![Demand for studio apartments shrinks](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/studio.jpg.webp?itok=55NN9ieh)
తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్ టు సేమ్.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్‌మెంట్లకు క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్‌కు గిరాకీ పెరిగిపోయింది.
– సాక్షి, సిటీబ్యూరో
బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్‌డ్ బాత్‌రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్‌మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్‌మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లున్నాయి.
19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్‌లు..
2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్‌మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్‌మెంట్లే..
లొకేషన్ ముఖ్యం..
స్టూడియో అపార్ట్‌మెంట్లను బ్యాచ్‌లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.
మన దగ్గర తక్కువే..
స్టూడియో అపార్ట్‌మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్‌మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌ల్లో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment