న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జియోదీతో కలిసి మాట్లాడుతున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: విలువ ఆధారిత బంగారం ఉత్పత్తుల్లో వాణిజ్యం పెంచుకునే విషయమై భారత్, యూఏఈ దృష్టి సారించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్విట్జర్లాండ్ తర్వాత భారత్‌కు ఎక్కువ బంగారం సరఫరా చేసే దేశం యూఏఈ అని చెప్పారు. యూఈఏతో బంగారం వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై కేంద్రం పలు రాయితీలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే, ఈ రాయితీలకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటూ, త్వరలోనే అవి పరిష్కామవుతాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఈయూఏతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాదిలో 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై సుంకాల్లో రాయితీలు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. సాధారణంగా అయితే బంగారం దిగుమతులపై సుంకం 15 శాతంగా ఉంది.
ఈ పరిమితి మేరకు బంగారాన్ని ఎగుమతి చేయడం ద్వారా యూఏఈ ప్రయోజనం పొందొచ్చని కేంద్రం భావిస్తోంది. భారత జెమ్స్, జ్యుయలరీకి యూఏఈ అతిపెద్ద మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 15 శాతం యూఏఈకే వెళుతుంటాయి. 2022–23లో భారత్ నుంచి జెమ్స్ జ్యుయలరీ మొత్తం ఎగుమతులు 37.5 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment