న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్‌నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు.
సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్‌నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment