్పల్, నిజాంపేట ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారు. 2020 గృహ విభాగానిదే.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడం, ప్రభుత్వం అందుబాటు గృహాలకు రాయితీలు అందిస్తుండటం వంటి కారణాలతో 2020లో గృహ విక్రయాలు జోరందుకుంటాయి. మెట్రో నగరాల్లోనూ మూలధన వృద్ధి స్థిరంగా ఉండటం, ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండటం వంటివి కూడా విక్రయాల వృద్ధికి కారణాలే. ఈ ఏడాది 64 శాతం మంది అద్దెదారులు సొంతిల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వే తెలిపింది. గతేడాది ఇది 54 శాతంగా ఉంది. ఇందులోనూ 64 శాతం మంది 35 ఏళ్లలోపే సొంతింటి కలను తీర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 35–45 ఏళ్ల మధ్య 26 శాతం, 45 ఏళ్ల పైన 10 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. గృహ కొనుగోళ్లలో అత్యంత ఆసక్తిగా హైదరాబాదీలే ఉన్నారు. ఇక్కడ 69 శాతం సొంతింటి ఎంపికలో నిమగ్నమై ఉంటే.. బెంగళూరులో 65 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం, పుణేలో 56 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 58 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో రూ.54 కోట్లు నో బ్రోకర్.కామ్‌తో 2019లో మెట్రో నగరాల్లో రూ.1,154 కోట్ల బ్రోకరేజ్ తగ్గిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ.372 కోట్లు, ముంబైలో రూ.342 కోట్లు, పుణేలో రూ.206 కోట్లు, చెన్నైలో రూ.180 కోట్లు, హైదరాబాద్‌లో రూ.54 కోట్ల బ్రోకరేజ్ ఆదా అయింది. బ్రోకర్లు తగ్గుతున్నారు రియల్టీ రంగంలో బ్రోకర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2018లో గృహ కొనుగోళ్లలో 14 శాతంగా ఉన్న మధ్యవర్తులు.. 2019లో 11 శాతానికి తగ్గింది. బ్రోకర్ల క్షీణత కొనుగోలుదారులకే లాభం. ఇళ్ల కొనుగోళ్లలో 35 శాతం స్నేహితులు, బంధువుల ద్వారా, 28 శాతం రియల్టీ వెబ్‌సైట్స్, 26 శాతం టులెట్ బోర్డ్స్ ద్వారా సంప్రదిస్తున్నారు. – సౌరభ్ గార్గ్, కో–ఫౌండర్, నోబ్రోకర్.కామ్ -
ఇంటి ఖరీదు 140 కోట్లు
మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ కొనబోతున్న ఇంటి ఖరీదు దాదాపు 140 కోట్లు అని సమాచారం. గత ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయ్యాక లాస్ ఏంజిల్స్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్ ఇంట్లో ఈ దంపతులు ఉంటూ వచ్చారు. ఆ ఇంటి ఖరీదు దాదాపు 50 కోట్లు అట. 5 పడక గదులు, 5 బాత్రూమ్లు, ఈత కొలను.. ఇలా హంగామా ఉన్న ఆ ఇంటిని ఇటీవల అమ్మేశారట నిక్. ఇదే పెద్ద ఇల్లు అంటే ఇంతకన్నా పెద్ద ఇంటికి మారాలని ఈ క్రేజీ కపుల్ అనుకున్నారని హాలీవుడ్ కథనం. బెవెర్లీ హిల్స్‌లోనే సుమారు 140 కోట్లు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేయబోతున్నారట. అయితే తన సోదరులతో కలిసి నిక్ జోనస్ ‘హ్యాపీనెస్ బిగిన్స్ టూర్’ ప్లాన్ చేశారు. ఈ మ్యూజికల్ టూర్ కోసం నిక్ పలు ప్రదేశాలను సందర్శిస్తారు. అందుకని కొత్త ఇల్లు కొనుక్కుని, తమ అభిరుచికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి టైమ్ పడుతుంది కాబట్టి వచ్చే ఏడు నిక్, ప్రియాంక గృహప్రవేశం అవుతారని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంకా చోప్రా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంకొన్ని చిత్రాలకు సైన్ చేశారామె. -
సొంతింటికి దారి ఇదీ..!
ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019–20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లపైనా పన్ను మినహాయింపు రెండేళ్లకు పొడిగించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. దీనికి పైన మరో రెండు లక్షల ఆదాయం ఉన్న వారు రుణంపై ఇంటిని తీసుకుని వడ్డీ రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా మొత్తం ఆదాయంపై పన్ను లేకుండా ప్రయోజనం పొందొచ్చు. త్వరలో ఇళ్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు ముందే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడ్డీ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇవన్నీ కలసి మధ్యతరగతి జీవులు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయి. అవేంటో చూడండి మరి... ఇల్లు కొనుగోలు అన్నది ఆర్థికంగా ఓ పెద్ద నిర్ణయం. ఈ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. సొంతిల్లును సమకూర్చుకోవడాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నిజానికి ఇది ఆర్థిక కట్టుబాటు కూడా. అందుకే ఇంటి కొనుగోలుకు సిద్ధమైన వారు ముందుగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. రుణంతో మొదటి సారి ఇంటిని కొనాలనుకునే వారు.. డౌన్ పేమెంట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. వీటికి తోడు మరెన్నో అంశాలు ఇంటి కొనుగోలు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి. డౌన్ పేమెంట్... ఇంటి రుణానికి డౌన్ పేమెంట్ తప్పనిసరి. ఓ ఇంటి కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని రుణం తీసుకోదలిచిన వ్యక్తి తన వంతుగా రెడీ చేసుకోవాల్సినదే డౌన్ పేమెంట్. రుణాలిచ్చే సంస్థలు సాధారణంగా ఇల్లు కొనుగోలు వ్యయంలో 20 శాతం డౌన్‌పేమెంట్ కింద అడుగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసే వారు కనీసం తమ వంతుగా రూ.10 లక్షలను డౌన్‌పేమెంట్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.40 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇంటి కొనుగోలు విలువ... డౌన్‌పేమెంట్ ఎంతన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ మొత్తం లేకపోతే ఇంటి రుణం సాధ్యం కానట్టే. అత్యవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాల్సిందే జీవితంలో అత్యవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. వాటిని తప్పించుకోలేం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందే తగిన విధంగా సన్నద్ధం కావాలి. సొంతింటి కోసం అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ కోసం వినియోగిస్తే... వేతనంలో మిగిలేదంతా ఈఎంఐగా పోతుంటే... అత్యవసరం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? అందుకే అత్యవసర నిధిని పక్కన పెట్టి మిగిలిన మొత్తానే డౌన్‌పేమెంట్‌గా వాడుకోవడం వివేకం. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్నే అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అలాగే, ఇంటి రుణం తీసుకునే వారు, అత్యవసర నిధికి అదనంగా మూడు నెలల ఈఎంఐ మొత్తాన్ని కూడా విడిగా రెడీగా ఉంచుకోవాలి. ముఖ్య లక్ష్యాల కోసం పెట్టుబడులు... డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకుని, అత్యవసర నిధిని పక్కన పెట్టి, నెలవారీ ఈఎంఐ చెల్లించడంతోనే అన్ని బాధ్యతలు తీరినట్టు కాదు. జీవితంలో కీలకమైన లక్ష్యాలు వేరేవీ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్య ఇందులో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పిల్లల ఉన్నత విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైనంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండాలి. దీనికి తోడు స్వల్పకాల లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వీటికి పెట్టుబడులు పోను వేతనంలో ఎంత మిగులుతుంది, ఎంత ఈఎంఐగా చెల్లించగలరన్నది నిర్ణయించుకోవాలి. చాలా మంది సొంతింటిని సమకూర్చుకునే విషయంలో కీలకమైన పెట్టుబడులు, అత్యవసరాలను విస్మరిస్తుంటారు. ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ అన్ని అంశాలను చూడరు. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. ఈఎంఐ ఎంత మేర...? డౌన్ పేమెంట్ అవసరమైనంత ఉన్న వారు చూడాల్సిన తదుపరి అంశం ఈఎంఐ. రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉందా? అనేది చూడాలి. కట్టగలమన్న నమ్మకం వేరు, సామర్థ్యం వేరు. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30–40 శాతాన్ని మించరాదనేది పాటించాల్సిన సూత్రం. ఇక ఈఎంఐ ఎంతన్నది రుణం ఎంత తీసుకుంటున్నారనే అంశంతోపాటు, ఎంత కాలానికి తీసుకుంటున్నారనేదీ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఆదాయం రూ.75,000 ఉందనుకుంటే... 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఎంత కాలానికి, ఎంత రుణం తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుందంటే... ఆదాయంలో ఈఎంఐ 20% ► రూ.18 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను బ్యాంకులు రూ.14.4 లక్షల రుణం ఇస్తాయి. 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ15,000 అవుతుంది. అంటే రూ.75,000 నెలసరి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ► రూ.20 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.16 లక్షల రుణం ఇస్తాయి కనుక 20 ఏళ్ల కాలాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ రూ.15,000 అవుతుంది. రుణం పెరిగినప్పటికీ కాల వ్యవధి ఐదేళ్లు పెంచుకున్నారు గనుక ఈఎంఐ మొదటి ఉదాహరణలో మాదిరే ఉంటుంది. ► ఇక రూ.21.5 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.17.2 లక్షల రుణాన్ని ఇస్తాయి. దీనిపైనా రూ.15,000 ఈఎంఐ ఉండాలనుకుంటే ఇంటి రుణ కాల వ్యవధిని 25 ఏళ్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఆదాయంలో ఈఎంఐ 30% ► రూ.26.8 లక్షల ఇంటికి డౌన్ పేమెంట్ పోను రూ.21.5 లక్షలు రుణంగా లభిస్తుంది. 15 ఏళ్ల టర్మ్ పెట్టుకుంటే ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.30.3 లక్షల ఇంటికి 24.2 లక్షలు రుణంగా తీసుకుంటే టర్మ్‌ను 20 ఏళ్లుగా నిర్ణయించుకున్నా కూడా ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.32.3 లక్షల ఇంటికి రూ.25.8 లక్షలు రుణంగా లభిస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌ను నిర్ణయించుకుంటే ఈఎంఐ 22,500 అవుతుంది. ఆదాయంలో ఈఎంఐ 40% ► రూ.36 లక్షల ఇంటిపై రూ.28.8 లక్షల రుణానికి గాను, 15 ఏళ్ల టర్మ్‌కు ఈఎంఐ రూ.30,000. ► రూ.40.3 లక్షల ఇంటికి రూ.28.8 లక్షల రుణం లభిస్తుంది. రుణం చెల్లించాల్సిన వ్యవధి 20 ఏళ్లు అయితే అప్పుడూ ఈఎంఐ రూ.30,000 దాటదు. ► ఇక రూ.43 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను వచ్చే రుణం రూ.34.4 లక్షలు. కాల వ్యవధి 25 ఏళ్లు అయితే ఈఎంఐ రూ.30,000 అవుతుంది. నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే తప్ప, ఈఎంఐ 20 శాతానికి మించకుండా ఉంటే దాన్ని సురక్షితంగా భావించొచ్చు. ఒకవేళ డౌన్ పేమెంట్ 20 శాతానికి మించి సమకూర్చుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల వేతనంలో ఈఎంఐ 40 శాతం వరకు ఉంటే చెల్లింపులు కష్టం కావచ్చు. తప్పదనుకుంటే నెల ఆదాయంలో 30 శాతాన్ని ఈఎంఐగా నిర్ణయించుకోవచ్చు. కొందరు దంపతులు ఇద్దరూ కలసి ఇంటి రుణం తీసుకుంటుంటారు. ఇరువురు ఆర్జనాపరులైతే అధిక ఈఎంఐ చెల్లించగలరు. అయితే, రుణ కాల వ్యవధి ముగిసే వరకు ఇద్దరూ ఆర్జనను కొనసాగించాలి. లేదంటే మధ్యలో ఇల్లాలు కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాన్ని విడిచిపెడితే, అప్పుడు భారీ ఈఎంఐ భారం ఆమె భాగస్వామి ఒక్కరిపైనే పడుతుంది. దీన్ని ముందే ఆలోచించుకోవాలి. -
ఇంటి ధరను నిర్ణయించేవేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇంటి అంతిమ విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అని! చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి.. వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలూ కీలకమే. భవిష్యత్తు అవసరాలూ చూడాల్సిందే.. ఇంటి కొనుగోలులో సౌకర్యాలే కాదు భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ–మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరమే కావచ్చు. కానీ, అదే ఇంటిని మీరు అమ్మేటప్పుడు మాత్రం పైవన్నీ కీలకమవుతాయని మరిచిపోవద్దు. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. న్యాయపరమైన చిక్కులుంటే అంతే! చేరువలోనే స్కూలు, ఆసుపత్రి, షాపింగ్ మాల్ వంటి ఎన్ని రకాల సదుపాయాలున్నా సరే న్యాయపరమైన చిక్కులున్నాయో అంతే సంగతులు. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందగుగు వేస్తాడని మరవొద్దు. విక్రయించే స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారులకు స్పష్టంగా ఓపిగ్గా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. -
తొలిసారి ఇల్లు కొంటున్నారా?
