రెండు మాసాలుగా సిటీలోనే మకాం.. | Police arrests Realtor, Narla Vamsi Krishna in Vijayawada | Sakshi
Sakshi News home page

రెండు మాసాలుగా సిటీలోనే మకాం..

Published Thu, Nov 21 2013 2:19 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

Police arrests Realtor, Narla Vamsi Krishna in Vijayawada

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ‘నగరంలో రకరకాలుగా చీటింగ్ చేసి చివరకు బాధితులు ఏం చేస్తారో అనే భయంతో,  గత్యంతరం లేక పరారయ్యాను. కాలువలో దూకి ఆత్మహ్యత్య చేసుకుందామని అమ్మకు చెప్పా.. ఆమె వద్దని సలహా ఇచ్చింది. దాంతో కారును కాలువలో తోసేసి ఆదృశ్యమయ్యాను. రెండు మాసాలుగా నగరంలోనే ఉంటున్నాను.’ అని కోట్లాది రూపాయలు చీటింగ్ చేసి పరారైన రియల్టర్ నార్ల వంశీ కృష్ణ బుధవారం పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు తెలిసింది. మోస్ట్‌వాంటెడ్ చీటర్‌గా పోలీసు రికార్డులలో నమోదైన వంశీకృష్ణ ఇంకా తనదైన శైలిలో కట్టుకథలు చెపుతూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా మాయమాటలతో ప్రజలనుంచి వంద కోట్లు వసూలు చేసిన వంశీకృష్ణ ఇప్పుడు చేతిలో చిల్లుగవ్వలేదంటూ చెప్పడంతో పోలీసులే అవాక్కవుతున్నారు.
 
 వీనస్ డవలపర్స్ పేరుతో నగరంలో బిల్డర్‌గా వ్యాపారం చేసి పేదల నుంచి, పోలీస్ అధికారులు, పారిశ్రామికవేత్తల వరకు అనేక మందికి లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన వంశీకృష్ణ పోలీసు ఇంటరాగేషన్‌లో తాను అమయాకుడినని, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2011 జనవరి 4న తాను తన తల్లితో కలిసి గుంటూరు జిల్లాకు వెడుతూ దుగ్గిరాల వద్ద జరిగిన సంఘటనపై మరో కట్టు కథ చెప్పినట్లు తెలిసింది. అప్పులవాళ్లకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, తన తల్లి వద్దని వారించిందని చె ప్పాడు.
 
 తాను కనపడితే మోసపోయిన జనం చంపేస్తారనే భయంతో చనిపోయినట్లు నమ్మించేవిధంగా కారును కాలువలో తోసి పరారయ్యామని వివరించాడు. ఇక్కడి నుంచి పరారయ్యాక చేతిలో డబ్బులేక తాను అనేకచోట్ల తన తల్లితో కలిసి తిరిగానని చెప్పాడు. చివరకు గత్యంతరం లేక వైజాగ్ చేరుకని అక్కడే ఏడాదిన్నర కాలంగా చిరుద్యోగం చేసుకుంటూ జీవనం సాగించానని చెప్పాడు. తప్పని పరిస్థితితో తిరిగి రెండు నెలల క్రితం విజయవాడ చేరుకుని ఇక్కడ కాలం వెళ్లబుచ్చుతున్నట్లు పోలీసులకు కహానీ వినిపించాడు.
 
 పక్కా పథకంతో లొంగుబాటు..
 చీటర్ వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోవడంలో కూడా పక్కా వ్యూహంతో వ్యవహరించాడని ప్రజలు భావిస్తున్నారు. తనపై ఏ కేసులు లేని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తనకు సన్నిహత సంబంధాలున్న ఇంటి సమీపంలో దొరకడం చర్చనీమాంశమైంది. రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూంకు పథకం ప్రకారం ఫోన్ చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన కాల్‌తో ఆ ఏరియాలో బీట్ తిరుగుతున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఆ ప్రదే శానికి వెళ్లి అతన్ని సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం అతన్ని జేబులు పరిశీలించారు. 
 
 రెండు మనీపర్సులు ఉన్నాయి. రూ.50 నోటు, కట్టుబట్టలు మాత్ర మే అతని వద్ద ఉన్నాయి. చేతికి వెండి కడియం ఉంది. ఇదంతా చూస్తుంటే నిందితుడు పక్కా ప్రణాళికతో లొంగిపోయినట్లు భావిస్తున్నారు. బినామీ పేర్లతో ఆస్తులు బదలాయించినట్లు తెలుస్తోంది. అదృశ్యం కావడానికి ముందే వంశీ తన ఆస్తులను పక్కావ్యూహంతో తన బంధుమిత్రులు, సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. పోలీసు అధికారులు వంశీకృష్ణ అరె స్టుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రైం డీసీపీ గీతాదేవి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న కేసులపై సంబంధిత పోలీసు అధికారులు పాత ఫైళ్లను బూజు దులిపి పరిశీలిస్తున్నారు.
 
 నమ్మించి మోసం చేశాడని బాధితుల గగ్గోలు
 అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఒక ఫ్లాట్ తీసుకుంటే ఇల్లు కూడబెట్టుకున్నట్లు వుంటుందని భావించి డబ్బులు ఇస్తే నమ్మించి మోసం చేసాడంటూ రియల్డర్ వంశీకృష్ణ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసం నగరంలో ఇంతవరకూ చూడలేదని, ఒకే ఫ్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి అమ్మడంతో పాటు, మరొకరి స్థలాన్ని బ్యాంక్‌లో పెట్టి రుణం పొందాడని వారు అంటున్నారు. 
 
 వంశీకృష్ణ మోసాలకు సబ్‌రిజిస్ట్రార్‌లో పాటు, బ్యాంకు అధికారుల పాత్ర వుందని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన నార్ల వంశీకృష్ణను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిన బాధితులు బుధవారం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. 
 తాడేపల్లి జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో వున్న వైశ్రాయ్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో భాగుంటుందని, నాల్గవ ఫ్లోర్‌లో ఎఫ్‌ఎప్3సీకి 2010లో రూ. 33 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని రెండు విడతలుగా రూ 20 లక్షలు చెల్లించినట్లు కుంచనపల్లికి చెందిన కొండా కృష్ణారెడ్డి తెలిపారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయమని కోరగా పని పూర్తయిన తర్వాత ఒకేసారి చేస్తానని గడపుకొంటూ వచ్చాడన్నారు.
 
 కారుబోల్తా కొట్టి అదృశ్యమైన తర్వాత మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. తాను 20 లక్షలు చెల్లించిన ఫ్లాట్‌ను 2009 డిసెంబరులోనే బుద్ధా రవిశంకర్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలియడంతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 2007 సంవత్సరంలో తన 900 గజాల స్థలంలో అపార్ట్‌మెంట్ కడతానని, 50:50 పద్ధతిలో నిర్మాణం చేపడతానని వంశీకృష్ణతో పాటు పోలీసు శాఖలో పనిచేసే సురేష్ తనవద్దకు వచ్చినట్లు వైశ్రాయ్ టవర్స్ స్థల యజమాని జీఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 13 ఫ్లాట్‌లలో చెరి ఆరు, మరొకటి ఇద్దరికీ వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తన ఆరు ఫ్లాట్లు సరిగా నిర్మాణం చేపట్టకపోగా.. ఏడో ఫ్లాట్‌ను కూడా ఇద్దరు, ముగ్గురికి విక్రయించనట్లు ఆయన పేర్కొన్నారు. తన స్థలం విలువ రూ.3 కోట్లు ఉందని, ఇప్పుడు కోటి రూపాయలు కూడా వచ్చేట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement