Gold products.
-
భారత్, యూఏఈ మధ్య బంగారం వాణిజ్యం పెంపు
న్యూఢిల్లీ: విలువ ఆధారిత బంగారం ఉత్పత్తుల్లో వాణిజ్యం పెంచుకునే విషయమై భారత్, యూఏఈ దృష్టి సారించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్విట్జర్లాండ్ తర్వాత భారత్‌కు ఎక్కువ బంగారం సరఫరా చేసే దేశం యూఏఈ అని చెప్పారు. యూఈఏతో బంగారం వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై కేంద్రం పలు రాయితీలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ రాయితీలకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటూ, త్వరలోనే అవి పరిష్కామవుతాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఈయూఏతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాదిలో 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై సుంకాల్లో రాయితీలు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. సాధారణంగా అయితే బంగారం దిగుమతులపై సుంకం 15 శాతంగా ఉంది. ఈ పరిమితి మేరకు బంగారాన్ని ఎగుమతి చేయడం ద్వారా యూఏఈ ప్రయోజనం పొందొచ్చని కేంద్రం భావిస్తోంది. భారత జెమ్స్, జ్యుయలరీకి యూఏఈ అతిపెద్ద మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 15 శాతం యూఏఈకే వెళుతుంటాయి. 2022–23లో భారత్ నుంచి జెమ్స్ జ్యుయలరీ మొత్తం ఎగుమతులు 37.5 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం తగ్గాయి. -
మనదేశంలో బంగారు గనులు ఎక్కడున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
గనుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, భారత్‌లో నిర్ధారించిన ప్రస్తుత బంగారం మైనింగ్ నిల్వల పరిమాణం 70.1 టన్నులు. ఇందులో 88 శాతం కర్ణాటకలో ఉంది. మరో 12 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. చాలా తక్కువ మొత్తం (0.1టన్ను కంటే తక్కువ) జార్ఖండ్‌లో కనుగొనడం జరిగింది. 1947లో పునఃప్రారంభించబడినప్పటి నుండి 2020 వరకు, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ దాదాపు 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మైన్ ప్రస్తుతం భారతదేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. భారత్ తన మొత్తం పసిడి డిమాండ్‌లో 80 శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. రత్నాలు ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ)ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ 2021లో 1,067 టన్నుల దిగుమతులు చేసుకుంది. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న 2020లో ఈ పరిమాణం కేవలం 430.11 టన్నులు. 2019తో పోల్చిచూస్తే, 28 శాతం పెరిగి 836.38 టన్నులుగా నమోదయ్యింది. ఎగుమతుల విషయానికొస్తే, 2021లో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో దేశం నుండి ఈ విభాగంలో రవాణా 50 శాతం పెరిగి 8,807.50 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. చదవండి: భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ! -
బంగారు దేశం!
ఆఫ్రికా దేశం ఇథియోపియా అంటే కేవలం పేదరికం, యుద్ధాలు, అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేనంత బంగారం ఈ దేశ భూగర్భంలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.ఈ స్వర్ణ లోహాన్నంతటినీ వెలికి తీయడం ప్రారంభిస్తే బంగారం ఉత్పత్తిలో ఇథియోపియా దక్షిణాఫ్రికాను కూడా వెనక్కి నెట్టే అవకాశం ఉంటుందన్నారు. స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ అబెర్దీన్కు చెందిన లియామ్ బుల్లాక్, ఒవెన్ మోర్గాన్ అనే ఇద్దరు భూగర్భ శాస్త్రజ్ఞులు ఇథియోపియాలో పరిశోధనలు సాగించారు. ఇథియోపియా పశ్చిమ భాగాన, సూడాన్ సరిహద్దుకు దగ్గర్లో అసోసా అనే ప్రాంతం ఉంటుంది. మైదానాలు, పర్వత ప్రాంతాలు, లోయలు, నదీ ప్రవాహాలతో కలగలసి ఉండే ఇథియోపియాలో దట్టమైన అడవులూ బాగా ఎక్కువే. 1930 నుంచి 1974 వరకు ఇథియోపియా చక్రవర్తిగా ఉన్న హైలీ సెలాస్సీ అసోసాలో బంగారాన్ని వెలికి తీయడంపై శ్రద్ధ చూపారు. అనంతరం అంతర్యుద్ధం తదితర కారణాలతో బంగారు గనుల తవ్వకాల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ 2000 తర్వాత ప్రభుత్వం గనుల తవ్వకాలకు లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించింది. తులు కపి అనే ప్రాంతం నుంచి ఇప్పటికే 48 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. అసోసా ప్రాంతంలోనూ 48 టన్నుల బంగారమే ఉందని ఈజిప్టుకు చెందిన ఆస్కామ్ అనే కంపెనీ గుర్తించింది. వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.