2016 Indian Banknote Demonetisation Date In India - Sakshi
Sakshi News home page

ఫ్లాష్‌బ్యాక్‌: ఆ నిర్ణయంతో..అతలాకుతలం 

Published Sat, May 20 2023 7:26 AM | Last Updated on Sat, May 20 2023 9:43 AM

2016 Indian Banknote Demonetisation Date In India - Sakshi

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: అది 2016. నవంబర్‌ 8. రాత్రి 8 గంటల సమయం. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న వేళ. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి టీవీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. జాతినుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్న వాళ్లందరికీ షాకిస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)

నల్లధనాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రూ.1,000, రూ.500 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ నోట్ల బెడద పోవడమే గాక నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలకు కూడా ఈ నిర్ణయంతో ఊపొస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా 2016 నవంబర్‌ 8 అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి! కానీ అనంతర పరిణామాలను, ముఖ్యంగా నోట్ల మార్పిడి ప్రక్రియను సజావుగా డీల్‌ చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దాంతో కొద్ది నెలల పాటు దేశమంతా అక్షరాలా అల్లకల్లోలమైపోయింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?)

పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంకు ముందు చూసినా కొండవీటి చాంతాటిని తలదన్నే లైన్లే. ఆ లైన్లలోనే కుప్పకూలిన ప్రాణాలు. నగదు మీదే ఆధారపడి నడిచే వ్యాపారాలు పడకేసి ఆర్థికంగా చితికిపోయిన సగటు బతుకులు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి కథలే! మనసుల్ని మెలిపెట్టే గాథలే. వ్యవసాయం మొదలుకుని ఆటోమొబైల్, నిర్మాణ తదితర కీలక రంగాలు నగదు కటకటతో కొన్నాళ్ల పాటు పూర్తిగా పడకేశాయి. మొత్తంగా దేశ ఆర్థిక రంగమే అతలాకుతలమైపోయింది.

ఇంతా చేస్తే నోట్ల రద్దు వల్ల నల్లధనం ఏ మాత్రమూ కట్టడి కాలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు నిరూపణ కావడం మరో విషాదం. అప్పట్లో ప్రవేశపెట్టిన రూ.2,000 కరెన్సీని ఆర్బీఐ తాజాగా రద్దు చేసిన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలను జనం మరోసారి భయంభయంగా గుర్తు చేసుకుంటున్నారు... 



నోట్ల రద్దు–కొన్ని వాస్తవాలు 

పలు అంచనాల ప్రకారం మన దేశ జీడీపీలో 20 నుంచి 25 శాతం దాకా నల్లధనమే. అంటే రూ.30 లక్షల కోట్ల పై చిలుకు!  

నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధాని చెప్పుకొచ్చారు. జనం కూడా అందుకు సిద్ధపడ్డారు.  

నోట్ల రద్దుతో తమకు కలిగిన నష్టాలను, వ్యయప్రయాలను పళ్ల బిగువున భరించారు. 

నోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఆవల ఉన్న రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం కింద మారుతుందని కేంద్రం ఆశించింది. 

కానీ వాస్తవంలో జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధమని గణాంకాలు తేల్చాయి.  

నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశం చలామణిలతో ఉన్న నగదులో ఏకంగా 86 శాతం (రూ.16.24 లక్షల కోట్లు) రూ.1,000, రూ.500 నోట్లే. ఇందులో రూ1,000 నోట్ల వాటా 38 శాతం కాగా రూ.500 నోట్లది 47 శాతం. అదంతా రాత్రికి రాత్రి పనికిరాకుండా పోయింది. 

ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చిందని అనంతరం రిజర్వు బ్యాంకే అధికారికంగా ప్రకటించింది. నల్లధనం కట్టడి లక్ష్యం ఇసుమంతైనా నెరవేరలేదని తద్వారా స్పష్టమైంది. 

నగదు కార్యకలాపాలను తగ్గించాలన్న ఉద్దేశమూ నెరవేరలేదు. 2016 నవంబర్‌లో దేశ ప్రజల దగ్గర రూ.17.7 కోట్ల విలువైన నగదుంటే 2022 అక్టోబర్‌ నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. 

నకిలీ నోట్ల చలామణి కూడా పెద్దగా తగ్గలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్లలో అత్యధికం వంద రూపాయల నోట్లే కావడం ఇందుకు కారణమని తేలింది. 

కాకపోతే నోట్ల రద్దు వల్ల ఇటు ప్రజలకు, అటు  ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. 

నగదు కార్యకలాపాల మీదే ఆధారపడే 48 కోట్ల మందికి పైగా భారతీయులను పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బ కొట్టింది. 

దేశ జీడీపీలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్ల పాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

ఆర్థికవేత్తల విస్మయం 

పలువురు ఆర్థికవేత్తలు కూడా నోట్ల రద్దు నిర్ణయంలో ఔచిత్యమేమిటో అంతుబట్టడం లేదంటూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ‘‘నల్లధనంలో మహా అయితే ఓ 5 శాతం మాత్రం నగదు రూపంలో ఉంటుందేమో. మిగతాదంతా భూములు, బంగారం వంటి ఆస్తుల రూపేణా మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మాయమైపోతుందని ఆర్బీఐ అనుకున్నారో!’’ అన్నారు.

2016 సెప్టెంబర్‌ దాకా ఆర్‌బీఐ గవర్నర్‌గా చేసిన రఘురాం రాజన్‌ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని కుండబద్దలు కొట్టారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమేనని గత జనవరిలో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కూడా, ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టంగా పేర్కొంది. 

చదవండి👉 ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement