Real estate prices
-
నగరవాసుల సొంతింటి కల నెరవేరుతుందట
న్యూఢిల్లీ: నగరవాసులకు సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ఓ కల. రియల్ ఎస్టేట్ ధరలు నానాటికి రియాలిటీకి దూరంగా పెరిగిపోతుండడంతో ఆ కల ఎప్పటికీ తీరునో తెలియక సతమతమయ్యేవారే ఎక్కువ. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వారి కలను నిజం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగానికే చెందిన నిపుణులే తెలియజేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల డబ్బు, నగదు చెలామణి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెల్సిందే. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సడన్‌గా ఈ చెలామణికి బ్రేక్ పడింది. పర్యవసానంగా కొనుగోళ్లు, అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అలాగే నగదు చెలామణి నిలిచిపోతుందీ, నల్లడబ్బు ఆగిపోతుంది కనుక రియల్టీ ధరలు పడిపోతున్నాయి. భూమి విలువ కూడా పడిపోతుంది కనుక తాము కూడా తగ్గించి అమ్మగలమని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెబుతున్నారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు పెరుగుతుండడంతో ఇళ్ల రుణాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇళ్ల రుణాల వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించిన బ్యాంకులు డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఆ వడ్డీలను మరింత తగ్గిస్తాయి. డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు కూడా ఇప్పటికే తగ్గాయి. దేశంలో నల్లడబ్బు చెలామణి ఎక్కువగా ఉండడంతో ప్రముఖ రియల్టర్ సంస్థలు ప్రధానంగా ధనవంతుల కోసం లగ్జరీ విల్లాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ సంస్థలు మధ్యతరగతి ప్రజల ఇళ్లపైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వస్తుంది. సకాలంలో కస్టమర్లకు బ్యాంక్ రుణాలు కూడా లభిస్తాయి కనక ఇదే వారికి లాభదాయక వ్యాపారం అవుతుంది. ఇంతకుముందుకన్నా గత రెండేళ్లుగా దేశంలో ఇళ్ల నిర్మాణ యూనిట్లు తగ్గుతూ వస్తుండడంతో కొన్ని రియల్టీ సంస్థలు ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తి మేరకే ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇకముందు ఈ సెక్టార్లో కూడా రియల్టీ సంస్థల మధ్య పోటీ ఉంటుంది కనుక ఇళ్ల రేట్లుకూడా తగ్గుతాయి. ప్రజలతో మోర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టంలో మార్పులు తీసుకరావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం కూడా ప్రజలకు కలిసొచ్చే అంశమే. ఇళ్ల రేట్లు ఎలా తగ్గుతాయంటే.... 1. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల నోట్లు మృగ్యమై భూముల రేట్లు పడిపోతాయి. పర్యవసానంగా ఇళ్ల అమ్మకం రేట్లు పడిపోతాయి. 2. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగినందున బ్యాంకుల ద్వారా ఇళ్ల రుణాలు సులభంగా లభిస్తాయి. 3. ఇప్పటికే తగ్గించిన ఇళ్ల రుణాల రేట్లను బ్యాంకులు మరింత తగ్గిస్తాయి. 4. లగ్జరీ విల్లాలకు డిమాండ్ పడిపోయి మధ్య తరగతి ఇళ్లకు రియల్టర్లు మర్లుతారు కనుక వారి మధ్య పోటీ పెరుగుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించక తప్పదు. 5. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాంలో సవరణల ప్రభావం. తదితర కారణాల వల్ల ఇళ్ల రేట్లు పడిపోతాయని, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయని గెరా డెవలప్మెంట్స్, అసెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గెరా, జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీఈవో అశ్విందర్ రాజ్ సింగ్, రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కుర్షద్ గాంధీ చెబుతున్నారు. ముఖ్యంగా ‘రెడీ టూ గో’ ఇళ్లకు డిమాండ్ కూడా ఉంటుందని గాంధీ అంచనావేస్తున్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన ఆరేడు నమ్మకమైన ప్రముఖ రియల్టీ సంస్థలపై మోదీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చని, అవి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లావాదేవీలు నిర్వహించడమే ఇందుకు కారణమని ఆ సంస్థలకు చెందిన కొందరు నిపుణులు చెబుతున్నారు. -
భువనగిరిలో విజన్ కౌంటీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. అప్పుడే అది అఫడబుల్ హౌజింగ్ అవుతుందంటున్నారు విజన్ ఇండియా డెరైక్టర్ లింగమయ్య. అందుకే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, బెంగళూరు హైవేల్లో అందుబాటు ధరల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామన్నారు. పూర్తి వివరాలివిగో.. హైదరాబాద్ దక్షిణ దిశ ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు అందుబాటులో లేక నివాస, వాణిజ్య సముదాయాలు తూర్పు దిశకు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతుండటం, ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు తోడు పోచారంలో ఐటీఐఆర్ ప్రాజెక్టూ రానుండటం వంటి కారణాలతో ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 200- 500 చ.గ. ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది. బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాం. 150 - 650 చ.గ. మధ్య మొత్తం 208 ఓపెన్ ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. ఫేజ్-1లో 25 ఎకరాల్లో మొత్తం 300 ఓపెన్ ప్లాట్లొస్తాయి. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విజన్ ప్యారడైజ్ ప్రాజెక్ట్‌కు ఆనుకొనే వందల ఎకరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్, పీ అండ్ డబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. దీంతో సమీప భవిష్యత్తులో కొత్తూర్ ప్రాంతంలో వేల కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోనున్నాయి. అందుకే ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 3 నెలల్లోనే 50 శాతం విక్రయాలైపోయాయంటే ఇక్కడి గిరాకీ, భవిష్యత్తు అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. -
గాలిలో మేడలు
విజయవాడ చుట్టుపక్కల రియల్టర్ల హల్చల్ చుక్కల్లో భూముల ధరలు జోరుగా జీరో బిజినెస్ కోట్లు ఆర్జిస్తున్న వ్యాపారులు విజయవాడ : రియల్టర్లకు రాజయోగం పట్టింది. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో పరిసర గ్రామాల్లో మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేస్తున్నారు. కొత్త రాజధాని పేరుతో గాలిలో మేడలు కడుతూ భూముల విలువను ఆకాశానికి పెంచేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ తదితర ఏరియాల్లో ఇప్పటికే వెంచర్లు ఉన్న రియల్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలు భవిష్యత్తులో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీల మాదిరిగా అభివృద్ధి చెందుతాయని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొత్తగా వెంచర్లు వేసేందుకు రియల్టర్లు గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో పొలాల కోసం చక్కర్లు కొడుతున్నారు. వారి హడావుడి కారణంగా తమ పొలాలను ఎంతకు విక్రయించాలో కూడా తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం మాగాణి భూముల కన్నా మెట్ట పొలాలకే డిమాండ్ పెరిగింది. మూడు నెలల ముందుగానే లావాదేవీలు.. విజయవాడనే రాజధాని చేస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు మొదటి నుంచి చెబుతుండటంతో మూడు నెలలుగా రియల్టర్లు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఆగిరిపల్లి ప్రాంతాలపై దృష్టిసారించారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు ముందే మధ్యవర్తుల సాయంతో చేతులు మార్చి(జీరో బిజినెస్) కోట్లాది రూపాయలను ఆర్జించారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో స్టాంప్ డ్యూటీని చెల్లించకుండా తప్పించుకున్నారు. మూడు నెలల్లో అధికారిక లావాదేవీలు ఇవీ.. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జూన్‌లో 1,492 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రభుత్వానికి రూ.4.18 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద లభించింది. జూలైలో 1,723 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.4.96 కోట్లు, ఆగస్టులో 1,096 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.62 కోట్ల ఆదాయం వచ్చింది. నూజివీడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 834 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.1.59 కోట్ల ఆదాయం లభించింది. జూలైలో 1,170 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.2.47 కోట్లు, ఆగస్టులో 513 రిజిస్ట్రేషన్లకు గానూ, రూ.1.88 కోట్ల ఆదాయం వచ్చింది. హనుమాన్‌జంక్షన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్‌లో 320 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోటి రూపాయలు ఆదాయం లభించింది. జూలైలో 420 రిజిస్ట్రేషన్లకు గానూ, కోటి రూపాయలు, ఆగస్టులో 270 రిజిస్ట్రేషన్లకు రూ.92 లక్షలు స్టాంప్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈ మూడు ప్రాంతాల్లో అధికారిక లావాదేవీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా అనధికారికంగా లవాదేవీలు జరిగినట్లు సమాచారం. ఆస్తుల విలువలకు రెక్కలు ఇప్పటికే జిల్లాలో రూ.12వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు నాలుగు వేల ఎకరాలు గన్నవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ భూములు, ప్లాట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గన్నవరంలో కొద్దికాలం క్రితం ఎకరం రూ.20 లక్షలు ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెబుతున్నారు. గన్నవరం సమీపం గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు ఎకరా రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. నూజివీడు ప్రాంతంలో కూడా భూముల ధరలు అంతులేకుండా పెరిగాయి. గతంలో నూజివీడులో ఎకరం పొలం రూ. 20 లక్షలు ఉండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి వల్ల ఇప్పుడు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లకు చేరింది. గన్నవరం పట్టణంలో సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. -
స్థిరాస్తి కొనుగోళ్లలో.. ముంబై ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. అలా చూస్తే ఇక్కడే కొనుగోళ్లు ఎక్కువగా ఉండాలి మరి. కానీ, ఇండియా ప్రాపర్టీ. కామ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో భిన్నమైన గణాంకాలొచ్చాయి. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ 25-35 ఏళ్లు, అలాగే 46 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న 2,583 మందిపై సర్వే చేసింది. 18 శాతం మంది షేర్ మార్కెట్లలో, 15 శాతం మంది బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతుండగా.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు 67 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. కొనుగోళ్ల ఎక్కడనే అంశంపై.. 30 శాతం మంది ముంబై శ్రేయస్కరమని భావించి.. మొదటి స్థానంలో నిలపారు. ఆ తర్వాత బెంగళూరు 21 శాతం, ఢిల్లీ 15 శాతం, చెన్నై 12 శాతం, పుణే 9 శాతం, కోల్క తా 7 శాతంతో వరుస స్థానాల్లో నిలివగా.. కేవలం 6 శాతం మంది మాత్రమే హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. పెట్టుబడులకు సరైన సమయమేది అనే అంశంపై.. 49 శాతం మంది వేచి చూసే ధోరణిలో ఉండగా.. 35 శాతం మంది ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. 16 శాతం మంది సందిగ్ధంలో ఉన్నారని సర్వే వెల్లడించింది. ధరల పెరుగుదల అంశంపై.. రెండేళ్లలో 62 శాతం మంది ధరలు పెరుగుతాయని భావిస్తే.. 38 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై ఆశతో ఉన్నారు. మెరుగైన మౌలిక వసతులను కల్పించటంతో పాటు, గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తుంద న్నారు. ఎందులో పెట్టుబడి శ్రే యస్కరమనే అంశంపై.. 40 శాతం మంది ఫ్లాట్లలో పెట్టుబడికి మొగ్గుచూపితే.. 24 శాతం మంది ఇండివిడ్యువల్ బంగ్లాల్లో, 23 శాతం మంది స్థలాలపై, కేవలం 7 శాతం మాత్రమే వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడులకు ఇష్టపడుతున్నట్లు సర్వే వెల్లడించింది.