రాజధానిలో రియల్టర్ హత్య | realtor murder in capital | Sakshi
Sakshi News home page

రాజధానిలో రియల్టర్ హత్య

Published Mon, Jul 7 2014 3:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

రాజధానిలో రియల్టర్ హత్య - Sakshi

రాజధానిలో రియల్టర్ హత్య

- వారం క్రితం అదృశ్యం... కాలిన స్థితిలో శవం లభ్యం
- సీఐ, గణేష్‌రెడ్డిలే నిందితులు: భార్య
- హతుడి డైరీలో అన్నీ మిస్టరీలే...
- మృతుడు చింతపల్లివాసి

సాక్షి, సిటీబ్యూరో/ ఆటోనగర్: వారం క్రితం అదృశ్యమైన రియల్టర్ అలుగుపల్లి వెంకట్‌రెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో ఉన్న అతడి మృ తదేహాన్ని ఆదివారం రాగన్నగూడలోని సామ రెసిడెన్సీ వెంచర్‌లో పోలీసులు కనుగొన్నారు. ప్లాట్ విషయంలో తన భర్తను గణేష్‌రెడ్డి, చారి లు ఎక్కడో హత్య చేసి.. శవాన్ని ఇక్కడకు తెచ్చి కాల్చారని, వీరికి ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూ ర్తి సహకరించాడని హతుడి భార్య ఆరోపించిం ది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..  
 
జిల్లాలోని చింతపల్లికి చెందిన అలుగుపల్లి వెంకట్‌డ్డి (44) మంజుల దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. వెంకట్‌రెడ్డి 2002 నుంచి కాంగ్రెస్ నేత సామ గణేష్‌రెడ్డితో కలిసి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ టీచర్స్‌కాలనీలో ఉంటున్నాడు. రాగన్నగూడ సమీపంలో సామరెసిడెన్సీ పేరుతో వెంచర్ చేశారు. ఈ వెంచర్‌లోని ప్లాట్ నెంబర్ 120లో ఉన్న  387 గజాల స్థలాన్ని గణేష్‌రెడ్డి బంధువు మైపాల్‌రెడ్డి..విజయలక్ష్మి అనే మహిళకు విక్రయించారు.

2011లో ఇదే ప్లాట్‌ను విజయలక్ష్మి నుంచి హబ్సిగూడకు చెందిన చారి కొనుగోలు చేశా డు. ఇదే ప్లాట్‌ను గణేష్‌రెడ్డి, అతడి బంధువు మైపాల్‌రెడ్డిలు.. వెంటక్‌రెడ్డి బంధువు పుష్పలతకు 2003లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వెంకట్‌రెడ్డికి మాత్రం డబుల్ రిజిస్ట్రేషన్ విషయం తెలియదు. ఇదిలాఉండగా జనవరిలో చారి ఇంటి నిర్మాణ  పనులు ప్రారంభించగా వెంకట్‌రెడ్డి అడ్డుకున్నాడు. ఈ ప్లాట్ తన బంధువుదని చెప్పడంతో చారి తన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాడు. తన బంధువును మోసం చేసిన గణేష్‌రెడ్డిని డబ్బులు తిరిగి ఇవ్వమని పలుమార్లు వెంకట్‌రెడ్డి నిలదీశాడు.

ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు.  ఈ క్రమంలోనే ఈనెల ఒకటి నుంచి వెంకట్‌రెడ్డి కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీ సులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మరుసటి రోజు అతడి కారు 120 ప్లాట్ సమీపంలోనే కనిపించింది. కారులో లభించిన డైరీలో నాలుగు పేజీలు రాసిన నోట్ లభ్యమైంది. కారు చుట్టుపక్కల ఎంత గాలించినా అతని ఆచూకీ మాత్రం లభించలేదు.
 
అప్పడు లేని శవం ఇప్పుడెలా వచ్చింది..?
ఈనెల 2న కారు లభించిన 200 మీటర్ల దూరంలోనే ఆదివారం కాలిన స్థితిలో ఉన్న వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని గొర్రెకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆరు రోజుల క్రితం కారు లభించిన చుట్టుపక్కల ప్రాంతాలలో క్షుణ్ణంగా పోలీసులు గాలించినా శవం మాత్రం ఆ రోజు కనిపించలేదు.

అప్పుడు కనిపించని శవం ఆదివారం ఎలా వచ్చిందనేది మిస్టరీ. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వెంకట్‌రెడ్డిని కిడ్నాప్ చే సి ఎక్కడో హత్య చేసి...శవాన్ని ఇక్కడ పడేసి పూర్తిగా కాల్చివేసినట్లుగా కనిపిస్తోంది.  కూర్చున్న చోటే అలాగే మృతి చెందిన్నట్లు ఉంది. హతుడి ఎడమ కాలులో ఉన్న ఇనుపరాడ్ బయటపడటంతో దాని ఆధారంగానే వెంకట్‌రెడ్డిగా గుర్తించారు.

ఏసీపీలు సురేందర్‌రెడ్డి, ఆనంద్‌భాస్కర్, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మహ్మద్‌గౌస్‌లు ఘటనా స్థలానికి వెళ్లి.. క్లూస్‌టీంతో ఆధారాల కోసం పరిశీలించారు.  ఈ ఘటనపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, హతుడి భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement