ఎస్‌ఐ నాగమణి
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బాధితుడికే అనుమానాలు లేని కేసు ఇది. తనంటే పడనివారెవరో తనపై దాడిచేసుంటారన్నదే అతని అనుమానం. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తొలుత అందించిన సమాచారం కూడా ఇదే. అయితే సాధారణ ఘటనగా మొదలైన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఒక మహిళ ఎస్‌ఐ, మేజిస్ట్రేట్‌ల ప్రమేయం బయటపడటంతో సంచలనాలకు కేంద్రమైంది. నిందితుల వేటలో విశాఖ పోలీసులకు సరికొత్త సవాళ్లు విసిరింది. చట్టం ముందు ఎంతటివారైనా సమానమంటూ పోలీసులు చేసిన దర్యాప్తు వారి నిబద్ధతకు అద్దం పట్టింది.
చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
మూడో వ్యక్తి విచారణతో..
జూన్ 19న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌పై బీచ్‌రోడ్డు కోస్టల్ బ్యాటరీ సమీపంలో దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి రాజేష్ తలపై సుత్తితో కొట్టి పరారయ్యారు. అనంతరం రాజేష్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనంటే పడనివారు ఎవరో ఈ దాడి చేసుంటారని రాజేష్ పోలీసులకు తెలపడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభమైంది. మొదట్లో రోటీన్‌గా కేసు విచారణ ప్రారంభమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గనగల్ల రాజు, కూర్మాన రామస్వాములను జూలై 1న అదుపులోకి తీసుకుని విచారించగా తరుణ్ అనే మూడో వ్యక్తి ప్రమేయం బయటపడింది. అతన్ని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటపట్డాయి.
హత్యకు రెండు బృందాలు?
బాధ్యత గల వృత్తిలో ఉన్న భీమిలి మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె సోదరి భీమిలి క్రైం ఎస్‌ఐ నాగమణిలే ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మేజిస్ట్రేట్ జయలక్ష్మికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి కారణంగా నిలిచాయి. మేజిస్ట్రేట్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న అప్పలరెడ్డి.. రాజేష్‌ను హత్య చేయాల్సిందిగా తరుణ్‌కు సూచించాడు.
తరుణ్ ఆరిలోవ, జాలరిపేటకు చెందిన మరో ఇద్దరు యువకులను ఇందుకు పురమాయించగా.. వారు రాజేష్‌పై దాడి చేశారు. వారిని పట్టుకుని విచారించగా మేజిస్టేట్ ప్రమేయంతో పాటు రాజేష్‌ను హత్యచేసేందుకు మరో బృందాన్ని సిద్ధం చేసిన ఎస్‌ఐ నాగమణి, కానిస్టేబుల్ ప్రమోద్‌ల వ్యవహారం బయటపడింది. ఎస్‌ఐ సూచనతో ప్రమోద్ ఓ రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురిని రాజేష్‌ను హత్య చేసేందుకు పురమాయించాడు. వారి వాట్సాప్ డేటా ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారాన్ని గుర్తించారు.
పోలీసులకు చుక్కలు చూపించారు?
పోలీసు చర్యలను ముందుగానే పసిగట్టిన ఎస్‌ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె డ్రైవర్ అప్పలరెడ్డి పరారయ్యారు. ఎస్‌ఐ నాగమణికి పోలీసుల క్రైం దర్యాప్తుపై ముందుగానే అవగాహన ఉండటంతో మూడు నెలలుగా పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రత్యేక బృందాలకు దొరకకుండా తప్పించుకుని తిరిగారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు ఎస్‌ఐ భర్తతో పాటు కొందరు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. వారు పోలీసులకు చిక్కకుండా కర్నాటక, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీలోని పలు నగరాల్లో సంచరించారు. ఒక్కో ప్రాంతంలో రెండు నుంచి నాలుగు రోజులు ఉంటూ నిత్యం సిమ్‌కార్డులు మార్చేసేవారు. వాట్సాప్ కాల్స్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉండేవారు.
అయినా వెనక్కి తగ్గని విశాఖ పోలీసు బృందాలు వారి ఆచూకీపై నిరంతరం నిఘా ఉంచడంతో ఎట్టకేలకు శనివారం విజయనగరంలో పట్టుబడ్డారు. చింతలవలసలో ఇంటికి వచ్చి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రైవర్‌ను హైవేపై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ నాగమణితో పాటు డ్రైవర్ అప్పలరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ, కేసు దర్యాప్తు అధికారి ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు. మేజిస్ట్రేట్‌ను అరెస్ట్ చేసేందుకు శాఖపరమైన మరికొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అవి పూర్తయిన వెంటనే అరెస్ట్ చేయడం చేస్తామన్నారు.
ఈ ఘటనలో తొలుత ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఆయన తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్‌తో పాటు రౌడీషీటర్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం ఎస్‌ఐతో పాటు మేజిస్ట్రేట్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఒక్కోక్క అంశం బయటపడిన విధానంపై ఆయన స్పందిస్తూ చట్టం ఎదుట ఎంతటివారైనా సమానమే అన్నారు. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి చట్ట వ్యతిరేకంగా నేరపూరిత విధానాలకు పాల్పడిన ఎస్‌ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి ఇందుకు అతీతులు కారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment