2019లో బీజేపీకి మరింత మెజారిటీ
మరోసారి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది...
బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది.
పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.
విశేషాలు...
⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది.
⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు.
⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
జీఎస్‌టీ
2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.
17వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు
(మొత్తం సీట్లు 543)
పార్టీ స్థానాలు
బీజేపీ 303
కాంగ్రెస్ 52
డీఎంకే 24
వైఎస్సార్‌సీపీ 22
టీఎంసీ 22
శివసేన 18
జేడీ(యూ) 16
బిజూ జనతాదళ్ 12
బీఎస్పీ 10
టీఆర్‌ఎస్ 9
స్వతంత్రులు 51
ఇతరులు 4
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment