ఆ సత్తా భారత్‌ సొంతం | India has potential to lead fourth industrial revolution says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆ సత్తా భారత్‌ సొంతం

Published Sat, Oct 8 2022 5:33 AM | Last Updated on Sat, Oct 8 2022 5:33 AM

India has potential to lead fourth industrial revolution says PM Narendra Modi - Sakshi

కేవడియా(గుజరాత్‌): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్‌ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్‌ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్‌ భాగస్వామి కాలేకపోయింది.

ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్‌ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు.

‘3డీ ప్రింటింగ్, మెషీన్‌ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్‌ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్‌ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది.  

పర్యావరణహిత అభివృద్ధిని భారత్‌ చాటిచెప్పింది
పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్‌ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్‌ ‘వైల్డ్‌లైఫ్‌ వీక్‌’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్‌ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది.

కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్‌ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్‌ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది.  పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల  సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement