Realtor
-
ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడి
సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్‌పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్‌లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్‌పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం -
రియల్టర్ రమేష్ హత్య కేసు: నిందితుడు రాణా పరార్
సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం నిందితులు రమేష్‌కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. సీన్ రీ కన్స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య -
షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య
సాక్షి, షాద్‌నగర్: తెలంగాణలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రియల్టర్ కమ్మరి కృష్ణను అతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌లోని కేకే ఫామ్‌హౌస్‌లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, కృష్ణ బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఫామ్‌హౌస్ నుంచి బయటకు వస్తుండగా అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. మరోవైపు.. కృష్ణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, కన్వేషన్ సెంటర్లు, ఫామ్‌హౌస్‌లను నిర్వహిస్తున్నట్టు సమాచారం. -
స్నేహితుడే..హంతకుడు
-
బీజేపీ నేత కిడ్నాప్?
అల్వాల్ (హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్, బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు చర్చనీయాంశమయ్యింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయిగూడ చర్లపల్లిలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. తిరుపతిరెడ్డికి అల్వాల్ పరిధిలోని పాకాలకుంటలో ఓ వివాదాస్పద స్థలం ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం తిరుపతిరెడ్డి తన స్థలానికి సంబంధించి అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు. డ్రైవర్ వేరే పనిమీద వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరుపతిరెడ్డి కన్పించకుండా పోయారని పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని భార్యతో పాటు అతని సోదరుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్థల వివాదం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మామిడి జనార్ధన్‌రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటోలో వెళ్లి..అదృశ్యమై.. మండల కార్యాలయం నుంచి తిరుపతిరెడ్డి ఒక్కడే ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన అనంతరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటకేసర్ వద్ద ఆటో దిగి సమీపంలోని దుకాణ సముదాయంలోకి వెళ్లాడని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇన్స్పెక్టర్ ఉపేందర్‌రావు వెల్లడించారు. తిరుపతిరెడ్డి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఆందోళన.. కిడ్నాప్‌కు గురైన తిరుపతిరెడ్డి ఆచూకీని తెలుసుకోవడంంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య, సోదరుడు ఆరోపించారు. ఆయన అదృశ్యమై దాదాపు రెండురోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత పోలీస్‌స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాటమార్చి ఫుటేజీలు ఉన్నాయంటున్నారని చెప్పారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని సుజాత పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయింపు తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, బీజేపీ నాయకులు, పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. జనగామ, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతిరెడ్డి శ్రేయోభిలాషులు కూడా పెద్దసంఖ్యలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. అదుపులో తిరుపతిరెడ్డి స్నేహితుడు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఘట్కేసర్ ప్రాంతంలో తిరుపతిరెడ్డిని వదిలిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. తిరుపతిరెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆయన గత కొన్ని రోజులుగా తరచూ స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. శుక్రవారం కూడా వేరే ఫోన్ ద్వారా మాట్లాడని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అల్వాల్‌లో రియల్టర్ తిరుపతిరెడ్డి కిడ్నాప్.. రూ.700కు ఆటో మాట్లాడుకుని..
హైదరాబాద్: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు. తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
కరీంనగర్లో లేడీ రియల్టర్ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత నిండు ప్రాణాలు బలిగొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లా జా అపార్ట్మెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇన్‌క్లైన్ కాలనీకి చెందిన ఆకుల ఓదెలు–లక్ష్మిల రెండో కుమార్తె సరిత మంచిర్యాల జి ల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది. గోదావరిఖనిలో నివసిస్తున్న వారికి ఆస్మిత్‌రెడ్డి, మణిత్‌రెడ్డి సంతానం. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం నచ్చని శ్రీపాల్‌రెడ్డి అందుకు అభ్యంతరం తెలిపాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలకు దారితీయడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్తుండే ది. ఈ క్రమంలో భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్మెంట్ 203 ఫ్లాట్‌లో ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. దీంతో సరిత సుమారు రూ. 20 లక్షలకుపైగా డబ్బును వెంకటేశ్‌కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్ నగరంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో కుమారులతో సహా సరితత మ్ముడి ఇంట్లోనే ఉంది.జూన్ 28న కొడుకులను గోదావరిఖని పంపిన సరిత అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్‌కు వెళుతున్నానని చెప్పింది. ఆమె సోదరుడు మర్నాడు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం సరిత ఫోన్ నుంచి ఆకుల సతీశ్‌కు వెంకటేశ్ వాట్సాప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుందని, ఫ్లాట్ లోపలే ఉందని, ఆమెను తాళం పగలగొట్టి తీసుకెళ్లాలని చెప్పి పరారయ్యాడు. దీంతో కంగారుపడిన సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్... హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిచూడగా రక్తపు మడుగులో, ముఖం, తలపై తీవ్రగాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. సతీశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధా న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణం... సరిత మృతికి వ్యాపార లావాదేవీలే కా రణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ. 25 లక్షలను పెట్టుబడి కింద వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందన్నారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వా లని అడగడంతో వెంకటేశ్ ఇవ్వలేదని.. దీనిపై ఇద్దరికీ గొడవలు జరిగేవని సతీశ్ తెలిపాడు. వెంకటేశ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
మంచిర్యాల ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో పట్ట పగలే దారుణ హత్య చోటుచేసుకుంది. మందమర్రి మండలం గద్దేరాగడిలో లక్ష్మీకాంతరావు అనే రియాల్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఆయన్ను కత్తులతో తలపై దాడి చేసి ప్రాణం తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల అసుపత్రికి తరలించారు. మృతుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు సమీప బంధవుగాపోలీసులు గుర్తించారు. అయితే ఓ స్థలం వ్యవహారంలో లక్ష్మీకాంతరావుకు స్థానికంగా కొందరితో వివాదం నడుస్తోందని, ఈ క్రమంలోనే ఆయన్ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం -
పీఎం పాలెం: రియల్టర్ కిడ్నాప్ కలకలం.. 12 లక్షలు డిమాండ్!
సాక్షి, విశాఖపట్నం: పీఎం పాలెంలో రియల్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్లాట్ అమ్మకం విషయంలో రియల్టర్ మధుసూదన్ రావుకు రౌడీ షీటర్ హేమంత్ కుమార్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మధుసూదన్ రావును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ప్లాట్ అమ్మకాల్లో వివాదం కారణంగా రౌడీ షీటర్ 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఇది కుదరకపోవడంతో రియల్టర్ మధుసూదన్‌ను రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేశారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసు కమిషనర్ శ్రీకాంత్‌ను ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. పద్మనాభం అనే వ్యక్తి వద్ద మధుసూదన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రియల్టర్ మధుసూదన్ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, రౌడీ షీటర్ హేమంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హేమంత్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక, మధుసూదన్ కిడ్నాప్‌కు సహకరించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. -
రూ.4 కోట్లతో రియల్టర్ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం
జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహుమానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు. వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. -
ఎట్ల రిజిస్ట్రేషన్ చేస్తావో.. చూస్తా!
సాక్షి, ఆదిలాబాద్: ప్లాట్ల కొనుగోలు, డబ్బులు ముట్టజెప్పే వ్యవహారంలో ఓ రియల్టర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మధ్య జరిగిన ఆడియో సంభాషణ సంచలనం రేపింది. ఏడాది క్రితం జరిగిందని ఎమ్మెల్యే చెబుతున్నా.. ఇటీవలే ఆ ప్లాట్ల వ్యవహారం జరిగినట్టుగా చర్చ సాగుతోంది. ఆ రియల్టర్ నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్‌కుమార్ అని ప్రచారం సాగుతోంది. రియల్టర్ కిరణ్‌కుమార్ బోథ్‌లో కొన్నేళ్ల క్రితం చేసిన లేఅవుట్లో కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే బాపురావు డబ్బులు చెల్లించలేదని చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య ఓ మధ్యవర్తి ఉండటం, రియల్టర్ ఆ మధ్యవర్తిపై ఒత్తిడి తేవడం, దీంతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్లో సంభాషించినట్లుగా వ్యవహారం సాగింది. ప్రధానంగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ ప్లాట్లను ఇతరులకు అమ్మేందుకు ఇటీవల ప్రయత్నాలు చేయగా, ఈ వివాదం చోటుచేసుకుందని అంటున్నారు. రియల్టర్, ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఇలా.. ఎమ్మెల్యే: ఎవరో వచ్చి ప్లాట్ చూస్తున్నారటా.. ధన్నూరోల్లటా (బోథ్ మండలం ధన్నూర్ గ్రామస్తులు).. రియల్టర్: చూస్తారు కదా సార్.. ఏడాదిన్నర, రెండేళ్లు టైం ఇచ్చిన తర్వాత డబ్బులు రాకుంటే నా దగ్గర కూడా పైసల్లేవు కదా సార్. ఎమ్మెల్యే: ఔనండి.. ఉంటాయి పైసలు ఉంటాయి.. దునియ కూడా ఉంటది. రియల్టర్: ఏం సర్.. సంవత్సరాల కొద్దీ పేమెంట్ ఆగుతద. ఎమ్మెల్యే: లెక్కతో లెక్క చేసుకోవాలి కానీ.. లేనిపోని లొల్లి పెట్టుకోకండి.. రియల్టర్: ఎవరు పెడుతున్నరు సార్ లొల్లి.. రమ్మని అంటున్న కద సార్ ఆయన్ని (మధ్యవర్తిని).. లెక్క చేద్దామని, నేను పది సార్ల పోయిన ఆయన దగ్గరికి.. ఎమ్మెల్యే: కండిషన్ పెడుతున్నవట కదా.. రూ.28 లక్షలు నెట్ క్యాష్ తీసుకొని రా అంటున్నవట కదా. రియల్టర్: నెట్కాదు సార్.. ఫస్ట్ నా దగ్గరికి రా అన్న.. ఆయన మాటిమాటికి మీదగ్గరే వస్తున్నడు. ఎమ్మెల్యే: ఔనండి నేను పైసలు ఇయ్యాల కదా.. రియల్టర్: మరి ఇచ్చేయండి ఆయనకి.. మీరిచ్చేస్తే ఆయన నాకు తెచ్చి ఇస్తాడేమో.. నేను మిమ్మల్ని అడగట్లే. ఎమ్మెల్యే: నువ్వు బోథ్‌లో ఎట్ల ఉంటావో నేను చూస్తా. రియల్టర్: సరే సార్ నేను దందానే చేస్తలేను. మీ ఇష్టం. మీరు అట్ల అంటే దానికి ఏం చేయలేను నేను. ఎమ్మెల్యే: బోథ్‌లో ఎట్ల లేఅవుట్ తీసినవో, ఎట్ల చేసినవో.. పోనియ్యు అని మేము అడుగుతలేం. బోథ్‌కు రా నువ్వు ఎట్ల రిజిస్ట్రేషన్ చేస్తావో చూస్తా నేను. రియల్టర్: సరే దాందేముంది.. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.. ఆ వాయిస్ నాది కాదు ఎమ్మెల్యే బాపురావుతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఫోన్లో వాయిస్ నాది కాదు. మార్ఫింగ్ చేసినట్టున్నారు. ఆయనతో రాజకీయ విభేదాలున్నవారు ఇలా చేసి ఉండొచ్చు. దాంతో నాకు సంబంధం లేదు. – రియల్టర్ కిరణ్‌కుమార్ బెదిరించలేదు ఇది నేను రియల్టర్‌తో ఏడాది కిందట మాట్లాడింది. నేను ఆయనను బెదిరించలేదు. బ్లాక్మెయిల్ చేయలేదు. నేనే రూ.28 లక్షలు బాకీ ఉన్నట్టు చెబుతున్నాను. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. – రాథోడ్ బాపురావు, బోథ్ ఎమ్మెల్యే -
‘రియల్’ క్రైం స్టోరీ: లేడీ ఎస్ఐ.. మహిళా మేజిస్ట్రేట్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బాధితుడికే అనుమానాలు లేని కేసు ఇది. తనంటే పడనివారెవరో తనపై దాడిచేసుంటారన్నదే అతని అనుమానం. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తొలుత అందించిన సమాచారం కూడా ఇదే. అయితే సాధారణ ఘటనగా మొదలైన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఒక మహిళ ఎస్ఐ, మేజిస్ట్రేట్ల ప్రమేయం బయటపడటంతో సంచలనాలకు కేంద్రమైంది. నిందితుల వేటలో విశాఖ పోలీసులకు సరికొత్త సవాళ్లు విసిరింది. చట్టం ముందు ఎంతటివారైనా సమానమంటూ పోలీసులు చేసిన దర్యాప్తు వారి నిబద్ధతకు అద్దం పట్టింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? మూడో వ్యక్తి విచారణతో.. జూన్ 19న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌పై బీచ్‌రోడ్డు కోస్టల్ బ్యాటరీ సమీపంలో దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి రాజేష్ తలపై సుత్తితో కొట్టి పరారయ్యారు. అనంతరం రాజేష్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనంటే పడనివారు ఎవరో ఈ దాడి చేసుంటారని రాజేష్ పోలీసులకు తెలపడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభమైంది. మొదట్లో రోటీన్‌గా కేసు విచారణ ప్రారంభమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గనగల్ల రాజు, కూర్మాన రామస్వాములను జూలై 1న అదుపులోకి తీసుకుని విచారించగా తరుణ్ అనే మూడో వ్యక్తి ప్రమేయం బయటపడింది. అతన్ని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటపట్డాయి. హత్యకు రెండు బృందాలు? బాధ్యత గల వృత్తిలో ఉన్న భీమిలి మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె సోదరి భీమిలి క్రైం ఎస్ఐ నాగమణిలే ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మేజిస్ట్రేట్ జయలక్ష్మికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి కారణంగా నిలిచాయి. మేజిస్ట్రేట్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న అప్పలరెడ్డి.. రాజేష్‌ను హత్య చేయాల్సిందిగా తరుణ్‌కు సూచించాడు. తరుణ్ ఆరిలోవ, జాలరిపేటకు చెందిన మరో ఇద్దరు యువకులను ఇందుకు పురమాయించగా.. వారు రాజేష్‌పై దాడి చేశారు. వారిని పట్టుకుని విచారించగా మేజిస్టేట్ ప్రమేయంతో పాటు రాజేష్‌ను హత్యచేసేందుకు మరో బృందాన్ని సిద్ధం చేసిన ఎస్ఐ నాగమణి, కానిస్టేబుల్ ప్రమోద్‌ల వ్యవహారం బయటపడింది. ఎస్ఐ సూచనతో ప్రమోద్ ఓ రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురిని రాజేష్‌ను హత్య చేసేందుకు పురమాయించాడు. వారి వాట్సాప్ డేటా ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారాన్ని గుర్తించారు. పోలీసులకు చుక్కలు చూపించారు? పోలీసు చర్యలను ముందుగానే పసిగట్టిన ఎస్ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె డ్రైవర్ అప్పలరెడ్డి పరారయ్యారు. ఎస్ఐ నాగమణికి పోలీసుల క్రైం దర్యాప్తుపై ముందుగానే అవగాహన ఉండటంతో మూడు నెలలుగా పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రత్యేక బృందాలకు దొరకకుండా తప్పించుకుని తిరిగారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు ఎస్ఐ భర్తతో పాటు కొందరు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. వారు పోలీసులకు చిక్కకుండా కర్నాటక, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీలోని పలు నగరాల్లో సంచరించారు. ఒక్కో ప్రాంతంలో రెండు నుంచి నాలుగు రోజులు ఉంటూ నిత్యం సిమ్‌కార్డులు మార్చేసేవారు. వాట్సాప్ కాల్స్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉండేవారు. అయినా వెనక్కి తగ్గని విశాఖ పోలీసు బృందాలు వారి ఆచూకీపై నిరంతరం నిఘా ఉంచడంతో ఎట్టకేలకు శనివారం విజయనగరంలో పట్టుబడ్డారు. చింతలవలసలో ఇంటికి వచ్చి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రైవర్‌ను హైవేపై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ నాగమణితో పాటు డ్రైవర్ అప్పలరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ, కేసు దర్యాప్తు అధికారి ఆర్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. మేజిస్ట్రేట్‌ను అరెస్ట్ చేసేందుకు శాఖపరమైన మరికొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అవి పూర్తయిన వెంటనే అరెస్ట్ చేయడం చేస్తామన్నారు. ఈ ఘటనలో తొలుత ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఆయన తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్‌తో పాటు రౌడీషీటర్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం ఎస్ఐతో పాటు మేజిస్ట్రేట్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఒక్కోక్క అంశం బయటపడిన విధానంపై ఆయన స్పందిస్తూ చట్టం ఎదుట ఎంతటివారైనా సమానమే అన్నారు. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి చట్ట వ్యతిరేకంగా నేరపూరిత విధానాలకు పాల్పడిన ఎస్ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి ఇందుకు అతీతులు కారన్నారు. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి?
నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై ఉత్కంఠకు తెరపడింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఈ కూల్చివేతపై.. ట్విన్ టవర్స్ నిర్మాణ సంస్థ సూపర్ టెక్ స్పందించింది. నోయిడా డెవలప్మెంట్ అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే కూల్చేసిన జంట భవనాల్ని నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదని సూపర్ టెక్ అధినేత ఆర్కే అరోరా స్పష్టం చేశారు. టవర్స్ కూల్చివేయడంపై ఇప్పటికే సూపర్ టెక్ నుంచి ఇళ్ల కొనుగోళ్ల కోసం అడ్వాన్స్‌లు చెల్లించిన కస్టమర్ల ఆందోళనపై స్పందించారు. కంగారు పడొద్దు. "మేం 70వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు దారులకు డెలివరీ చేశాం. మిగిలిన వారికి షెడ్యూల్ టైమ్ ప్రకారం డెలివరీ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సుప్రీం కోర్ట్ ఉత్తర్వుతో ట్విన్ టవర్స్‌ను కూల్చేస్తున్నామని, ఆ ప్రభావం మా సంస్థ నుంచి కొనసాగుతున్న ఇతర ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపదని ఆర్కే అరోరా అన్నారు. సుప్రీం తీర్పు మాకు శిరోధార్యం "నోయిడాలోని ట్విన్ టవర్స్ 'అపెక్స్', 'సెయానే'లు సెక్టార్ 93ఏ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. నోయిడా అథారిటీ కేటాయించిన భూమిలో నిర్మించబడింది. 2009లో రెండు టవర్లతో సహా ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ ప్రణాళికలను నోయిడా అథారిటీ ఆమోదించింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్ బై చట్టాలకు అనుగుణంగా నిర్మించాం." అని ఆర్కే అరోరా పేర్కొన్నారు. "అయితే, మేం నిర్మించిన జంట భవనాల వల్ల సాంకేతిక కారణాల్ని ఎత్తి చూపిస్తూ రెండు టవర్లను కూల్చివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తా. తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. చదవండి👉 ట్విన్ టవర్స్ కూల్చివేతలో మీకు తెలియని ఆసక్తికర విషయాలు! -
తండ్రిని చంపేశారనే కక్షతో..
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన రియల్టర్ రఘుపతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదమూడేళ్ల క్రితం తన తండ్రి జంగారెడ్డిని కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి.. రఘుపతిని అంతమొందించేందుకు రూ.30 లక్షలకు కర్ణాటకకు చెందిన కిరాయి గుండాలతో సుపారీ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం కిరాయి మూకలు ఈనెల 15న దమ్మాయిగూడలోని శివనగర్‌లో రఘుపతిపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీ కాంత్ రెడ్డి, మంజునాథ్‌లతో పాటు సుపారీ గ్యాంగ్‌లోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మల్కజ్గిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్‌లతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడ పీఎస్ రావ్ నగర్‌కు చెందిన సూరకంటి శ్రీకాంత్ రెడ్డి తండ్రి జంగారెడ్డికి కాప్రా మండలం చక్రిపురంలోని సీతారాం నగర్‌కు చెందిన హతుడు అంబటి రఘుపతి అలియాస్ రఘుకు 2009లో ప్లాట్ విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో రఘుపతి, మరికొందరు స్నేహితులతో కలిసి జంగారెడ్డిని హత్య చేశాడు. 2012లో ఈ కేసులో న్యాయస్థానం రఘుపతిని నిర్ధోషిగా తేల్చింది. అప్పట్నుంచి శ్రీకాంత్ రెడ్డి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని భావించిన శ్రీకాంత్ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జంగారెడ్డికి దగ్గరి స్నేహితుడు మంజునాథ్ సహాయం కోరాడు. జంగారెడ్డి హత్య అనంతరం మంజునాథ్ కర్నాటకలోని శిమోగా జిల్లాలో మెటీరియల్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రఘుపతిని హత్య చేసేందుకు కర్నాటకకు చెందిన కిరాయి హంతకుడు రిజ్వాన్‌తో రూ.30 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇతను తన స్నేహితులైన భావిత్, మహ్మద్ సాదీఖీ అలియాస్ రహాద్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్, సుమిత్, నేతలతో కలిసి నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి శ్రీకాంత్ రెడ్డి దమ్మాయిగూడలోని పీఎస్రావ్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆశ్రయం కల్పించాడు. హంతకులు తిరిగేందుకు సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు. వీరు నెల రోజులుగా రఘుపతి ఇళ్లు, తదితర ప్రాంతాలను రెక్కీ చేశారు. ఈ క్రమంలో ఈనెల 15న రాత్రి రఘుపతి తన స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్‌లతో కలిసి శివనగర్‌లోని ఓ ప్లాట్ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్వీఆర్ వైన్స్ సమీపంలో నిందితులు కత్తులు, వేట కొడవళ్లతో రఘుపతిపై దాడి చేశారు. అతడి తలకు తీవ్ర గాయాలు కావటంతో రఘుపతి అక్కడికక్కడే మరణించాడు. రఘుపతి స్నేహితుడు ప్రసాద్‌కు ఎడమ భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. హత్య అనంతరం ఘటనాస్థలి నుంచి ద్విచక్ర వాహనాలపై శ్రీకాంత్ రెడ్డికి ఇంటికి వెళ్లిన నిందితులు.. అక్కడ్నుంచి రెండు కార్లలో రాష్ట్ర సరిహద్దులను దాటేశారు. హత్యకు వినియోగించిన వేట కొడవళ్లను కీసర నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్కు వెళ్లే మార్గంలో చిత్రంభళారే విచిత్రం స్టూడియో పక్కన ఉన్న పొదల్లో పారవేశారు. రూ.30 లక్షలలో కొంత మొత్తాన్ని శ్రీకాంత్ రెడ్డి రిజ్వాన్‌కు అందించగా.. నిందితులు పంచుకున్నారు. సుపారీ డబ్బుల కోసం వచ్చి చిక్కారు.. సుపారీ డబ్బుల్లో ఇంకా కొంత రావాల్సి ఉండటంతో హంతకులు సాదీఖ్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్ కర్నాటక నుంచి శ్రీకాంత్ రెడ్డికి చెందిన బొమ్మలరామారం మండలం రంఘపురంలోని ఫామ్ హౌస్‌కు వచ్చారు. అప్పటికే సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించిన జవహర్‌నగర్ పీఎస్, మల్కజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మాటువేసి ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి, మంజునాథ్, కాప్రా మండలం సాయిబాబానగర్‌కు చెందిన కావాడీ రాజేశ్‌లతో పాటు అంతరాష్ట్ర నిందితులు ముగ్గుర్ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు వేట కొడవళ్లు, మూడు కత్తులు, కారు, బైక్‌లను స్వా«దీనం చేసుకున్నారు. రిజ్వాన్, భావిత్, సుమిత్, నేతలు పరారీలో ఉన్నారు. (చదవండి: తాగుబోతు అల్లుని కిరాతకం.. భార్యను ఇంటికి పంపలేదని) -
రియల్ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు
-
రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్ మృతదేహం లభ్యమైంది. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్‌రెడ్డి మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా రవీందర్ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిపై అతని అల్లుడు మోహన్‌రెడ్డి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఉన్న సెల్‌ఫోన్ తీసుకోవడానికి రాగా అక్కడే కాపుకాసిన అతని బంధువు ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రవీందర్ రెడ్డిని సమీపంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. చదవండి: బెదిరించానని చెబితే ఖతం చేస్తా... ఘటనా స్థలంలో పోలీసులు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థిరాస్తి వ్యాపారంలో మూడున్నర లక్షల కమిషన్ విషయం గొడవకు కారణమని తెలుస్తోంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! -
రియల్టర్ శ్రీనివాస్ హత్య కేసు: పోలీసుల అదుపులో మరో నలుగురు
సాక్షి, మెదక్ : రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల కాల్‌డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీలా? అక్రమ సంబంధమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది. -
రియల్టర్ భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పురోగతి
-
మోసగించడంలో మనోడిది నయా ట్రెండ్.. ప్రకటనలే పెట్టుబడి
సాక్షి, సిటీబ్యూరో: రియల్ఎస్టేట్ ప్రకటనల ఆధారంగా పలువురిని మోసంచేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు ఖమ్మం జిల్లా చిన్నారానికి చెందిన ఎస్.నాగరాజుగా గుర్తించారు. వివరాలు.. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నాగరాజు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఆ పేరుతోనే మోసాలకు చేయాలని నిర్ణయించుకున్నాడు. 99ఎకర్స్.కామ్, ఓఎల్ఎక్స్ యాప్‌లతో పాటు వివిధ క్లాసిఫైడ్స్‌తో స్థలాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనల్ని చూసేవాడు. వారికి ఫోన్‌చేసి ఆ స్థిరాస్తిని తాను ఖరీదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పి బయానాగా కొంత చెల్లించి వాట్సాప్ ద్వారా పత్రాలు షేర్ చేయించుకునే వాడు. ఆపై రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన బోర్డులపై ఉన్న రియల్టర్ల నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి తానే సదరు స్థలానికి యజమానినంటూ పరిచయం చేసుకునేవాడు. తక్కువ ధరకు విక్రయించేస్తున్నట్లు చెప్పి పత్రాలు షేర్ చేసేవాడు. నిజమేనని నమ్మిన రియల్టర్లు అగ్రిమెంట్ చార్జీలు, అడ్వాన్సులు, ఇతర ఖర్చుల పేరుతో రూ.లక్షల్లో తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. తరువాత అసలు యజమానుల్ని సంప్రదించి స్థిరాస్తి ఖరీదు చేయలేకపోతున్నానని చెప్పి వారి పత్రాలను వాట్సాప్ ద్వారా తిప్పిపంపి బయానాగా చెల్లించినదీ వెనక్కు తీసుకునేవాడు. ఇలా చైతన్యపురి, మీర్పేట్లతో పాటు సైబర్ క్రైమ్ ఠాణాలోనూ పది కేసులు నమోదయ్యాయి. దీంతో ఏసీపీ ఎస్.హరినాథ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎన్.రాము రంగంలోకి దిగారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడు నాగరాజుగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నరసరావుపేటలో రియల్టర్ దారుణ హత్య
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో రియల్టర్ మల్లికార్జునరావు దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో నరికి చంపారు. రావిపాడు రోడ్డులోని ప్రైవేట్ వెంచర్లో ఆయనను దుండగులు హత్య చేశారు. గతంలో ఓ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డి ఆడియో క్లిప్ వైరల్
-
మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘మహేందర్... 50 ఎకరాల వెంచర్ నడుస్తోంది... సర్పంచ్‌కిస్తే సరిపోతుందా... పొట్టు పొట్టు చేస్తం.. వాడిని బిచ్చం అడుగుతవా... మంత్రిని కలువు అని’ అంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ శివార్లలోని ఓ సర్పంచ్ భర్తను బెదిరించినట్టుగా భావిస్తున్న ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కలిసే వరకు వెంచర్ ఆపేయాలంటూ మంత్రి చేసినట్టుగా ఉన్న ఆ ఆడియోలోని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మంత్రిపై చర్యలు తీసుకో వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అసలు ఆ ఆడియోలోని వాయిస్ తనది కానేకాదని మల్లారెడ్డి ఖండించారు. ఈ ఆడియో ఉదం తంతో నగర శివార్లలో జరుగుతున్న రియల్ వసూళ్ల పర్వం మరోసారి తెరపైకి వచ్చింది. శివార్లలో వెంచర్ పడిందంటే చాలు ప్రజా ప్రతినిధులు గద్దల మాదిరి వాలిపోయి సాగి స్తున్న వసూళ్ల దందా సంచలనం సృష్టిస్తోంది. ఆదాయ వనరులుగా వెంచర్లు రాజధాని చుట్టూ స్థిరాస్తి రంగం ఊపందుకుని రెండు దశాబ్దాలు కావస్తోంది. గత 20 ఏండ్లుగా శివారు భూములపై లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ క్రమంలో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న వెంచర్లు ప్రజా ప్రతినిధులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. చోటా నేతల నుంచి బడా లీడర్ల వరకు ఇదే దందా సాగిస్తున్నారు. ఇందులో వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మంత్రులు సైతం ఉంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘లైన్’లోకి వస్తే సరే.. లేదంటే వెంచర్లు వెలియగానే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. రియల్టర్లపై సాగించే బెదిరింపుల పర్వం అంతా ఇంతా కాదు. లేఅవుట్ పడగానే సదరు సంస్థ లేదా డెవలపర్‌ను ‘లైన్’లోకి తీసుకుంటారు. అంతా సవ్యంగా సాగి తాము అనుకున్నది ముడితే ఓకే... లేదంటే ఆ డెవలపర్‌కు చుక్కలు కనబడాల్సిందే. భూమి అమ్ముకోలేని పరిస్థితుల్లో అడిగినంత సమర్పించుకుంటే కానీ అడుగు ముందుకు పడదు. సదరు నేత స్థాయిని బట్టి.. వెంచర్‌ను బట్టి, సదరు ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి రియల్ వసూళ్లు చేతులు మారుతుంటాయి. కనీసం రూ.10వేల నుంచి మొదలయ్యే ఈ తతంగం కొన్నిసార్లు ‘కోట్లు’ దాటుతాయి. లేఅవుట్ వేసిన భూమిలో ఏవైనా లోపాలుంటే వాటిని ఎత్తిచూపుతూ బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా కొందరు వెనుకాడడం లేదనే ఆరోపణలున్నాయి. వారు అడిగినంత ఇస్తే ఏ లోపం ఉన్నా, నిబంధనలేవీ పట్టించుకోక పోయినా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడరు. లేదంటే కష్టాలు తప్పవని స్థిరాస్తిరంగ వ్యాపారి ఒకరు వాపోయారు. అనుమతులకు అదనం ప్రజాప్రతినిధుల దందాకు తోడు వెంచర్ నిర్వాహకులకు అధికారిక అనుమతులు కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటే సదరు వెంచర్‌ను నిర్దేశిత రుసుముతో అనుమతించాలి. నిబంధనల ప్రకారం లేని దరఖాస్తును తిరస్కరించాలి. కానీ స్థానిక సంస్థలైనా, స్వయం ప్రతిపత్తిగల సంస్థలైనా.. అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది రియల్ డబ్బులకు ఆశ పడుతున్నారు. నిబంధనల మేరకు ఉన్నా, లేకపోయినా వారికి సంబంధం లేదు. వారి వాటా వారికి ముట్టాల్సిందే. అడిగింది ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో అనుమతుల జారీలో జాప్యం చేస్తారనే భయంతో వెంచర్ నిర్వాహకులు కూడా ముందే ముట్టజెప్పేస్తున్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను కూడా పురపాలికల సిబ్బంది, పాలకవర్గం వదలడం లేదనే ఆరోపణలున్నాయి. సిండికేట్‌గా మారి అన్ని అనుమతులున్న లేఅవుట్లలోనూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. ‘తూముకుంట మునిసిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 333 పార్ట్, 361 పార్ట్ గల భూమిలో 4 ఎకరాల 28 గుంటలలో హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకొని లేఅవుట్ వేశారు. హెచ్ఎండీఏ నుంచి ఫైనల్ లేఅవుట్ కూడా వచ్చింది. అయితే మున్సిపాలిటీకి ఒక శాతం ఇంపాక్ట్ ఫీజు కడదామని వెళితే తీసుకోవట్లేదు. లక్షల్లో ఇస్తేగానీ చేసేదే లేదని తెగేసి చెప్పారు. వినకపోతే మీ లేవుట్‌లో అభివృద్ధి సరిగా లేదని, రోడ్లు బాగాలేకున్నా...ఎలా అనుమతి ఇచ్చారంటూ హెచ్ఎండీఏకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారు. ఓవైపు హెచ్ఎండీఏకు రూ.70 లక్షల ఫీజు కట్టి అనుమతి తెచ్చుకుంటే...వీళ్లేమో ఫిర్యాదు చేస్తామంటూ వ్యాపారానికి అడ్డంకిగా మారుతున్నారు. ఇలాచేసి అధికారిక లేఅవుట్ అనుమతులు తీసుకునే బదులు, అనధికారికంగా లేఅవుట్ చేసి స్థానిక సంస్థలకు రూ.20 లక్షలు ముట్టచెబితే మా వ్యాపారం సజావుగా సాగేలా ఉంది..’ అని రియల్టర్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయేది ప్రజలే.. రియల్టర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రభుత్వ సిబ్బంది... ఇలా ఎవరి చేతుల నుంచి ఇంకెవరి చేతుల్లోకి డబ్బులు వెళ్లినా ఆ భారమంతా చివరకు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోంది. వెంచర్ వేసే స్థలం కొనుగోలుకు అదనంగా గజానికి రూ.250 ఖర్చు పెడితే డెవలప్ చేసి కొనుగోలుదారులకు అమ్మవచ్చు కానీ, తాము కొన్న దానికంటే రెండింతలు అదనంగా ధర నిర్ణయించి రియల్ వ్యాపారులు సదరు స్థలాలను ప్రజలకు అంటగడుతుండటం గమనార్హం. ఇదీ సంభాషణ మల్లారెడ్డి: హలో మహేందర్ మహేందర్ (బొమ్మరాసిపేట్ సర్పంచ్ భర్త): సార్ నమస్కారం సార్ మల్లారెడ్డి: 50 ఎకరాల వెంచర్ నడుస్తోంది, సర్పంచ్‌కు ఇస్తే సరిపోతదా, కలెక్టర్‌కు జెప్పి వాడిని పొట్టుపొట్టు జేస్తా మహేందర్: సార్ సార్ మాకు ఇంతవరకూ కలవలేడు సార్, నేను పోయిన సార్, వెంచర్ అతను కలవలేదు. మల్లారెడ్డి: వాడ్ని పట్టుకరర్రి వయా, మీకు కలిసేదేంది. ఈడ ఎమ్మెల్యే ఉన్నడు, మంత్రి ఉన్నడు. మహేందర్: అవును సార్, మొన్న పోయిన సార్ అతను కలువలేడు మల్లారెడ్డి: వాడు ఎవడాడు, వాడు కలుసుడేంది.. వాణ్ణి బిచ్చం అడుగుతవా.. మంత్రిని కలువు, వాడ్ని కలువు అని. హాస్పిటల్ అని, స్కూల్ అని దేనికో ఇవ్వాలెగా. లేకుంటే పొట్టుపొట్టు చేసి ఇడిశిపెడ్తం. మహేందర్: సార్ సార్ నేను తప్పకుండా తీసుకొని వస్త సార్. మల్లారెడ్డి: ఎప్పుడు తెస్తవ్. మహేందర్: అతనికి యాక్సిడెంట్ అయిందంట సార్, హాస్పిటల్లో ఉన్నడు సార్. మల్లారెడ్డి: వాడు రాడు. వచ్చేదాకా వెంచర్ పనులు ఆపేసేయ్ మను. మహేందర్: ఓకే సార్. నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆ ఆడియో టేపులో ఉన్నది నా వాయిస్ కాదు. నా గొంతును వేరొకరు అనుకరించారు (మిమిక్రీ). ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఎవరినీ బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. ఈ వెంచరే కాదు, ఏ వెంచర్ల వద్ద నుంచి నేను ఒక రూపాయి కూడా అడగలేదు. తీసుకోలేదు. ఎవ్వరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నాకే వందల ఎకరాల భూములు ఉన్నాయి. సరిపడా డబ్బులు ఉన్నాయి. వేరేవాళ్ల భూములు, డబ్బులు నాకు అవసరం లేదు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధమే. దీనిపై విచారణకు ఆదేశిస్తాం. ప్రజలకు సేవ చేయటానికి నేను రాజకీయాల్లోకి వచ్చా. విద్యాసంస్థలు పెట్టి విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేస్తున్నా. ప్లేస్మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నా. – చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చదవండి: శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి -
కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్ హత్య
మహబూబ్‌నగర్ క్రైం: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతున్నాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు. మొదట కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత చనిపోలేదని భావించి కత్తులతో గొంతుకోశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంటకి చెందిన నరహరి (40), అతడి భార్య అరుణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జిల్లా కేంద్రంలోని వైష్ణవిదేవి కాలనీలో నివాసం ఉంటున్నారు. నరహరి చిన్న చింతకుంట మండలం ఉంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన జగదీశ్ కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని సద్దల గుండు చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ.. మహబూబ్‌నగర్‌లో ‘వండర్ లైఫ్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల నుంచి జగదీశ్‌తో నరహరికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం అవసరం ఉందని నరహరి దగ్గర దశల వారీగా జగదీశ్ దాదాపు రూ.కోటి వరకు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 నెలల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని జగదీశ్‌ను పలుమార్లు నరహరి అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి జగదీశ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన నరహరి.. అర్ధరాత్రి వరకు అక్కడే డబ్బుల విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిరోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో నరహరి అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత అక్కడి నుంచి బైక్‌పై తన ఇంటికి బయల్దేరాడు. అయితే షాషాబ్‌గుట్ట నుంచి భగీరథ కాలనీ వైపు వస్తుండగా.. మార్గమధ్యలో పసుల కిష్టారెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలో టీఎస్ 06 ఈఎస్ 3618 నంబర్ కలిగిన కారుతో వెనుక నుంచి నరహరి బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టారు. కిందపడిపోన నరహరి చనిపోలేదని భావించిన దుండగులు కత్తులతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం వారు ఉపయోగించిన కారును సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. -
ఇదో పెద‘రాయుడి’ అక్రమ మార్గం
సాక్షి, రాజమహేంద్రవరం: సేవ ముసుగులో కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడ వేశాడు ఓ గ్రామంలో పెద‘రాయుడు’. టీడీపీలో చక్రం తిప్పే ఆయన రియల్టర్ కూడా. సంపదను పెంచుకునే ముసుగులో ప్రజల కోసం ఉదారంగా భూమి రాసి ఇచ్చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. రాయవరం మండలంలో తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై నడిపించే నాయకుడికి హఠాత్తుగా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన వచ్చిందట. అనుకున్నదే తడవుగా తనకున్న విలువైన భూమిలో మూడు కుంచాల భూమి రాసిచ్చేస్తానని ముందుకు వచ్చాడు. ఇందుకోసం మండల స్థాయిలో అధికారులకు వల వేసి తన ‘లే అవుట్’కు మార్గం సుగమం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. టీడీపీ నేతకు ఇంత ఔదార్యం ఎందుకు వచ్చిందా అని జనం ఆరా తీయగా దీని వెనుక దాగి ఉన్న పచ్చ నేత స్వార్థం బహిర్గతమై జనం విస్మయానికి గురవుతున్నారు. ఆ కథా కమామీషు ఏమిటో ఒకసారి చూద్దాం. దానం ఇచ్చిన భూమిలో... రాయవరంలో ప్రభుత్వ భవనాలకు దివంగత రాయవరం మునసబు సుమారు మూడు ఎకరాలు ఏనాడో దానం చేశారు. ఆ భూమిలో పోలీస్‌స్టేషన్, తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, వెలుగు, ఉపాధి హామీ, మండల విద్యాశాఖ, హౌసింగ్, సబ్ ట్రెజరీ...ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాల నుంచి 40 అడుగుల రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఆ నాయకుడు ముందుకు వచ్చాడు. ఆ రోడ్డును ఆమోదిస్తే ఆ నాయకుడు వేస్తున్న వెంచర్ ధర అమాంతం పెరిగిపోతుంది. రాయవరం మెయిన్ రోడ్డు నుంచి కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఏర్పాటుకు నిర్దేశించిన స్థలం సోమేశ్వరం–రాజానగరం రోడ్డును ఆనుకుని దివంగత రాయవరం మునసుబు దానం చేసిన స్థలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల వెనుక టీడీపీ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. సుమారు 16 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతా ప్లాన్ చేసిన ఆ వెంచర్‌కు సరైన మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలు పలుకుతోంది. అదే రోడ్డు ఏర్పాటైతే ఒక్కసారిగా ఎకరం రూ.3 కోట్లు అయిపోతుంది. ఆ నాయకుడు వేయతలపెట్టిన వెంచర్ కోసం పంట పొలాల్లోకి సుమారు 100 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పుతో ప్రభుత్వ భూముల్లో నుంచి రోడ్డును వేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్న జాగాలో రహదారి ఇచ్చినందుకు ప్రతిగా ఆ నాయకుడు 20 సెంట్ల భూమి ఇవ్వడానికి అధికారులు, అనధికారులతో రహస్య ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇదేమిటంటూ స్థానికుల ఆగ్రహం ఆ నాయకుడు చెప్పినట్టుగా తలాడిస్తున్న కొందరు అధికారులు, అనధికారులు ఆ స్థలంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయవరం సచివాలయం–2ను మార్చేసే ఆలోచన చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఈ సచివాలయ నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లి సుభా‹Ùచంద్రబోస్ ఈ ఏడాది జనవరి 12న భూమిపూజ కూడా చేయడం గమనార్హం. ఒక్క గ్రామ సచివాలయమే కాదు రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నుంచి ప్రధాన రహదారికి 40 అడుగుల రోడ్డును వేస్తే ఆ నేతకు చెందిన పొలం విలువ ప్రస్తుతం ఉన్న విలువకు మూడు, నాలుగు రెట్లు అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. తన భూమిని రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి 20 సెంట్ల ఇవ్వజూపి, ప్రభుత్వ స్థలంతో 40 అడుగుల రోడ్డు వేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఎకరం రూ.3 కోట్లు పైనే పలుకుతుంది. అంటే ప్రతి ఎకరాకు రూ.2 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు వేస్తే గనక ఆ పెదరాయుడికి అదనంగా వచ్చి పడే మొత్తం సొమ్ము రూ.32 కోట్లుగా లెక్క లేస్తున్నారు. ఇంత అదనపు రాబడి వస్తుండటంతోనే తెర వెనుక జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ అధికారులకు 5 శాతం (కోటిన్నర) ముట్టజెప్పే ఒప్పందం కుదిరిందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడో ఏళ్ల కిందట దాత ఎంతో ఔదార్యంతో ఇచ్చిన భూమిని ఎలా కేటాయిస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. ఈ ప్రతిపాదన చర్చకు రావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు ఈ ప్రతిపాదన ఎలా వచ్చింది? ప్రతిపాదనకు ఎవరు మద్దతిస్తున్నారు? తెరవెనుక రాజకీయం ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారులు, నాయకులు ఎలా సహకరిస్తారంటున్నారు. లక్షలు చేతులు మారాకనే ఇందుకు అధికారులు తలాడించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 40 అడుగుల రోడ్డే ఎందుకు? టీడీపీ నేతకు చెందిన పొలాల్లోకి వెళ్లేందుకు చిన్న చిన్న రహదారులున్నాయి. 40 అడుగుల రహదారి అందుబాటులో లేదు. మండల పరిషత్ స్థలం నుంచి 40 అడుగుల రోడ్డు కోసం ఇస్తే.. భవిష్యత్తులో రియల్ బూమ్‌తో కోట్లు కొల్లగొట్టాలనేది ఆలోచనగా కనిపిస్తోంది. ఆ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చుకుంటే టౌన్ ప్లానింగ్ అనుమతులకు ఎటువంటి ఆటంకాలు ఉండవనేది వారి ఎత్తుడగ. ప్రస్తుతం సచివాలయం–2, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ ఇక్కడే నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణ పనుల్లో బల్క్‌మిల్క్ సెంటర్ షెడ్డును కూడా ఇటీవలే కూల్చేశారు. ఇక్కడ సచివాలయం–2 భవన నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు..ఎవరు తీసుకు వచ్చారని గ్రామస్తులు ప్రశి్నస్తున్నారు. దాత ఇచ్చిన భూమిని ఇలా ఇతరుల ప్రయోజనాలకు ధారాదత్తం చేయడం పట్ల గ్రామంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మా దృష్టికీ వచ్చింది రాయవరంలో లే అవుట్ రోడ్డు కోసం ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరున్నా చర్యలు తప్పవు. అన్ని అంశాలూ సమగ్రంగా విచారిస్తున్నాం. ఇందుకోసం రెవెన్యూ డివిజన్ స్థాయిలో విచారణ జరిపిస్తా. – జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి -
పోలీస్ సైరన్ వేసుకుని వచ్చి బురిడీ!
సాక్షి, విశాఖపట్నం: పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు కొట్టేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన మధురవాడలో మంగళవారం ఈ చోటుచేసుకుంది. వివరాలు.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లుతో కలిసి చర్చించాడు. ఇద్దరూ కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. (చదవండి: కస్టడీ నుంచి నిందితుడి పరారీ) అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ వాహనంలో వచ్చిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇటీవల ఓ భూమి అమ్మగా వచ్చిన రూ.50 లక్షల నగదులో 20 లక్షలతో మరో భూమిని కొనుగోలు చేయడానికి తాను వచ్చానని నాగేశ్వరావు చెబుతున్నాడు. బాధితుని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ దోపిడీ విషయం పై కొన్ని అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావుతో పాటు బ్రోకర్ వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. (విశాఖ సీపీగా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతలు) -
పక్కా ప్రణాళికతో సురేష్ కిడ్నాప్ ప్లాన్
-
నర్సరావుపేటలో రియాల్టర్ దారుణ హత్య
గుంటూరు : నర్సరావుపేటలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రావిపాడు రోడ్డులోని ఓ వెంచర్ సమీపంలో వ్యాపారి తడికమల్ల రమేష్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెండు కోట్ల రూపాయల లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో రియల్టర్ మృతి
సాక్షి, నల్లగొండ క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ రియల్టర్ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీ సులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రంపోడు మండలంలోని తేరటిగూడెం గ్రామానికి చెందిన సోమకేశవులు(36), 20ఏళ్ల క్రితం పట్టణంలోని గంధంవారిగూడెం రోడ్డులోని చైతన్యపురి కాలనీలో స్థిరపడ్డాడు. ఫైనాన్స్, రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమకేశవులు, భార్య స్వాతి ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం రాత్రి 10.30 గంటల వరకు ఒకే గదిలో నిద్రించారు. 11గంటలకు సిగరెట్ తాగేందుకు వరండాలోకి వచ్చాడు. తెల్లవారుజామున 3:30 గంటలకు కుమారుడు మంచినీళ్లు కావాలని అడగడంతో స్వాతి గది బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. డోర్ గడియ పెట్టి ఉండడంతో భర్తకు ఫోన్ చేసింది. అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఎదురింటి వారికి ఫోన్ చేసింది. వారు వచ్చి చూడగా వరండాలో సోమకేశవులు విగతజీవుడిగా పడి ఉండడంతో పోలీసుల కు సమాచారం ఇచ్చారు. సీఐ సురేశ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్లాన్ ప్రకరమే హత్య చేశారా..? సోమకేశవులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఫైనాన్స్ వ్యవహారాల్లో రూ.25లక్షల లావాదేవీల విషయంలో కోర్టు కేసులు సాగుతున్నాయి. నెల రోజుల క్రితం పోల యాదయ్యకు రూ.10లక్షలు ఇవ్వగా రూ.5లక్షలు తిరిగి ఇచ్చినట్లు చెప్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార భాగస్వామితో ఆర్థిక పరమైన గొడవలేమీ లేవని చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరులో అనుమానాస్పదంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. నివాసంలోనే ప్లాన్ ప్రకారం ఊపిరి ఆడకుండా హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు మృతదేహం పక్కన కారం చల్లినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకా..? ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో హత్య చేశారా..? అన్న విషయమై ఎటూ తేలకుండా ఉండేందుకే కారం చల్లడం, వంటిపై గాయాలు లేకుండా హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముక్కుల్లో నుంచి కొంత రక్తం ఘటనా స్థలం వద్ద ఉంది. హత్యలో కేశవులుకు సంబంధించిన వారి పాత్ర ఏమైనా ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు ఆధారాలు సేకరించారు. కొన్ని రోజులుగా కేశవులు ఎవరితో మాట్లాడారు.. అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు. -
రక్షణ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు
సాక్షి, హైదరాబాద్ : పదవులు ఇప్పిస్తానని చెప్పడమే కాక కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. మోసం చేసినందుకుగాను బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. బీజేపీ జనరల్ సెక్రటరీ పీ మురళీధర్ రావు హైదరాబాద్‌కు చెందిన రియల్ఎస్టెట్ వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డిని ఫార్మా ఎక్సిల్ చైర్మన్‌ని చేస్తానని చెప్పాడు. అందుకు గాను మహిపాల్ దగ్గర నుంచి రూ. 2.17 కోట్లను వసూలు చేశాడు అనంతరం నిర్మలా సీతారామన్ సంతకంతో ఉన్న ఓ అపాయింట్మెంట్ ఆర్డర్‌ని మహిపాల్‌కు ఇచ్చాడు. కానీ సదరు ఉత్తర్వులు నకిలీవే కాక.. మురళీధర్ రావు ఏకంగా నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. దాంతో మహిపాల్ భార్య ప్రవర్ణా రెడ్డి.. మురళీధర్ రావు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మురళిధర్ రావుతో పాటు మరో ఎనిమింది మంది మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 406, 420, 468, 471, 506, 120-బీ కింద కేసు నమోదయ్యింది. -
నివాసితులను వేధిస్తున్న రియల్టర్
హైదరాబాద్: రియల్టర్ వేధింపులను భరించలేక రంగారెడ్డి జిల్లా గండిపేటకు సమీపంలోని లెజెండ్ చైమ్స్ వెంచర్ నివాసితులు ఆదివారం ఆందోళనకు దిగారు. రియల్టర్ కొనుగోలు సమయంలో చెప్పిన సౌకర్యాలేమీ పూర్తి చేయకపోగా.. బౌన్సర్లతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోకాపేట రెవెన్యూ పరిధిలోని గండిపేటకు సమీపంలో లెజెండ్ చైమ్స్ వెంచర్లో ఆరేళ్ల క్రితం 135 మంది ఎన్ఆర్ఐలు విల్లాలను కొనుగోలు చేశారు. ఒప్పంద సమయంలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సకాలంలో పూర్తి చేస్తానన్న బిల్డర్.. వాటి విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. సెక్యూరిటీని పూర్తిగా తగ్గించడంతో నివాసితులే వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నారు. హెచ్ఎండీఏకు మార్టగేజ్ చేసిన విల్లాలను అమ్ముకోవడంతో పాటు పార్కు, ఖాళీగా ఉంచాల్సిన స్థలాల్లో భవనాలను నిర్మిస్తున్నారు. వారం నుంచి స్విమ్మింగ్ పూల్‌కు సైతం తాళాలు వేసుకుని, దాన్ని వినియోగించలేని పరిస్థితి కల్పించారు. దీంతో బాధి తులంతా ఆదివారం విషయం తేల్చాల్సిందేనని నిర్ణయించి, సమావేశం ఏర్పాటు చేసి రియల్టర్ నాగేశ్వర్రావును పిలిచారు. చట్టపరంగా చర్యలకు ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మూడు గంటల పాటు ఆందోళన చేశారు. మరో పది రోజుల్లో సమస్యలను తీరుస్తానని రియల్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అన్నీ మేమే చూసుకుంటున్నాం కోట్ల రూపాయలు పెట్టి విల్లాలను కొంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను మేమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్డర్ స్విమ్మింగ్ పూల్‌కు తాళాలు వేయడం, క్లబ్‌హౌస్‌ను పూర్తి చేయకపోవడం, సెక్యూరిటీని తగ్గించటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇలాంటి బిల్డర్లపై కఠినంగా వ్యవహరించాలి. – జ్యోతి, నివాసితురాలు మేమే పూర్తి చేసుకున్నాం బిల్డర్ సకాలంలో విల్లాను పూర్తి చేయలేదు. దీంతో మా డబ్బులను అదనంగా ఖర్చుపెట్టి పూర్తి చేసుకున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. – రవిరెడ్డి, నివాసితుడు -
ఓ మై గాడ్ !
హసన్‌పర్తి: ఓ రియల్టర్ వ్యాపారి.. స్వామికే శఠగోపం పెడుతున్నాడు. కోనేరును కబ్జా చేసి.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇరు శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రియల్టర్‌కు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గజం భూమి ధర రూ.20 వేల వరకు పలుకుతోందని.. కబ్జాకు గురైన కోనేరు భూమి సుమారు రూ.కోటి ఉంటుందని.. ప్రస్తుత అధికారులు గతంలో డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ రియల్టర్‌కు మద్దతు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనేరు స్థలం కబ్జా.. భీమారం శివారులోని సర్వే నంబర్ 137/సీలో 0.10 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంతభాగంలో కోనేరు విస్తరించింది. ఇది శిథిలావస్థకు చేరుకోగా.. దీనిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఈ మేరకు సదరు రియల్టర్ దాని చుట్టు పక్కల సుమారు 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. కోనేరును కబ్జా చేసి పార్క్‌గా చూపించినట్లు గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ భూమిని చింతగట్టుకు చెందిన మధుసూదన్‌రెడ్డి ఎర్రగట్టు దేవస్థానానికి దానంగా ఇచ్చినట్లు పత్రాలు ఉన్నాయని అప్పటి పాలకవర్గం ఎండోమెంట్ అధికారులకు నివేదించింది. దీనిపై పత్రికల్లో కథనాలు రాగా.. అప్పటి దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ స్పందించి కోనేరును సందర్శించారు. ఈ క్రమంలో కోనేరుకు సంబంధించిన భూమి పేరుమాండ్లు (దేవుడి) పేర ఉన్నట్లు అప్పటి చైర్మన్ బూర సురేందర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శ్రీ ఎర్రగట్టు దేవస్థాన భూములను సర్వే చేసి హద్దులను నిర్ధారించాలని అప్పటి డిప్యూటీ కమిషనర్ రమేష్ ఆదేశించారు. దేవస్థాన భూములు స్వాధీనం చేసుకుని ఆలయం పేరుపైనే పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. కమిషనర్ ఆదేశాలు ఇచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అవి బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు సర్వేచేయడంలో నిర్లక్ష్యం వహించారు. డీసీ రమేష్ బదిలీ కాగా.. ఆయన స్థానంలో సునీత వచ్చారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో రియల్టర్ మళ్లీ కబ్జాకు తెరలేపారు. ప్లాట్లుగా విభజించే యత్నం.. కొంతకాలం విరామం తర్వాత రియల్టర్ కోనేరు స్థలాన్ని మళ్లి ప్లాట్లుగా విభజించడానికి యత్నిస్తుండగా.. స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. ఈ క్రమంలో రియల్టర్ తమపై తిరగబడ్డాడని.. కోనేరు స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానికులు కోరారు. -
బాలయ్యన్నా లెక్క లేదు.. నా లెక్క నాదే
► ఓ రియల్టర్‌కు చుక్కలు చూపించిన మంత్రి ► సినీనటుడు బాలకృష్ణ పేరు ప్రస్తావించినా బేఖాతరు ► నెలల తరబడి ‘నాలా’ ఫైల్ తొక్కిపెట్టించిన వైనం ► రియల్ వెంచర్‌కు రూ. 4 కోట్ల డిమాండ్ ► చివరికి రూ. 3 కోట్లకు తెగిన బేరం? ► ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చనీయాంశం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖుల పేర్లు చెబితే.. కాని పనులు కూడా జరిగిపోతుంటాయి.. అందునా.. సీఎం స్థాయి వ్యక్తుల సన్నిహితులను రిఫరెన్స్‌గా వాడితే.. క్షణాల్లో పని జరిగిపోవాల్సిందే.. కానీ ఒక భూమి మార్పిడి కేసులో ఓ రియల్టర్ ప్రయోగించిన సినీనటుడు బాలయ్య అస్త్రం.. జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి ముందు తుస్సుమంది.. అలాగని.. ఆ మంత్రిగారేమీ మడికట్టుకొని కూర్చోలేదు.. నిర్మొహమాటంగా మాట్లాడారు.. సీఎం వియ్యంకుడి పేరు ప్రస్తావించిన రియల్టర్‌ను పిలిపించి క్లాస్ పీకారు.. బాలయ్య తెలుసా.. అయితే ఏంటి?.. నా లెక్క నాదే.. ఆ లెక్క ఇస్తేనే పనవుద్ది.. అని లెక్కలేనితనంతో వ్యవహరించారు.. ముక్కుపిండి మరీ లెక్క వసూలు చేశారు. టీడీపీవర్గాలే ముక్కున వేలేసుకొని చర్చించుకుంటున్న ఈ డీల్ వెనుక ఏం జరిగిందంటే.. విశాఖపట్నం: నగరానికి చెందిన ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ కమ్ రియల్ ఎస్టేట్ అధినేత నగర శివారులో భారీ వెంచర్‌కు శ్రీకారం చుట్టారు. ఆనందపురం మండలం శొంఠ్యాం పరిసరాల్లో సుమారు పాతిక ఎకరాల్లో ఆయన ప్రతిపాదించిన వెంచర్ పరిధిలో పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్పించుకునేందుకు అవసరమైన ‘నాలా’ అనుమతుల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దరఖాస్తు కూడా సమర్పించారు. అన్నీ పక్కాగా ఉన్నా అనుమతులు మాత్రం రావడం లేదు. నెలల తరబడి రెవెన్యూ వర్గాలను సంప్రదిస్తున్నా అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. పోనీ సమస్య ఏమిటో కూడా వారు చెప్పడం లేదు. చివరికి ఆ రియల్టర్ రెవెన్యూ ఉన్నతాధికారిని కలిసి.. ‘కొన్ని నెలలుగా తిరుగుతున్నాం.. ఫైల్ ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడంలేదు.. ఏమైనా ఫార్మాలిటీస్ కావాలంటే చెప్పండి.. ఇచ్చేస్తాం’ అని మొరపెట్టుకున్నారు. అసలు విషయం ఆ ఉన్నతాధికారి చెబితే కానీ సదరు రియల్టర్‌కు అర్థం కాలేదు. ‘మంత్రి గారిని కలిసి.. ఫార్మాలిటీస్ ఇవ్వకుండా అక్కడ అంత భారీ వెంచర్ ఎలా వేస్తారని’ ఆ ఉన్నతాధికారి ప్రశ్నించారు. తత్వం బోధపడిన రియల్టరు వెంటనే సదరు మంత్రి సన్నిహితులను కలుసుకున్నారు. కానీ ఆ మంత్రి వర్గీయులు పెట్టిన ఇండెంట్ విని ఆయనకు కళ్లు తిరిగినంత పనైంది. ఏకంగా రూ. 4 కోట్లు డిమాండ్ చేయగా.. అంత ఇచ్చుకోలేమని, రూ. కోటి వరకు ఇస్తామని బేరమాడారట. ‘నాలుగు’కు నయాపైసా కూడా తగ్గేది లేదని మంత్రి వర్గీయులు తెగేసి చెప్పడంతో చివరి ప్రయత్నంగా ఆ రియల్టరు సినీనటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అస్త్రం ప్రయోగించారని అంటున్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా గతంలో బాలకృష్ణ సినిమాలను ఇక్కడ పంపిణీ చేయడంతో పాటు నేరుగా ఒకింత పరిచయం ఉన్న నేపథ్యంలో ఆయనతోనే చెప్పించాలని చూశారు. బాలయ్య వద్దకు విషయం వెళ్లేలా ఉందని పసిగట్టిన మంత్రి.. ఆ రియల్టర్‌ను పిలిపించి గట్టిగా క్లాసు పీకారట. ‘బాలయ్య చెప్పినా.. ఎవరు చెప్పినా... మన లెక్క మనకివ్వాల్సిందే.. వాటా వచ్చే వరకూ ఫైలు కదిలేది లేదంటూ ఉన్నతాధికారులకు సైతం స్పష్టం చేయడంతో చివరికి చేసేది లేక మూడు కోట్లకు బేరమాడుకుని వ్యవహారాన్ని సెటిల్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి పనికీ ఇండెంట్లు వేసే మంత్రి సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ.. స్వయానా సీఎం చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణ తెలుసన్నా లెక్క చేయకపోవడమే ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. -
నెల్లూరులో బ్లాక్‌మనీ కలకలం
పోలీసుల అదుపులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు రియల్టర్లు నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో గురువారం బ్లాక్‌మనీ కలకలం రేగింది. నగరంలోని ఓ హోటల్లో రూ.కోట్లలో నోట్ల మార్పిడి జరుగుతోందని అందిన సమాచారంతో జిల్లా పోలీసులు ఓ హోటల్‌పై దాడిచేశారు. సుమారు గంటపాటు గదిలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. కానీ అక్కడ ఏమి దొరకకపోవడంతో గదిలో ఉన్న నలుగురు రియల్టర్ల(హైదరాబాద్)ను అదుపులోకి తీసుకొన్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్‌లో రూ.కోట్లు విలువ చేసే ఏడెకరాల భూమి ఉంది. దానిని హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు రియల్టర్లు 4 నెలల కిందట కొంత నగదు అప్పచెప్పి భూమి యజమాని వద్ద అగ్రిమెంట్ చేసుకొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) చేసుకొనేందుకు వారు గురువారం నెల్లూరుకు వచ్చి దర్గామిట్టలోని మినర్వా హోటల్లో దిగారు. ఈ క్రమంలో హోటల్లో రూ.కోట్లలో నగదు మార్పిడి జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాయంత్రం హోటల్‌పై దాడి చేశారు. దీంతో నలుగురు రియల్టర్లను అదుపులోకి తీసుకొన్నారు. -
భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదం దాదాపు తుపాకీ కాల్పులవరకూ వెళ్లింది. ఈ ఘటన నగరంలోని హిమయత్ నగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తికి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కు మధ్య భూ వివాదాలు తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇద్దరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన రియల్టర్.. ఏకంగా తన వద్ద ఉన్న గన్ తో గొడవకు దిగిన అవతలి వ్యక్తిని కాల్చేందుకు యత్నించాడు. అయితే ఈ గొడవ గమనిస్తున్న స్థానికులు వెంటనే వారిద్దరిని వారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నయీమ్ కబ్జా ప్లాట్లు చదును చేసిన రియల్టర్
ఘట్కేసర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కబ్జాలో ఉన్న ప్లాట్లను ఓ రియల్టర్ చదును చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొద్దిసేపటికే వదిలేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రకాష్ కథనం ప్రకారం.. గ్రామంలోని సర్వేనంబర్ 14లో ఉన్న పొలం గ్రామానికి చెందిన ఉదారి నాగభూషణం పేరు మీద ఉంది. ఆయన వద్ద కుషారుుగూడకు చెందిన బాపురెడ్డి కొన్నేళ్ల క్రితం జీపీఏ చేసుకున్నాడు. దీంతో పాటు సర్వేనంబర్ 10లో మరికొంత భూమికి సైతం జీపీఏ తీసుకొని 1988లో మొత్తం 14 ఎకరాలతో ఆయన వెంచర్ వేసి, ప్లాట్లను అమ్మేశాడు. అనంతరం గ్రామపెద్దల సహకారంతో రెండోసారి అవే సర్వేనంబర్లలోని 14 ఎకరాల్లో 2004లో వెంచర్ వేశారు. అందులోని 51 ప్లాట్లను నగరానికి చెందిన రియల్టర్ సురేందర్‌రెడ్డి రెండోసారి తక్కువ ధరకు కొన్నాడు. ఈ క్రమంలో నయీమ్ కొంత డబ్బివ్వాలని సురేందర్‌రెడ్డికి హుకుం జారీ చేశాడు. దీంతో రియల్టర్ కొంత నగదుతో పాటు తన 51 ప్లాట్లను నయీమ్‌కు అప్పగిం చాడు. అప్పటి నుంచి సదరు స్థలం వద్దకు ఎవరూ రాలేదు. నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మిర్యాలగూడలోని ఓ నివాసంపై సిట్ అధికారులు దాడులు నిర్వహించగా.. అవుశాపూర్‌కు చెందిన ప్లాట్ల డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో రియల్టర్ సురేందర్‌రెడ్డి సదరు ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు. 4 రోజుల నుంచి చదును చేసి, ప్లాట్ల సరిహద్దు రాళ్లను ఏర్పా టు చేస్తున్నాడు. పంచాయతీ అధికారులు పనులను ఆపాలని కోరినా ఫలితం లేక పోలీ సులను ఆశ్రరుుంచారు. పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పనులను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత పనులు ప్రారంభించారు. కాగా రియల్టర్వి 51 ప్లాట్లుంటే 14 ఎకరాల వెంచర్‌ను చదును చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మౌఖిక ఆదేశాలు ఇచ్చారు: సీఐ ప్రకాశ్ వెంచర్‌లోని రియల్టర్ సురేందర్‌రెడ్డి 51 ప్లాట్ల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిట్ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సీఐ ప్రకాశ్ తెలిపారు. -
రూ.5 లక్షల నగదు ఆటోలో మరిచిన రియల్టర్
గుంటూరు : రూ. 5 లక్షల నగదు సంచిని ఆటోలో మర్చిపోయాడు సుబ్బారావు అనే రియల్టర్. ఆ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ సదరు నగదు సంచితో ఉడాయించాడు. ఆటోలో నగదు మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చిన సుబ్బారావు వెంటనే మరో వాహనంలో ఆటో కోసం గాలించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండాపోయిన సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ బృందావన్ కాలనీలో నివసించే చింతల యాదిరెడ్డి(40) లావణ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. యాదిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ క్రమంలో ఈ నెల 14 రాత్రి 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి రాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్టర్ హత్య
సేలం: తిరుచెంగోడు వద్ద రియల్టర్ హత్యకు గురయ్యాడు. తిరుచెంగోడు 7వ వార్డు దొండి గార్డు ప్రాంతానికి చెందిన శేషురాజ్ (49) రియల్టర్. ఇతనికి భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం ఉదయం కోళిక్కాల్ నత్తానికి శేషురాజ్ బైకులో వెళుతున్నాడు. చెంగోటం పాళయం ఈచంగాడు ప్రాంతంలో మనుష్య సంచారం లేనిచోట ద్విచక్ర వాహనాన్ని నిలిపి శేషురాజ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైకులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శేషురాజ్‌పై కత్తులతో దాడి చేసి పారిపోయారు. దాడిలో తల, మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలైన శేషురాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మార్గంగా వచ్చిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు తిరుచెంగోడు పోలీసులు అక్కడికి చేరుకుని శేషురాజ్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చుననే సందేహంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో భారీ చోరీ
హైదరాబాద్: బంజారాహిల్స్ సినారీ వ్యాలీలో భారీ చోరి జరిగింది. వ్యాలీలో నివసించే శ్యామ్ సుందర్ అనే రియల్టర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. దుండగులు కోటిన్నర విలువైన బంగారం, డబ్బు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటనపై శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్గావ్లో రియల్టర్ దారుణ హత్య
-
రాజమండ్రిలో రియల్టర్ దారుణహత్య
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం నాగదేవి థియేటర్ సమీపంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి కోర్లంపేటకాలనీకి చెందిన కటికతల వెంకట శేషు(53)గా గుర్తించారు. శేషును గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. వ్యాపార లావాదేవీల్లో గొడవ జరగడం వల్లే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
తొలిసారి ఇల్లు కొంటున్నారా?
తొలిసారి!! దీనికుండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఈ ‘తొలిసారి’... అనేది దేనికైనా వర్తిస్తుంది. ఆఖరికి అది ఇల్లు కొనేవారి విషయంలోనైనా!! ఎందుకంటే ఒక పని తొలిసారి చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి చేయాలనుకుంటే అవన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి అంత భయం ఉండదు. ఇంటి విషయంలో కూడా అంతే. మన అవసరాలకు అనువైన ఇంటినే కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు చేసే ఇంటికి సంబంధించిన అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనటమనేది ఖరీదైన విషయం. ఒకసారి ఇల్లు కొన్నాక దాన్ని మళ్లీ విక్రయించడం, వేరే ఇంటికి మారడం చాలా కష్టసాధ్యం. అందుకే ఈ అంశాలను ఒకసారి గమనించండి. అవసరాలకు అనువుగా... ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఇల్లు కట్టడం, కొనడం రెండూ చాలా కష్టమైన పనులే. అందుకే తొలిసారి ఇంటిని కొనేటపుడు... ఏ రకమైన ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే మీరు కొన బోయే ఇల్లు మీ కుటుంబానికి అనువుగా ఉంటుందా! లేదా? ఏ బడ్జెట్లో, ఏ రకంగా ఇంటిని కొనాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. వీటితోపాటు కొనాలని భావించే ఇంటిని ఒకటికి రెండు సార్లు చూడండి. పైపు లైన్స్, డ్రైనేజ్, వెంటిలేషన్ తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సరైన ప్రదేశమూ ముఖ్యమే మీ అవసరాలు తెలుసుకున్నాక వాటికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? లే క ఇతరత్రా అవసరాలకు ప్రాపర్టీని కొంటున్నారా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసే ప్రదేశానికి హస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అలాగే ఇల్లు మీ ఆఫీసుకు ఎంత దూరంలో ఉంటుందో పరిగణనలోకి తీసుకోవాలి. పేరున్న రియల్టర్లను సంప్రదించండి రియల్టర్ అవసరం లేకుండా డెరైక్ట్‌గా బిల్డర్ దగ్గరి నుంచే ఇంటిని కొనుగోలు చేస్తే, కమీషన్ చెల్లించే అవసరం ఉండదు కాబట్టి కాస్త డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డెరైక్ట్‌గా కాకుండా రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. తొలిసారి ఇంటిని కొనే సమయంలో రియల్టర్ సాయం తీసుకోవడమే మంచిది. అలాగే రియల్టీ రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు. బడ్జెట్‌పై కన్నేయండి ఇంటిని కొనాలని భావించినప్పుడు దానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది చూసుకోవాలి. మీ బడ్జెట్ పరిమితిలోపే మంచి ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఒకసారి ఇంటిని కొనాలి అని నిర్ణయం తీసుకున్నాక... అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలు లేవని భావించినపుడు మాత్రమే ఇంటిని కొనాలి అనే ఆలోచన చేయడం మంచిది. డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి ఇంటి ని కొనడానికి, ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను పొందడానికి అవసరమైన పత్రాలను మీ వద్ద రెడీగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల డాక్యుమెంట్ల సమర్పణలో ఎలాంటి సమయం వృథా కాదు. ఇంటి కొనుగోలుతో సంబంధం ఉన్న అన్ని లీగల్ అంశాలపై జాగ్రత్త వహించండి. మంచి ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండి ఇంటిని కొనేటప్పుడు అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఫైనాన్సింగ్. మీ ఆర్థిక సంబంధ వ్యయాల్లో ఇంటి ఫైనాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే సరైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రొవైడర్ ఒక్కోరకమైన వడ్డీ రేట్లకు ఇంటి రుణాలను అందిస్తుంటారు. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ 9.85 శాతం వడ్డీరే టుకే ఇంటి రుణాలను ఆఫర్ ఇస్తోంది. -
మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!
పాత తేదీలతో లే అవుట్లు, భవనాలకు అనుమతులు * బిల్డర్లతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ల కుమ్మక్కు * రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని 5 గ్రామాల్లో అక్రమాలు * హెచ్ఎండీఏ ప్రత్యేక విచారణలో వెల్లడి.. క్రిమినల్ కేసులకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని గ్రామాల్లో లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బిల్డర్లు, రియల్టర్లతో గ్రామ పంచాయతీల కార్యనిర్వహణాధికారులు(ఈఓలు), కార్యదర్శులు, సర్పం చ్‌లు కుమ్మక్కై ఏకంగా దశాబ్ద కాలం కింది నాటి పాత తేదీలతో దొడ్డిదారిలో అనుమతులు జారీ చేసేస్తున్నారు. అక్రమ మార్గంలో లభించిన అనుమతులతో బిల్డర్లు వందల సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈఓలు, సర్పంచ్‌లకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతున్నాయి. నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్లు ఇవ్వాల్సిన అనుమతులను ఈవోలే ఇచ్చేస్తుండటంతో సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, గండి మైసమ్మ, ప్రగతినగర్, బౌరంపేట, దూలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ అనుమతుల ఆరోపణలపై హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా చేపట్టిన విచారణలో ఈ బాగోతం వెలుగు చూసింది. అధికార పరిధి దాటిన ఈఓలు... గ్రామ పంచాయతీ ఈఓల అధికారాలను కేవలం రెండంతస్తుల భవన నిర్మాణాల అనుమతుల వరకే పరిమితం చేస్తూ 2008 ఏప్రిల్ 17న హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పాత తేదీలతో దొడ్డిదారిలో ఈఓలు మూడంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 భవన సముదాయాలతోపాటు ఆరు గేటెడ్ కమ్యూనిటీలను హెచ్ఎండీఏ బృందం పరిశీలించగా, అందులో 30 భవనాలకు స్థానిక గ్రామ పంచాయతీల ఈఓలు పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు బయటపడింది. అధికారులను ఈఓలు దుర్వినియోగం చేయడంతోపాటు బిల్డర్లతో కుమ్మక్కై భారీగా లంచాలు స్వీకరించినట్లు ఈ విచారణలో తేలింది. ఇక ఎల్ఆర్ఎస్ పథకం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ గ్రామాల్లో పాత తేదీలతో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు హెచ్ఎండీఏ గుర్తించింది. ఈఓలు, సర్పంచ్‌లతో కుమ్మక్కైన బిల్డర్లు బౌరంపేట, మల్లంపల్లి గ్రామాల్లో సుమారు 45 ఎకరాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నట్లు బయటపడింది. ప్రభుత్వానికి హెచ్ఎండీఏ లేఖ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టనుందని, అప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని ఈఓలు సలహా ఇవ్వడంతోనే బిల్డర్లు అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని హెచ్ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఐదు గ్రామాల్లో అక్రమ మార్గంలో అనుమతులు జారీ చేసిన ఈఓలు, సర్పంచ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమ లే అవుట్లు, కట్టడాల ఫొటోలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
రియల్టర్లకు కష్టం...
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీఆర్డీఏ పరిధిలోని రియల్టర్లకు కొత్త కష్టం వచ్చింది. గ్రామ కంఠానికి అర కిలోమీటరు దూరం దాటిన లేఅవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించింది. రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు వ్యాపారం నిలిచిపోయింది. పది రోజుల క్రితం వచ్చిన ఈ ఆదేశాలు అమలులోకి రావడంతో వందకుపైగా లేఅవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో రియల్టర్లు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఒత్తిడి తెస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాల్లోని నివేశన స్థలాల గుర్తింపు ప్రక్రియ రెండు నెలల నుంచి కొనసాగుతోంది. గ్రామకంఠం పరిధిలో నివాస గృహాలు, నివేశన స్థలాలు ఉంటే వాటిని వదిలివేస్తూ, ఆ పరిధి దాటిన వాటికి భూ సమీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. మొత్తం 29 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాటిలో ఇంకా అనేక గ్రామాల్లోని గ్రామ కంఠాలను గుర్తించాల్సి ఉంది. రూ.80 లక్షల నుంచి రెండు కోట్లకు పెరిగిన ఎకరా ధర... ఈ నేపథ్యంలోనే కొందరు రియల్టర్లు గ్రామ కంఠంకు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూము లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రాజధాని గ్రామాలకు సమీపంలో సీఆర్డీఏ అనుమతితో వెంచర్ వేస్తే, ఆ స్థలాలకు మంచి ధర వస్తుందనే భావనతో ఈ భూములను కొనుగోలు చేశారు. ప్రారంభంలో ఎకరా రూ.80 లక్షలు ఉంటే రియల్టర్లు ప్రవేశించిన తరువాత వాటి ధర రూ. 2 కోట్ల వరకు పెరిగింది. గ్రామ కంఠానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు ఐదారు వందల ఎకరాల వ్యవసాయ భూములను రియల్టర్లు కొనుగోలు చేశారు. వారిలో కొంత మంది హడావుడిగా వెంచర్ వేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. భూముల ధరలు తగ్గుతాయని ఆందోళన.. వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మార్పు చేయాలని కోరుతూ ‘నాలా’ చార్జీలను చెల్లించారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ నిబంధనపై రియల్టర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. రోజుకో కొత్త నిబంధన, కొత్త ప్రకటన చేస్తూ తమ ప్రాణాలు తీస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి బాగుంటుం దని భావించామని, అయితే ఈ నిబంధన పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ రాజధాని పరిధిలోని స్థలాల రిజిస్ట్రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిలిపివేసిందని, దీని వల్ల అనేక మంది రియల్టర్లు భారీగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. తాజా నిబంధన కారణంగా గ్రామ కంఠానికి అర కిలోమీటరుదూరంలోని స్థలాల లేఅవుట్లకు అనుమతి లేకపోతే ఆ భూముల ధరలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ జీఓ కొయ్యకత్తి
అమలాపురం :కోట్లాది రూపాయల విలువ చేసే భూములు కళ్ల ముందే కబ్జాల పాలవుతున్నా పాలకులకు గానీ, అధికారులకు గానీ చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు. పంచాయతీల ఆస్తుల పరిరక్షణకు రెండేళ్ల క్రితం జారీ చేసిన జీఓ నంబర్ : 188.. రాజకీయ జోక్యానికి తోడు అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతల కారణంగా కాపాడలేని కొయ్యకత్తిలా నిరుపయోగంగా మిగులుతోంది. పంచాయతీల్లో లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. చెరువులు కబ్జాల బారిన పడి బక్కచిక్కిపోతున్నాయి. ఇక పోరంబోకు భూములకు గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి ఎక్కడున్నాయో పంచాయతీ సిబ్బందికే తెలియకుండా పోయింది. మారుమూల స్థలాలేకాదు.. పంచాయతీల్లో ప్రధాన రహదారులను ఆనుకున్న విలువైన స్థలాలూ కబ్జాకు గురయ్యాయి. విలువైన భూములు కళ్లముందే అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే లేడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఈ స్థలాలను స్వాధీనం చేసుకుంటే గణనీయమైన ప్రయోజనం పొందే అవకాశముంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ నం: 188ని విడుదల చేసింది. దాని ప్రకారం ఆయా పంచాయతీలు తమ భూములను సర్వే చేసి ఫొటోలు తీరుుంచి, రికార్డుల్లో భద్రపరచాలి. ‘ఎసెట్ రిజిస్టర్లు’ ఏర్పాటు చేసి భూమి వివరాలను నమోదు చేయాలి. కబ్జాల బారిన పడిన భూములు స్వాధీన ం చేసుకుని, వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. వీటిలో పంచాయతీలకు చెందిన స్థలాలుగా బోర్డులు పెట్టాలి. అరుుతే జీఓ వచ్చి రెండేళ్లు కావస్తున్నా పంచాయతీలు దీనిని అమలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో 1,069 పంచాయతీలుంటే అమలాపురం డివిజన్లో ఆత్రేయపురం వంటి కొద్ది పంచాయతీలు మాత్రమే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకున్నాయి. రాజకీయ కారణాలు, అధికార పార్టీ నాయకులు, పాలకవర్గాల ఒత్తిడితో అధికారులు జీఓ నం:188ని అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత నెలలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆంజనేయులు ఈ జీఓ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఓని పక్కాగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. మామూళ్ల మత్తులో అధికారులు అనేక ఏళ్లుగా కబ్జాల బారిన పడిన సొంత స్థలాల విషయంలోనే కాదు.. రియల్టర్లు తమ లే అవుట్లలో పంచాయతీలకు కేటాయించే కమ్యూనిటీ స్థలాలను కాపాడుకోవడంలో కూడా పంచాయతీలు విఫలమవుతున్నాయి. నిబంధనల ప్రకారం లే అవుట్ విస్తీర్ణాన్ని బట్టి కొంత స్థలాన్ని కమ్యూనిటీ స్థలాలుగా గుర్తించి పంచాయతీలకు స్వాధీనం చేయాల్సి ఉంటుంది. అయినా డీటీసీ అప్రూవల్ లే అవుట్దారులు కమ్యూనిటీ స్థలాలను కేటాయించినట్టు చూపిస్తున్నా వాటిని పంచాయతీలకు స్వాధీనం చేయకుండా అమ్ముకుని, సొమ్ములు చేసుకుంటున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా మామూళ్లమత్తులో పడి పట్టించుకోవ డం లేదు. లే అవుట్లలో కమ్యూనిటీ స్థలాల ఖరీదు ఆ యా ప్రాంతాలను బట్టి రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేస్తాయి. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట వంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఆనుకుని ఉన్న పంచాయతీల్లో ఇటువంటి స్థలాలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. పైగా ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ అధికారులే అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, పాలకవర్గాలు కబ్జా అయిన స్థలాలను, లే అవుట్లలోని కమ్యూనిటీ స్థలాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాల్సి ఉంది. -
‘గార్లకుంట’ గజ గజ
రెండెకరాల్లో రియల్టర్ల పాగా ప్లాట్లు చేస్తూ విక్రయూలు స్థలం విలువ రూ. 3 కోట్లపైనే నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం నేరుగా కుంటను ఆక్రమించేందుకు నామోషీ కాబోలు! మొదట దాని పక్క స్థలాన్ని కొంటారు. తీరిగ్గా కుంటను కలుపుకుంటారు. తర్వాత ప్లాట్లు చేసి విక్రరుుస్తూ అమాయకులను బుక్ చేస్తారు. ఆమ్యామ్యాలతో అధికారులను కట్టడి చేస్తారు. ఎక్కడికక్కడ ఇలా పక్కాగా రియల్టర్లు కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరి డబ్బు యూవకు గార్లకుంట ‘చిన్న’బోతోంది. జనగామ : పట్టణ శివారు ఏసిరెడ్డి నగర్ సమీపంలో గార్లకుంట ఉంది. 177 సర్వే నంబర్లోని ఈ కుంట విస్తీర్ణం 11.22 ఎకరాలని రెవెన్యూ రికార్డులు స్పష్టంచేస్తున్నారుు. ప్రస్తుతం ఇంత స్థలంలో కుంట లేదు. రెండు నుంచి మూడెకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమిత శిఖం భూముల విలువ సుమారు రూ. 3 కోట్లపైమాటే. ఆక్రమణలు, ఆపై ప్లాట్ల విక్రయూలతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా.. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అడ్డుకునే సాహసం చేయట్లేదు. కారణం.. కాసులు ముట్టడమేనని ఆరోపణలు విన్పిస్తున్నారుు. హద్దులు చెరిగిన గార్లకుంట రియల్టర్ల ధనదాహం ధాటికి గార్లకుంట హద్దులు చెరిగిపోయాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు హద్దుల కోసం ఓ వైపు కాల్వ తవ్వించగా కబ్జాదారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎఫ్టీఎల్(ఫీట్ ట్యాంకు లెవల్) నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఎఫ్టీఎల్ ప్రకారం.. కుంట సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని పట్టా భూముల్లోనైనా నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఈ భూమిలోని రైతులు సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కుంటలోకి నీరొచ్చే సమయంలో 100 మీటర్ల పరిధిలో ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. రియల్టర్లు దీన్నేమాత్రం ఖాతరు చేయట్లేదు. ఇప్పట్లో కుంటలు నిండే పరిస్థితి లేకపోవడాన్ని అదునుగా తీసుకుని కబ్జాకు పూనుకుంటున్నారు. కుంటల సమీపంలోని పట్టా భూములు కొని ప్లాట్లు చేస్తున్నారు. క్రమంగా కుంట స్థలాన్నీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అంతా ‘సవ్యంగా’ సాగుతోంది. కానీ ప్లాట్లు కొన్న వాళ్లు చుక్కలు చూస్తున్నారు. నిర్మాణాలు.. తదితర అనుమతుల కోసం మళ్లీ భారీ మొత్తంలో ఖర్చు చేయూల్సి వస్తోంది. కబ్జా స్థలాన్ని కాపాడలేరా? కుంట సమీపంలో ప్లాట్లకు గజానికి రూ. 4 వేల ధర చెబుతున్నారు. ఎకరాకు 4800 గజాలు తేలుతాయి. రెండెకరాలకు లెక్కేసినా ఎటు లేదన్నా కబ్జా స్థలం విలువ రూ. 3 కోట్లుపైనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలే చెబుతున్నారుు. ఇంత విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘కుంట భూమి కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. దీన్ని ఆక్రమించిన వారి కోసం ఆరా తీస్తున్నాం. ఎఫ్టీఎల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ చుట్టుపక్కల వారు ప్లాట్లు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. -
ఎక్విజిషన్ భూములపై రియల్టర్ కన్ను!
కాకినాడ: విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న కాకినాడ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు, వివిధ భారీ పరిశ్రమలు ఉండడంతో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రైల్వే, రోడ్లు మార్గాలకు అనుసంధానంగా ఉండడం, బీచ్‌పార్కు, త్వరలో పర్యాటక ప్రాజెక్టు వస్తుందన్న నేపథ్యంలో భూ ముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేసి విరమణ పొందిన ఉద్యోగులు ఇక్కడ ఉండటానికే మొగ్గుచూపడంతో టీచర్స్, పోస్టల్, రెవెన్యూ, డాక్టర్లు, పోలీసు, బ్యాంకు అధికారులు ఇలా ప్రత్యేకంగా కాలనీలు సైతం వెలిశాయి. ఓ 100 గజాలు కొనుగోలు చేసుకోని సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే కొనుగోలు దారులను రియల్టర్లు మోసం చేస్తున్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానాలు, విందులు ఏర్పాటు చేస్తూ వారిని మచ్చిక చేసుకుని, ప్రభుత్వం పేదల కోసం ఎక్విజిషన్ చేసిన భూములను సైతం కబ్జా చేసేందుకు రియల్టర్లు తెగబడుతున్నారు. ఈ కోవకు చెందినదే కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని 55.31 ఎకరాలు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఫేజ్-2లో భాగంగా ఈ భూమిని సేకరించారు. సర్పవరం సర్వే నంబర్లు 130/16 నుంచి 130/35 వరకు, 184/1 నుంచి 184/22 సర్వేనంబర్లలో ఉన్న 55.31 ఎకరాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఫేజ్-2 కింద సేకరిస్తున్నట్టు 915/2007 కింద జిల్లా అధికారులు గెజిట్ పబ్లికేషన్ చేశారు కూడా. అనంతరం రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎకరా ఒక్కింటికి అప్పటి మార్కెట్ రేటుతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరగా రూ.29 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం కుర్చుకుందని చెబుతున్నారు. ఈ భూములను ప్రభుత్వం తీసుకోదు, ఎక్విజిషన్ తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ రియల్టర్ ఈ భూములపై కన్నేశాడు. కారుచౌకగా భూములను కొట్టేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. కొందరు పేద రైతులను సేకరించి ప్రభుత్వం ఇస్తానన్న రూ.29 లక్షలు ఇస్తాను, రైతులు ఒప్పుకుంటే ప్రభుత్వం భూములపై ఉంచిన ఎక్విజిషన్ తానే తీయించుకుంటానంటూ చెప్పి రూ. 3 లక్షల వంతున అడ్వాన్సు ఇచ్చాడు. నాలుగేళ్ల క్రితమే ఈ ఒప్పందం చేసుకున్న రియల్టర్ తాను రైతుల నుంచి చేసుకున్న అగ్రిమెంటు ఒప్పందం చెల్లదని తేలిపోవడంతో గతంలో ఇచ్చిన సొమ్ముకు మిగిలిన ఒప్పందం సొమ్ము చెల్లిస్తానని, వచ్చి భూములను స్వాధీనం చేయాలని బెదిరింపులకు దిగుతున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో చేసుకున్న అగ్రిమెంటు ఒప్పందం చనిపోయిందని, ఇప్పుడు తాము భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు ఎకరం రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్లు పైబడి పలుకుతున్నందున పేదల ఇళ్లకు అవసరమైన పక్షంలో ప్రభుత్వం తమ భూములకు అప్పుడు ఇస్తానని సొమ్ములకు మూడు రెట్లు ఇస్తే తాము భూములను స్వాధీనం చేస్తామని రైతులు చెబుతున్నారు. రియల్టర్‌కు భూములు ఇవ్వనని చెప్పడంతో రాజకీయ వత్తిళ్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయాలని లేని పక్షంలో భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు అండగా రియల్టర్ ఆగడాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే కొద్దో, గొప్పో ఇచ్చి నోరు మూయిస్తున్నారంటున్నారు. రియల్టర్ పెడుతున్న బాధలను తట్టుకోలేక జిల్లా ఉన్నతాధికారులను కలసి భూమిపై ఉన్న ఎక్విజిషన్ ఎత్తివేయాలని లేదా ప్రభుత్వ రేటుకు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి భూములు తీసుకోవాలని, రియల్టర్ నుంచి వస్తున్న రాజకీయ వత్తిళ్లు నిరోధించాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించనున్నట్టు రైతులు పుల్లా రామచంద్రరావు, చిక్కాల చక్రరావు, చిక్కాల వీరభద్రరావు, నిమ్మన భవన్నారాయణ తదితరులు తెలిపారు. -
రియల్టర్‌పై కాల్పులు
అత్తాపూర్: కారులో వెళ్తున్న రియల్టర్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ పీ అండ్‌టీ కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ షాబుద్దీన్(42) నివాసముంటున్నారు. ఇతను రియల్ఎస్టేట్ వ్యాపారంతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌ల్లో రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నాడు. భూములు, ప్లాట్ విషయంలో ఇతనికి పలువురితో గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా షాబుద్దీన్ సోమవారం రాత్రి 12 గంటలకు తన ఇన్నోవా కారులో హైదర్‌గూడ బాపూఘాట్మీదుగా ఇంటికి బయలుదేరాడు. వెనుకే వచ్చిన ఇద్దరు దుండగులు హైదర్‌గూడ ఏజీకాలనీ వాటర్ ట్యాంక్ వద్ద షాబుద్దీన్ కారుపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తు షాబుద్దీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే ఆయన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు. తనపై కాల్చిన బుల్లెట్ షెల్‌ను పోలీసులకు అప్పగించాడు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాలు... కాల్పులు జరిగిన తీరుపై పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి షాబుద్దీన్ ఒంటరిగా వెళ్తున్న విషయం నిందితులకు ఎలా తెలుస్తుందని, ఇద్దరు వ్యక్తులు కారుపై కాల్పులు జరిపి పారిపోవడం వెనుక ఏదో ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, షాబుద్దీన్ తనకు ప్రాణహాని ఉందని, రివాల్వర్‌కు అనుమతి మంజూరు చేయాలని గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
రాజేంద్రనగర్‌లో కాల్పుల కలకలం
-
రాజేంద్రనగర్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ ఏజీ కాలనీలోని రహదారిపై వెళ్తున్న వాహనంపై ఆగంతకులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న రియాల్టర్ షాబుద్దీన్ నేరుగా రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన వాహనంపై ఆగంతకులు కాల్పులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబుద్దీన్ తో పాటు పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి వచ్చి స్థానికులను విచారిస్తున్నారు. -
‘రియల్’.. ఢమాల్..!
రియల్టర్ల గుండెల్లో రైళ్లు స్తంభించిన లావాదేవీలు విజయవాడ: ఓ రియల్టర్ సెప్టెంబర్ మొదటి వారం గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామంలో ఎకరం రూ.1.40 కోట్లు చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో ఒక వంతు డబ్బు చెల్లించి 60రోజుల షరతుతో రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అగ్రిమెంటు రాయించుకున్నారు. మరో రియల్టర్ నూజివీడు సమీపంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఒక ఎకరం రూ. 70 లక్షల చొప్పున కొనుగోలు చేసి 60 రోజుల షరతుపై బయానా ఇచ్చి అగ్రిమెంటు చేసుకున్నారు. జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. రియల్టర్లు ఆందోళనలో ఉన్నారు. విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తామని ఆగస్టులో సీఎం చంద్రబాబు, అధికార పార్టీ నేతలు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు నమ్మిన రియల్టర్లు తెగించి పొలాలు, స్థలాలు కొనుగోళ్లు చేశారు. దాంతో వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు కూడా రియల్ ఏస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఇతర రకాల వృత్తుల్లో ఉన్న కాంట్రాక్టర్లు తదితరులు అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ లాభాలు పొందవచ్చనే భావనతో రియల్ ఏస్టేట్ రంగంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆగస్టు నుంచి, సెప్టెంబర్ వరకు విజయవాడ పరిసర ప్రాంతాలైన గన్నవరం, కంకిపాడు, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ తదితర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల రియల్ వ్యాపారం జరిగింది. భూములు, స్థలాల ధరలు మూడు రె ట్లుపెరిగాయి. అమ్మేవారు లేకపోవడంతో రియల్టర్లు అమ్మడానికి దొరికిన భూమిని కొనుగోలు చేసేశారు. టోకెన్ బిజినెస్‌పై నాలుగోవంతు డబ్బు రైతులకు ఇచ్చి పొలాలు కొనుగోలు చేశారు. అక్టోబర్ నెలలో గుంటూరు జిల్లా అమరావతిలో రాజధాని ఏర్పాటు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడకేసింది. కొనుగోళ్లు నిలిచిపోయాయి. మారుబేరం చేసి లాభం కోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారులు లావాదేవీలు నిలిచి పోయి నానా అగచాట్లు పడుతున్నారు. పొలం, స్థలం కొనుగోలుకు ఎవరూ రాకపోవడంతో రియల్టర్లు ఆలోచనలో పడ్డారు. గతంలో తమ ఆస్తులను విక్రయించిన వారు మిగిలిన సొమ్ముకోసం తిరుగుతున్నారు. నిలువునా మునిగిపోయాం.. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి రెండు మాసాల క్రితం భూములు కొనుగోలు చేసిన మధ్యవర్తులు నిలువునా మునిగిపోయామని వాపోతున్నారు. రాజధాని రాకపోతే రేట్లు పడిపోతాయని ఓ పక్క బ్రోకర్లు, మరో పక్క రియల్టర్లు కూడా టెన్షన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా రైతాంగం మాత్రం భూసేకరణ ఉండదని ఊపిరి పీల్చుకుంటున్నారు. -
హాంఫట్!
ఇప్పటికే ఎక్కువ శాతం ఆక్రమణ ఉన్నవాటిపైనా రియల్టర్ల కన్ను పట్టించుకోని పాలకులు, అధికారులు ముస్లిం మైనారిటీల ఆందోళన ఇబ్రహీంపట్నం : పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు, భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు కూడా సరిగా పట్టించుకోకపోవడంతో మండలంలోని 90 శాతం భూములు కబ్జాకు గురయ్యాయి. 1962వ సంవత్సరంలో వక్ఫ్ గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం కొండపల్లి శాంతినగర్‌లోని ముర్తుజా అలీ పంజా కింద ఆర్ఎస్ నంబరు 212ఏ, 212బీలలో 18.30 ఎకరాల మాన్యం భూమి, బ్యాంక్ సెంటరులో 293 సర్వే నంబరులో 1,800 చదరపు గజాల భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. బ్యాంక్ సెంటర్లో ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. మసీదు గడ్డ కింద ఆర్ఎస్ నంబరు 289లో ఉన్న 15 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు భవనాలు కూడా నిర్మించుకున్నారు. కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఉన్న బొమ్మలకాలనీలోని పురాతన మసీదును సైతం కొందరు ఆక్రమించుకుని ఏకంగా కాపురం ఉంటున్నారు. ఈ మసీదు కింద ఉన్న భూములను కొందరు ఆక్రమించి నిర్భయంగా విక్రయిస్తున్నారు. మిగిలిన భూములను ఆక్రమించుకునేందుకు.. మండలంలోని గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, దొనబండ, దామలూరు, ఈలప్రోలు గ్రామాల్లోనూ వందలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. మసీదులు, శ్మశానాలు, పంజాలు, దర్గాలు, ఖాజీమాన్యం, జాగీర్దార్ మాన్యం తదితర ఆస్తులు, భూములను కొందరు పెద్దలు ఆక్రమించారు. మరోవైపు విజయవాడను రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో మిగిలిన భూములపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఈ పరిస్థితుల్లో తమ భూములను పరిరక్షించుకునేందుకు అధికార టీడీపీ తరఫున ముస్లిం ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ లేరని, కనీసం మైనారిటీ శాఖకు మంత్రిగా తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నియమించలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంచాయతీ, రెవెన్యూ వర్గాల నిర్లక్ష్యం వల్లే.. మైనారిటీలకు చెందిన ఆస్తులు, భూములను కాపాడాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. ప్రభుత్వం 2002 జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 374 ప్రకారం వక్ఫ్ బోర్డు భూములను పర్యవేక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులపై కూడా ఉంది. కానీ, వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నవారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొందరు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి తప్పుడు ఎన్వోసీలు ఇస్తున్నారు. వాటి సాయంతో సర్వే నంబర్ మార్చుకుని, సమీప డోర్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులకు అన్నీ తెలిసినా మామూళ్లు తీసుకుని ఇళ్లు, ఇతర నిర్మాణానాలకు అనుమతులు ఇస్తున్నారు. పన్నులు కూడా వసూలు చేస్తున్నారు. కబ్జాదారులు అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులు జారీచేసిన ఎన్వోసీలు, పంచాయతీకి పన్నులు చెల్లించిన రశీదులు చూపించి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. వక్ఫ్ భూములపై ప్రభుత్వ కన్ను! విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భూ సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని ఖాజీమాన్యం, జాగీర్దార్ మాన్యం భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు కొండపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 438/1, 289, 293లలో ఉన్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. వక్ఫ్ చట్టాన్ని కఠినంగా అమలు చేసి కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. - ఎస్ఏ రెహ్మాన్, న్యాయవాది, కొండపల్లి మైనారిటీ అధికారులు ఆదేశిస్తేనే చర్యలు కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి గ్రామాల్లో ఖాజీమాన్యం, వక్ఫ్‌భూములు ఉన్నమాట వాస్తవమే. ఈ భూములు అన్యాక్రాతమైతే ముస్లిం మైనారిటీ అధికారులే ముందుగా స్పందించాలి. ఆక్రమణలపై మైనారిటీ అధికారులు రాత పూర్వకంగా ఉత్తర్వులు అందజేస్తేనే రెవెన్యూ శాఖ తరఫున మేము స్పందింస్తాము. నేను వచ్చిన తర్వాత అటువంటి ఉత్తర్వులేమీ అందలేదు. వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాము. - హరిహర బ్రహ్మాజీ, తహశీల్దార్, ఇబ్రహీంపట్నం చర్యలు తీసుకుంటున్నాం ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం ఆక్రమించిన 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాము. కొండపల్లి శాంతినగర్, బ్యాంక్ సెంటర్, బొమ్మలకాలనీల్లో ఉన్న భూముల ను ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నవారిలో కొందరికి నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి తప్పకుండా భూములను కాపాడటానికి చర్యలు తీసుకుంటాము. - అహ్మద్, వక్ఫ్‌బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, విజయవాడ -
అనంతలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దాడి
అనంతపురం : అనంతపురం జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంతరం రైల్వేస్టేషన్ వద్ద తిరుమలరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తిరుమలరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా భూ తగాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
డీఎమ్మార్సీ నివేదికపైనే మెట్రో రైలు భవిత!
తిరుపతికి మెట్రో రైలు మంజూరు చేస్తూ సర్కారు ఇప్పటికీ ఉత్తర్వులు జారీచేయని వైనం డీఎమ్మార్సీ నివేదిక ఆధారంగానే మెట్రో రైలు మంజూరు చేస్తారంటున్న అధికారులు! మెట్రో రైలు వచ్చేస్తోందంటూ అప్పుడే హడావుడి చేస్తూ సొమ్ముచేసుకుంటున్న రియల్టర్లు ఇదిగో ఈ మార్గంలోనే మెట్రో రైలు వెళ్తుంది.. అదిగో అక్కడే మెట్రో రైల్వే స్టేషన్ నిర్మించేస్తారు.. అప్పుడైతే ధర ఎక్కువ.. ఇప్పుడే కొనండి.. తక్కువ ధరకు ప్లాటు వస్తుంది.. మెట్రో రైలు వచ్చాక అధిక ధరకు అమ్ముకోవచ్చు.. ఇదీ తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో రియల్టర్లు చేస్తున్న హడావుడి. రియల్టర్ల మాటలు నిజమని నమ్మిన అమాయకులు రూ.వేలు పలకని భూములను కూడా రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకూ మెట్రో రైలు వస్తుందా? అనేగా మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అధికారవర్గాలే చెప్పలేకపోతుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పరిసర ప్రాంతాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చూపి ప్రజలను లూటీ చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెట్రో రైలును తిరుపతికి మంజూరు చేస్తూ ప్రభుత్వం కనీసం ఇప్పటిదాకా ఉత్తర్వులు జారీచేయలేదు. ఈనెల 4న సీఎం చంద్రబాబు శాసనసభలో తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు మౌఖికంగా ప్రకటించారంతే..! తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలను డీఎమ్మార్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) అధ్యయనం చేసి, ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటిగా ఉంటుందని డీఎమ్మార్సీ నివేదిక ఇస్తేనే ఆ ప్రాజెక్టును చేపడతారన్నది స్పష్టమవుతోంది. కానీ.. రియల్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలు మాత్రం వాస్తవాన్ని కప్పిపెట్టి దోపిడీకి తెరతీయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రాజధాని ఎంపికపై ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి జిల్లాపై ఈనెల 4న చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. ఆ వరాల్లో తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఒకటి. కానీ.. మెట్రో రైలును తిరుపతికి మంజూరు చేస్తూ ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. కానీ.. విశాఖపట్నంకు మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ ఆగస్టు 13న పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 140) జారీచేశారు. అదే రోజున విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి(వీజీటీఎం) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు(జీవోఎంఎస్ నెం: 141)ను జారీచేశారు. ఇదే రీతిలో తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేస్తూ ఇప్పటిదాకా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. వైజాగ్, వీజీటీఎంల్లో డీపీఆర్ గ్రీన్‌సిగ్నల్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకరించేందుకు డీఎమ్మార్సీ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, వీజీటీఎంల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూ పొందించే బాధ్యతను కూడా డీఎమ్మార్సీకే అప్పగిస్తూ ఆగస్టు 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీఎమ్మార్సీ సీఈ నేతృత్వంలోని నిపుణుల కమిటీ డీపీఆర్‌ను రూపొందించి.. ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ డీపీఆర్ ఆధారంగా మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు టెండర్లు పిలుస్తారు. కానీ.. డీపీఆర్ తయారీకి సంబంధించిన ఉత్తర్వుల్లో కూడా ఎక్కడా తిరుపతి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టడం ఇప్పటికీ ప్రాథమిక దశను కూడా దాటలేదన్నది స్పష్టమవుతోంది. డీఎమ్మార్సీ బృం దంతోనే తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేయించి.. లాభసాటిగా ఉంటుందని తేల్చితేనే ఆ ప్రాజెక్టును చేపడతామని ప్రభుత్వమే స్పష్టీకరిస్తోంది. అంటే.. డీఎమ్మార్సీ నివేదికపైనే మెట్రో రైలు భవిత ఆధారపడి ఉందన్నది స్పష్టమవుతోంది. రియల్టర్ల హడావుడి వాస్తవాలు ఇలా ఉంటే రియల్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలు మాత్రం తాము చౌకగా కొనుగోలు చేసిన భూములను రియల్ వెంచర్లుగా మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు మెట్రో రైలును అస్త్రంగా చేసుకున్నారు. తిరుపతి మెట్రో రైలును వంద కిలోమీటర్ల పరిధిలో చేపడతారని.. రెండు మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేస్తారని.. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్‌కు సమీపంలోనూ మరొకటి శ్రీకాళహస్తిలో నిర్మిస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తొలి దశలో రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, తిరుపతి, అలిపిరి, జూపార్కు, శ్రీని వాసమంగాపురం వరకూ ఓ మార్గం.. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండు, ఏర్పేడు, శ్రీకాళహస్తి వరకూ మరో మార్గం చేపడతారని మొత్తం వంద కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారని రియల్టర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. తొలిదశలో వీజీటీఎం పరిధిలో 49 కి.మీ.లు, విశాఖపట్నంలో 20 కి.మీ.ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతుండడం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉంటే.. వాటిని రియల్టర్లు కప్పిపెడుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చూపి.. రూ.వేలు కూడా పలకని ప్లాట్లను రూ.లక్షలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. -
గాలిలో మేడలు
విజయవాడ చుట్టుపక్కల రియల్టర్ల హల్చల్ చుక్కల్లో భూముల ధరలు జోరుగా జీరో బిజినెస్ కోట్లు ఆర్జిస్తున్న వ్యాపారులు విజయవాడ : రియల్టర్లకు రాజయోగం పట్టింది. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో పరిసర గ్రామాల్లో మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేస్తున్నారు. కొత్త రాజధాని పేరుతో గాలిలో మేడలు కడుతూ భూముల విలువను ఆకాశానికి పెంచేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ తదితర ఏరియాల్లో ఇప్పటికే వెంచర్లు ఉన్న రియల్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలు భవిష్యత్తులో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీల మాదిరిగా అభివృద్ధి చెందుతాయని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొత్తగా వెంచర్లు వేసేందుకు రియల్టర్లు గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో పొలాల కోసం చక్కర్లు కొడుతున్నారు. వారి హడావుడి కారణంగా తమ పొలాలను ఎంతకు విక్రయించాలో కూడా తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం మాగాణి భూముల కన్నా మెట్ట పొలాలకే డిమాండ్ పెరిగింది. మూడు నెలల ముందుగానే లావాదేవీలు.. విజయవాడనే రాజధాని చేస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు మొదటి నుంచి చెబుతుండటంతో మూడు నెలలుగా రియల్టర్లు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఆగిరిపల్లి ప్రాంతాలపై దృష్టిసారించారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు ముందే మధ్యవర్తుల సాయంతో చేతులు మార్చి(జీరో బిజినెస్) కోట్లాది రూపాయలను ఆర్జించారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీని చెల్లించకుండా తప్పించుకున్నారు. మూడు నెలల్లో అధికారిక లావాదేవీలు ఇవీ.. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జూన్‌లో 1,492 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రభుత్వానికి రూ.4.18 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద లభించింది. జూలైలో 1,723 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.4.96 కోట్లు, ఆగస్టులో 1,096 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.62 కోట్ల ఆదాయం వచ్చింది. నూజివీడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 834 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.1.59 కోట్ల ఆదాయం లభించింది. జూలైలో 1,170 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.47 కోట్లు, ఆగస్టులో 513 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.1.88 కోట్ల ఆదాయం వచ్చింది. హనుమాన్‌జంక్షన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 320 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోటి రూపాయలు ఆదాయం లభించింది. జూలైలో 420 రిజిస్ట్రేషన్లకు గానూ, కోటి రూపాయలు, ఆగస్టులో 270 రిజిస్ట్రేషన్లకు రూ.92 లక్షలు స్టాంప్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈ మూడు ప్రాంతాల్లో అధికారిక లావాదేవీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా అనధికారికంగా లవాదేవీలు జరిగినట్లు సమాచారం. ఆస్తుల విలువలకు రెక్కలు ఇప్పటికే జిల్లాలో రూ.12వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు నాలుగు వేల ఎకరాలు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ భూములు, ప్లాట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గన్నవరంలో కొద్దికాలం క్రితం ఎకరం రూ.20 లక్షలు ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెబుతున్నారు. గన్నవరం సమీపం గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు ఎకరా రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. నూజివీడు ప్రాంతంలో కూడా భూముల ధరలు అంతులేకుండా పెరిగాయి. గతంలో నూజివీడులో ఎకరం పొలం రూ. 20 లక్షలు ఉండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి వల్ల ఇప్పుడు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లకు చేరింది. గన్నవరం పట్టణంలో సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. -
రియల్టర్ హత్య
వారం క్రితం అదృశ్యం...కాలిన స్థితిలో మృతదేహం లభ్యం సీఐ, గణేష్రెడ్డిలే నిందితులు: భార్య సాక్షి, సిటీబ్యూరో/ ఆటోనగర్: వారం క్రితం అదృశ్యమైన రియల్టర్ అలుగుపల్లి వెంకట్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో ఉన్న అతని మృతదేహాన్ని ఆదివారం రాగన్నగూడలోని సామ రెసిడెన్సీ వెంచర్లో పోలీసులు కనుగొన్నారు. ప్లాట్ విషయంలో తన భర్తను గణేష్‌రెడ్డి, చారిలు ఎక్కడో హత్య చేసి.. శవాన్ని ఇక్కడకు తెచ్చి కాల్చారని, వీరికి ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి సహకరించాడని హతుడి భార్య ఆరోపించింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన అలుగుపల్లి వెంకట్‌డ్డి (44) మంజుల దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. వెంకట్‌రెడ్డి 2002 నుంచి కాంగ్రెస్ నేత సామ గణేష్‌రెడ్డితో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ టీచర్స్‌కాలనీలో ఉంటున్నాడు. రాగన్నగూడ సమీపంలో సామరెసిడెన్సీ పేరుతో వెంచర్ చేశారు. ఈ వెంచర్‌లోని ప్లాట్ నెంబర్ 120లో ఉన్న 387 గజాల స్థలాన్ని గణేష్‌రెడ్డి బంధువు మైపాల్‌రెడ్డి..విజయలక్ష్మి అనే మహిళకు విక్రయించారు. 2011లో ఇదే ప్లాట్‌ను విజయలక్ష్మి నుంచి హబ్సిగూడకు చెందిన చారి కొనుగోలు చేశాడు. ఇదే ప్లాట్‌ను గణేష్‌రెడ్డి, అతని బంధువు మైపాల్‌రెడ్డిలు.. వెంకట్‌రెడ్డి బంధువు పుష్పలతకు 2003లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వెంకట్‌రెడ్డికి మాత్రం డబుల్ రిజిస్ట్రేషన్ విషయం తెలియదు. ఇదిలాఉండగా జనవరిలో చారి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా వెంకట్‌రెడ్డి అడ్డుకున్నాడు. ఈ ప్లాట్ తన బంధువుదని చెప్పడంతో చారి తన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాడు. తన బంధువును మోసం చేసిన గణేష్‌రెడ్డిని డబ్బులు తిరిగి ఇవ్వమని పలుమార్లు వెంకట్‌రెడ్డి నిలదీశాడు. ఫలితంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈనెల ఒకటి నుంచి వెంకట్‌రెడ్డి కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మరుసటి రోజు అతని కారు 120 ప్లాట్ సమీపంలోనే కనిపించింది. కారులో లభించిన డైరీలో నాలుగు పేజీలు రాసిన నోట్ లభ్యమైంది. కారు చుట్టుపక్కల ఎంత గాలించినా అతని ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పడు లేని శవం ఇప్పుడెలా వచ్చింది... ఈనెల 2న కారు లభించిన 200 మీటర్ల దూరంలోనే ఆదివారం కాలిన స్థితిలో ఉన్న వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని గెర్రెకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆరు రోజుల క్రితం కారు లభించిన చుట్టుపక్కల ప్రాంతాలలో క్షుణ్ణంగా పోలీసులు గాలించినా శవం మాత్రం ఆ రోజు కనిపించలేదు. అప్పుడు కనిపించని శవం ఆదివారం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వెంకట్‌రెడ్డిని కిడ్నాప్ చే సి ఎక్కడో హత్య చేసి...శవాన్ని ఇక్కడ పడేసి పూర్తిగా కాల్చివేసినట్లుగా కనిపిస్తోంది. కూర్చున్న చోటే అలాగే మృతి చెందిన్నట్లు ఉంది. హతుడి ఎడమ కాలులో ఉన్న ఇనుపరాడ్ బయటపడటంతో దాని ఆధారంగానే వెంకట్‌రెడ్డిగా గుర్తించారు. ఏసీపీలు సురేందర్‌రెడ్డి, ఆనంద్‌భాస్కర్, ఇన్స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మహ్మద్గౌస్లు ఘటనా స్థలానికి వెళ్లి.. క్లూస్‌టీంతో ఆధారాల కోసం పరిశీలించారు. ఈ ఘటనపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, హతుడి భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి పేర్కొన్నారు. డైరీలో ఎన్నో మిస్టరీలు... కారులో లభించిన డైరీలోని మొదటి పేజీలో..ప్లాట్ విషయమై చర్చిందుకు ఈనెల ఒక టిన మరో వ్యక్తి ద్వారా చారి పిలిచాడు. నాకు భయంగా ఉంది. అయినా సరే వెళ్తున్నా..నాకు ఏదైనా జరిగితే సీఐ గోపాలకృష్ణమూర్తి, సామ గణేష్‌రెడ్డి, చారిలదే బాధ్యత. మరోపేజీలో..గణేష్‌రెడ్డి ఒక ప్లాట్ విషయలో నాతో రూ.10 లక్షలు కట్టించాడు. అది పెద్దలాస్, అది అందరికీ తెలుసు. వాడు రాక్షసుడు. మూడో పేజీలో... దేవుడి సాక్షిగా నా చావుకు సామ గణేష్‌రెడ్డి, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తిలే కారణం. నాలుగో పేజీలో... నా వ్యాపారంలో గణేష్రెడ్డికి రూ.50 కోట్లు ఇప్పించాను. వాడు చాలాచాలా మోసం చేశాడు. వాడి నుంచి డబ్బులు నా భార్యపిల్లలకు ఇప్పించాలి. అతన్ని శిక్షించాలని ఉంది. అయితే ఈ నాలుగు పేజీలు కూడా డైరీలో వరుస పేజీలలో లేవు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలోని తేదీలలో ఉంది. అసలు ఇది అతని చేతిరాతేనా అనే అనుమానం నివృత్తి చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఆ నోట్ కాపీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. -
రాజధానిలో రియల్టర్ హత్య
- వారం క్రితం అదృశ్యం... కాలిన స్థితిలో శవం లభ్యం - సీఐ, గణేష్రెడ్డిలే నిందితులు: భార్య - హతుడి డైరీలో అన్నీ మిస్టరీలే... - మృతుడు చింతపల్లివాసి సాక్షి, సిటీబ్యూరో/ ఆటోనగర్: వారం క్రితం అదృశ్యమైన రియల్టర్ అలుగుపల్లి వెంకట్‌రెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో ఉన్న అతడి మృ తదేహాన్ని ఆదివారం రాగన్నగూడలోని సామ రెసిడెన్సీ వెంచర్లో పోలీసులు కనుగొన్నారు. ప్లాట్ విషయంలో తన భర్తను గణేష్‌రెడ్డి, చారి లు ఎక్కడో హత్య చేసి.. శవాన్ని ఇక్కడకు తెచ్చి కాల్చారని, వీరికి ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూ ర్తి సహకరించాడని హతుడి భార్య ఆరోపించిం ది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని చింతపల్లికి చెందిన అలుగుపల్లి వెంకట్‌డ్డి (44) మంజుల దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. వెంకట్‌రెడ్డి 2002 నుంచి కాంగ్రెస్ నేత సామ గణేష్‌రెడ్డితో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ టీచర్స్‌కాలనీలో ఉంటున్నాడు. రాగన్నగూడ సమీపంలో సామరెసిడెన్సీ పేరుతో వెంచర్ చేశారు. ఈ వెంచర్‌లోని ప్లాట్ నెంబర్ 120లో ఉన్న 387 గజాల స్థలాన్ని గణేష్‌రెడ్డి బంధువు మైపాల్‌రెడ్డి..విజయలక్ష్మి అనే మహిళకు విక్రయించారు. 2011లో ఇదే ప్లాట్‌ను విజయలక్ష్మి నుంచి హబ్సిగూడకు చెందిన చారి కొనుగోలు చేశా డు. ఇదే ప్లాట్‌ను గణేష్‌రెడ్డి, అతడి బంధువు మైపాల్‌రెడ్డిలు.. వెంటక్‌రెడ్డి బంధువు పుష్పలతకు 2003లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వెంకట్‌రెడ్డికి మాత్రం డబుల్ రిజిస్ట్రేషన్ విషయం తెలియదు. ఇదిలాఉండగా జనవరిలో చారి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా వెంకట్‌రెడ్డి అడ్డుకున్నాడు. ఈ ప్లాట్ తన బంధువుదని చెప్పడంతో చారి తన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాడు. తన బంధువును మోసం చేసిన గణేష్‌రెడ్డిని డబ్బులు తిరిగి ఇవ్వమని పలుమార్లు వెంకట్‌రెడ్డి నిలదీశాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈనెల ఒకటి నుంచి వెంకట్‌రెడ్డి కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీ సులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మరుసటి రోజు అతడి కారు 120 ప్లాట్ సమీపంలోనే కనిపించింది. కారులో లభించిన డైరీలో నాలుగు పేజీలు రాసిన నోట్ లభ్యమైంది. కారు చుట్టుపక్కల ఎంత గాలించినా అతని ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పడు లేని శవం ఇప్పుడెలా వచ్చింది..? ఈనెల 2న కారు లభించిన 200 మీటర్ల దూరంలోనే ఆదివారం కాలిన స్థితిలో ఉన్న వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని గొర్రెకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆరు రోజుల క్రితం కారు లభించిన చుట్టుపక్కల ప్రాంతాలలో క్షుణ్ణంగా పోలీసులు గాలించినా శవం మాత్రం ఆ రోజు కనిపించలేదు. అప్పుడు కనిపించని శవం ఆదివారం ఎలా వచ్చిందనేది మిస్టరీ. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వెంకట్‌రెడ్డిని కిడ్నాప్ చే సి ఎక్కడో హత్య చేసి...శవాన్ని ఇక్కడ పడేసి పూర్తిగా కాల్చివేసినట్లుగా కనిపిస్తోంది. కూర్చున్న చోటే అలాగే మృతి చెందిన్నట్లు ఉంది. హతుడి ఎడమ కాలులో ఉన్న ఇనుపరాడ్ బయటపడటంతో దాని ఆధారంగానే వెంకట్‌రెడ్డిగా గుర్తించారు. ఏసీపీలు సురేందర్‌రెడ్డి, ఆనంద్‌భాస్కర్, ఇన్స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మహ్మద్గౌస్లు ఘటనా స్థలానికి వెళ్లి.. క్లూస్‌టీంతో ఆధారాల కోసం పరిశీలించారు. ఈ ఘటనపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, హతుడి భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి పేర్కొన్నారు. -
జర సూడరాదె..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘భాయ్ సాబ్... ఎన్నికలు దగ్గర పడ్డాయి. నేను సిట్టింగ్గా ఉన్నందున ఎక్కువ అవసరం ఉంది. మావోన్ని పంపిస్తా. వీలైనంతగా సహకరించు. ఈ ఒక్కసారి సూడాలె...’ - జిల్లాలోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌కు సిట్టింగ్ ఎంపీ విజ్ఞప్తి. ‘అన్నా... జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. ఖర్చు మొత్తం నామీదే పడతాంది. తర్వాత చూసుకుందాం. ఏదైనా పని ఉంటే నేనున్నాగా. వీలైనంత సర్దాలన్నా....’ - నగరంలోని బడా రియల్టర్‌కు ఎమ్మెల్యే ఫోన్ ...రెండు మూడు రోజులుగా జిల్లాలోని బడా కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, రైస్ మిల్లర్లకు ఇలాంటి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజాప్రతినిధుల నుంచి ‘పెద్దలకు’ ఫోన్లు వెల్లు వెత్తుతున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సహజమే అయినా.. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఇది త్వరగా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీకి దిగుతున్న నేతలు నిధుల వేటలో పడ్డారు. సాధారణ ఎన్నికల కోసం పోటీ చేసేవారు ఖర్చుల కోసం ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి రావడంతో వీరి ప్రణాళికలు తారుమారయ్యాయి. అదనంగా వచ్చిన ఎన్నికల భారం ఇప్పుడు నియోజకవర్గ నేతలపైనే పడుతోంది. దీంతో వీరు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఎంతో కొంత ఇస్తామని ఒప్పుకున్న వారికి ఫోన్లు చేసి ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నారు. గతంలో నిధులు సర్దుబాటు చేసేందుకు నిరాకరించిన వారికి మరోమారు ఫోన్ చేసి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి అస్త్రంగా సర్దుబాటు చేయాల్సిందే అని హెచ్చరికగా చెబుతున్నారు. ఇలాంటి హెచ్చరిక.. డిమాండ్లు ఎక్కువగా అధికార పార్టీ వారి నుంచే వెళ్తున్నాయి. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను, నీటి పారుదల శాఖలో పనులు చేస్తున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. స్వయంగా పిలుపించుకుని మాట్లాడుతున్నారు. బేరసారాలు.. హెచ్చరికలు కడిపికొండ రోడ్డు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రూ.14 కోట్లతో ఓ కాంట్రాక్టర్ టెండరు దక్కించుకున్నారు. అగ్రిమెంట్‌కు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార, విపక్ష పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పనిలో కమీషన్ వెతుక్కుంటున్నారు. జిల్లాలోని ఓ ఎంపీ స్వయంగా ఫోన్ చేసి ‘ముందైతే ఓ పది లక్షలు ఇవ్వాలి. ఎన్నికల ఖర్చు ఉంది. రోడ్డు పనులు మొదలయ్యాక తర్వాత చూసుకుందాం’ అంటూ... బేరసారాలకు దిగారు. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పా ర్టీల నేతలు ఎన్నికల నిధుల వేటలో పడ్డారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, భూముల వ్యాపారం చేస్తున్న రియల్టర్లు... వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ఖర్చులు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరగా డబ్బులు ఇవ్వకుంటే... పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని కటువుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఇదే ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు. జిల్లాలోని ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల చేతుల్లో గతంలో లేని విధంగా ఇప్పుడు నిత్యం కాగితాలు, ఫైళ్లు ఉంటున్నాయి. ఇవన్నీ రోడ్డు పనులకు సంబంధించి ఫిర్యాదుల కాగితాలేనని వారి సన్నిహితులు చెబుతుండడం గమనార్హం. ఎంతో కొంత ఇస్తున్నాం.. కాంట్రాక్ట్ దక్కించుకుని... పనులు మొదలుపెట్టే ముందే పది శాతం ముట్టజెప్పాల్సి వస్తోందని... అదనంగా ఇప్పుడు ఎన్నికల ఖర్చు వచ్చిపడిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఇచ్చామని, అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలకు పార్టీ ఫండ్ పేరిట మళ్లీ ఏడాదిలోనే పెద్ద డిమాండ్లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా... ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు ఉన్నా... తమకు పనులు కావాలి కాబట్టి అడిగింత కాకుండా ఎంతోకొంత ఇచ్చి బయటపడుతున్నామని కాంట్రాక్టర్లు, రియల్టర్లు చెబుతున్నారు. -
కొత్త ఏడాదిలో అడుగులు తడబడొద్దు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం మొదలైంది. కనీసం ఈసారైనా నగరంలో ఒక ప్లాటు కొనాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎలాగైనా స్థలాన్ని కొనాలన్న ఆలోచన సరైనదే. కాకపోతే స్థలం కోసం వెచ్చించే కష్టార్జితం బూడిదపాలు కావొద్దంటే.. ప్లాటు కొనే ముందు పలు అంశాలపై దృష్టి సారించాలి. స్థలం చూపెట్టే మధ్యవర్తులు, రియల్టర్లు, విక్రయించే యజమానులు కాసింత చిరాకుపడినా ఫర్వాలేదు.. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి. అడగటానికి మొహమాటం పడితే ప్లాటు ‘కొని’ చిక్కులు తెచ్చుకున్నట్లే. స్థలమైనా, ఫ్లాటు అయినా.. కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మోసాల బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అంతకంటే ముందు ఏయే రకాలుగా మోసపోయే అవకాశముందో తెలుసుకోవాలి. వీటిపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మోసపోయే అవకాశమే ఉండదు స్థిరాస్తిని విక్రయించడానికి ముందు ఆస్తి పత్రాల్ని బ్యాంకుల్లో కుదువపెట్టి అప్పు తీసుకుంటారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం తెలివిగా పత్రాలు ఎక్కడో పోయాయని, ఎలాంటి సమస్య వచ్చినా పూచీ తమదేనని నమ్మబలుకుతారు. సగం ధరకే ఇస్తున్నామని ఆశ చూపుతారు. ఆస్తిని అమ్మేశాక, పత్తా లేకుండా పోతారు. ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడితే కష్టార్జితం కోల్పోతాం. న్యాయంకోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. కాబట్టి స్థలం కొనేముందు స్థిరాస్తికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్ధారణ చేసుకోవాలి. పవర్ పట్టా.. సమస్య వచ్చేదిట్టా: పవర్ పట్టా ద్వారా స్థలాన్ని విక్రయించే ఏజెంట్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది స్థల యాజమానులేం చేస్తారంటే.. ఒకరి కంటే ఎక్కువమందికి జీపీఏ (జనరల్ పవరాఫ్ అటార్నీ)లు రాసి ఇస్తుంటారు. దీని ఆధారంగా స్థలం కొన్నారనుకోండి ఇక అంతే సంగతులు. ఇలాంటి వారి నుంచి స్థలాన్ని కొనేముందు యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో నిర్ధారించుకోవాలి. ఆయా లేఅవుట్ గురించి సంబంధిత ప్రభుత్వ శాఖల్లో విచారించాలి. అవసరమైతే అక్కడి స్థానికులతో మాట్లాడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో చాలామంది విదేశాల నుంచి నగరానికి వస్తారు. మళ్లీ వెనక్కి వెళ్లే తరుణంలో మధ్యవర్తులు, రియల్టర్లు చూపెట్టే స్థలాల్ని పక్కాగా పరిశీలించక ముందే ప్లాటును కొనుగోలు చేసి వెళ్లిపోతుంటారు. కొన్నాళ్లయ్యాక నగరానికొస్తే అదే ప్లాటు ఇద్దరు లేదా ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్ అవడం చూసి ఖంగుతినాల్సి వస్తుంది. కాబట్టి ప్లాటు కొన్నాక అంతా పక్కాగా ఉందని నిర్ధారణకు వచ్చిన తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
రియల్టర్ దారుణ హత్య
దమ్మాయిగూడెం (తిరుమలాయపాలెం), న్యూస్‌లైన్: ఇంటి నుంచి భూమి బేరం కోసమని వెళ్లిన రియల్టర్‌ని గుర్తుతెలి యని వ్యక్తులు హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహాన్ని దమ్మాయిగూడెం సమీపంలో మేడిదపల్లి రోడ్డు పక్కన స్థానికులు గమనించి పోలీసులతో చెప్పారు. తిరుమలాయపాలెం పోలీసులు తెలిపిన వివరాలు: ఖమ్మంలో అదృశ్యం.. ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్లకు చెందిన చింతకుంట్ల వెంకటేశ్వర్లు(52) గత పదేళ్లుగా ఖమ్మంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్లో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్, గ్రానైట్ రాళ్ల వ్యాపారం కూడా సాగిస్తున్నాడు. భూమి కొనుగోలు కోసం వరంగల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తు లు వెంకటేశ్వర్లును సంప్రదించారు. గుది మళ్లలోని తన సమీప బంధువుల భూమి ని చూపించేందుకు ఈ నెల 1న (ఆదివా రం) సాయంత్రం ఇంటి నుంచి మోటార్ సైకిల్‌పై వెంకటేశ్వర్లు బయలుదేరాడు. అతడు తన వాహనాన్ని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద పార్క్ చేసి, భూమి కొనుగోలుకు వచ్చిన వారితో కలిసి వారి కారులో వెళ్లాడు. ఆనాటి నుంచి వెంకటేశ్వర్లు ఆచూకీ లేకపోవడం, అతని సెల్ కూడా స్విచ్చాఫ్ ఉండడంతో కుటుంబీకులు సోమవారం ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడిదపల్లిలో మృతదేహం.. దమ్మాయిగూడెం సమీపంలోని మేడిదపల్లి రోడ్డు పక్కనున్న (వల్లపు లింగయ్య) పత్తి చేను వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం స్థాని కులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి వెళ్లారు. మృతదేహంపై పెట్రోల్‌పోసి నిప్పంటించినట్టుగా ఉంది. చెప్పులు, రోడ్డుకు ఇరువైపులా మద్యం బాటిళ్లు, మృతదేహం పక్కన చేతి రుమాలు (కర్చీఫ్) ఉన్నాయి. ఓ వ్యక్తి (చింతకుంట్ల వెంకటేశ్వర్లు) అదృశ్యమైనట్టుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలుసుకున్న సీఐ.. అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఖమ్మం రూరల్ ఎస్సై నాగరాజు కూడా ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. చింతకుంట్ల వెంకటేశ్వర్లు ఫైల్ ఫొటోకు, మృతదేహానికి పోలికలు గుర్తించలేక... అతని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. చింతకుంట్ల వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు రవికిషోర్ వచ్చి, అక్కడున్న చెప్పులు తన తండ్రివేనంటూ భోరున విలపించాడు. రవికిషోర్ చెప్పిన ఇతర ఆనవాళ్లు సరిపోలడంతో ఆ మృతదేహాన్ని వెంకటేశ్వర్లుదిగా పోలీసులు నిర్థారించారు. ఘటన స్థలాన్ని ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, రూరల్ సీఐ తిరుపతిరెడ్డి పరిశీ లించారు. వెంకటేశ్వర్లును అపహరించిన రోజునే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ తిరుపతిరెడ్డి కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు చెల్లించలేదని మహిళను నిర్బంధించిన వ్యాపారి
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని కస్తురి అనే మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ దాదాపు ఐదు నెలలపాటు గృహ నిర్బంధించాడు. దాంతో స్థానికులు, మీడియా సహాయంతో ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను గృహ నిర్బంధం నుంచి రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... గతంలో కస్తురి అనే మహిళ రియల్ వ్యాపారి ప్రసాద్ వద్ద రూ. 4 లక్షల అప్పు చేసింది. ఆ అప్పు చెల్లించడంలేందంటూ గత ఐదు నెలల క్రితం ప్రసాద్ ఆమెను తన గృహంలో నిర్బంధించాడు. తనను విడుదల చేయాలని కస్తురి ఎన్నిసార్లు ప్రాదేయపడిన ప్రసాద్ కనికరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ విషయం స్థానికులకు తెలియడంతో మీడియాకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. కస్తురి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని మొదట అందరూ భావించినా.. ఆత్మహత్యల యత్నానికి మరో కారణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాడ్జ్‌లో దొరికిన సూసైడ్‌నోట్‌లో ఆత్మహత్యలకు నలుగురు వ్యక్తులు కారణమని.. తమ కుటుంబాన్ని మోసం చేసి ఆర్ధిక ఇబ్బందులకు గురిచేశారని ఉంది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసులు కుమార్ చౌదరి, మంజీలాల్ గాంధీలతో పాటు రవి, లలిత అనే మరో ఇద్దరు దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య, ఆమె ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన అనిల్‌కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లాను : వంశీకృష్ణ
-
రెండు మాసాలుగా సిటీలోనే మకాం..
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ‘నగరంలో రకరకాలుగా చీటింగ్ చేసి చివరకు బాధితులు ఏం చేస్తారో అనే భయంతో, గత్యంతరం లేక పరారయ్యాను. కాలువలో దూకి ఆత్మహ్యత్య చేసుకుందామని అమ్మకు చెప్పా.. ఆమె వద్దని సలహా ఇచ్చింది. దాంతో కారును కాలువలో తోసేసి ఆదృశ్యమయ్యాను. రెండు మాసాలుగా నగరంలోనే ఉంటున్నాను.’ అని కోట్లాది రూపాయలు చీటింగ్ చేసి పరారైన రియల్టర్ నార్ల వంశీ కృష్ణ బుధవారం పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు తెలిసింది. మోస్ట్‌వాంటెడ్ చీటర్‌గా పోలీసు రికార్డులలో నమోదైన వంశీకృష్ణ ఇంకా తనదైన శైలిలో కట్టుకథలు చెపుతూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా మాయమాటలతో ప్రజలనుంచి వంద కోట్లు వసూలు చేసిన వంశీకృష్ణ ఇప్పుడు చేతిలో చిల్లుగవ్వలేదంటూ చెప్పడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. వీనస్ డవలపర్స్ పేరుతో నగరంలో బిల్డర్‌గా వ్యాపారం చేసి పేదల నుంచి, పోలీస్ అధికారులు, పారిశ్రామికవేత్తల వరకు అనేక మందికి లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన వంశీకృష్ణ పోలీసు ఇంటరాగేషన్‌లో తాను అమయాకుడినని, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2011 జనవరి 4న తాను తన తల్లితో కలిసి గుంటూరు జిల్లాకు వెడుతూ దుగ్గిరాల వద్ద జరిగిన సంఘటనపై మరో కట్టు కథ చెప్పినట్లు తెలిసింది. అప్పులవాళ్లకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, తన తల్లి వద్దని వారించిందని చె ప్పాడు. తాను కనపడితే మోసపోయిన జనం చంపేస్తారనే భయంతో చనిపోయినట్లు నమ్మించేవిధంగా కారును కాలువలో తోసి పరారయ్యామని వివరించాడు. ఇక్కడి నుంచి పరారయ్యాక చేతిలో డబ్బులేక తాను అనేకచోట్ల తన తల్లితో కలిసి తిరిగానని చెప్పాడు. చివరకు గత్యంతరం లేక వైజాగ్ చేరుకని అక్కడే ఏడాదిన్నర కాలంగా చిరుద్యోగం చేసుకుంటూ జీవనం సాగించానని చెప్పాడు. తప్పని పరిస్థితితో తిరిగి రెండు నెలల క్రితం విజయవాడ చేరుకుని ఇక్కడ కాలం వెళ్లబుచ్చుతున్నట్లు పోలీసులకు కహానీ వినిపించాడు. పక్కా పథకంతో లొంగుబాటు.. చీటర్ వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోవడంలో కూడా పక్కా వ్యూహంతో వ్యవహరించాడని ప్రజలు భావిస్తున్నారు. తనపై ఏ కేసులు లేని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తనకు సన్నిహత సంబంధాలున్న ఇంటి సమీపంలో దొరకడం చర్చనీమాంశమైంది. రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూంకు పథకం ప్రకారం ఫోన్ చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన కాల్‌తో ఆ ఏరియాలో బీట్ తిరుగుతున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఆ ప్రదే శానికి వెళ్లి అతన్ని సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం అతన్ని జేబులు పరిశీలించారు. రెండు మనీపర్సులు ఉన్నాయి. రూ.50 నోటు, కట్టుబట్టలు మాత్ర మే అతని వద్ద ఉన్నాయి. చేతికి వెండి కడియం ఉంది. ఇదంతా చూస్తుంటే నిందితుడు పక్కా ప్రణాళికతో లొంగిపోయినట్లు భావిస్తున్నారు. బినామీ పేర్లతో ఆస్తులు బదలాయించినట్లు తెలుస్తోంది. అదృశ్యం కావడానికి ముందే వంశీ తన ఆస్తులను పక్కావ్యూహంతో తన బంధుమిత్రులు, సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. పోలీసు అధికారులు వంశీకృష్ణ అరె స్టుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రైం డీసీపీ గీతాదేవి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న కేసులపై సంబంధిత పోలీసు అధికారులు పాత ఫైళ్లను బూజు దులిపి పరిశీలిస్తున్నారు. నమ్మించి మోసం చేశాడని బాధితుల గగ్గోలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఒక ఫ్లాట్ తీసుకుంటే ఇల్లు కూడబెట్టుకున్నట్లు వుంటుందని భావించి డబ్బులు ఇస్తే నమ్మించి మోసం చేసాడంటూ రియల్డర్ వంశీకృష్ణ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసం నగరంలో ఇంతవరకూ చూడలేదని, ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి అమ్మడంతో పాటు, మరొకరి స్థలాన్ని బ్యాంక్‌లో పెట్టి రుణం పొందాడని వారు అంటున్నారు. వంశీకృష్ణ మోసాలకు సబ్‌రిజిస్ట్రార్‌లో పాటు, బ్యాంకు అధికారుల పాత్ర వుందని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన నార్ల వంశీకృష్ణను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిన బాధితులు బుధవారం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాడేపల్లి జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో వున్న వైశ్రాయ్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో భాగుంటుందని, నాల్గవ ఫ్లోర్లో ఎఫ్‌ఎప్3సీకి 2010లో రూ. 33 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని రెండు విడతలుగా రూ 20 లక్షలు చెల్లించినట్లు కుంచనపల్లికి చెందిన కొండా కృష్ణారెడ్డి తెలిపారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయమని కోరగా పని పూర్తయిన తర్వాత ఒకేసారి చేస్తానని గడపుకొంటూ వచ్చాడన్నారు. కారుబోల్తా కొట్టి అదృశ్యమైన తర్వాత మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. తాను 20 లక్షలు చెల్లించిన ఫ్లాట్‌ను 2009 డిసెంబరులోనే బుద్ధా రవిశంకర్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలియడంతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 2007 సంవత్సరంలో తన 900 గజాల స్థలంలో అపార్ట్మెంట్ కడతానని, 50:50 పద్ధతిలో నిర్మాణం చేపడతానని వంశీకృష్ణతో పాటు పోలీసు శాఖలో పనిచేసే సురేష్ తనవద్దకు వచ్చినట్లు వైశ్రాయ్ టవర్స్ స్థల యజమాని జీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 13 ఫ్లాట్లలో చెరి ఆరు, మరొకటి ఇద్దరికీ వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తన ఆరు ఫ్లాట్లు సరిగా నిర్మాణం చేపట్టకపోగా.. ఏడో ఫ్లాట్‌ను కూడా ఇద్దరు, ముగ్గురికి విక్రయించనట్లు ఆయన పేర్కొన్నారు. తన స్థలం విలువ రూ.3 కోట్లు ఉందని, ఇప్పుడు కోటి రూపాయలు కూడా వచ్చేట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మోసగాడు వంశీకృష్ణ బ్రతికే ఉన్నాడు!
-
చీటర్ చిక్కాడు
జనాన్ని ముంచడమంటే ఇంత పచ్చి మోసంగా ఉంటుందా.. ఏకంగా తాను మరణించినట్లు నమ్మించేందుకు తెగపడతారా.. అవునని రుజువుచేశాడు చీటర్ వంశీకృష్ణ. రియల్టర్ అవతారమెత్తి నమ్మిన వారిని ఫోర్జరీ సంతకాలతో నట్టేట ముంచడంతోపాటు తన కస్టమర్లను నిలువు దోపిడీ చేసిన అతని పాపం ఎట్టకేలకు పండింది. రెండున్నర ఏళ్ల అదృశ్యం తర్వాత మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. వంశీకృష్ణ పాపాల పుట్ట పగిలి మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడ : అతను కమిషనరేట్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్... రెండున్నర సంవత్సరాలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఎట్టకేలకు సూర్యారావు పేట పోలీసులకు చిక్కాడు. కస్తూరిబాయిపేటలోని ఒక ఆస్పత్రికి చికిత్స కోసం రాగా.. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే అతనే కావాలని లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అతనిని సూర్యారావు పేట పోలీసులు విచారణ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని కోట్ల రూపాయలకు ముంచేసి అదృశ్యమైన వీనస్ బిల్డర్స్ యజమాని నార్ల వంశీకృష్ణ 2011 జనవరి 4వ తేదీ నుంచి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. 2011 జనవరి 4వ తేదీన వంశీకృష్ణ కారు గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో పంట కాలువలో పల్టీ కొట్టింది. ఆ ప్రమాదంలో వంశీతోపాటు అతని తల్లి కూడా గల్లంతైనట్లు అందరూ భావించారు. కాలువలో ఎంత గాలించినా వారి మృతదేహాలు దొరక్కపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి తాను చనిపోయినట్లు నమ్మించడం కోసం కారును కావాలనే కాలువలోకి పల్టీ కొట్టించి వంశీ కనపడకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో అతన్ని నమ్మి లక్షల రూపాయలకు ప్లాట్లు కొన్నవారు, అడ్వాన్సులు ఇచ్చినవారు ఆందోళన చెందారు. తొలుత దీనిపై కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. అయితే బాధితులందరూ నగరానికి చెందినవారే కావడంతో చివరికి పోలీసులు ఈ విషయంపై దృష్టి పెట్టి వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇతనిపై నగరంలోని వన్‌టౌన్, కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్లోనూ పలు కేసులున్నాయి. ప్లాట్లు కొనిపించడం ఆ తర్వాత వారికి తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకులో రుణాలు తీసుకోవడం, ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి విక్రయించడం వంటి మోసాల ద్వారా వంశీకృష్ణ కోట్ల రూపాయలు మింగేశాడని పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా ఒక బ్యాంకు లోనులో ఉన్న ప్లాటుకు మరొక బ్యాంకు లోను ఇవ్వదు. కానీ కొందరు బ్యాంకు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా లోన్లు ఉన్న ప్లాట్లకే మళ్లీ లోన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. రెప్కో, యూనియన్ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకుల ద్వారా రెండోసారి ఇవి మంజూరు చేయించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఒక సీఐ రియల్టర్ వంశీకష్ణకు రూ.5 కోట్లకుపైనే ఇచ్చిన విషయం బయటకొచ్చింది. ఇంతేకాకుండా గతంలో జిల్లా పోలీస్ బాస్ కూడా ఇతని వలలో పడినట్లు పోలీసువర్గాలే చెబుతున్నాయి. గుడ్డిగా నమ్మి ప్లాట్లు కొనడంతోపాటు కొందరు అతని పేరిట పవర్ ఆఫ్ ఆటార్నీ ఇచ్చి నిండా మునిగిపోయినట్లు తేలింది. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న ప్లాటును అతను వేరొకరికి రిజిస్టర్ చేసి బ్యాంకు రుణాన్ని మాత్రం వారి పేరుతో తీసుకున్నాడు. దీంతో పలువురు ప్లాటు తమది కాకపోయినా బ్యాంకులకు వాయిదాలు కడుతున్నారు. ఇలా రూ.100 కోట్లకుపైనే అతను పలువుర్ని ముంచేశాడు. ప్లాట్ల పేరుతో అనేక మందికి టోపీ పెట్టి, చివరికి వ్యాపార భాగస్వాములను సైతం నట్టేట ముంచి అదృశ్యమైన నార్ల వంశీకృష్ణ మోసాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వ్యాపారం చేద్దామని నమ్మించి జాయింట్ ఎకౌంట్లో ఉన్న రూ.80 లక్షల్ని తన సంతకం ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు చలసాని మైథిలి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ మెడికల్ హెల్త్‌కేర్ అండ్ హోల్డింగ్స్ పేరుతో వ్యాపారం కోసం రూ.కోటిని వంశీకృష్ణ, మైథిలి కలిసి గవర్నర్‌పేట ఇండియన్ బ్యాంకులో జమ చేశారు. ఆ డబ్బు డ్రా చేయాలంటే ఇద్దరూ సంతకాలు చేయాలి. అయితే వంశీయే చెక్కుపై మైథిలి సంతకాన్ని కూడా చేసి రూ.80 లక్షల్ని డ్రా చేశాడు. ఇందుకు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు మైథిలి ఫిర్యాదులో పేర్కొంది. భవానీపురంలో తులసి ఎన్‌క్లేవ్‌ను వంశీ, శ్రీనివాసరావు కలిసి నిర్మించారు. అయితే ఆ తర్వాత శ్రీనివాసరావుకు తెలియకుండా అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వంశీ దానిపై రూ.కోటిన్నర రుణం తీసుకున్నాడు. ఇందుకు ఒక పోలీసు అధికారి తన ఆస్తులను ష్యూరిటీగా పెట్టారు. దీనిపై శ్రీనివాసరావు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసూ పెండింగ్‌లోనే ఉంది. అతను దొరకడంతో ఇంకా చాలా విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మ్యాన్ మిస్సింగ్ కేసు ఉండటంతో పోలీసులు నేడు గుంటూరు జిల్లాకు తరలించే అవకాశం ఉంది. -
డబ్బుల కోసం రియల్టర్ నిర్బంధం
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: అప్పు వసూలు కోసం ఓ రియల్టర్‌ను నిర్బంధించిన సంఘటన మండల పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు బుధవారం నలుగురు నిందితులను రిమాండుకు పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దషాపూర్‌కు చెందిన జి. మల్లేష్‌యాదవ్, హైదరాబాద్ కుషాయిగూడ మల్కాపూర్‌లో ఉండే రియల్టర్ బుచ్చిరెడ్డిలు పరిచయస్తులు. వీరికి డబ్బులు అవసరమయ్యాయి. పెద్దషాపూర్లో ఉన్న మల్లేష్ పొలం తాలూకు పత్రాలను తాకట్టు పెట్టి నగరంలోని కొత్తపేటలో ఉండే సుధాకర్ వద్ద ఏడాది క్రితం రూ. 30 లక్షలు అప్పుగా తెచ్చుకున్నారు. మల్లేష్ రూ.16 లక్షలు, బుచ్చిరెడ్డి రూ.14 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బులకు నెలానెలా వడ్డీతో చెల్లించాల్సి ఉండగా కొన్ని నెలల నుంచి బుచ్చిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. మల్లేష్‌యాదవ్ మొత్తం డబ్బులను సుధాకర్‌కు చెల్లించి తన భూమి పత్రాలను తెచ్చుకున్నాడు. తనకు రావాల్సిన డబ్బుల కోసం బుచ్చిరెడ్డిని పలుమార్లు అడిగినా ఇవ్వకుండా రేపుమాపు అంటూ తప్పించుకుంటున్నాడు. ఈక్రమంలో డబ్బులను వసూలు చేయడానికి మల్లేష్‌యాదవ్ ఓ పథకం వేశాడు. ఇందుకోసం ఆయన శంషాబాద్ పోలీసుస్టేషన్లో పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ సహాయం తీసుకున్నాడు. శంషాబాద్ సీఐని మాట్లాడుతున్నాను.. పోలీస్ స్టేషన్‌కు రావాలి అంటూ హెడ్‌కానిస్టేబుల్ చేత మూడు రోజుల కిందట ఫోన్ చేయించాడు. దీంతో ఈనెల 21న బుచ్చిరెడ్డి తన కారులో డ్రైవర్ రమేష్‌తో కలిసి శంషాబాద్ బస్టాప్ వద్దకు వచ్చాడు. అక్కడ వారిని మల్లేష్యాదవ్తో పాటు సదరు హెడ్ కానిస్టేబుల్ కలుసుకున్నారు. సీఐ రావడానికి కొంత సమయం పడుతుందని హెడ్‌కానిస్టేబుల్ చెప్పారు. దీంతో పథకం ప్రకారం బుచ్చిరెడ్డిని డ్రైవర్‌తో పాటు మల్లేష్‌యాదవ్ పెద్దషాపూర్లో ఉన్న తన ఫాంహౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరిని ఓ గదిలో నిర్భందించారు. ఇందుకోసం మల్లేష్ తన కుమారుడు అశోక్‌యాదవ్, జూకల్కు చెందిన వాజిద్, నగరంలోని సంతోష్‌నగర్ నివాసి శోభన్‌బాబు(ఓ పత్రికలో యాడ్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి) సహాయం తీసుకున్నాడు. బయటకు తెలిసిందిలా.. డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ బుచ్చిరెడ్డికి మల్లేష్‌యాదవ్ తన సహచరులతో స్పష్టం చేసి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ నెల 22న బుచ్చిరెడ్డిచేత అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి డబ్బులు తీసుకురావాలని చెప్పించారు. దీంతో వారు అదే రోజు శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పెద్దషాపూర్‌లోని ఫాంహౌస్‌పై దాడి చేసి బుచ్చిరెడ్డి, డ్రైవర్ రమేష్‌ను విడిపించారు. ఈ కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు పంపారు. హెడ్ కానిస్టేబుల్ పాత్రపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అనంతపురంలో రియల్టర్ రాంప్రసాద్ హత్య
నగర శివారులోని రియల్టర్ వ్యాపారి రాంప్రసాద్ యాదవ్‌పై ఆగంతకులు శనివారం ఉదయం వేటకోడవళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో అయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాంప్రసాద్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంప్రసాద్‌కు ఎవరితో ఎటువంటి విబేధాలు లేవని ఆయన కుటుంభ సభ్యులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఆయన రియల్టీ వ్యాపారంలోకి ప్రవేశించారని చెప్పారు. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.