సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని... ఈ నిర్ణయం వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటిౖకైనా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కృష్ణమోహన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్‌లతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే అంగీకరించిందన్నారు. బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి అనేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయమే ఉదాహరణని ఎద్దేవా చేశారు.
ప్రధానిపై నమ్మకంతో అప్పట్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని తాము సమర్థించామని, అయితే చెప్పిన లక్ష్యం ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఏ ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని... ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నగదు చెలామణి పెరిగింది..
పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ కాబట్టే దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చెలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. 2014కు ముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు ఉండేదని, అదిప్పుడు 13 శాతానికి పెరిగిందన్నారు.
అలాగే గతంతో పోలిస్తే పెద్ద నోట్ల వాడకం రెట్టింపయ్యిందని చెప్పారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి తెచ్చిన రూ. 2 వేల నోటు వల్ల పెద్ద నోట్ల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. కొత్త నోట్ల ముద్రణకు మోదీ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు ఖర్చు పెట్టిందని... ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పట్టుకున్న నల్లధనమే రూ. 40 వేల కోట్లు..
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని చెప్పిన ప్రధాని మాటలు అపహాస్యమయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. 592 కేసుల్లో రూ. 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారని చెప్పారు. బీజేపీ వేసే ప్రతి అడుగు పేదలపై పిడుగులా మారిందని, నీతి ఆయోగ్ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడం.. తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందని, కేంద్రం ప్రతిరోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లని ఆయన పేర్కొన్నారు.
మోదీ హయాంలో రూ. కోటీ ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలలో నిలబడి 108 మంది మరణించారని, నోట్ల రద్దు కారణంగా 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిందని, దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోందని పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని భరోసా ఇచ్చిన పెద్దలు... ఇప్పుడు 2 వేల రోజులైనా ఏం మార్పు తెచ్చారని హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం పెరిగాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment