
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్‌సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది.
తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్‌నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట.
దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.
అభూత కల్పన
ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment