దమ్మాయిగూడెం (తిరుమలాయపాలెం), న్యూస్‌లైన్: ఇంటి నుంచి భూమి బేరం కోసమని వెళ్లిన రియల్టర్‌ని గుర్తుతెలి యని వ్యక్తులు హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహాన్ని దమ్మాయిగూడెం సమీపంలో మేడిదపల్లి రోడ్డు పక్కన స్థానికులు గమనించి పోలీసులతో చెప్పారు.
తిరుమలాయపాలెం పోలీసులు తెలిపిన వివరాలు: ఖమ్మంలో అదృశ్యం..
ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్లకు చెందిన చింతకుంట్ల వెంకటేశ్వర్లు(52) గత పదేళ్లుగా ఖమ్మంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్‌లో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్, గ్రానైట్ రాళ్ల వ్యాపారం కూడా సాగిస్తున్నాడు. భూమి కొనుగోలు కోసం వరంగల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తు లు వెంకటేశ్వర్లును సంప్రదించారు. గుది మళ్లలోని తన సమీప బంధువుల భూమి ని చూపించేందుకు ఈ నెల 1న (ఆదివా రం) సాయంత్రం ఇంటి నుంచి మోటార్ సైకిల్‌పై వెంకటేశ్వర్లు బయలుదేరాడు. అతడు తన వాహనాన్ని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద పార్క్ చేసి, భూమి కొనుగోలుకు వచ్చిన వారితో కలిసి వారి కారులో వెళ్లాడు. ఆనాటి నుంచి వెంకటేశ్వర్లు ఆచూకీ లేకపోవడం, అతని సెల్ కూడా స్విచ్చాఫ్ ఉండడంతో కుటుంబీకులు సోమవారం ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మేడిదపల్లిలో మృతదేహం..
దమ్మాయిగూడెం సమీపంలోని మేడిదపల్లి రోడ్డు పక్కనున్న (వల్లపు లింగయ్య) పత్తి చేను వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం స్థాని కులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి వెళ్లారు. మృతదేహంపై పెట్రోల్‌పోసి నిప్పంటించినట్టుగా ఉంది. చెప్పులు, రోడ్డుకు ఇరువైపులా మద్యం బాటిళ్లు, మృతదేహం పక్కన చేతి రుమాలు (కర్చీఫ్) ఉన్నాయి. ఓ వ్యక్తి (చింతకుంట్ల వెంకటేశ్వర్లు) అదృశ్యమైనట్టుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలుసుకున్న సీఐ.. అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఖమ్మం రూరల్ ఎస్సై నాగరాజు కూడా ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. చింతకుంట్ల వెంకటేశ్వర్లు ఫైల్ ఫొటోకు, మృతదేహానికి పోలికలు గుర్తించలేక... అతని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. చింతకుంట్ల వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు రవికిషోర్ వచ్చి, అక్కడున్న చెప్పులు తన తండ్రివేనంటూ భోరున విలపించాడు. రవికిషోర్ చెప్పిన ఇతర ఆనవాళ్లు సరిపోలడంతో ఆ మృతదేహాన్ని వెంకటేశ్వర్లుదిగా పోలీసులు నిర్థారించారు.
ఘటన స్థలాన్ని ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, రూరల్ సీఐ తిరుపతిరెడ్డి పరిశీ లించారు. వెంకటేశ్వర్లును అపహరించిన రోజునే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ తిరుపతిరెడ్డి కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రియల్టర్ దారుణ హత్య
Published Wed, Dec 4 2013 6:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement