ఓ సమాచార హక్కు కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద మొత్తంలో దేశీయ కరెన్సీ నోట్లు మాయమైపోయాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.23వేల కోట్లు ప్రింట్ అయ్యాయని, కానీ అవేమీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు చేరుకోలేదని వెల్లడైంది. దీనిపై ఆర్‌టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజాన వ్యాజ్యం నేడు(ఫిబ్రవరి 12)న బొంబై హైకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఆర్‌బీఐ, ఇతర ప్రింటింగ్ ఇన్‌స్టిట్యూషన్లు కరెన్సీ నోట్లపై ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయంపై మనోరంజన్ రాయ్ 2015లోనే ఓ పిల్ దాఖలు చేశారు.
అసలేమి జరిగింది....
- ప్రింటింగ్ ప్రెస్‌లు ముద్రించిన దేశీయ కరెన్సీ నోట్ల గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ వివరాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లు రూ.500 డినామినేషన్ గల 19,45,40,00,000 పీస్‌ల నోట్లను ఆర్‌బీఐకి పంపించినట్టు తెలిసింది. కానీ ఆర్‌బీఐ మాత్రం తాను కేవలం 18,98,46,84,000 పీసుల నోట్లనే పొందినట్టు పేర్కొంది. అంటే రూ.23,465 కోట్ల విలువైన 46,93,16,000 పీసులు మాయమైపోయాయి.
- ఆర్‌టీఐకి సమర్పించిన డేటాలో రూ.1000 డినామినేషన్ కలిగి 4,44,13,00,000 పీసుల నోట్లను ఆర్‌బీఐకి పంపినట్టు ప్రింటింగ్ ప్రెస్‌లు తెలిపాయి. కానీ ఆర్‌బీఐ సమర్పించిన డేటాలో 4,45,30,00,000 పీసులను తాను అందుకున్నట్టు పేర్కొంది. అంటే రూ.1,170 కోట్లు అత్యధికంగా ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఆర్‌బీఐ పొందింది. ఈ లెక్కలు సరియైనవిగా లేవు.
- మరో ఆర్‌టీఐ డేటాలో 2000-2011 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 డినామినేషన్ కలిగిన 13,35,60,00,000 పీసులను, రూ.1000 డినామినేషన్ కలిగిన 3,35,48,60,000 పీసులను ఆర్‌బీఐకి పంపినట్టు పేర్కొంది. కానీ ఈ నోట్లను అసలు ఆర్‌బీఐ పొందలేదని తెలిసింది.
- ఆర్‌బీఐ, ప్రింటింగ్ ఏజెన్సీలు విడుదల చేసిన ఈ తారుమారు లెక్కలపై ఆర్‌టీఐ కార్యకర్త రాయ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంటే కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌లోనూ, వాటి సరఫరాలోనూ తప్పులుతడకలు చోటుచేసుకున్నాయని ఈ గణాంకాల్లోనే వెల్లడైందని పేర్కొన్నారు.
- ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను బాధ్యులుగా చేస్తూ, దీనిపై రాయ్ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే 2016 జనవరి 27న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనిల్ సింగ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పీఎం, ఎఫ్‌ఎం, ఎంహెచ్‌ఏ పేర్లను తొలగించాలని పేర్కొన్నారు.
- 2016 ఆగస్ట్ 23న "సరైన పరిశీలన లేకుండా" జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ స్వప్నా ఎస్ జోషి ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.
- 2016 సెప్టెంబర్ 22న రాయ్ దీనిపై రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రివ్యూ పిటిషనే నేడు విచారణకు రానుంది. అయితే రాయ్ ముందు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన 75 రోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పెద్ద నోట్ల రద్దు అవినీతికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మోదీ ప్రకటించారు. కానీ అసలు విషయం పెద్ద మొత్తంలో దేశీయ కరెన్సీ నోట్లు మాయమైపోవడమని రాయ్ ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment