సాక్షి, ఆదిలాబాద్: ప్లాట్ల కొనుగోలు, డబ్బులు ముట్టజెప్పే వ్యవహారంలో ఓ రియల్టర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మధ్య జరిగిన ఆడియో సంభాషణ సంచలనం రేపింది. ఏడాది క్రితం జరిగిందని ఎమ్మెల్యే చెబుతున్నా.. ఇటీవలే ఆ ప్లాట్ల వ్యవహారం జరిగినట్టుగా చర్చ సాగుతోంది. ఆ రియల్టర్ నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్‌కుమార్ అని ప్రచారం సాగుతోంది.
రియల్టర్ కిరణ్‌కుమార్ బోథ్‌లో కొన్నేళ్ల క్రితం చేసిన లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే బాపురావు డబ్బులు చెల్లించలేదని చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య ఓ మధ్యవర్తి ఉండటం, రియల్టర్ ఆ మధ్యవర్తిపై ఒత్తిడి తేవడం, దీంతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్‌లో సంభాషించినట్లుగా వ్యవహారం సాగింది. ప్రధానంగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ ప్లాట్లను ఇతరులకు అమ్మేందుకు ఇటీవల ప్రయత్నాలు చేయగా, ఈ వివాదం చోటుచేసుకుందని అంటున్నారు.
రియల్టర్, ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఇలా..
ఎమ్మెల్యే: ఎవరో వచ్చి ప్లాట్ చూస్తున్నారటా.. ధన్నూరోల్లటా (బోథ్ మండలం ధన్నూర్ గ్రామస్తులు)..
రియల్టర్: చూస్తారు కదా సార్.. ఏడాదిన్నర, రెండేళ్లు టైం ఇచ్చిన తర్వాత డబ్బులు రాకుంటే నా దగ్గర కూడా పైసల్లేవు కదా సార్.
ఎమ్మెల్యే: ఔనండి.. ఉంటాయి పైసలు ఉంటాయి.. దునియ కూడా ఉంటది.
రియల్టర్: ఏం సర్.. సంవత్సరాల కొద్దీ పేమెంట్ ఆగుతద.
ఎమ్మెల్యే: లెక్కతో లెక్క చేసుకోవాలి కానీ.. లేనిపోని లొల్లి పెట్టుకోకండి..
రియల్టర్: ఎవరు పెడుతున్నరు సార్ లొల్లి.. రమ్మని అంటున్న కద సార్ ఆయన్ని (మధ్యవర్తిని).. లెక్క చేద్దామని, నేను పది సార్ల పోయిన ఆయన దగ్గరికి..
ఎమ్మెల్యే: కండిషన్ పెడుతున్నవట కదా.. రూ.28 లక్షలు నెట్ క్యాష్ తీసుకొని రా అంటున్నవట కదా.
రియల్టర్: నెట్‌కాదు సార్.. ఫస్ట్ నా దగ్గరికి రా అన్న.. ఆయన మాటిమాటికి మీదగ్గరే వస్తున్నడు.
ఎమ్మెల్యే: ఔనండి నేను పైసలు ఇయ్యాల కదా..
రియల్టర్: మరి ఇచ్చేయండి ఆయనకి.. మీరిచ్చేస్తే ఆయన నాకు తెచ్చి ఇస్తాడేమో.. నేను మిమ్మల్ని అడగట్లే.
ఎమ్మెల్యే: నువ్వు బోథ్‌లో ఎట్ల ఉంటావో నేను చూస్తా.
రియల్టర్: సరే సార్ నేను దందానే చేస్తలేను. మీ ఇష్టం. మీరు అట్ల అంటే దానికి ఏం చేయలేను నేను.
ఎమ్మెల్యే: బోథ్‌లో ఎట్ల లేఅవుట్ తీసినవో, ఎట్ల చేసినవో.. పోనియ్యు అని మేము అడుగుతలేం. బోథ్‌కు రా నువ్వు ఎట్ల రిజిస్ట్రేషన్ చేస్తావో చూస్తా నేను.
రియల్టర్: సరే దాందేముంది.. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి..
ఆ వాయిస్ నాది కాదు
ఎమ్మెల్యే బాపురావుతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఫోన్‌లో వాయిస్ నాది కాదు. మార్ఫింగ్ చేసినట్టున్నారు. ఆయనతో రాజకీయ విభేదాలున్నవారు ఇలా చేసి ఉండొచ్చు. దాంతో నాకు సంబంధం లేదు.
– రియల్టర్ కిరణ్‌కుమార్
బెదిరించలేదు
ఇది నేను రియల్టర్‌తో ఏడాది కిందట మాట్లాడింది. నేను ఆయనను బెదిరించలేదు. బ్లాక్‌మెయిల్ చేయలేదు. నేనే రూ.28 లక్షలు బాకీ ఉన్నట్టు చెబుతున్నాను. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు.
– రాథోడ్ బాపురావు, బోథ్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment