ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్‌ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది.
నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్‌ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు.
కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్‌లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్‌లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment