Digital Technology
-
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ కావాలి
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రి మేధ(ఏఐ)ని ఉపయోగించుకొనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొనే అంశంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొనే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్–డబ్ల్యూటీఎస్ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను మోదీ ప్రారంభించారు.డిజిటల్ సాంకేతికత విషయంలో నిబంధనల ఆధారిత ఫ్రేమ్‌వర్క్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు కేవలం వ్యక్తిగత భద్రత, టెక్నాలజీ సంస్థల పారదర్శకతకే కాదు, అంతర్జాతీయ డేటా ప్రవాహంపై ఆధారపడి ఉన్న వాణిజ్యం, వస్తు సేవలకు సైతం కీలకమేనని ఉద్ఘాటించారు. సైబర్ మోసాల నుంచి ఏ ఒక్క దేశమూ ఒంటరిగా తమ ప్రజలకు రక్షణ కలి్పంచలేదని అభిప్రాయపడ్డారు.అందుకే అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అంతర్జాతీయ సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా 40 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విషయంలో తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
కృత్రిమ మేధతో నవ ప్రపంచం?
స్మార్ట్ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్ ఏఐ మనదాకా వస్తే? అప్పుడు వర్చువల్ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? మన చాలా పనులను ఏఐ చేయడం మొదలుపెడితే, మన చేతికి బోలెడు సమయం చిక్కుతుంది. అప్పుడు మనం తోటలో తిరుగుతూనో, వ్యాయామం చేస్తూనో గడపవచ్చు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గిపోతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రోబోలు చదువులు చెబుతాయి. కానీ ఎప్పుడో మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారుతుందా అన్నది ప్రశ్న! ఒక సగటు భారతీయుడు ఏడాదికి 2,300 గంటల సమయం స్మార్ట్ ఫోన్ మీద గడిపే స్తున్నాడని ఒక అంచనా. 580 గంటలు ఓటీటీ(ఓవర్ ద టాప్) ప్లాట్ ఫామ్‌లలో కంటెంట్‌ను వెతుక్కుని వాటిని చూసేందుకు ఉపయోగి స్తున్నారు. సోషల్ మీడియాలోనూ దాదాపు ఇదే రకమైన ధోరణి కనిపి స్తోంది. సైబర్ మీడియా రీసెర్చ్ ద్వారా మేము జరిపిన అధ్యయనంలో ఈ పోకడలు వెల్లడయ్యాయి. కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగ దారుల తీరుతెన్నులను పరిశీలించేందుకు మేము ఈ సర్వేల్లాంటివి చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీలతో మన జీవితాలు ఎంతగా పెన వేసుకుపోయాయో సూచిస్తాయి ఈ సర్వే విశేషాలు. చేతిలో కావాల్సినంత సమయం 2024 అంటే ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకున్న అంశాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తే? జరగబోయేది ఇదే. అంతా జనరేటివ్ ఏఐ పుణ్యం! 2023లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ), మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. టెక్నాలజీ ధోరణులను నిత్యం పరిశీలించే విశ్లేషకుడిగా 2024లో ఈ ఏఐ విషయంలో ఏం జరగబోతోందన్నది నాకెంతో ఉత్సుకత రేకెత్తించే అంశం. అయితే ఒక్కటైతే నిజం. ఈ ఏడాది కృత్రిమ మేధ విస్తృత స్థాయికి చేరుతుందన్నది నా నమ్మకం. జనరేటివ్ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను ఇట్టే చేసేస్తుంది. టెక్ట్స్ జనరేట్ చేయడం, చిత్రాలు, మోడల్స్‌ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది ఒకసారి చూస్తే... ఏఐ, జనరేటివ్ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024 లోనే కాదు... ఆపై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలి పోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్నెస్ గోల్స్‌ను సాధించుకునేందుకు ప్రయత్నించడం, లేదా తోటపని చేసు కోగలగడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో ఆలోచించండి. విద్యార్థుల నేస్తం మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్ ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010, అటుపై పుట్టినవాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆటబొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే శాయి. భావోద్వేగాలను పలికించగల, ఏఐ భాగస్వామి అని పిలు స్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తిసామర్థ్యాలకు తగ్గట్టు చదువులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితోపాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్ ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని వారి కళ్లముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్ సిము లేషన్ ్స, అడాప్టివ్ టెక్ట్స్ బుక్స్, ఏఐ మెంటర్స్... విద్యార్థుల అవస రాలు, ఆశయాలకు అనుగుణంగా బోధించడం మొదలవుతుంది. ఇప్పటిమాదిరిగా బట్టీపట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకుని, పిచ్చి పోటీని వదిలించుకుని తమకు నచ్చిన అంశాన్ని చదవుకునే వీలు ఏర్పడుతుంది. ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపా ధ్యాయుల పాత్ర కూడా గణ నీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించే వారిగా వీళ్లు మారిపోతారు. ఇలాంటి వాతా వరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్ మోడళ్ల సాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు. అంతరాలు తగ్గేనా? కృత్రిమ మేధ కచ్చితంగా ఓ అందమైన, సానుకూల భవి ష్యత్తును చూపుతున్నప్పటికీ దీనికి ఇంకో కోణమూ ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ అంతరం మరింత పెరుగుతుందా? ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. డిజిటల్ డివైడ్ అని పిలుస్తున్న ఈ అంతరమే పూర్తిగా పూడని నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది అందోళన కలిగించే అంశం. ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకుముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరమవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాల్లోనూ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువ. వ్యాసకర్త సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్)లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విభాగాధిపతి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్‌స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్‌లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
భారత ఏఐ మోడల్ ఎలా ఉండాలి?
కృత్రిమ మేధ విప్లవాన్ని అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ముందుకు తోస్తూంటే, చైనాలో అది ప్రభుత్వ మద్దతుతో సాగుతోంది. మరి ఈ విషయంలో భారత్ ఏం చేయాలి? భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకదాన్ని తయారు చేయడం కష్టమేమీ కాదు. కాకపోతే వీటికి పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా, చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. మనం మూడో మార్గం అనుసరించడం మేలు. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందరి డిజిటల్ హితం కోసం దాన్ని ‘జన్ ఏఐ’ మోడల్‌గా తీర్చిదిద్దాలి. వీడియోలు సృష్టించడంలో ఛాట్‌జీపీటీకి ఉన్న సామర్థ్యం ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు... పది కోట్ల మంది దాన్ని వినియోగించేలా చేసింది. ‘ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ (ఎల్ఎల్ఎం), అలాగే జనరేటివ్ ఏఐకి శక్తినిచ్చే విషయాలన్నీ... ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వంటివాటిని సమూలంగా మార్చేసే అద్భుత టెక్నాల జీలనడంలో సందేహం లేదు. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కృత్రిమ మేధను ‘ఫైర్’(మంట) అని వర్ణిస్తే, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల సమూల మార్పునకు నాందిగా అభివర్ణించారు. మరోవైపు గోల్డ్‌మాన్ శాక్స్ లాంటి సంస్థలు జనరేటివ్ ఏఐ కారణంగా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తికి కనీసం ఏడు లక్షల కోట్ల డాలర్ల మొత్తం చేరుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ సానుకూల అంశాలతోపాటు ఉద్యోగాలు కోల్పోవడం, మానవ ప్రమేయం తగ్గిపోవడం వంటి కొన్నింటిపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏఐ సూపర్ ఇంటెలిజెన్ ్సతో మనిషికి ముప్పు అన్న భావన కూడా పెరుగుతోంది. అలాగే వివక్ష, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్యానికి ముప్పు వంటి అంశాలూ చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ విషయంలో కార్యకలాపాలు ఎక్కు వగా అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. రెండింటిలోనూ వ్యవస్థల నిర్మాణం, ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా వేరు. అమె రికాలో పెద్ద టెక్ కంపెనీలు ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూండగా, చైనా భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తోంది. చైనా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి సొంత జనరేటివ్ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నాయి. సమాచారం, సందర్భాలు రెండింటినీ పరిగ ణనలోకి తీసుకునేలా చైనా తన జనరేటివ్ ఏఐ మోడళ్లను నిర్మిస్తోంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు ఎవరికివారు తమదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా పరిమితమైన పరిధిలో. జనరేటివ్ ఏఐ నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దాన్ని నియంత్రించడంపై యూరోపియన్ యూనియన్ దృష్టి పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ కూడా ఏఐ ఆధారిత పరిపాలన విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యిస్తోంది. భారత్ స్థానమెక్కడ? అంతా బాగానే ఉంది కానీ... ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్ స్థానమెక్కడ? మేమూ సొంతంగా ఎల్ఎల్ఎం ప్లాట్‌ఫామ్స్ సిద్ధం చేసుకుంటామని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. హడావుడి కూడా కనిపించింది కానీ... ఛాట్‌జీపీటీ çసృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ వీటిపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే, భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకదాన్ని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. భారతీయ భాషలు, కాంటెక్స్›్టతో కూడిన సమాచారాన్ని అందివ్వడం ద్వారా ఈ ఎల్ఎల్ఎంను వినూ త్నంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నం చేసేముందు మన లక్ష్యం, ఉద్దేశం ఏమిటన్నది స్పష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా? లేక చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది తేల్చుకోవాలి. మాకైతే మూడో మార్గం మేలని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. చాలా సాహసోపేతమైందే కావచ్చు. కానీ భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. డిజిటల్ పబ్లిక్ గుడ్ కోస మన్నమాట. దీన్ని ప్రజల కోసం ‘జన్ ఏఐ’ లేదా ‘జెన్ ఏఐ’ అని పిలుచుకుందాం. సామాజిక వృద్ధి కోసం... భారత్ సృష్టించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ‘ఇండియా–స్టాక్’ ఆధారంగా మొత్తం జనాభా స్థాయిలో డిజిటైజేషన్ సాధ్యం చేయ గలిగాం. ఫలితంగా 140 కోట్ల మందికి డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపులు, యూపీఐతో సులభతర చెల్లింపులు, ఆధార్ గుర్తింపులు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వంటి ఘనతలు ఎన్నింటినో సాధించగలిగాం. ఈ డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా నిర్మించిన సేవల పుణ్యమా అని ఆరోగ్య రంగం కూడా ప్రజలకు మరికొంచెం చేరువైంది. లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ప్రభుత్వ సబ్సిడీల వంటివి సులువైపోయాయి. దేశాద్యంతం సర్వసామాజిక వృద్ధి కూడా సాధ్య మైంది. ఇండియా స్టాక్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ఏపీఐల ఆధారంగా అసంఖ్యాకమైన స్టార్టప్‌లు వినూత్నమైన సేవ లను భారతీయ పౌరులకు అందుబాటులోకి తేగలిగాయి. ఇండియా స్టాక్ ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్ ్స, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇతర దేశాలు కూడా ఈ వరుసలో ఉన్నాయి. నిజానికి భారత్ తన జీ–20 అధ్యక్ష స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డిజిటల్ పబ్లిక్ గుడ్, ఇండియా స్టాక్లను ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తోంది. అంతరాలు తొలగేలా... ఇండియా స్టాక్ అసలైన సామర్థ్యం పౌరులందరికీ డిజిటల్ సేవలు అందించడం ద్వారా నిరూపితమైంది. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలు, స్టార్టప్‌లు దానికి ఎప్ప టికప్పుడు విలువను జోడించేందుకూ అవకాశం ఏర్పడింది. జనరేటివ్ ఏఐని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం. ఇండియా ‘భారత్‌ఎల్‌ఎల్‌ఎం’ పేరుతో సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవచ్చు. ఇండియా స్టాక్ ద్వారా సమాచారాన్ని అందివ్వడం ద్వారా మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు. ఇండియా స్టాక్‌పై ఇంకో పొర మాదిరిగా కొన్ని ఎల్ఎల్ఎంల సమాహారంగా జన్ ఏఐని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ప్రజాసేవలో భాగంగా అందరికీ అందివ్వడం కీలకం. తద్వారా డిజిటల్ అంతరాన్ని తొలగించవచ్చు. జనాభా మొత్తానికి లాభాలు అందించవచ్చు. ఆధార్, యూపీఐ మాదిరిగా అన్నమాట. వ్యక్తిగత గోప్యత, వివక్ష వంటి ఏఐ సంబంధిత ఆందో ళనలకు సమాధానం వెతికేందుకు కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. వైయక్తిక గోప్యత విషయంలో పాశ్చాత్యుల ఆలోచన దీనికంటే భిన్నమైంది. సమష్టితనం, సామాజిక గోప్యత, నమ్మకం వంటి భారతీయ దృక్పథాలను వాడుకుంటూ ఈ పని చేయవచ్చు. సానుకూల ప్రభుత్వం, ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్న మన ఐటీ కంపెనీలు, ఐఐటీల వంటి సంస్థలు కలిసికట్టుగా ఈ ‘జన్ ఏఐ’ని సుసాధ్యం చేయగలవని మేము విశ్వసిస్తున్నాం. ఆ తరువాత భారతీయ కంపెనీలు భారత్‌ఎల్‌ఎల్‌ఎం నుంచి నిర్దుష్ట, లోపాలు సరిదిద్దిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేయవచ్చు. అందరికీ అందు బాటులో ఉండే ఏపీఐల సాయంతో స్టార్టప్‌లు కూడా ఎల్ఎల్ఎంలను వాడుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీలో ఇప్పుడున్న రెండు విప్లవా త్మకమైన విషయాలను భారత్ ఇలా జోడించవచ్చు. అంటే జనరేటివ్ ఏఐ, డిజిటల్ పబ్లిక్ గుడ్లను మేళవించడం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని జన్ ఏఐ మోడళ్లకు నమూనాగా భారతీయ మోడల్‌ను నిలబెట్టవచ్చు. – జస్ప్రీత్ బింద్రా, టెక్ విస్పరర్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్; సుధీర్ తివారీ, థాట్‌వర్క్స్ ఇండియా డిజిటల్ ఇంజినీరింగ్ సెంటర్ గ్లోబల్ హెడ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్‌ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్‌కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
తయారీలో డిజిటల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్‌ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్‌వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది. ‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్‌లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సవాళ్లను అధిగమించేందుకు.. నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్తఘోష్ తెలిపారు. -
7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్‌లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది. -
జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది. కాగా ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు -
వారిని అస్సలు పట్టించుకోని అమెజాన్ ఫ్లెక్స్, ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్‌వర్క్ ఇండియా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్‌లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్‌ఫామ్‌లకు ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్‌ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్‌కార్ట్‌కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్‌కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్‌వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు. -
డిజిటల్ విప్లవానికి శ్రీకారం
-
డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, జావా టెక్నాలజీల నిపుణులకు ఫుల్ డిమాండ్
ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు. కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్‌లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్‌లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది. -
ఉద్యోగులకు డిమాండ్..భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వార్షిక నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్‌కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్‌కు డిమాండ్ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 2022– 23లో ఫిన్‌టెక్, ఐటీ–ఇన్ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్ స్టాఫింగ్ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్‌గా పరిగణిస్తారు. యువతే ఎక్కువ ఫ్లెక్సీస్టాఫ్కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్‌లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్కు డిమాండ్ 10 శాతం పెరుగుతుందని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. -
డిజిటల్ విద్యతో దీటుగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ విద్యతో మరింత రాణించేలా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక పద్ధతులను అనుసరించి బోధన చేపట్టడం ద్వారా మన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్యా బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేస్తూ వీటిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖలో ’మనబడి నాడు – నేడు’ డిజిటల్ లెర్నింగ్‌పై సీఎం జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తరగతి గదుల్లో టీవీలు, డిజిటల్ బోర్డులు తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, టీవీల ఏర్పాటుపై జూలై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్నారు. వీటి వల్ల సైన్స్, మేథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు సులభంగా, చక్కగా అర్థం అవుతాయన్నారు. వీటి వినియోగం ద్వారా టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. డిజిటల్ స్క్రీన్‌పై కంటెంట్‌ను హైలెట్, ఎన్లార్జ్ చేస్తే బాగుంటుందని సూచించారు. డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బోధనకు అనువుగా డిజిటల్ స్క్రీన్లు తరగతి గదిలో బోధనా కార్యక్రమాలకు అనువుగా డిజిటల్ బోర్డులు, స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి మెరుగైన పద్ధతిలో అమర్చాలన్నారు. నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతుల్లో టీవీ స్క్రీన్లు అమర్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ట్యాబ్‌లు.. ‘సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్‌లో బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేయాలి. అందుకు అనుగుణంగా స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. అవి నిర్దారించాకే ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు. 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్‌లు తరువాత 9, 10వ తరగతుల్లో కూడా వినియోగించుకొనేలా ఉండాలని స్పష్టం చేశారు. మూడేళ్లపాటు ట్యాబ్‌లు నాణ్యతతో పని చేసేలా ఉండాలన్నారు. వాటి నిర్వహణ కూడా అత్యంత ప్రధానమన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టటాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ట్యాబ్‌ల కొనుగోలులో మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా అందించాలని పేర్కొన్నారు. -
పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!
దేశంలో 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులన్నీ కులీన వర్గాల కోసమే చేపట్టేవారనీ, తాము అధికారంలోకి వచ్చాకే పేదల సంక్షేమం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామనీ కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. జాతీయ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం స్వాతంత్య్రానంతరమే మొదలైంది. ఈ దార్శనికతే... టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమించింది. తర్వాతి ప్రభుత్వాలు ఈ పరంపరను కొనసాగిస్తూ తెచ్చిన... ప్యాసింజర్ రిజర్వేషన్, టెలిఫోన్, బ్యాంకింగ్ సేవల్లో కంప్యూటరీకరణ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేవలం డిజిటల్ టెక్నాలజీ ముందంజ ప్రాతిపదికగా, గత ప్రభుత్వాల హయాంలోని టెక్నాలజీలను చిన్నచూపు చూడటం తగదు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. తాను సాధించిన అనేక విజయాలకు తోడుగా పేదలకు ప్రయోజనం కలిగించడానికి టెక్నాలజీని విస్తా రంగా ఉపయోగించడాన్ని అది ఎత్తిచూపుతోంది. గత వారం ఢిల్లీలో డ్రోన్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ... గతంలో, వర్తమానంలో టెక్నాలజీ ఉపయోగంలో ఉన్న వ్యత్యాసాలను పోల్చి చెప్పారు. 2014కు ముందు టెక్నాలజీని పేదల వ్యతిరేకిగా చిత్రించేవారనీ, దీన్ని ప్రజల సమస్యలలో ఒక భాగంగా పరిగణించేవారనీ మోదీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు పాలనలో టెక్నాలజీని ఉపయోగించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వాతావరణం ఉండేదనీ, దీని ఫలితంగా పేదలూ, మధ్య తరగతి ప్రజలూ అధికంగా బాధలకు గురయ్యేవారనీ మోదీ పేర్కొ న్నారు. గత పాలనా కాలాల్లో టెక్నాలజీని కులీనుల ప్రయోజనాల కోసం ఉద్దేశించినది మాత్రమే అని భావించేవారనీ, కానీ తమ ప్రభుత్వం టెక్నాలజీని ముందుగా ప్రజారాశులకు అందుబాటులోకి తెచ్చిందనీ చెప్పారు. అయితే ప్రధాని ప్రకటనలో రెండు అశాలు న్నాయి. ఒకటి: తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే భారత్ పరి పాలనలో టెక్నాలజీని వాడటం మొదలెట్టింది. రెండు: 2014కు ముందు ప్రభుత్వాలు వాడిన టెక్నాలజీ ఫలితాలు పేదలకు అందు బాటులో ఉండేవి కావు. టెక్నాలజీ గురించి ఇలా సాధారణీకరించడం లేదా డిజిటల్ టెక్నాలజీ కోణం నుంచి మాత్రమే టెక్నాలజీని అంచనా వేయడం లేదా 2014కు ముందూ, 2014 తర్వాతా అనే చట్రంలో మాత్రమే టెక్నాలజీని అంచనావేయడం అనేది సమస్యాత్మకమే అని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి లేదా అంతకుముందు కూడా టెక్నాలజీతో భారతదేశం సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉండేది. మహాత్మాగాంధీ కాలం నుంచే సై¯Œ ్స, టెక్నాలజీ ఉపయోగం అనేది ప్రజల సంభాషణల్లో భాగమై ఉండేది. అయితే గాంధీ టెక్నాలజీ వ్యతిరేకి అని తప్పు ఆరోపణలకు గురవడం మరో విషయం. శ్రామిక ప్రజలను పక్కకు నెట్టి యంత్రాలను వాడటాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించారు తప్ప టెక్నాలజీని కాదు. ఇక జవహర్లాల్ నెహ్రూ విషయానికి వస్తే... ప్రజల సంక్షేమానికీ, జాతీయ అభివృద్ధికీ, శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం గురించీ నెహ్రూ గొప్పగా ప్రబోధించారు. ఈ దార్శనికతే... పరిశోధనా శాలలు, టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమిం చింది. అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ వంటి పలు అంశాల్లో సాంకేతిక జ్ఞానం ఆనాడే పురుడు పోసుకుంది. గత 75 సంవత్సరాల సాంకేతిక అభివృద్ధిలో భారత్‌ను సమున్నతంగా నిలపడంలో ఈ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయని ఎవరూ మర్చిపోకూడదు. దీనికి ఇటీవలి తిరుగులేని ఉదాహరణ కోవిడ్ టీకాలు! రాజీవ్ గాంధీ హయాంలో 1980లలో టెక్నాలజీ వినియోగం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజీవ్ ప్రారంభించిన టెక్నాలజీ మిషన్లు నూనె గింజల నుంచి రోగనిరోధకత వరకు పలు రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాయి. ఆ సమయంలోనే యావత్ ప్రపంచం పర్సనల్ కంప్యూటర్ విప్లవానికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సాక్షీభూతమై నిలిచింది. టెలిఫోన్ సర్వీసులు, బ్యాంకింగ్, వాతావరణ అంచనా వంటి ఎన్నో ప్రజోపయోగ రంగాల మెరుగు దలకు ఈ పరిణామాలను సృజనాత్మకంగా ఉపయోగించు కోవడానికి అనేక ప్రాజెక్టులను దేశంలో మొదలెట్టారు. ప్యాసింజర్ రైల్వే రిజర్వే షన్, డిజిటల్ టెలికామ్ స్విచ్, బ్యాకింగ్ రంగంలో కంప్యూటరీకరణ, సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ అభివృద్ది వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ప్రజలకు పర్సనల్ కంప్యూటర్ వంటి ఉపకరణం కావాలనీ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను వీరికి అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందనీ సూచించేవి కావు. ఎందుకంటే ఆనాటికి భారత్‌లో ఇంటర్నెట్ ఉనికిలోనే ఉండేది కాదు. అయినప్పటికీ సగటు మనిషికి మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఎంతగానో మేలు చేశాయి. ఎయిర్‌లై¯Œ ్స రిజర్వేష¯Œ లో కంప్యూటరీకరణకు ఎంతో ముందుగా ఈ ప్రాజెక్టులు ఉనికిలోకి వచ్చాయి. కాబట్టి ఆనాటి టెక్నా లజీ ప్రయోజనాలు మొదటగా కులీన వర్గాలను లక్ష్యంగా చేసుకో లేదన్నది నిజం. కాబట్టి 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులు, భావనలు అనేవి కులీన వర్గాలకు సంబంధించినవే తప్ప అవి పేదలకు ప్రయోజనం కలిగించలేదనడం చాలా తప్పు. అయితే ఆనాటి కొత్త ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవచ్చు. అంత కచ్చితంగా అవి పని చేయకపోయి ఉండవచ్చు. కానీ భారతీయ సాంకేతిక జ్ఞాన ప్రయా ణంలో ఇవి కీలకమైన మూలమలుపులుగా నిలిచాయి. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గడం, తక్కువ డేటా ప్రైజ్‌లతో ఇంటర్నెట్ ప్రాప్యత తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, ఛోటా రీజార్జ్ వంటి మార్కెటింగ్ ఆవిష్కరణలు గత రెండు దశాబ్దాల కాలంలో డిజిటల్ టెక్నాల జీలనూ, వాటి అప్లికేషన్లనూ బాగా ముందుకు తీసుకుపోయాయి. లక్ష్యంగా పెట్టుకున్న సబ్సిడీల పంపిణీకి ప్రభుత్వాల చేతికి ఆధార్ ఆవిష్కరణ గొప్ప ఉపకరణాన్ని అందించింది. అయితే బయోమె ట్రిక్స్ ఆధారిత ఐడెంటిఫికేషన్ సిస్టమ్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీతో సమ్మేళనం వంటివి ఒక్క సబ్సిడీల పంపిణీకి మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అప్లికేషన్ల కల్పనకు దారితీశాయి. తాము సాధించిన గొప్ప విజయాల్లో జామ్ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) ఒకటని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పు కుంటోంది. యూపీఐ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్ వ్యాప్తిని కూడా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ దీన్ని సాధించడం కోసమే పెద్ద నోట్ల రద్దు వంటి చేదుమాత్రను దేశమంతటికీ తినిపించాల్సి వచ్చిందని ప్రభుత్వం నేటికీ ఒప్పుకోవడం లేదు. పైగా డిమాండ్ ఆధారిత వృద్ధి ఫలితంగా ఈ కొత్త ఆవిష్కరణలు ముందుకు రాలేదని గ్రహించాలి. మరోవైపున ఆధార్ ఉపయోగం ఎంత సర్వవ్యాప్తిగా మారిపోయిం దంటే... కంపెనీలు, బ్యాంకులు వంటి వాటితో యునీక్ ఐడెంటిఫి కేషన్ నంబర్‌ను షేర్ చేయాల్సి రావడం గురించి విద్యావంతులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే వినియోగదారులు తమ ఐడీ నంబర్లను ఎవరికీ షేర్ చేయవద్దని ‘ఉడాయ్’ ప్రజలకు బోధిస్తూ మెసేజ్ పంపింది కానీ ఆ మరుక్షణమే ప్రభుత్వం దాన్ని తొలగించడం గమ నార్హం. ఏదేమైనా ఇది మరింతగా గందరగోళాన్ని ఏర్పర్చింది. బయో మెట్రిక్స్, క్లోనింగ్, ఫిషింగ్ వంటి వాటి కారణంగా ప్రత్యక్ష నగదు బదలాయింపు వ్యవస్థలో తప్పుడు కేసులు బయటపడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు అనేది డిజిటల్ పేమెంట్ల వైపుగా ప్రజలను బలవంతంగా మళ్లించినట్లే, ఆన్లైన్ క్లాసులు, ఇ–హెల్త్ వంటి అప్లికేషన్ల కోసం డిజిటల్ ఉపకరణాలను మరింతగా ఉపయోగించేలా కరోనా మహమ్మారి యావన్మంది ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. ఈ రెండు కేసుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నాసిరకం కనెక్టివిటీ, డివైజ్‌ల ప్రాప్యత తీవ్ర అవరోధాలను కలిగిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులకు గానూ తమ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం విద్యార్థులు ఊళ్లలో చెట్లమీదికి ఎక్కుతున్న ఫొటోలు, బయోమెట్రిక్ ఆథరైజేషన్ కోసం పెద్దలు పడుతున్న పాట్లు వైరల్ అయి డిజిటలైజేషన్ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసిపడేశాయి. ప్రతి గ్రామాన్నీ ఫైబర్ ఆప్టిక్స్‌తో కనెక్ట్ చేసే ప్లాన్ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఇకపోతే ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ అయిన బీఎస్ఎన్ఎల్ నిదానంగా అంతరించే వైపు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్‌తో, ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఏర్పడుతున్న సమస్యలు ఒకవైపూ... ప్రతిచేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి క్షేత్రంలో డ్రోన్, ప్రతి ఇంట్లో సౌభాగ్యం అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాద రూపంలోని ప్రచారార్భాటం మరోవైపూ దేశంలో సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాసకర్త: దినేష్ సి. శర్మ, సైన్స్ విషయాల వ్యాఖ్యాత -
డిజిటల్ ఫ్యూచర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి: శివశంకర్
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల డిజిటల్ వినియోగం మరింత పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ & వర్చువల్ మీటింగ్‌ల నుండి ఆన్లైన్ విద్య వరకు ఇప్పుడు 'కొత్త టెక్నాలజీ మన జీవితంలోని అన్ని అంశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు & వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ & ఆటోమేషన్తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు Metaverse. మెటవర్స్ అంటే మనం నివసించే ప్రపంచానికి మించిన ఒక సింక్రోనస్ డిజిటల్ ప్రపంచం. Web 3.0 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, బ్రాండ్లతో పరిశ్రమ అంతటా అలలను సృష్టించాయి, వినియోగదారులకు ఇంతకు ముందెన్నడూ చూడని ఇంటరాక్టివిటీని అందించే అవకాశాలను అన్వేషించాయి. క్రిష్టోకరెన్సీ & NFTల విస్తరణ అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ టెక్నాలజీ, ఈస్పోర్ట్ల పెరుగుదల డిజిటల్ భవిష్యత్తును మనకు అందిస్తుంది. ప్రస్తుతం సాంకేతికత మనం జీవించే, పనిచేసే విధానాన్ని మరింత వేగంగా మారుస్తుంది. అయితే, ఈ సాంకేతికతలను నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి ఇది నిస్సందేహంగా కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా: ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం సుగమం భారతదేశంలో మరింత సౌకర్యవంతంగా, మా ప్రభుత్వం దాని ఫ్లాగ్షిప్ 'డిజిటల్ ఇండియా" చొరవ ద్వారా భారతదేశాన్ని డిజిటల్‌గా సాధికారత కలిగిన సమాజంగా & నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి పెట్టుబడి పెడుతుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆన్-డిమాండ్ గవర్నెన్స్ & సేవలు అలాగే పౌరుల డిజిటల్ సాధికారత వంటి ప్రోగ్రామ్‌ల ముఖ్య ఫోకస్ ఏరియాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం, పరిణామం & మనం నివసించే ప్రపంచాన్ని మర్చివేయడంతో యువత ముఖ్యంగా పెరుగుతున్న ఈ డిమాండ్లకు, సరిపోయేలా ఆచరణాత్మక మార్గాల్లో వారి శిక్షణను ప్లాన్ చేయడం ద్వారా ఫలితం పొందుతారు. స్కీల్లింగ్ ప్రోగ్రామ్‌లు: ముఖ్యమైన నైపుణ్యాలతో విద్యార్థులను శక్తివంతం చేయడం బహుళ తరాల శ్రామికశక్తితో, ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో యువ జనాభా కలిగిన భారతదేశం, ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది యువత వర్క్‌ఫోర్స్‌లో చేరడాన్ని మనం గమనిస్తున్నాం. యువత విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ వారందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. అది వారంతా ఉపాధి పొంది మంచి నాణ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మహమ్మారి సమయంలో మంచి నైపుణ్యం గల వనరుల అవసరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది IT పరిశ్రమ, ప్రభుత్వానికి బాగా తెలుసు. యజమానులు తమ ఉద్యోగులకు ఉన్న నైపుణ్యాలు, ఉద్యోగార్టులకు ఉన్న నైపుణ్యాల మధ్య అంతరం ఎలా ఉందో పరిశ్రమలు మాట్లాడుతున్నాయి. 12వ తరగతి గ్రాడ్యుయేట్లకు అవకాశాలు: డ్యూయల్, డిపెండబుల్ & వైవిధ్యం 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్‌కి సిద్దం అవుతున్న విద్యార్థులు పూర్తిగా రూపాంతరం చెందిన డిజిటల్ సొసైటీకి శిఖరాగ్రంగా నిలుస్తున్నారు. IT పరిశ్రమ 2022లో వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా టైర్-2 నగరాల్లో పటిష్టమైన ఉపాధి. అవకాశాలను అందిస్తుందని ఇటీవలి పరిశ్రమ నివేదికలు తెలుపుతున్నందున, 12 తరగతి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీ సంబందిత శిక్షణా కార్యక్రమాలలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 'డ్యుయల్-ఫోకస్': విద్యపై డ్యుయల్ -ఫోకస్ ఏకీకృతం చేయడం + ఆచరణాత్మక శిక్షణ, ఇందులో ఈ రోజు IT పరిశ్రమలో అత్యవసరంగా అవసరమైన నైపుణ్యాలను అందించడం. వాస్తవాప్రపంచ ఐటీ ప్రాజెక్ట్‌లను బహిర్గతం చేయడం వంటివి ఉంటాయి. 'డిపెండబుల్': శిక్షణా కార్యక్రమం వ్యవధిలో వారికి స్టెపండ్ ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తూ, శిక్షణానంతరం హామీ ఇవ్వబడిన ఉద్యోగంలో ఉంచే భద్రతను విద్యార్థులకు అందిస్తుంది. వైవిధ్యం: విద్యార్థి వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు & మార్గదర్శకత్వానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలపై దృష్టి సారించే సంపూర్ణ బోధనను కలిగి ఉంటుంది. మీరు భారతదేశంలో విద్య & ట్రైనింగ్ చరిత్రను పరిశీలించినప్పుడు, వృత్తిపరమైన ట్రైనింగ్ & నైపుణ్యం మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయినట్లు మీరు చూడవచ్చు. గురుకులం, పాఠశాల అభ్యాస రీతులు, హైబ్రిడ్ మోడల్ లెర్నింగ్‌పై దృష్టి సారించాయి, ఇది రోజు మొత్తంలో నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ఉపయోగించడం చేర్చబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లు: విస్తరిస్తున్న హారిజోన్లు HCL టెక్నాలజీస్‌లో, హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ ఇన్-క్లాస్ ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లను అందించడంపై మేము దృష్టి పెడుతున్నాము, ఇది విద్యార్థులు లైవ్ ప్రాజెక్ట్‌లో క్లాస్‌రూమ్‌లో నేర్చుకున్న వాటిని ఆచరణాత్మకంగా వర్తింపజేసే అవకాశాలను అందిస్తుంది. 'వారు నేర్చుకునేటప్పుడు' సంపాదించే అవకాశం విద్యార్థులకు చిన్న వయస్సు నుండే ఆర్థిక బాధ్యతను నేర్పుతుంది. వారు పొందే ఆచరణాత్మక ఎక్స్పోజర్ & మార్గదర్శకత్వం వారి తోటివారిపై వారికి ఆధిక్యతను అందిస్తుంది. మన చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ, స్మార్ట్ మార్గాన్ని ఎంచుకునే వారికి ITలో అవకాశాల కొరత లేదు. IT పరిశ్రమకు అవసరమైన సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, వాస్తవ-ప్రపంచ ప్రాజెక్ట్‌లకు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం చాలా అనిశ్చిత సమయాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించగలదు. నా కెరీర్ ప్రారంభ దశలో, డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌లో పని చేయడానికి, నేర్చుకోవడానికి నాకు అవకాశం లభించింది, భారతదేశం గొప్ప నాయకులు మరియు దూరదృష్టి గలవారిలో ఒకరిగా వారిని మనమందరం ప్రేమగా గుర్తుంచుకుంటాము. ఆయన అనేక వివేకవంతమైన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అతని ఒక అందమైన కోట్ గుర్తుకు వస్తుంది. "ఆకాశంవైపు చూడు. మనం ఒంటరిగా లేము. మొత్తం విశ్వం మనతో స్నేహపూర్వకంగా" ఉంటుంది అలాగే కలలు కనేవారికి, పని చేసేవారికి ఉత్తమమైన వాటిని అందించడానికి మాత్రమే సహకరిస్తుంది. శ్రీమతి శివశంకర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ -
ఏపీ పోలీస్‌కు 15 డిజిటల్ సభ అవార్డులు.. సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్.. ‘డిజిటల్ టెక్నాలజీ సభ–2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 8 అవార్డులు, తిరుపతి అర్బన్ పోలీస్ యూనిట్ రెండు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ యూనిట్లు ఒక్కోటి చొప్పున గెలుచుకున్నాయి. బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఏపీ పోలీస్, జీఐఎస్ ఆధారిత జీపీఎస్ విధానం, దిశ కమాండ్ కంట్రోల్ రూమ్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, హాక్ వాహనాలు, వీడియోకాన్ఫరెన్స్ విధానం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ విధానాలకు డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కాయి. చదవండి: (ఆకలితో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. కనీసం తాగునీరు లేక..) సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల భద్రతకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మెరుగైన పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి కొనియాడారు. -
డిజిటల్ స్కిల్ పై వాట్సాప్ ఇండియా శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు డిజిటల్ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ ఇండియా ముందుకువచ్చింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డిజిటల్ స్కిల్ అకాడమీ శిక్షణ కార్యక్రమాన్ని వాట్సాప్ ఇండియా చేపట్టింది. కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డేటా గోప్యత, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత వంటి వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఇన్ఫీ పార్క్‌కు వాట్సాప్ ఇండియా అప్పగించింది. బుధవారం వర్చువల్‌గా ఈ డిజిటల్ అకాడమీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ప్రారంభించారు. చల్లా మధుసూధన రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కోర్సులో చేరడానికి 15,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరికి 10వ తేదీ నుంచి పది రోజులు పాటు శిక్షణ ఇచ్చి ఆన్లైన్ పరీక్ష ద్వారా వాట్సాప్ స్కిల్స్ స్టార్ కార్యక్రమానికి విద్యార్థులను ఎంపిక చేస్తారని చెప్పారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు వివిధ డిజిటల్ టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వీరు శిక్షణ తీసుకున్న రంగాల్లో ఉద్యోగం పొందడానికి వాట్సాప్ ఇండియా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అనేక వినూత్నమైన శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వాట్సాప్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండూరు అజయ్ రెడ్డి కోరారు. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం... విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి నైపుణ్యం కలిగించే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కింద 40 సాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.30.79 కోట్లు వ్యయం చేస్తోంది. -
సింగపూర్ తెలుగు ప్రజలకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించిన పీయూష్ గుప్త
సింగపూర్‌లో నివసించే తెలుగు సమాజం శ్రేయస్సు దృష్ట్యా అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందిచే విధంగా నవంబర్ 6న STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సింగపూర్ బ్యాంక్ డెవలప్వెంట్ ఆఫ్ సింగపూర్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పీయూష్ గుప్త హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వివిధ టెక్నాలజీ అంశాలతో పాటు, భవిష్యత్తులో రానున్న సాంకేతిక పరిణామాలు, దానికి మనందరం ఎలా సిద్ధంగా ఉండాలి వాటి పరిణామాలు, క్రిప్టో & డిజిటల్ కరెన్సీ, ముఖ్యంగా యువతకు మార్గనిర్ధేశం, స్ధిరత్వం, సమతూల్యత, జాతీయ సమగ్రత, గ్లోబర్ వార్మింగ్, సామన్యుల తలసరి ఆదాయం పెంచుకోవడానికి సూచనలు వంటి వివిధ విభిన్న అంశాలతో కూడిన “ఫైర్ సైడ్ చాట్ విత్ పీయూష్ గుప్తా” శీర్షికతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చక్కగా నిర్వహించారు. తదనంతరం వివిధ అంశాలపై వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు అంతర్దృష్టితో అత్యంత ఆలోచనా భరితంగా పీయూష్ గుప్తా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని భవిష్య ప్రణాళికను, అవసరాన్ని ప్రారంభోపస్యాసంలో వివరించారు. STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని పీయూష్ గుప్త సమక్షంలో అందరి వీక్షకుల నడుమ లాంచనంగా ఆవిష్కరించారు. సుమారు 20 సంస్ధల సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక అంశాల అవగాహనతో పాటు, జాతీయ సమగ్రతను పెంపొందిచుకొని అంతిమ ప్రయోజనాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమానికి వాఖ్యతగా కార్యదర్శి సత్య చిర్ల వ్యవహరించారు. ప్రతి నెల ఒక్కొక్క సాంకేతిక అంశం యొక్క అవగాహనా కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలని, సింగపూర్ తెలుగు సమాజం సహకారం అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 1000 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పీయూష్ గుప్తాతో పాటు మిగతా అతిధులకు, నందితా బన్నాకు, వివిధ సంస్ధల కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలుగుసమాజం కార్యవర్గానికి, వివిధ మాద్యమాల ద్వారా హాజరైన వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ శీర్షికలో డిసెంబర్ 4న సైబర్ సెక్యూరిటీపై పేపాల్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోరమ్ మెహతా, జనవరిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై లజాడా డేటా అండ్ ఎంటర్పైజ్ ఇంటలిజెన్స్ హెడ్ ముని వినయ్ లతో అవగాహనా కార్యక్రమం ఉంటుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంపై వీక్షకులు,నిపుణుల నుండి విశేష స్పందన లభించిందని, ఈ కార్యక్రమం తమ నైపుణ్యాలని పెంచుకోవటానికి, తద్వారా కెరీర్ పరంగా ముందుకెళ్లటానికి ఉపయోగపడుతుందని,తదుపరి ప్రోగ్రాం కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు. -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఈ–కామర్స్‌పై మరింతగా ఐటీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్‌కు ఊతం లభించిందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్‌తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా.. ఇదే ఆఖరి హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్ బ్యాడ్జ్‌ని ట్విట్టర్ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్‌కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా భారత్ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది. బ్లూ బ్యాడ్జ్ వివాదం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమన్న మాట. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించిన ట్విట్టర్ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్ నేతలు సురేష్ సోని, అరుణ్‌కుమార్, సురేష్ జోషి, కృష్ణ గోపాల్ ఖాతాల్లో వెరిఫైడ్ బ్లూ టిక్స్‌ను తొలగించింది. ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్ ఢిల్లీ యూనిట్ నాయకుడు రాజీవ్ మండిపడ్డారు. టెక్ ఫ్యూడలిజానికి ట్విట్టర్ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని ట్విట్టర్ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది. -
రూ. 8 లక్షల కోట్లకు ఈ–కామర్స్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో డిజిటల్ టెక్నాలజీల వాడకం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందనుంది. గతేడాది (2020లో) 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ 2024 నాటికి దాదాపు 111 బిలియన్ డాలర్ల్ల (సుమారు 8 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. దాదాపు 84 శాతం వృద్ధి సాధించనుంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ఎఫ్ఐఎస్ విడుదల చేసిన 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 41 దేశాల్లో ప్రస్తుత, భవిష్యత్ చెల్లింపుల ధోరణులను ఈ నివేదికలో విశ్లేషించారు. దీని ప్రకారం కోవిడ్–19 పరిణామాలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. చెల్లింపుల కోసం కొత్త విధానాలను ఉపయోగించడం పెరిగింది. ‘కోవిడ్–19 నేపథ్యంలో భారత్‌లో ఈ–కామర్స్ విభాగం భారీగా పెరిగింది. భవిష్యత్‌లో మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఐఎస్ వరల్డ్‌పే ఎండీ (ఆసియా పసిఫిక్) ఫిల్ పామ్ఫోర్డ్ తెలిపారు. పెరగనున్న మొబైల్ షాపింగ్..: నివేదిక ప్రకారం ఈ–కామర్స్ వృద్ధికి మొబైల్ ద్వారా కొనుగోళ్లు జరపడం ప్రధానంగా దోహదపడనుంది. వచ్చే నాలుగేళ్లలో మొబైల్ షాపింగ్ వార్షికంగా 21 శాతం మేర వృద్ధి చెందనుంది. 2020లో అత్యధికంగా ఉపయోగించిన చెల్లింపు విధానాల్లో డిజిటల్ వ్యాలెట్లు (40%), క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డులు (చెరి 15%) ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల మార్కెట్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా 2024 నాటికి 47 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా దేశీయంగా ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ’బై నౌ పే లేటర్’ (ముందుగా కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం) విధానం కూడా గణనీయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతానికి దీని మార్కెట్ వాటా 3%గానే ఉన్నప్పటికీ ... 2024 నాటికి ఇది 9%కి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పీవోఎస్ మార్కెట్ 41 శాతం వృద్ధి.. డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరిపేలా కస్టమర్లకు వెసులుబాటు కల్పించే సంస్థలే రాబోయే రోజుల్లో రిటైల్, ఈ–కామర్స్ మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలవని పామ్ఫోర్డ్ తెలిపారు. నివేదిక ప్రకారం దేశీయంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మార్కెట్ 2024 నాటికి 41 శాతం వృద్ధి చెంది 1,035 బిలియన్ డాలర్లకు చేరనుంది. స్టోర్స్‌లో చెల్లింపులకు అత్యధికంగా నగదు (34 శాతం), డిజిటల్ వ్యాలెట్లు (22 శాతం), డెబిట్ కార్డ్ (20 శాతం) విధానాలను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ 13 శాతం అప్.. వర్ధమాన దేశాల్లో అధిక వృద్ధి ఊతంతో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ–కామర్స్ మార్కెట్ 2024 నాటికి 13 శాతం వార్షిక వృద్ధి నమోదు సాధించే అవకాశం ఉంది. చైనాలో అత్యధికంగా ఈ–కామర్స్ వినియోగం అత్యధిక స్థాయిలో కొనసాగనుంది.