తొలిసారి ఇల్లు కొంటున్నారా?
తొలిసారి!! దీనికుండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఈ ‘తొలిసారి’... అనేది దేనికైనా వర్తిస్తుంది. ఆఖరికి అది ఇల్లు కొనేవారి విషయంలోనైనా!! ఎందుకంటే ఒక పని తొలిసారి చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి చేయాలనుకుంటే అవన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి అంత భయం ఉండదు. ఇంటి విషయంలో కూడా అంతే. మన అవసరాలకు అనువైన ఇంటినే కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు చేసే ఇంటికి సంబంధించిన అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనటమనేది ఖరీదైన విషయం. ఒకసారి ఇల్లు కొన్నాక దాన్ని మళ్లీ విక్రయించడం, వేరే ఇంటికి మారడం చాలా కష్టసాధ్యం. అందుకే ఈ అంశాలను ఒకసారి గమనించండి.
అవసరాలకు అనువుగా...
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఇల్లు కట్టడం, కొనడం రెండూ చాలా కష్టమైన పనులే. అందుకే తొలిసారి ఇంటిని కొనేటపుడు... ఏ రకమైన ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే మీరు కొన బోయే ఇల్లు మీ కుటుంబానికి అనువుగా ఉంటుందా! లేదా? ఏ బడ్జెట్‌లో, ఏ రకంగా ఇంటిని కొనాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. వీటితోపాటు కొనాలని భావించే ఇంటిని ఒకటికి రెండు సార్లు చూడండి. పైపు లైన్స్, డ్రైనేజ్, వెంటిలేషన్ తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
సరైన ప్రదేశమూ ముఖ్యమే
మీ అవసరాలు తెలుసుకున్నాక వాటికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? లే క ఇతరత్రా అవసరాలకు ప్రాపర్టీని కొంటున్నారా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసే ప్రదేశానికి హస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అలాగే ఇల్లు మీ ఆఫీసుకు ఎంత దూరంలో ఉంటుందో పరిగణనలోకి తీసుకోవాలి.
పేరున్న రియల్టర్లను సంప్రదించండి
రియల్టర్ అవసరం లేకుండా డెరైక్ట్‌గా బిల్డర్ దగ్గరి నుంచే ఇంటిని కొనుగోలు చేస్తే, కమీషన్ చెల్లించే అవసరం ఉండదు కాబట్టి కాస్త డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డెరైక్ట్‌గా కాకుండా రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. తొలిసారి ఇంటిని కొనే సమయంలో రియల్టర్ సాయం తీసుకోవడమే మంచిది. అలాగే
రియల్టీ రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు.
బడ్జెట్‌పై కన్నేయండి
ఇంటిని కొనాలని భావించినప్పుడు దానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది చూసుకోవాలి. మీ బడ్జెట్ పరిమితిలోపే మంచి ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఒకసారి ఇంటిని కొనాలి అని నిర్ణయం తీసుకున్నాక... అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలు లేవని భావించినపుడు మాత్రమే ఇంటిని కొనాలి అనే ఆలోచన చేయడం మంచిది.
డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి
ఇంటి ని కొనడానికి, ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను పొందడానికి అవసరమైన పత్రాలను మీ వద్ద రెడీగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల డాక్యుమెంట్ల సమర్పణలో ఎలాంటి సమయం వృథా కాదు. ఇంటి కొనుగోలుతో సంబంధం ఉన్న అన్ని లీగల్ అంశాలపై జాగ్రత్త వహించండి.
మంచి ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండి
ఇంటిని కొనేటప్పుడు అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఫైనాన్సింగ్. మీ ఆర్థిక సంబంధ వ్యయాల్లో ఇంటి ఫైనాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే సరైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రొవైడర్ ఒక్కోరకమైన వడ్డీ రేట్లకు ఇంటి రుణాలను అందిస్తుంటారు. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ 9.85 శాతం వడ్డీరే టుకే ఇంటి రుణాలను ఆఫర్ ఇస్తోంది.