తొలిసారి!! దీనికుండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఈ ‘తొలిసారి’... అనేది దేనికైనా వర్తిస్తుంది. ఆఖరికి అది ఇల్లు కొనేవారి విషయంలోనైనా!! ఎందుకంటే ఒక పని తొలిసారి చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి చేయాలనుకుంటే అవన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి అంత భయం ఉండదు. ఇంటి విషయంలో కూడా అంతే. మన అవసరాలకు అనువైన ఇంటినే కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు చేసే ఇంటికి సంబంధించిన అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనటమనేది ఖరీదైన విషయం. ఒకసారి ఇల్లు కొన్నాక దాన్ని మళ్లీ విక్రయించడం, వేరే ఇంటికి మారడం చాలా కష్టసాధ్యం. అందుకే ఈ అంశాలను ఒకసారి గమనించండి. అవసరాలకు అనువుగా... ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఇల్లు కట్టడం, కొనడం రెండూ చాలా కష్టమైన పనులే. అందుకే తొలిసారి ఇంటిని కొనేటపుడు... ఏ రకమైన ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే మీరు కొన బోయే ఇల్లు మీ కుటుంబానికి అనువుగా ఉంటుందా! లేదా? ఏ బడ్జెట్లో, ఏ రకంగా ఇంటిని కొనాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. వీటితోపాటు కొనాలని భావించే ఇంటిని ఒకటికి రెండు సార్లు చూడండి. పైపు లైన్స్, డ్రైనేజ్, వెంటిలేషన్ తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సరైన ప్రదేశమూ ముఖ్యమే మీ అవసరాలు తెలుసుకున్నాక వాటికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? లే క ఇతరత్రా అవసరాలకు ప్రాపర్టీని కొంటున్నారా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసే ప్రదేశానికి హస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అలాగే ఇల్లు మీ ఆఫీసుకు ఎంత దూరంలో ఉంటుందో పరిగణనలోకి తీసుకోవాలి. పేరున్న రియల్టర్లను సంప్రదించండి రియల్టర్ అవసరం లేకుండా డెరైక్ట్‌గా బిల్డర్ దగ్గరి నుంచే ఇంటిని కొనుగోలు చేస్తే, కమీషన్ చెల్లించే అవసరం ఉండదు కాబట్టి కాస్త డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డెరైక్ట్‌గా కాకుండా రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. తొలిసారి ఇంటిని కొనే సమయంలో రియల్టర్ సాయం తీసుకోవడమే మంచిది. అలాగే రియల్టీ రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు. బడ్జెట్‌పై కన్నేయండి ఇంటిని కొనాలని భావించినప్పుడు దానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది చూసుకోవాలి. మీ బడ్జెట్ పరిమితిలోపే మంచి ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఒకసారి ఇంటిని కొనాలి అని నిర్ణయం తీసుకున్నాక... అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలు లేవని భావించినపుడు మాత్రమే ఇంటిని కొనాలి అనే ఆలోచన చేయడం మంచిది. డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి ఇంటి ని కొనడానికి, ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను పొందడానికి అవసరమైన పత్రాలను మీ వద్ద రెడీగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల డాక్యుమెంట్ల సమర్పణలో ఎలాంటి సమయం వృథా కాదు. ఇంటి కొనుగోలుతో సంబంధం ఉన్న అన్ని లీగల్ అంశాలపై జాగ్రత్త వహించండి. మంచి ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండి ఇంటిని కొనేటప్పుడు అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఫైనాన్సింగ్. మీ ఆర్థిక సంబంధ వ్యయాల్లో ఇంటి ఫైనాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే సరైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రొవైడర్ ఒక్కోరకమైన వడ్డీ రేట్లకు ఇంటి రుణాలను అందిస్తుంటారు. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ 9.85 శాతం వడ్డీరే టుకే ఇంటి రుణాలను ఆఫర్ ఇస్తోంది.