శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: అప్పు వసూలు కోసం ఓ రియల్టర్‌ను నిర్బంధించిన సంఘటన మండల పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు బుధవారం నలుగురు నిందితులను రిమాండుకు పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దషాపూర్‌కు చెందిన జి. మల్లేష్‌యాదవ్, హైదరాబాద్ కుషాయిగూడ మల్కాపూర్‌లో ఉండే రియల్టర్ బుచ్చిరెడ్డిలు పరిచయస్తులు. వీరికి డబ్బులు అవసరమయ్యాయి. పెద్దషాపూర్‌లో ఉన్న మల్లేష్ పొలం తాలూకు పత్రాలను తాకట్టు పెట్టి నగరంలోని కొత్తపేటలో ఉండే సుధాకర్ వద్ద ఏడాది క్రితం రూ. 30 లక్షలు అప్పుగా తెచ్చుకున్నారు.
మల్లేష్ రూ.16 లక్షలు, బుచ్చిరెడ్డి రూ.14 లక్షలు తీసుకున్నారు. ఈ డబ్బులకు నెలానెలా వడ్డీతో చెల్లించాల్సి ఉండగా కొన్ని నెలల నుంచి బుచ్చిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. మల్లేష్‌యాదవ్ మొత్తం డబ్బులను సుధాకర్‌కు చెల్లించి తన భూమి పత్రాలను తెచ్చుకున్నాడు. తనకు రావాల్సిన డబ్బుల కోసం బుచ్చిరెడ్డిని పలుమార్లు అడిగినా ఇవ్వకుండా రేపుమాపు అంటూ తప్పించుకుంటున్నాడు. ఈక్రమంలో డబ్బులను వసూలు చేయడానికి మల్లేష్‌యాదవ్ ఓ పథకం వేశాడు. ఇందుకోసం ఆయన శంషాబాద్ పోలీసుస్టేషన్‌లో పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ సహాయం తీసుకున్నాడు. శంషాబాద్ సీఐని మాట్లాడుతున్నాను.. పోలీస్ స్టేషన్‌కు రావాలి అంటూ హెడ్‌కానిస్టేబుల్ చేత మూడు రోజుల కిందట ఫోన్ చేయించాడు. దీంతో ఈనెల 21న బుచ్చిరెడ్డి తన కారులో డ్రైవర్ రమేష్‌తో కలిసి శంషాబాద్ బస్టాప్ వద్దకు వచ్చాడు. అక్కడ వారిని మల్లేష్‌యాదవ్‌తో పాటు సదరు హెడ్ కానిస్టేబుల్ కలుసుకున్నారు. సీఐ రావడానికి కొంత సమయం పడుతుందని హెడ్‌కానిస్టేబుల్ చెప్పారు. దీంతో పథకం ప్రకారం బుచ్చిరెడ్డిని డ్రైవర్‌తో పాటు మల్లేష్‌యాదవ్ పెద్దషాపూర్‌లో ఉన్న తన ఫాంహౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరిని ఓ గదిలో నిర్భందించారు. ఇందుకోసం మల్లేష్ తన కుమారుడు అశోక్‌యాదవ్, జూకల్‌కు చెందిన వాజిద్, నగరంలోని సంతోష్‌నగర్ నివాసి శోభన్‌బాబు(ఓ పత్రికలో యాడ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి) సహాయం తీసుకున్నాడు.
బయటకు తెలిసిందిలా..
డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ బుచ్చిరెడ్డికి మల్లేష్‌యాదవ్ తన సహచరులతో స్పష్టం చేసి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ నెల 22న బుచ్చిరెడ్డిచేత అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి డబ్బులు తీసుకురావాలని చెప్పించారు. దీంతో వారు అదే రోజు శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పెద్దషాపూర్‌లోని ఫాంహౌస్‌పై దాడి చేసి బుచ్చిరెడ్డి, డ్రైవర్ రమేష్‌ను విడిపించారు. ఈ కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు పంపారు. హెడ్ కానిస్టేబుల్ పాత్రపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డబ్బుల కోసం రియల్టర్ నిర్బంధం
Published Thu, Oct 24 2013 4:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement