- విజయవాడ చుట్టుపక్కల రియల్టర్ల హల్‌చల్
- చుక్కల్లో భూముల ధరలు
- జోరుగా జీరో బిజినెస్
- కోట్లు ఆర్జిస్తున్న వ్యాపారులు
విజయవాడ : రియల్టర్లకు రాజయోగం పట్టింది. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో పరిసర గ్రామాల్లో మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేస్తున్నారు. కొత్త రాజధాని పేరుతో గాలిలో మేడలు కడుతూ భూముల విలువను ఆకాశానికి పెంచేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ తదితర ఏరియాల్లో ఇప్పటికే వెంచర్లు ఉన్న రియల్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆయా ప్రాంతాలు భవిష్యత్తులో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీల మాదిరిగా అభివృద్ధి చెందుతాయని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొత్తగా వెంచర్లు వేసేందుకు రియల్టర్లు గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో పొలాల కోసం చక్కర్లు కొడుతున్నారు. వారి హడావుడి కారణంగా తమ పొలాలను ఎంతకు విక్రయించాలో కూడా తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం మాగాణి భూముల కన్నా మెట్ట పొలాలకే డిమాండ్ పెరిగింది.
మూడు నెలల ముందుగానే లావాదేవీలు..
విజయవాడనే రాజధాని చేస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు మొదటి నుంచి చెబుతుండటంతో మూడు నెలలుగా రియల్టర్లు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఆగిరిపల్లి ప్రాంతాలపై దృష్టిసారించారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు ముందే మధ్యవర్తుల సాయంతో చేతులు మార్చి(జీరో బిజినెస్) కోట్లాది రూపాయలను ఆర్జించారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీని చెల్లించకుండా తప్పించుకున్నారు.
మూడు నెలల్లో అధికారిక లావాదేవీలు ఇవీ..
గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జూన్‌లో 1,492 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రభుత్వానికి రూ.4.18 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద లభించింది. జూలైలో 1,723 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.4.96 కోట్లు, ఆగస్టులో 1,096 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.62 కోట్ల ఆదాయం వచ్చింది.
నూజివీడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 834 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.1.59 కోట్ల ఆదాయం లభించింది. జూలైలో 1,170 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.47 కోట్లు, ఆగస్టులో 513 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.1.88 కోట్ల ఆదాయం వచ్చింది. హనుమాన్‌జంక్షన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 320 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోటి రూపాయలు ఆదాయం లభించింది. జూలైలో 420 రిజిస్ట్రేషన్లకు గానూ, కోటి రూపాయలు, ఆగస్టులో 270 రిజిస్ట్రేషన్లకు రూ.92 లక్షలు స్టాంప్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈ మూడు ప్రాంతాల్లో అధికారిక లావాదేవీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా అనధికారికంగా లవాదేవీలు జరిగినట్లు సమాచారం.
ఆస్తుల విలువలకు రెక్కలు
ఇప్పటికే జిల్లాలో రూ.12వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు నాలుగు వేల ఎకరాలు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ భూములు, ప్లాట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గన్నవరంలో కొద్దికాలం క్రితం ఎకరం రూ.20 లక్షలు ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెబుతున్నారు.
గన్నవరం సమీపం గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు ఎకరా రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. నూజివీడు ప్రాంతంలో కూడా భూముల ధరలు అంతులేకుండా పెరిగాయి. గతంలో నూజివీడులో ఎకరం పొలం రూ. 20 లక్షలు ఉండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి వల్ల ఇప్పుడు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లకు చేరింది. గన్నవరం పట్టణంలో సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది.