
కొత్త ఏడాదిలో అడుగులు తడబడొద్దు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం మొదలైంది. కనీసం ఈసారైనా నగరంలో ఒక ప్లాటు కొనాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎలాగైనా స్థలాన్ని కొనాలన్న ఆలోచన సరైనదే. కాకపోతే స్థలం కోసం వెచ్చించే కష్టార్జితం బూడిదపాలు కావొద్దంటే.. ప్లాటు కొనే ముందు పలు అంశాలపై దృష్టి సారించాలి. స్థలం చూపెట్టే మధ్యవర్తులు, రియల్టర్లు, విక్రయించే యజమానులు కాసింత చిరాకుపడినా ఫర్వాలేదు.. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి. అడగటానికి మొహమాటం పడితే ప్లాటు ‘కొని’ చిక్కులు తెచ్చుకున్నట్లే.
- స్థలమైనా, ఫ్లాటు అయినా.. కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మోసాల బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అంతకంటే ముందు ఏయే రకాలుగా మోసపోయే అవకాశముందో తెలుసుకోవాలి. వీటిపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మోసపోయే అవకాశమే ఉండదు
- స్థిరాస్తిని విక్రయించడానికి ముందు ఆస్తి పత్రాల్ని బ్యాంకుల్లో కుదువపెట్టి అప్పు తీసుకుంటారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం తెలివిగా పత్రాలు ఎక్కడో పోయాయని, ఎలాంటి సమస్య వచ్చినా పూచీ తమదేనని నమ్మబలుకుతారు. సగం ధరకే ఇస్తున్నామని ఆశ చూపుతారు. ఆస్తిని అమ్మేశాక, పత్తా లేకుండా పోతారు. ఇలాంటి మోసగాళ్ల చేతిలో పడితే కష్టార్జితం కోల్పోతాం. న్యాయంకోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. కాబట్టి స్థలం కొనేముందు స్థిరాస్తికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్ధారణ చేసుకోవాలి.
- పవర్ పట్టా.. సమస్య వచ్చేదిట్టా: పవర్ పట్టా ద్వారా స్థలాన్ని విక్రయించే ఏజెంట్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది స్థల యాజమానులేం చేస్తారంటే.. ఒకరి కంటే ఎక్కువమందికి జీపీఏ (జనరల్ పవరాఫ్ అటార్నీ)లు రాసి ఇస్తుంటారు. దీని ఆధారంగా స్థలం కొన్నారనుకోండి ఇక అంతే సంగతులు. ఇలాంటి వారి నుంచి స్థలాన్ని కొనేముందు యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో నిర్ధారించుకోవాలి. ఆయా లేఅవుట్ గురించి సంబంధిత ప్రభుత్వ శాఖల్లో విచారించాలి. అవసరమైతే అక్కడి స్థానికులతో మాట్లాడాలి.
- డిసెంబర్, జనవరి నెలల్లో చాలామంది విదేశాల నుంచి నగరానికి వస్తారు. మళ్లీ వెనక్కి వెళ్లే తరుణంలో మధ్యవర్తులు, రియల్టర్లు చూపెట్టే స్థలాల్ని పక్కాగా పరిశీలించక ముందే ప్లాటును కొనుగోలు చేసి వెళ్లిపోతుంటారు. కొన్నాళ్లయ్యాక నగరానికొస్తే అదే ప్లాటు ఇద్దరు లేదా ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్ అవడం చూసి ఖంగుతినాల్సి వస్తుంది. కాబట్టి ప్లాటు కొన్నాక అంతా పక్కాగా ఉందని నిర్ధారణకు వచ్చిన తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.