నగరవాసుల సొంతింటి కల నెరవేరుతుందట
న్యూఢిల్లీ: నగరవాసులకు సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ఓ కల. రియల్ ఎస్టేట్ ధరలు నానాటికి రియాలిటీకి దూరంగా పెరిగిపోతుండడంతో ఆ కల ఎప్పటికీ తీరునో తెలియక సతమతమయ్యేవారే ఎక్కువ. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వారి కలను నిజం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగానికే చెందిన నిపుణులే తెలియజేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల డబ్బు, నగదు చెలామణి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెల్సిందే. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సడన్‌గా ఈ చెలామణికి బ్రేక్ పడింది. పర్యవసానంగా కొనుగోళ్లు, అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అలాగే నగదు చెలామణి నిలిచిపోతుందీ, నల్లడబ్బు ఆగిపోతుంది కనుక రియల్టీ ధరలు పడిపోతున్నాయి. భూమి విలువ కూడా పడిపోతుంది కనుక తాము కూడా తగ్గించి అమ్మగలమని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెబుతున్నారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు పెరుగుతుండడంతో ఇళ్ల రుణాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇళ్ల రుణాల వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించిన బ్యాంకులు డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఆ వడ్డీలను మరింత తగ్గిస్తాయి. డిపాజిట్లు పెరిగిన నేపథ్యంలో ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు కూడా ఇప్పటికే తగ్గాయి.
దేశంలో నల్లడబ్బు చెలామణి ఎక్కువగా ఉండడంతో ప్రముఖ రియల్టర్ సంస్థలు ప్రధానంగా ధనవంతుల కోసం లగ్జరీ విల్లాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ సంస్థలు మధ్యతరగతి ప్రజల ఇళ్లపైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వస్తుంది. సకాలంలో కస్టమర్లకు బ్యాంక్ రుణాలు కూడా లభిస్తాయి కనక ఇదే వారికి లాభదాయక వ్యాపారం అవుతుంది. ఇంతకుముందుకన్నా గత రెండేళ్లుగా దేశంలో ఇళ్ల నిర్మాణ యూనిట్లు తగ్గుతూ వస్తుండడంతో కొన్ని రియల్టీ సంస్థలు ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తి మేరకే ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇకముందు ఈ సెక్టార్‌లో కూడా రియల్టీ సంస్థల మధ్య పోటీ ఉంటుంది కనుక ఇళ్ల రేట్లుకూడా తగ్గుతాయి. ప్రజలతో మోర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టంలో మార్పులు తీసుకరావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం కూడా ప్రజలకు కలిసొచ్చే అంశమే.
ఇళ్ల రేట్లు ఎలా తగ్గుతాయంటే....
1. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల నోట్లు మృగ్యమై భూముల రేట్లు పడిపోతాయి. పర్యవసానంగా ఇళ్ల అమ్మకం రేట్లు పడిపోతాయి.
2. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగినందున బ్యాంకుల ద్వారా ఇళ్ల రుణాలు సులభంగా లభిస్తాయి.
3. ఇప్పటికే తగ్గించిన ఇళ్ల రుణాల రేట్లను బ్యాంకులు మరింత తగ్గిస్తాయి.
4. లగ్జరీ విల్లాలకు డిమాండ్ పడిపోయి మధ్య తరగతి ఇళ్లకు రియల్టర్లు మర్లుతారు కనుక వారి మధ్య పోటీ పెరుగుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించక తప్పదు.
5. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాంలో సవరణల ప్రభావం. తదితర కారణాల వల్ల ఇళ్ల రేట్లు పడిపోతాయని, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయని గెరా డెవలప్‌మెంట్స్, అసెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గెరా, జేఎల్‌ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీఈవో అశ్విందర్ రాజ్ సింగ్, రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కుర్షద్ గాంధీ చెబుతున్నారు. ముఖ్యంగా ‘రెడీ టూ గో’ ఇళ్లకు డిమాండ్ కూడా ఉంటుందని గాంధీ అంచనావేస్తున్నారు.
దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన ఆరేడు నమ్మకమైన ప్రముఖ రియల్టీ సంస్థలపై మోదీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చని, అవి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లావాదేవీలు నిర్వహించడమే ఇందుకు కారణమని ఆ సంస్థలకు చెందిన కొందరు నిపుణులు చెబుతున్నారు.