ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.
2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం టాప్ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ పేర్కొంది.
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్ టెక్ కంపెనీలు ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్‌ఫ్రై తదితరాలు 5 బిలియన్ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది.
ఇష్యూ పరిమాణం అప్
పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.
గతేడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్‌సీలు సైతం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment