
భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదం దాదాపు తుపాకీ కాల్పులవరకూ వెళ్లింది. ఈ ఘటన నగరంలోని హిమయత్ నగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తికి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కు మధ్య భూ వివాదాలు తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇద్దరూ గొడవకు దిగారు.
ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన రియల్టర్.. ఏకంగా తన వద్ద ఉన్న గన్ తో గొడవకు దిగిన అవతలి వ్యక్తిని కాల్చేందుకు యత్నించాడు. అయితే ఈ గొడవ గమనిస్తున్న స్థానికులు వెంటనే వారిద్దరిని వారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.