జర సూడరాదె..! | Bhai Saab ... But, he said | Sakshi
Sakshi News home page

జర సూడరాదె..!

Published Fri, Mar 14 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

జర సూడరాదె..!

జర సూడరాదె..!

సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘భాయ్ సాబ్... ఎన్నికలు దగ్గర పడ్డాయి. నేను సిట్టింగ్‌గా ఉన్నందున ఎక్కువ అవసరం ఉంది. మావోన్ని పంపిస్తా. వీలైనంతగా సహకరించు. ఈ ఒక్కసారి సూడాలె...’  - జిల్లాలోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌కు సిట్టింగ్ ఎంపీ విజ్ఞప్తి.
 
‘అన్నా... జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. ఖర్చు మొత్తం నామీదే పడతాంది. తర్వాత చూసుకుందాం. ఏదైనా పని ఉంటే నేనున్నాగా. వీలైనంత సర్దాలన్నా....’  - నగరంలోని బడా రియల్టర్‌కు ఎమ్మెల్యే ఫోన్
 
...రెండు మూడు రోజులుగా జిల్లాలోని బడా కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, రైస్ మిల్లర్లకు ఇలాంటి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజాప్రతినిధుల నుంచి ‘పెద్దలకు’ ఫోన్లు వెల్లు వెత్తుతున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సహజమే అయినా.. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఇది త్వరగా మొదలైంది.  
 
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీకి దిగుతున్న నేతలు నిధుల వేటలో పడ్డారు. సాధారణ ఎన్నికల కోసం పోటీ చేసేవారు ఖర్చుల కోసం ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి రావడంతో వీరి ప్రణాళికలు తారుమారయ్యాయి. అదనంగా వచ్చిన ఎన్నికల భారం ఇప్పుడు నియోజకవర్గ నేతలపైనే పడుతోంది. దీంతో వీరు ఇతర మార్గాలను  అన్వేషిస్తున్నారు.

గతంలో ఎంతో కొంత ఇస్తామని ఒప్పుకున్న వారికి ఫోన్లు చేసి ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నారు. గతంలో నిధులు సర్దుబాటు చేసేందుకు నిరాకరించిన వారికి మరోమారు ఫోన్ చేసి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి అస్త్రంగా సర్దుబాటు చేయాల్సిందే అని హెచ్చరికగా చెబుతున్నారు. ఇలాంటి హెచ్చరిక.. డిమాండ్‌లు ఎక్కువగా అధికార పార్టీ వారి నుంచే వెళ్తున్నాయి. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను, నీటి పారుదల శాఖలో పనులు చేస్తున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. స్వయంగా పిలుపించుకుని మాట్లాడుతున్నారు.
 
బేరసారాలు.. హెచ్చరికలు
 
కడిపికొండ రోడ్డు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రూ.14 కోట్లతో ఓ కాంట్రాక్టర్ టెండరు దక్కించుకున్నారు. అగ్రిమెంట్‌కు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో తాత్కాలికంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార, విపక్ష పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పనిలో కమీషన్ వెతుక్కుంటున్నారు. జిల్లాలోని ఓ ఎంపీ స్వయంగా ఫోన్ చేసి ‘ముందైతే ఓ పది లక్షలు ఇవ్వాలి. ఎన్నికల ఖర్చు ఉంది. రోడ్డు పనులు మొదలయ్యాక తర్వాత చూసుకుందాం’ అంటూ... బేరసారాలకు దిగారు. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పా ర్టీల నేతలు ఎన్నికల నిధుల వేటలో పడ్డారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, భూముల వ్యాపారం చేస్తున్న రియల్టర్లు... వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ఖర్చులు సర్దుబాటు చేసుకుంటున్నారు.
 
ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరగా డబ్బులు ఇవ్వకుంటే... పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని కటువుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఇదే ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు. జిల్లాలోని ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల చేతుల్లో గతంలో లేని విధంగా  ఇప్పుడు నిత్యం కాగితాలు, ఫైళ్లు ఉంటున్నాయి. ఇవన్నీ రోడ్డు పనులకు సంబంధించి ఫిర్యాదుల కాగితాలేనని వారి సన్నిహితులు చెబుతుండడం గమనార్హం.
 
ఎంతో కొంత ఇస్తున్నాం..

కాంట్రాక్ట్ దక్కించుకుని... పనులు మొదలుపెట్టే ముందే పది శాతం ముట్టజెప్పాల్సి వస్తోందని... అదనంగా ఇప్పుడు ఎన్నికల ఖర్చు వచ్చిపడిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
 
పంచాయతీ ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఇచ్చామని, అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలకు పార్టీ ఫండ్ పేరిట మళ్లీ ఏడాదిలోనే పెద్ద డిమాండ్‌లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా... ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు ఉన్నా... తమకు పనులు కావాలి కాబట్టి అడిగింత కాకుండా ఎంతోకొంత ఇచ్చి బయటపడుతున్నామని కాంట్రాక్టర్లు, రియల్టర్లు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement