data analytics
-
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్‌లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
భవిష్యత్‌కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు. -
డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, జావా టెక్నాలజీల నిపుణులకు ఫుల్ డిమాండ్
ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు. కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్‌లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్‌లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది. -
ఐఐఎంల్లో ఈ–కామర్స్, స్టార్టప్స్ ఆఫర్స్!
ఈ–కామర్స్, స్టార్టప్స్.. గత కొంత కాలంగా నియామకాల్లో ముందంజలో నిలుస్తున్న రంగాలు. ముఖ్యంగా ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో ఇది మరింతగా స్పష్టమైంది. ఐఐఎంల్లో 2021లో పీజీపీఎం కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. వీరికి ఈ–కామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది ఈ రంగాల్లోని సంస్థల ఆఫర్లు తగ్గాయి. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్లు పుంజుకోవడంతో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అన్ని ఐఐఎంల్లోనూ అదే ట్రెండ్ ► తొలి తరం ఐఐఎంలు మొదలు నూతన ఐఐఎంల వరకూ.. దాదాపు అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఆయా ఐఐఎంల్లో కనిష్టంగా పది శాతం.. గరిష్టంగా 80 శాతం మేరకు ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగాయి. ► ఐఐఎం–ఇండోర్‌లో.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో గరిష్టంగా 80 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఐఐఎం–బెంగళూరులో 53 శాతం; ఐఐఎం–లక్నోలో 24.5 శాతం; ఐఐఎం–కోజికోడ్‌లో 25 శాతం; ఐఐఎం–అహ్మదాబాద్‌లో 10 శాతం వృద్ధి నమోదైంది. ► తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం–విశాఖపట్నంలోనూ ఈ–కామర్స్ ఆఫర్లు గతేడాది కంటే పది శాతం మేరకు పెరిగి.. మొత్తం 120 మంది విద్యార్థుల్లో.. దాదాపు 30 మందికి ఈ–కామర్స్ సంస్థల్లో ఆఫర్లు లభించాయి. (ఇక్కడ చదవండి: కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!) ఈ–కామర్స్ దిగ్గజాల హవా ఈ–కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే, రేజర్‌పే సంస్థలు ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. ఈ రంగంలో లభించిన మొత్తం ఆఫర్లలో యాభై శాతం ఈ సంస్థల నుంచే ఉండటం విశేషం. అంతేకాకుండా వేతనాలు కూడా సగటున రూ.12లక్షల నుంచి రూ.30లక్షల వరకు అందించాయి. గతేడాది కంటే 30శాతం అదనంగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. అందుకు తగినట్లుగానే క్యాంపస్ డ్రైవ్స్‌లో భారీగా నియామకాలు చేపట్టింది. అదే విధంగా అమెజాన్, పేటీఎం కూడా ఈ ఏడాది టెక్, మేనేజ్మెంట్ ప్రొఫైల్స్‌లో భారీగా నియామకాలు చేపడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్టార్టప్స్ హవా గత రెండేళ్లుగా వెనుకంజలో ఉన్న స్టార్టప్ కంపెనీల ఆఫర్లు ఈసారి భారీగా పెరిగాయి. ప్రధానంగా ఎడ్టెక్, ఫిన్‌టెక్ సంస్థలు ముందంజలో నిలిచాయి. బ్లాక్‌బర్గ్, ఇంటర్వ్యూబిట్, టర్టిల్‌మింట్ వంటి సంస్థలు స్టార్టప్ ఆఫర్స్ భారీగా ఇచ్చాయి. ఐఐఎంల విద్యార్థులు కూడా ఈ స్టార్టప్ ఆఫర్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. దీనికి స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ కెరీర్ ప్రగతికి పునాదులు వేసుకోవచ్చనే భావనే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను నేరుగా వ్యక్తీకరించి, ఆచరణలో పెట్టే అవకాశం స్టార్టప్ సంస్థల్లోనే ఎక్కువగా ఉంటుందనే అభి ప్రాయంతోనే విద్యార్థులు ఈ ఆఫర్స్‌కు అంగీకరించారని ఆయా ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫండింగ్ పెరగడమే కారణమా! స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడానికి వాటికి గతేడాది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ రావడం మరో కారణం అనే వాదన వినిపిస్తోంది. హెక్స్జన్ సంస్థ సర్వే ప్రకారం–గతేడాది భారత్‌లోని స్టార్టప్ సంస్థలు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో యాభై శాతానికి పైగా టెక్ స్టార్టప్స్, ఎడ్టెక్ స్టార్టప్స్ ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో నివేదిక ప్రకారం–2020లో జాతీయ స్థాయిలో ఏడు వేలకు పైగా స్టార్టప్ సంస్థలకు పది బిలియన్ డాలర్ల నిధులను వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సమకూర్చారు. వీటిలో మూడొంతులు.. ఫిన్‌టెక్, ఈ–కామర్స్ అనుబంధ టెక్ స్టార్టప్‌లే ఉన్నాయి. ఇలా భారీగా నిధులు సమకూర్చు కున్న స్టార్టప్‌లు.. వ్యాపార ఉన్నతికి, విస్తరణకు అవసరమైన మానవ వనరుల కోసం క్యాంపస్ డ్రైవ్స్ బాట పట్టాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కీలకమైన ప్రొఫైల్స్ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు కీలక విభాగాల్లో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు పలు ముఖ్య విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే హోదాల్లో ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుత డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాల్లో పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంతేకాకుండా వ్యాపార విస్తరణ వ్యూహాలు సమర్థవంతంగా రూపొందించే నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం ఈ–కామర్స్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారాలను మరింత వ్యూహాత్మకంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అను గుణంగా సేవలందించడం, కస్టమర్స్ మెచ్చే ప్రొడక్ట్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం మార్కెటింగ్, డేటాఅనలిటిక్స్ విభాగాల్లో నియా మకాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. స్టార్టప్ సంస్థల్లో.. ఈ ప్రొఫైల్స్ స్టార్టప్ సంస్థలు ప్రధానంగా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లో ఎక్కువగా నియామకాలు చేపట్టాయి. దీనికి కారణం.. సదరు స్టార్టప్ సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌లు రూపొందించి.. వాటికి మార్కెట్లో ఆదరణ లభించేలా వ్యవహరిస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ నైపుణ్యాలుంటాయనే ఉద్దేశంతో బి–స్కూల్స్‌లో ప్లేస్‌మెంట్స్ చేపట్టాయి. ఈ స్కిల్స్ ఉంటేనే ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. అభ్యర్థుల్లోని కోర్ నైపుణ్యాలే కాకుండా.. వ్యాపా రాభివృద్ధికి దోహదపడే స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, ఇన్నోవేషన్ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చాయి. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించి.. వ్యాపార కార్యకలాపాలకు అవరోధం కలగకుండా వ్యవహరించొచ్చనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. మిగతా సెక్టార్స్ సంగతి ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్‌లో టెక్ ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఈ టెక్ స్టార్టప్‌లే నిధుల సమీకరణలో ముందంజలో నిలిచాయి. దాంతో ఫిన్‌టెక్, ఎడ్టెక్ వంటి టెక్ స్టార్టప్స్‌లో ఆఫర్లు పెరిగాయి. మరోవైపు ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడంలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి. సానుకూల సంకేతాలు ► ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈకామర్స్, స్టార్టప్ సంస్థలు.. టైర్–2,టైర్–3ల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్స్టిట్యూట్లలో ఈ రిక్రూట్మెంట్స్ ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, సీఆర్ఎం, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్–2, టైర్–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశాలు న్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► మొత్తంగా చూస్తే గతేడాది కోవిడ్ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్ ప్లేస్‌మెంట్స్.. తిరిగి పుంజుకోవడంతో మేనేజ్మెంట్ విద్యార్థులకు భవిష్యత్తు ఆశాజనకం అనే భావన ఏర్పడుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రానున్న రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐఎం ప్లేస్‌మెంట్స్ ముఖ్యాంశాలు ► 2021లో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో భారీగా పెరుగుదల. ► సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తున్న వైనం. ► మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సీఆర్ఎం విభాగాల్లో నియామకాలు. ► స్టార్టప్ ఆఫర్స్‌లో టెక్ స్టార్టప్స్ హవా. ► రానున్న రోజుల్లో ఇతర బి–స్కూల్స్‌లోనూ నియామకాలు ఆశాజనకంగా ఉంటాయంటున్న నిపుణులు. డిజిటలైజేషనే ప్రధాన కారణం ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టడానికి ప్రధాన కారణం డిజిటలైజేషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ–కామర్స్ మార్కెట్ విస్తృతమవుతోంది. దానికి అనుగుణంగా సంస్థలు నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. – ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, చైర్ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు -
ఈ ఏడాది ఆ టెకీలకు పండగే..
బెంగళూర్ : నూతన టెక్నాలజీల రాకతో ఆయా సాంకేతికతపై పట్టున్న అభ్యర్ధులకు భారీ వేతనాలతో ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ ఏడాది డేటా సైన్స్‌లో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని, ఇది గత ఏడాది కంటే 62 శాతం అధికమని ఓ ఎడ్యుటెక్ సంస్థ నివేదిక పేర్కొంది. ఐదేళ్లలోపు అనుభవం కలిగిన వారికే ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. డేటా సైన్స్‌లో పనిచేసే ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్లతో విస్తృతంగా చర్చించిన మీదట ఎడ్యుటెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ఈ అంచనాకు వచ్చింది. సరైన నైపుణ్యాలు కొరవడిన క్రమంలో 2019లో ఎనలిటిక్స్, డేటా విభాగాల్లో 97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. డేటా సైన్స్‌తో కూడిన ఉద్యోగాలకు ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇంధన, ఫార్మా, హెల్త్‌కేర్, ఈకామర్స్ సహా పలు రంగాల్లో డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా డిజిటల్ ఎకానమీ ఎదుగుదల నేపథ్యంలో కంపెనీలు అమ్మకాలు పెంకచుకునేందుకు, వినియోగదారులను మెరుగ్గా అర్ధం చేసుకునేందుకు డేటా సైన్స్ ప్రాధాన్యత పెరిగింది. విస్తృతంగా డేటా అందుబాటులోకి రావడంతో వ్యాపారాభివృద్ధికి డేటా సైన్స్ విభాగం కీలకంగా మారిందని గ్రేట్‌లెర్నింగ్ కో ఫౌండర్ హరి కృష్ణన్ నాయర్ పేర్కొన్నారు. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ వంటి పోస్టులకు విపరీతమైన డిమాండ్ నెలకొందని చెప్పారు. చదవండి : ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.. -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్ గ్రూప్ సీఎండీ గీతాంబర్ ఆనంద్ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్ వినియోగంతో మార్కెటింగ్ వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు. ‘‘గతంలో మా కంపెనీలో ప్రాజెక్ట్ వ్యయంలో మార్కెటింగ్ వ్యయం 4–5 శాతంగా ఉండేది. కానీ, ఇప్పుడు డేటా అనలిటిక్స్ వినియోగంతో ఇది కేవలం 1 శాతానికి పరిమితమైందని’’ అని చెప్పారాయన. నిర్మాణ రంగంలో టెక్నాలజీని వాడితే స్టీల్, సిమెంట్ వృథా కాకుండా ఉంటుందన్నారు. అనంతరం సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్ మాట్లాడుతూ.. డెవలపర్లు ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు స్థానిక మార్కెట్ పరిస్థితులు, కొనుగోలుదారులు ఆర్థిక స్థితిని అవగాహన చేయాలని సూచించారు. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఫ్లాట్ల విస్తీర్ణాలను, ధరలను నిర్ణయించాల్సిన డెవలపర్లు.. అలా చేయడం లేదని పేర్కొన్నారు. -
నమ్మకంగా ముంచేశారా?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట. దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అభూత కల్పన ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. -
‘ఈక్విటీ’ నిధులు @ రూ.63,744 కోట్లు
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్ సంస్థ, ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ► ఈక్విటీ ద్వారా కాకుండా బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.29,944 కోట్లు సమీకరించాయి. ► ఈ ఏడాది నిధుల సమీకరణ జరిగిన వివిధ ఈక్విటీ మార్గాల్లో అత్యధిక నిధులు ఐపీఓ మార్గంలో వచ్చాయి. ఈ మార్గంలో 24 కంపెనీలు రూ.33,244 కోట్లు సమీకరించాయి. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సగం. గత ఏడాది మొత్తం 36 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి. ► కంపెనీలు ఈ ఏడాది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా రూ.16,077 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.10,678 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) ద్వారా రూ.3,145 కోట్లు సేకరించాయి. ► గత ఏడాది ఓఎఫ్ఎస్ మార్గంలో సమీకరించిన నిధులు రూ.18,094 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ.10,678 కోట్లకు తగ్గింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఓఎఫ్ఎస్గా కోల్ ఇండియా ఇష్యూ(రూ.5,274 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,848 కోట్లతో లార్సెన్ అండ్ టుబ్రో ఇష్యూ నిలిచింది. ► క్యూఐపీ నిధుల సమీకరణ కూడా 73 శాతం తగ్గింది. గత ఏడాది ఈ విధానంలో రూ.61,148 కోట్లు రాగా, ఈ ఏడాది 73 శాతం తగ్గి రూ.16,677 కోట్లు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద క్యూఐపీగా రూ.3,500 కోట్ల ఐడియా క్యూఐపీ నిలిచింది. ► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా రూ.4,473 కోట్ల బంధన్బ్యాంక్ ఐపీఓ నిలిచింది. ► ఈ ఏడాది ఎస్ఎమ్ఈల (స్మాల్, మీడియమ్ ఎంటర్ప్రైజ్) కార్యకలాపాలు గత ఏడాది కంటే జోరుగా ఉన్నాయి. ఈ ఏడాది ఎస్ఎమ్ఈలు ఐపీఓ విధానంలో రూ.2,254 కోట్లు సమీకరించగా, గత ఏడాది ఈ సమీకరణ రూ.1,679 కోట్లుగా మాత్రమే ఉంది. 161 ఐపీఓలు @ 552 కోట్ల డాలర్లు: ఈవై కాగా, ఈ ఏడాది అత్యధిక ఐపీఓలు వచ్చిన స్టాక్ ఎక్సే్చంజ్లుగా భారత స్టాక్ ఎక్సే్చంజ్‌లు రెండో స్థానంలో నిలిచాయని ఈవై తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్ నెల చివరి వరకూ మొత్తం 161 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు 552 కోట్ల డాలర్లను సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ క్యూ3లో 9 ఐపీఓలు రాగా, ఈ క్యూ4లో రెండు ఐపీఓలు మాత్రమే వచ్చాయని వివరించింది. ఎస్ఎమ్ఈ ఐపీఓల్లో కూడా ఇదే ధోరణి చోటు చేసుకుంది. ఈ క్యూ3లో 42గా ఉన్న ఎస్ఎమ్ఈ ఐపీఓలు ఈ క్యూ4లో ఎనిమిదికి తగ్గాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో 261 ఐపీఓలు 6,000 కోట్ల డాలర్లు సమీకరించాయి. -
స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నికల్లో గెలవడమెలా?
'కేంబ్రిడ్జ్ అనలిటికా' అనే సంస్థ ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని వినియోగించుకుని ఎన్నికలను 'ప్రభావితం చేసింద'న్న బలమైన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కేవలం అమెరికా, యూకేలకు మాత్రమే కాక, భారత్‌లోనూ ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది. ఈ వివాద నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నికల్లో ఎలా గెలువవచ్చో కూడా తెరపైకి వచ్చింది. భారత్‌లో జరిగిన పలు ఎన్నికల్లో కేంబ్రిడ్జ్, ఎస్సీఎల్కు చెందిన దేశీయ పార్టనర్ ఓవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) డేటా ఎనాలిటిక్స్ ప్రభావితం చేశాయని తెలిసింది. 2010 ప్రారంభం నుంచి మొబైల్స్‌ను వాడుకుని కొత్త కొత్త పొలిటికల్ టూల్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఓబీఐ అధినేత అమ్రిష్ త్యాగి చెప్పారు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌తో ఎలా ఎన్నికల్లో గెలువ వచ్చు అని కొంతమంది రాజకీయ నాయకులు అడిగారని తనకు గుర్తు ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్‌తో ఎన్నికల్లో గెలవడం త్యాగి కంపెనీ ఆర్ట్‌కు సంబంధించి కచ్చితమైన వివరణ అని అన్నారు. మొబైల్ ఫోన్ ప్రజల అభిప్రాయాలను ఎలా రూపుదిద్దగలదో వివరించారు. ఇది ప్రజలను సోషల్ మీడియాతో లింక్ చేయడంతోనే సాధ్యమని త్యాగి చెప్పారు. సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైనదని, ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాల్సినవసరం ఉందన్నారు. దీనిలో వ్యక్తిగత బ్రాండు చాలా కీలమన్నారు. స్పీచులు, ఇతర పోస్టర్ల ద్వారా కంటే కూడా మొబైల్ ఫోన్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని చాలా వేగంగా మార్చవచ్చని తెలిపారు. 2015లో బిహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ సంఘటనను కూడా త్యాగి గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్‌కు చెందిన ఓ ఫోటోను విడుదల చేశామని, అది సెకన్లలో వైరల్ అయిందని తెలిపారు. ‘బిహార్ ఎన్నికల్లో మా క్లైంట్ అఖండ విజయం సాధించారు. మేం టార్గెట్ చేసిన సీట్లలో 90 శాతం సీట్లను గెలుచుకున్నాం’ అని కేంబ్రిడ్జి అనలిటికా ప్రకటించుకుంది కూడా. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని ‘ప్రిడిక్టివ్ అనలటిక్స్, బిహేవియరల్ సైన్స్’తో విశ్లేషించి కేంబ్రిడ్జ్ అనలిటికా ఖాతాదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే, ఫేస్బుక్ ఖాతాదారుల్లో ఏ ఓటరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు చూపుతున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఎవరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు? అన్న అంశాలను పసిగట్టి వారిని లక్ష్యంగా చేసుకొని సీఏ లాంటి సంస్థలు తమ క్లైంట్కు సానుకూలంగా ఓటరు మలుచుకుంటాయి. 2016లో త్యాగి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు సాయపడినట్టు తెలిసింది. -
ఏఐ, రోబోటిక్స్ నిపుణులకు ఈ ఏడాది హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు ఈ ఏడాది హ్యాపీ న్యూఇయర్ కాబోతుంది. ఈ ఏడాదిలో రోబోటిక్స్ నిపుణులకు 50-60 శాతం ఎక్కువ డిమాండ్ ఉండబోతుందని హ్యుమన్ రిసోర్స్, సెర్చ్ ఎక్స్‌పర్ట్‌లు అంచనావేస్తున్నారు. వ్యాపార వ్యూహాలపై మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రభావం చూపనున్నట్టు పేర్కొన్నారు. పునరావృత పనులను మిషన్లు తగ్గిస్తాయని, రోబోటిక్స్, ఏఐ, బిగ్ డేటా, అనాలిటిక్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని ఓరాకిల్ ఆసియా-పసిఫిక్ రీజన్ సీనియర్ డైరెక్టర్ షఖున్ ఖన్నా చెప్పారు. ఐఓటీ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగాలు గత మూడేళ్లలో నాలిగింతలు పెరిగాయని బిలాంగ్ అంచనావేసింది. గత కొన్నేళ్లలో ఏఐలో డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్ నిపుణులకు డిమాండ్ 76 శాతం పెంచినట్టు పేర్కొంది. వ్యాపారం, ఆర్థిక సర్వీసులు, ఇన్సూరెన్స్, ఈకామర్స్, స్టార్టప్‌లు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాల్లో ఎంట్రీ నుంచి మధ్య స్థాయి, సీనియర్ స్థాయి వరకు డిమాండ్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రక్రియ ఆధారిత కంపెనీలకు మంచి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రోబోటిక్స్ అవసరం ఉందని, ఇది వ్యయాలను తగ్గించి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కెల్లీ సర్వీసెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. భారత్‌లో సుమారు 7వేల నుంచి 10వేల డేటా సైంటిస్ట్‌లు ఉన్నారని, 4 నుంచి 5 ఏళ్ల అనుభవమున్న వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. డేటా అనాలిటిక్స్‌కు ప్రారంభ వేతనమే రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలుంటుందని, 10 కంటే ఎక్కువ అనుభవమున్న ఏఐ నిపుణులకు రూ.60 లక్షల నుంచి రూ.1.5 కోట్లు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. -
ఇక పన్ను ఎగవేతదారులకు చుక్కలే!
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపేందుకు జీఎస్టీ రిటన్స్ డేటాను వినియోగించుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. పన్ను ఎగవేతదారులపై ముప్పేట దాడికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలతో 2018 మే నాటికి పన్ను ఎగవేత దాదాపు అసాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఆదాయాన్ని వారు దాఖలు చేసిన జీఎస్టీ రిటన్స్‌తో సరిపోల్చి ఓ డేటాబేస్‌ను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరోక్ష పన్నుల డేటాను ఆదాయ పన్ను రిటన్స్‌తో ప్రభుత్వం సరిపోల్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత పన్ను వ్యవస్థతో పోలిస్తే జీఎస్టీ ద్వారా వ్యాపారాల పరిమాణం, లావాదేవీలపై స్పష్టత అధికంగా ఉండటంతో ఆదాయం తక్కువగా చూపడం లేదా ఖర్చులు పెంచి చూపడం వంటి అవకతవకలకు పెద్దగా ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. ప్రజలు పెడుతున్న ఖర్చు, రాబడి, పెట్టుబడులపై డేటా ఎనలిటిక్స్ ద్వారా పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని పన్ను ఎగవేతదారులకు దీంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద పోగుపడిన డిపాజిట్ల డేటా సైతం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండటంతో పన్ను అక్రమాలను పరిశీలించేందుకు డేటా అనలిటిక్స్‌ను విరివిగా ఉపయోగించాలని భావిస్తున్నారు. -
లెక్కల్లో చూపని సంపదనూ పట్టండి..
► డేటా అనలిటిక్స్ ఉపయోగించండి ► చిన్న వ్యాపారస్తులనూ జీఎస్టీ వ్యవస్థలోకి చేర్చండి ► ఐటీ అధికారులకు ప్రధాని మోదీ సూచన ► రెండో ’రాజస్వ జ్ఞాన సంగం’ ప్రారంభం న్యూఢిల్లీ: డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా .. లెక్కల్లో చూపని సంపదను కూడా వెలికితీయాలని ఆదాయ పన్ను అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే 2022 నాటికి పన్నుల వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చెప్పారు. ’రాజస్వ జ్ఞాన సంగం’ రెండో వార్షిక సదస్సును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అవినీతిని నిర్మూలించి, నిజాయితీగా పన్నులు కట్టేవారిలో విశ్వాసం పెంపొందించేలా పరిస్థితులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని ప్రధాని చెప్పారు. ఇటీవల అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం కేవలం రెండు నెలల వ్యవధిలోనే కొత్తగా 17 లక్షల వర్తకులను పరోక్ష పన్నుల విధాన వ్యవస్థలోకి తెచ్చిందని ఆయన తెలిపారు. రూ. 20 లక్షల కన్నా తక్కువ వార్షిక టర్నోవరు ఉండే చిన్న వ్యాపారస్తులను సైతం జీఎస్టీ విధానంలో నమోదు చేసుకునేలా చూడాలని మోదీ సూచించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. స్వాతంత్య్రానంతరం దేశంలో పన్నులపరంగా ప్రవేశపెట్టిన అతి పెద్ద సంస్కరణ ఫలాలు సామాన్యులకు చేరేలా చూడాలని మోదీ చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారులు పాల్గొంటున్నారు. పని సంస్కృతి మెరుగుపర్చుకోవాలి.. 2022 నాటికి దేశ పన్నుల వ్యవస్థను మరింత మెరుగుపర్చుకునేలా అధికారులు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, పని సంస్కృతిని కూడా మెరుగుపర్చుకోవాలని మోదీ సూచించారు. పన్నుల విభాగానికి లావాదేవీలకు సంబంధించి సిబ్బంది ప్రమేయం చాలా తక్కువ స్థాయిలోనే ఉండాలని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ–అసెస్మెంట్ మొదలైన విధానాలు పాటించాలని ప్రధాని చెప్పారు. తద్వారా స్వార్ధ శక్తులు చట్టాలను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడాన్ని అరికట్టవచ్చన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలి.. పన్ను సంబంధ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటుండటంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు ఇరుక్కుపోయిన ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరిస్తే.. ఆ నిధులు పేదల సంక్షేమానికి ఉపయోగపడేవని పేర్కొన్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి రాజస్వ జ్ఞాన సంగం సదస్సులో తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే నిజాయితీగా పన్నులు చెల్లించే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ప్రధాని ఆదేశించినట్లు సీబీఈసీ ట్విటర్లో వెల్లడించింది. -
ఐఐటీలో చదివినా.. ఆఫర్లు రావట్లేదు!
ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం చాలా కంపెనీలు ఐఐటీలకు వెళ్లాయి. కానీ, గత సంవత్సరంతో పోలిస్తే ఆ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు మాత్రం చాలా తగ్గిపోయాయి. ఐఐటీ బాంబేలో గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీ గత సంవత్సరం 16 మందిని తీసుకోగా, ఈసారి 13 మందినే తీసుకుంది. అలాగే బీసీజీ అనే కన్సల్టింగ్ సంస్థ గత సంవత్సరం తొమ్మిది మందికి అవకాశం ఇస్తే, ఈసారి నలుగురినే ఎంచుకుంది. ఈసారి ఎనలిటిక్స్ రంగం నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయంటున్నారు. గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలు సాధారణంగా కోర్ ఫైనాన్స్ ప్రొఫైల్స్ నుంచే ఎక్కువ మందిని తీసుకుంటాయి. కానీ, ఈసారి వాళ్లు కూడా ఎనలిటిక్స్‌లోకే ఎక్కువగా తీసుకున్నారు. డచ్ బ్యాంక్, ఫ్లో ట్రేడర్స్ లాంటి కంపెనీలు మాత్రమే కోర్ ఫైనాన్స్ ఉద్యోగాలు ఆఫర్ చేశాయని, మిగిలినవి తీసుకున్నవే తక్కువైనా, అవి కూడా ఎనలిటిక్స్‌లోకే తీసుకున్నాయని ఓ విద్యార్థి చెప్పాడు. ఈ తరహా కంపెనీలకు ఎక్కువగా ఫైనాన్స్ ఉద్యోగాల కోసమే వెళ్తారని, కానీ వాళ్లు కూడా సాఫ్ట్వేర్, కోడింగ్ విద్యార్థులను అడుగుతున్నారని మరో విద్యార్థి తెలిపాడు. ఏఎన్‌జడ్, యాక్సిస్, సిటీఫైనాన్స్ లాంటి బ్యాంకులు కూడా తమకు ఎక్కువగా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు అక్కర్లేదు గానీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, స్టాటస్టికల్ మోడలింగ్ వచ్చినవాళ్లు కావాలంటున్నాయి. ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిపోవడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులు నీరసించిపోయారు. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కూడా బిగ్ డేటా ఎనలిటిక్స్ రంగంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువగా డేటా ఎనలిటిక్స్ మీదే ఆధారపడుతున్నారని, నిర్ణయాలన్నింటికీ డేటాయే ఆధారమని ఓ ప్లేస్మెంట్ రిప్రజెంటేటివ్ తెలిపారు. ఇప్పుడు ఈ రంగంలో రిక్రూట్మెంట్లు బాగా పెరిగాయని, ఇంతకుముందు సాధారణ బిజినెస్ ఎనలిటిక్స్ రంగంలో మాత్రమే తీసుకునే సంస్థలు కూడా ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ నిపుణుల కోసం చూస్తున్నాయన్నారు. దాంతోపాటు కోడింగ్ కూడా వచ్చి ఉంటే బంపర్ చాన్సులు వస్తున్నాయట. సాధారణంగా జేపీ మోర్గాన్ సంస్థ ఇన్నాళ్లూ కేవలం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చేది గానీ, ఇప్పుడు మాత్రం అది కేవలం డేటా రోల్స్‌లోకి మాత్రమే తీసుకుంటోంది. చాలా కంపెనీలు ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ ప్రొఫైల్స్ కావాలనే అడుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులు ఈ రంగంలో ఎక్కువగా దృష్టిపెట్టాలని ఐఐటీ మద్రాస్‌లో ప్లేస్మెంట్ ఇన్చార్జి అయిన ప్రొఫెసర్ మను సంతానం తెలిపారు. కంపెనీలు డేటా ఎనలిటిక్స్ రోల్స్ అడుగుతున్నాయని, కానీ విద్యార్థులకు దాని గురించే తెలియపోవడంతో రిక్రూట్మెంట్లు తగ్గాయని వివరించారు. ఐఐటీ రూర్కీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోయాయి. వస్తున్న కంపెనీల సంఖ్య బాగానే పెరిగింది గానీ, వాళ్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మాత్రం బాగా తగ్గిందని అక్కడి ప్లేస్మెంట్ ఇన్చార్జి ప్రొఫెసర్ ఎన్పీ పాదీ చెప్పారు.