Digitization
-
రైతులకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటలైజేషన్ దిశగా.. వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు. యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్‌ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీవ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు వెబ్‌ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది 2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది కౌలు రైతులు: 16.50 లక్షల మంది సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది -
భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
ఫైనాన్స్ డిజిటలైజేషన్‌తో కొత్తతరం బ్యాంకింగ్
ముంబై: ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్, ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు. బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్‌టెక్‌లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్‌్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది. ఆర్బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్ రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
షరతులు నచ్చితేనే రుణం..
ఎన్నో అవసరాలకు రుణాలు తీసుకోవడం నేడు సర్వ సాధారణంగా మారింది. డిజిటైజేషన్ కారణంగా కోరుకున్నంత రుణం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది. అవసరంలో ఉన్న వారు రుణం వస్తే చాలన్నట్టు, మిగిలిన ముఖ్యమైన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో పడే భారాన్ని చూసి ఆందోళన చెందే పరిస్థితి. షరతులు, నియమ, నిబంధనలు, ఫీజుల గురించి తెలుసుకోకుండానే రుణ ఒప్పందంపై నిస్సంకోచంగా సంతకాలు చేయకూడదు. రుణానికి సంబంధించి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్/ముఖ్య విషయాల సమాహారం)ను తప్పకుండా చదవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో అంగీకారానికి రావాలి. కేఎఫ్‌ఎస్‌ను రుణ గ్రహీతలకు తప్పకుండా అందజేయాలంటూ ఆర్బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా రుణ గ్రహీతకు రుణంపై కళ్లు తెరిపించేదే కేఎఫ్ఎస్. కేఎఫ్ఎస్తో రుణ గ్రహీత నిర్ణయం సులభంగా మారుతుంది. ఒక బ్యాంక్ ఇస్తున్న రుణ ఆఫర్‌తో పోలిస్తే మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ రుణ ఆఫర్లో ఏది మెరుగైనదో తేల్చుకోవచ్చు. కేఎఫ్ఎస్ అందించకపోయినా, ఒకవేళ కేఎఫ్ఎస్లో వైరుధ్యాలు ఉన్నా వాటిని రుణదాత దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరించకపోతే, పరిష్కారం సహేతుకంగా లేకపోతే ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు. ఒకవేళ డిజిటల్ రుణం అయితే దానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ కాలంలో రుణ గ్రహీత తనకు మంజూరైన రుణాన్ని వెనక్కి తిప్పికొట్టొచ్చు. దీనికి ఎలాంటి పెనాలీ్టలు పడవని గార్గ్ వివరించారు. కేఎఫ్ఎస్ అంటే..? 2023 నవంబర్ 15న ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఎన్బీఎఫ్సీ బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన ‘ఈకామ్’, ‘ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్’ రుణ ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరింది. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)ను రుణ గ్రహీతలకు బజాజ్ ఫైనాన్స్ అందించకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. కేఎఫ్ఎస్ అన్నది ఒక డాక్యుమెంట్ (పత్రం). ఇందులో రుణానికి సంబంధించి కీలక సమాచారం అంతా ఉంటుంది. నిజానికి రుణ ఒప్పందంలో (లోన్ అగ్రిమెంట్) అన్ని వివరాలు ఉన్నప్పటికీ, అందులోని పదజాలం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. కీలక వివరాలన్నింటినీ సులభంగా అర్థమయ్యేలా కేఎఫ్ఎస్ చెబుతుంది. అందుకే దీన్ని కీలక సమాచార పత్రంగా చెబుతారు. రుణంపై వడ్డీ రేటు ఎంత, షరతులు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, నిర్ణీత కాలం కంటే ముందే సంబంధింత రుణాన్ని తీర్చివేస్తే విధించే చార్జీలు, రుణ వాయిదా చెల్లింపుల్లో ఆలస్యం అయితే పడే పెనాల్టీ చార్జీలు.. ఇలా రుణానికి సంబంధించి సమగ్ర వివరాలు అందులో వెల్లడించడం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బాధ్యత. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో తెలియజేయాలి. కేఎఫ్ఎస్ పారదర్శకతను తీసుకొస్తుంది. కీలక వివరాలన్నీ ఉండడంతో, రుణ గ్రహీత అన్నీ తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకే దీన్ని రుణదాతలు అందరికీ అందించాలంటూ ఆర్బీఐ ఆదేశాలు తీసుకొచ్చింది. ‘‘కేఎఫ్ఎస్ అంటే రుణానికి సంబంధించి అస్థిపంజరం వంటిది. రుణం తీసుకునే వ్యక్తి అన్ని కీళ్లను తెలుసుకోవాలి, వంపులు, కదలికలను తెలుసుకోవాలి’’అని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రాజీవ్ శర్మ వివరించారు. డిజిటల్ రుణాలకు సంబంధించి కేఎఫ్ఎస్ మరింత కీలకం. ఎందుకంటే రుణ ప్రక్రియలో ఒకటికి మించిన పారీ్టలు భాగస్వాములై ఉంటాయి. ఏమి చూడాలి..? రుణ కాల వ్యవధి, రుణానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం (ఈఎంఐ) గురించి కేఎఫ్ఎస్లో స్పష్టంగా ఉంటుంది. రుణానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ కోరుతోందా? అన్నది కేఎఫ్ఎస్లో పరిశీలించుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. ముఖ్యంగా రుణానికి సంబంధించి చెబుతున్న వడ్డీ రేటు వార్షికమేనా? అన్నది చూడాలి. రుణం చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు గురించి, అన్ని రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. రుణ గ్రహీత కోరితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కేఎఫ్ఎస్ కాపీ, రుణ డాక్యుమెంట్లను ఈమెయిల్‌కు పంపిస్తాయని పరిజిత్ గార్గ్ చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణం తీసుకుంటున్నట్టు అయితే, రుణ వివరాల పేజీ నుంచే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని శర్మ సూచించారు. నెట్‌బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదిల్ శెట్టి తెలిపారు. పారదర్శకత కోసం.. ‘‘చారిత్రకంగా చూస్తే రుణ వ్యయాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. వడ్డీ రేటునే ప్రముఖంగా ప్రకటనల్లో పేర్కొనడం కనిపించేది. తక్కువ వడ్డీ రేటుకు వస్తుందని రుణం తీసుకున్న తర్వాతే.. వివిధ రకాల ఫీజుల భారం తెలిసొచ్చేది. పారదర్శకత లేకపోవడం వల్ల వారు వివిధ రుణ ఉత్పత్తులను పోల్చుకుని, వాస్తవ రుణ వ్యయాల గురించి అర్థం చేసుకోలేకపోయేవారు’’అని మై మనీమంత్ర ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. అన్ని రకాల చార్జీల గురించి కేఎఫ్ఎస్లో పేర్కొనడం పారదర్శకత, వినియోగదారు అనుకూల రుణ వాతావరణానికి దారితీస్తుందన్నారు. ‘‘ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేటు, ఇతర ఫీజులు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు తదితరమైనవి ఉండేవి. కేఎఫ్‌ఎస్‌ను అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలకు విస్తరించాం. రుణాల పంపిణీలో పారదర్శకత పెంపు, కస్టమర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుంది’’అని ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. వడ్డీ రేటు వేరు, ఏపీఆర్ వేరు ఈ రెండింటి మధ్య ఉన్న బేధాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే అన్ని చార్జీలు కలిపినది. ఉదాహరణకు రూ.లక్ష రుణాన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) నుంచి 36 నెలల కాలానికి 18 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అంటే నెలవారీ ఈఎంఐ రూ.1,500 అనుకుంటాం. కానీ కాదు. ఈ రుణం ఏపీఆర్ 20.16 శాతం అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.1,680 అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఆరంభంలో విధించే పలు చార్జీలు అన్నీ కలసి ఈ స్థాయికి చేరింది. రుణంపై నికర వడ్డీ రేటుకు అన్ని రకాల చార్జీలు కలిపి ఏపీఆర్ ఎంత అన్నది కేఎఫ్ఎస్లో పేర్కొనాలన్నది ఆర్బీఐ ఆదేశం. అయితే, రుణ వాయిదా ఆలస్యంగా చెల్లిస్తే విధించే ఆలస్యపు రుసుము, కంటింజెంట్ చార్జీలు ఇందులో భాగంగా ఉండవని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ బౌన్స్ చార్జీలు, రుణాన్ని ముందస్తుగా చెల్లించేట్టు అయితే విధించే చార్జీలు కూడా ఏపీఆర్లో కలసి ఉండవు. ఇవి తెలుసుకున్న తర్వాతే.. ► చెల్లింపుల సామర్థ్యం: ఎంత రుణం కావాలన్న స్పష్టత ఒక్కటీ ఉంటే సరిపోదు. తీసుకునే ఆ రుణానికి నెలవారీ ఎంత మేర చెల్లించగలరు? అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. దీని ఆధారంగానే కాల వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. బ్యాంకుల మధ్య వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తదితర చార్జీలను పోల్చుకున్న తర్వాతే ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 0.5% వ్యత్యాసమున్నా 4–5 ఏళ్ల చెల్లింపుల్లో చెప్పుకోతగ్గంత తేడా వస్తుంది. తమ ఆదా యంలో అన్ని రుణాలకు చేసే చెల్లింపులు 40% మించకుండా చూసుకోవాలి. ► ఆదాయంలో అప్పుల రేషియో: బ్యాంక్‌లు రుణం ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, ఆదాయంలో అప్పుల రేషియోని చూస్తాయి. ఆదాయంలో అప్పులకు చేసే చెల్లింపులు 43 శాతం మించి ఉంటే అప్పుడు చెల్లింపుల్లో రిస్క్ ఉన్నట్టు అవి భావించొచ్చు. దాంతో రుణ దరఖాస్తు తిరస్కరణ లేదంటే అధిక వడ్డీ రేటును విధించొచ్చు. ► క్రెడిట్ స్కోర్: 750 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే దాన్ని ఉత్తమమైనదిగా పరిగణిస్తాయి బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు. అంతేకాదు రుణం సులభంగా, వేగంగా లభిస్తుంది. డిమాండ్ చేసి వడ్డీ రేటులో కొంత తగ్గింపు ప్రయోజనాన్ని సైతం పొందొచ్చు. ► ముందస్తు చెల్లింపులు: రుణాన్ని నిర్ణీత కాలానికి ముందే లేదంటే నెలవారీ వీలున్నప్పుడల్లా అదనపు చెల్లింపులు చేసుకుంటూ వెళితే త్వరగా తీరిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో చెప్పుకోతగ్గంత ఆదా చేసుకోవచ్చు. కాకపోతే చాలా సంస్థలు మందుస్తు రుణ చెల్లింపులపై 2–4 శాతం చార్జీ విధిస్తుంటాయి. ఈ తరహా చార్జీ అమలు చేయని సంస్థ నుంచి తీసుకోవడం అనుకూలం. మెరుగైన అవగాహన ‘‘కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇదొక అవకాశం. రుణానికి సంబంధించి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడం వల్ల రుణగ్రహీత అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది’ ’అని గోద్రేజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకే లోగడ కేఎఫ్ఎస్ తప్పనిసరి. ఇకపై అన్ని రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘రుణాలపై అసలు వ్యయాలు ఎంత మేర ఉన్నాయనేది రుణ గ్రహీతలకు దీనివల్ల తెలుస్తుంది. చెప్పకుండా విధించే చార్జీలకు కళ్లెం వేస్తుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహీతల్లో రుణ ఎకోసిస్టమ్ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది.’’అని ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ ‘వెలాసిటీ’ వ్యవస్థాపకుడు, సీఈవో అభిరూప్ మేధేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎఫ్ఎస్ రిటైల్ రుణ గ్రహీతలకు మేలు చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కేఎఫ్ఎస్తో ప్రత్యేకంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆయా సంస్థల వద్ద ఆర్థిక, న్యాయ నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కనుక బ్యాంకుల ఒప్పంద పత్రాలను అవి సమగ్రంగా సమీక్షించుకోగలవు. కానీ, చిన్న సంస్థలు, వ్యక్తులకు ఇది కష్టమైన పనే అవుతుంది. వ్యక్తులు అయితే బ్యాంక్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేఎఫ్‌ఎస్‌ను వ్యక్తులు, ఎంఎఎస్‌ఎంఈ రుణాలకు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. -
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్‌పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్‌ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
సొంత ఫిన్‌టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్‌ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్‌తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
భూ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్‌ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
చదువులపై ‘ఈనాడు’ చిత్తు కథ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరోసారి విషం కక్కారు. పేదల చదువులపై పూర్తి వక్రీకరణలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రికలో కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగానే ఈ కథనం ప్రచురించారు. ఈ కథనంలోని డొల్లతనాన్ని, రామోజీ ఏడుపుగొట్టుతనాన్ని ప్రభుత్వం బట్టబయలు చేసింది. ♦ బెస్ట్ అవైలబుల్ పథకంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు అందేదని ఈనాడు రాసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పలు పథకాల ద్వారా విద్యార్థులకు మేలు చేస్తోంది. అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. ఇవికాక ప్రభుత్వ విద్యా రంగంలో ప్రతి విద్యార్థి మీద ఏడాదికి అదనంగా చేస్తున్న ఖర్చు రూ.30 వేల పైనే. ♦ బెస్ట్ అవైలబుల్ పథకం కొందరికే అందేది. అంటే మిగిలిన విద్యార్థులకు నాసిరకం చదువులు అందినా పర్వాలేదనేది ఈనాడు అభిప్రాయమా? ఇది పేదలు, ఎస్సీ, ఎస్టీలు బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం చేసినట్టుగా కాదా? అందరికీ నాణ్యమైన విద్య అందడం ఈనాడుకి ఇష్టంలేదా? ♦ మంచి చదువులు ఏ ఒక్కరికో కాదు.. అందరికీ సమానంగా అందాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకే కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. మన బడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తొలి దశలో రూ.3,699 కోట్లతో 15,715 స్కూళ్లలో సదుపాయాలు కల్పించింది. రెండో దశలో మరో 22,344 స్కూళ్లను రూ.8,000 కోట్లతో బాగుచేస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.2,949 కోట్లు ఖర్చు చేసింది. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రైవేటు స్కూళ్లలో కూడా లేవన్నది నిజం. ♦ పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం విప్లవాత్మక మార్పుగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాకుండా, ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారికీ వర్తిస్తోంది. అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్లలో సుమారు 45 లక్షల మంది తల్లులు అందుకున్న మొత్తం రూ.26,067.28 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి రూ.100 కోట్లు ఎక్కడ? ఒక్క అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన రూ.26,067.28 కోట్లు ఎక్కడ? ఈ పథకం ద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పిల్లలు ఎంతగానో లబ్ధిపొందారు. ♦ విద్యా రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల 14,28,568 మంది ఎస్సీ విద్యార్థులు, 5,19,116 మంది ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22,761 మంది విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రభుత్వం సత్కరించింది. ♦ జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. దీనికి రాగిజావను కూడా ఇటీవల అదనంగా చేర్చింది. ఈ నాలుగేళ్లలో కేవలం జగనన్న గోరుముద్ద పథకం మీద పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.4,286.7 కోట్లు. ఇలాంటి ఆహారాన్ని ఉచితంగా ఏ ప్రైవేటు పాఠశాలలైనా అందిస్తున్నాయా? ♦ బడికి వెళ్లే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద వారికి కావాలి్సన యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్టు, సాక్సులు, ఇంగ్లిష్ డిక్షనరీ, వర్క్స్ బుక్స్ లాంటివాటిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం నాలుగేళ్లలో చేసిన ఖర్చు అక్షరాలా రూ.3,366.53 కోట్లు. చంద్రబాబు అమలు చేసిన స్కీమ్‌లో ప్రైవేటు పాఠశాలలు ఇలాంటివి అందించాయా? ♦ అందరికీ ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్లో శిక్షణ, పరీక్షలు ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయా? ♦ కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడలేనంతగా ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయిలో ఉంచే మరో అంశం డిజిటలీకరణ. గ్లోబల్ సిటిజన్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. ఆరు, ఆపై తరగతుల వారికి ప్రతి తరగతి గదిలో ఒక ఐఎఫ్‌పీ ప్యానెల్ ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రూ.440 కోట్లతో 30,213 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు చేసింది. రెండో దశలో మరో రూ.520 కోట్లు ఖర్చు చేస్తోంది. 5వ తరగతి లోపు 10,038 తరగతి గదుల్లో తొలిదశలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఎన్నో ఈనాడు చెప్పగలదా? ♦ డిజిటల్ విద్యలో భాగంగా 4 నుంచి 10వ వతరగతి వరకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాక 8వ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇందుకోసం 5.18 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.686 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా సౌకర్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వీటిద్వారా మేలు పొందడంలేదా? ఇలా గడచిన 50 నెలల్లో ప్రభుత్వ విద్యా రంగం మీద చేసిన ఖర్చు అక్షరాలా రూ.68,607 కోట్లు. విద్యార్ధులకు మేలు జరిగేలా చర్యలు బెస్ట్ అవైలబుల్ స్కీంలో చేరిన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 9, 10 తరగతులు వారిని అదే పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. మిగిలిన విద్యార్థులు వారు కోరుకున్న ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. వీరికి ప్రభుత్వ పరంగా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే అన్ని పథకాలు, సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా గుర్తించిన చాలా పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు లేవు. వరుసగా ఐదేళ్లపాటు పదో తరగతిలో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించాలి. అందులో 50% విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఫలితాలు సాధించిన స్కూళ్లే ఈ స్కీంకు అర్హత పొందుతాయి. ఈ నిబంధనలేవీ ఎంపిక చేసిన స్కూళ్లలో లేవు అని ప్రభుత్వం వివరించింది. -
సుప్రీంకోర్టులో ఉచిత వైఫై సేవలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు డిజిటైజేషన్ దిశగా మరో కీలక అడుగు పడింది. అత్యున్నత న్యాయస్థానంలోని మొదటి అయిదు కోర్టు రూముల్లో వైఫై సేవలను అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ప్రకటించారు. లాయర్లు, కక్షిదారులు, మీడియా వ్యక్తులు, ఇతర సందర్శకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటును ‘ ఇఐ గిజీఊజీ‘ లాగిన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చునన్నారు. ‘అన్ని కోర్టు రూములు ఇకపై పుస్తకాలు, పేపర్లు కనిపించవు. అయితే దీనర్థం, పుస్తకాలు, కాగితాలపై అస్సలు ఆధారపడబోమని కాదు’అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. -
RBI Annual Report 2022-23: కట్టలు తెంచుకున్న కరెన్సీ!
ముంబై: చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ అలాగే పరిమాణం రెండూ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో (2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగాయి. అయితే 2021–22లో ఈ పెరుగుదల (2020–21తో పోల్చి) వరుసగా 9.9 శాతం, 5 శాతంగా ఉన్నాయి. మొత్తంగా పరిస్థితి చూస్తే, డిజిటలైజేషన్ మార్గంలో ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం పెరగడం గమనార్హం. అయితే పెరుగుదల శాతాల్లో తగ్గడమే ‘చెప్పుకోవడానికి’ కొంత ఊరటనిచ్చే అంశం. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ♦ విలువ పరంగా చూస్తే, రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 31 మార్చి 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతం. 31 మార్చి 2022లో ఇది 87.1 శాతం. ♦ రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 37.9% వాటాను కలిగి ఉంది. తరువాతి స్థానంలో రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోటు ఉంది. ఈ నోట్లు 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 19.2%గా ఉన్నాయి. ♦ 2023 మార్చి చివరి నాటికి రూ. 25,81,690 కోట్ల విలువ కలిగిన మొత్తం రూ. 500 డినామినేషన్ నోట్లు 5,16,338 లక్షలు. 2022 మార్చి చివరి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు. అంటే వ్యవస్థలో రూ.500 నోట్లు వార్షికంగా పెరిగాయన్నమాట. ♦ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్లు ఉన్నాయి. చెలామణిలో ఉన్న నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 డినామినేషన్లను కలిగి ఉంటాయి. ♦ 2022–23 మధ్యకాలంలో ఆర్బీఐ లైవ్–పైలట్ ప్రాతిపదికన ఈ–రూపాయిని కూడా ప్రారంభించింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న ఈ–రూపాయి–హోల్‌సేల్ అలాగే ఈ–రూపాయి–రిటైల్ విలువలు వరుసగా రూ. 10.69 కోట్లు రూ. 5.70 కోట్లుగా ఉన్నాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్, సరఫరాలు రెండూ గత సంవత్సరంతో (2021–22) పోలిస్తే 1.6 శాతం స్వల్పంగా పెరిగాయి. రూ.2000 నోట్ల ప్రింటింగ్‌కు ఇండెంట్ లేదు. రూ.2000 నోట్ల సంగతి ఇదీ... ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. తగ్గుతున్న మోసాల ‘విలువ’..: 2022–23లో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుంది. అయితే విలువ మాత్రం దాదాపు సగానికి తగ్గి రూ. 30,252 కోట్లుగా ఉంది. కార్డ్, ఇంటర్నెట్ డిజిటల్ పేమెంట్లలోనే మోసాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. -
డిజిటలైజేషన్, మొండిబకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులు డిజిటలైజేషన్‌పై దృష్టి సారించాలని అలాగే ఒత్తిడితో కూడిన రుణాలపై (మొండిబకాయిలకు దారితీసే అవకాశమున్న ఖాతాలు) నిఘా ఉంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, అన్ని వర్గాలను ఫైనాన్షియల్ చట్రంలోకి తీసుకురావడంపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్యాంకులు నిరర్థక ఆస్తులను సకాలంలో గుర్తించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మొండిబకాయిలకు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) చేయాలి. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయి దృష్టి సారింపు అవసరం. భవిష్యత్తు అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్‌ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్‌కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్‌ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్‌ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్‌బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్‌ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
క్రెడిట్‌కార్డ్... అవసరాలకు భరోసా!
న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరిలో వార్షికంగా వినియోగం 29.6 శాతం పెరిగి, రూ. 1,86,783 కోట్లుగా నమోదయ్యింది. 2022 జనవరితో (13 నెలల్లో) పోల్చితే 32 శాతంపైగా పెరుగుదల (రూ. 1,41,254 కోట్ల నుంచి రూ. 1,86,783 కోట్లు) నమోదుకావడం గమనార్హం. ఈ స్థాయిలో రుణాల విలువ నమోదుకావడం ఒక రికార్డు. డిజిటలైజేషన్‌పై విశ్వాసం పెరగడం ప్రత్యేకించి కోవిడ్ అనంతరం కాలంలో వినియోగ అవసరాలు దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించిన ఒక సర్వే గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (2022 ఏప్రిల్–2023 జనవరి) రుణ పరిమాణం 20 శాతం పెరిగింది. ఒక్క జూన్‌లో రికార్డు స్థాయిలో 30.7 శాతం పురోగతి కనబడింది. ► 2023 జనవరి చివరినాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీలో మొదటి ఐదు స్థానాలూ ఆక్రమించాయి. ► రోనా కష్టకాలం నేపథ్యంలో 2021 మధ్యలో క్రెడిట్ కార్డ్ వినియోగం చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది. సంబంధిత సూచీ రికవరీ మార్గంలో పురోగమిస్తోంది. సాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొనడం, గృహ ఆదాయంపై మెరుగుదల వంటి సానుకూల సెంటిమెంట్ దీనికి నేపథ్యం. చెల్లింపుల సౌలభ్యత పలు విభాగాలు డిజిటలైజ్ అయ్యాయి. దీని ఫలితంగా కస్టమర్ల క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరిగాయి. ఆరోగ్యం, ఫిట్నెస్, విద్య, యుటిలిటీ బిల్లులు తదితర విభాగాల్లో ఖర్చు పెరగడానికి క్రెడిట్ కార్డ్ చెల్లింపుల సౌలభ్యత ఖచ్చితంగా దోహదపడింది. క్రెడిట్ కార్డ్ వినియోగంలో నెలవారీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉంది. గడచిన కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో స్థిరమైన వృద్ధి ఉంది. ముఖ్యంగా గత 11 నెలల నుండి క్రెడిట్ కార్డ్ వ్యయాలు స్థిరంగా రూ. 1 లక్ష కోట్లు పైబడి ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. డిసెంబర్ 2022లో మొత్తం క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో ఈ–కామర్స్ వాటా 60 శాతంగా ఉండడం మరో విశేషం. భవిష్యత్తులోనూ క్రెడిట్ కార్డ్ వినియోగం మరింత పుంజుకుంటుందని విశ్వసిస్తున్నాం. – రామమోహన్ రావు, ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ వ్యక్తిగత రుణాలు పెరుగుతున్నాయ్ ఈ రోజుల్లో తనఖా రుణాలు, వ్యాపార రుణాలు వంటి సురక్షిత రుణాలు వెనుకబడుతుండగా, వ్యక్తిగత రుణ విభాగం పెరుగుతోంది. ఇప్పు డే ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న తాజా గ్రాడ్యుయేట్లు, వారి ముందువారి కంటే ఆర్థికంగా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. అలాగే వారి క్రెడిట్ స్కోర్లను అధికంగా కొనసాగించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు ఆన్లైన్లో తమ కార్యకలాపాలను పెంచుకోవడం, సమాచారాన్ని పంచుకోవడంతో యువకులు మరింత సమాచారంతో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లను చేస్తున్నారు. మహమ్మారి సమయంలో క్రెడిట్ కార్డులు ప్రధానంగా కిరాణా కొనుగో లు, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించడం జరిగింది. తిరిగి మళ్లీ ఆయా విభాగాల్లో క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరుగుతున్నాయి. వీ స్వామినాథన్, ఆండ్రోమెడ లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్‌టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్‌టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్‌గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్‌ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్‌లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
డిజిటైజేషన్లో భారత్ భేష్
ముంబై: డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్ అసాధారణ రీతిలో కృషి చేస్తోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి సాధనలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) గణనీయంగా తోడ్పాటునివ్వగలవని ఆయన తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. 2025 నాటికి చాలా మటుకు అప్లికేషన్లు ..క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలతో రూపొందుతాయని, సుమారు 90 శాతం డిజిటల్ పని అంతా క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌పైనే జరుగుతుందని ఆయన చెప్పారు. ‘ఈ నేపథ్యంలోనే మేము ప్రపంచవ్యాప్తంగా 60 పైగా రీజియన్లు, 200 పైగా డేటా సెంటర్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాం. భారత్‌లో మరింతగా విస్తరిస్తున్నాం. హైదరాబాద్‌లో మా నాలుగో రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం. క్లౌడ్‌ను అంతటా అందుబాటులోకి తేవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని నాదెళ్ల చెప్పారు. భారత్‌లో క్లౌడ్ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. క్లయింట్ సర్వర్ శకంతో పోలిస్తే ప్రస్తుతం అంతా మారిపోయిందని .. అన్ని వ్యాపారాల్లోనూ క్లౌడ్ వినియోగం పెరుగుతోందని నాదెళ్ల వివరించారు. 2020 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల .. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు మొదలైన వారితో సమావేశం కానున్నారు. కృత్రిమ మేధ హవా.. ఆటోమేషన్ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ చాలా కీలకంగా మారగలదని నాదెళ్ల చెప్పారు. ‘ముందుగా మనకు భారీ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది లేకుండా ఏఐ ప్రయోజనాలను పొందలేము. అందుకే మేము మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తున్నాం‘ అని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండటం, మార్కెట్ శక్తులు దానికి తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తుండటం వంటి అంశాలు భారత్‌కు సానుకూలమైనవని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల మార్కెట్ 2026 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2021–26 మధ్య కాలంలో ఏటా 23.1 శాతం వృద్ధి నమోదు చేయనుంది. భారత్‌లోని టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసు ప్రొవైడర్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉన్నాయి. -
‘డిజిటల్’ స్థాయికి విద్యా రంగం
సాక్షి, అమరావతి: ఆధునిక ఆలోచనలు, పిల్లల భవిష్యత్తు పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో విద్యారంగం ఎంత ఆధునికతను సంతరించుకుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెబుతుంది. ఆధునిక భావాలు, అధునాతన విద్యా విధానాలపై అవగాహన ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తీరుతెన్నులు మరాయి. ఓ వైపు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను మెరుగు పరుస్తూనే, మరోవైపు ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో 2022లో విద్యా రంగం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు పునాది స్థాయి నుంచే అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు సాంకేతికతను, డిజిటల్ సాధనాలను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకుంది. ట్యాబులు, స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు రాష్ట్రంలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), ప్రొజెక్టర్ బేస్డ్ డీసీఆర్లను నెలకొల్పుతోంది. 50 వేలకు పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్‌ప్లస్ స్కూళ్లలో ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈ–కంటెంట్ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ సంస్థ ఈ–కంటెంట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా ఈ– కంటెంట్‌ను డౌన్లోడ్ చేయించింది. దీనివల్ల స్కూళ్లలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బాలలు వాటిని చదివేలా చేస్తున్నారు. ఏవైనా సందేహాలున్నా తిరిగి వెనక్కి వెళ్లి ఈ–కంటెంట్‌ను చూసుకొనే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులు కూడా ఉత్సాహంగా చదువుకోగలుగుతున్నారు. విద్యార్థులు, టీచర్లకు ట్యాబుల పంపిణీ సీబీఎస్ఈ విధానం, డిజిటల్ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు, ఆ తరగతి టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఒక్కో ట్యాబు ఖరీదు రూ.16 వేలు కాగా బైజూస్ కంటెంట్‌కు ఆ సంస్థ బయటి మార్కెట్లో ధర ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు అవుతుంది. ఈలెక్కన ఒక్కో విద్యార్థికీ రూ.32 వేలు విలువైన ట్యాబు, కంటెంట్ ఉచితంగా ప్రభుత్వం అందించింది. డిసెంబర్ 21న బాపట్ల జిల్లా యడ్లపల్లి జడ్పీ హైస్కూలులో సీఎం వైఎస్ జగన్ ఈ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. డిజిటల్ విద్యా విధానంతో ఎన్నో ప్రయోజనాలు ► బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు ► సంప్రదాయ అభ్యసన విధానంలో విద్యార్థి ఏదైనా ఒక రోజు దాన్ని కోల్పోతే మరునాటి నుంచి అభ్యసనంలో వెనుకబడతాడు. డిజిటల్ విద్యా విధానంలో ఎక్కడి నుంచైనా ఆయా అభ్యాసాలను నేర్చుకోవచ్చు ► డిజిటల్ విద్యాభ్యాసంలో విద్యార్థుల అభ్యసన వేగం, సామర్థ్యాలకు అనుగుణంగా స్టడీ మెటీరియల్‌ను సరళీకరించడానికి ఉపాధ్యాయులకు అవకాశమిస్తుంది ► విద్యార్థులు తెలివిని పెంచుకోగలుగుతారు. ► వారంతట వారే కొత్త అంశాలను డిజిటల్ విధానంలో నేర్చుకోగలుగుతారు. ► వారికి అవసరమైన అంశాలను ఆన్లైన్లో వనరులను శోధించడం, అధ్యయనం చేయడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు. ► సంప్రదాయ విద్యా విధానంలో ఉండే పుస్తకాల బరువు డిజిటల్ విధానంలో ఉండదు ► పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ► విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా రూపుదిద్దుకుంటారు. భవిష్యత్తులో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతావకాశాలను పొందుతారు. -
డిజిటలైజేషన్లో భారత్ మార్గదర్శి
వాషింగ్టన్: డిజిటలైజేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్‌లో డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్‌లో డిజిటలైజేషన్ కీలక ప్రాత పోషించిందని అన్నారు. పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్‌సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. డిసెంబర్లో భారత్‌లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్ మాల్పాస్ వెల్లడించారు. -
డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ముందడుగు వేసింది. శుక్రవారానికి రాష్ట్రంలో కోటి హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానం చేసి, ఈ ఘనతను సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేశామని, ఇది కూడా మిగతా రాష్ట్రాలకంటే అధికమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. రోగుల ఆరోగ్య నివేదికలను డిజిటలైజ్ చేసి భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందులో అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు భాగస్వాములవుతాయన్నారు. ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టంలో భాగంగా మారాయని ఆయన వివరించారు. -
AP: ఇక డిజిటల్ బడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్ స్థాయి వరకు స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ వరకు... ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యావిధానం లేకపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు సరైన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందడం లేదు. నేరుగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్ధులు స్కూలు వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల ఒకటో తరగతి వయసుకు అలవడాల్సిన అక్షర, సంఖ్యా పరిజ్ఙానం కొరవడుతోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్లే కొద్దీ వెనుకబాటుకు గురవుతున్నారు. ప్రథమ్ సంస్థ, న్యాస్, రాష్ట్ర స్థాయి సర్వేల్లో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. దీన్ని సరిదిద్దేందుకు పూర్వ ప్రాథమిక విద్యకు వీలుగా ఫౌండేషనల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచే చిన్నారులకు డిజిటల్ సాంకేతికతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసక్తికరంగా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఫౌండేషనల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతుల బోధనను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ టీచర్లకు శిక్షణ డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. డిజిటల్ డివైస్‌లను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా 50 శాతం మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి.. మూడు దశల్లో 45,328 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద 15,694 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. రెండో దశ కింద 2023–24లో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను సిద్ధం చేస్తారు. తొలిదశ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు. పాఠశాలలకు ఇంటర్నెట్ డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాడ్ బ్యాండ్/లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్/డాంగిల్/పోర్టబుల్ హాట్‌స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే 2,658 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉండగా మూడు నెలల్లో మిగతా స్కూళ్లలోనూ అందుబాటులోకి తేనున్నారు. డిజిటల్ బోధన ఇలా.. తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ విద్యాబోధన నిర్వహిస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.511.28 కోట్లు వ్యయం కానుంది. -
భవిష్యత్‌కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు.