
శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమంలో డిస్క్ యాప్‌ను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థుల కోసం దేశంలోనే తొలిసారిగా డిజిటల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు వీడియో క్లాసులు, మోడల్ ప్రశ్నపత్రాలు, పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం మొత్తం పొందుపరిచిన ఈ–డిజిటల్ స్టడీ కిట్ (డిస్క్)ను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఐటీ కంపెనీ క్లౌడ్జ్, ఇంటర్ బోర్డు సంయుక్తంగా సిద్ధం చేసిన డిస్క్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు రూ.325 చెల్లించి దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
సబ్జెక్ట్ నిపుణులు కలసి రూపొందించడం వల్ల సిలబస్ ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. డిస్క్‌లోని పాఠాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, పాఠాలు వీలైనంత సరళమైన భాషలో ఉండేలా చూడాలని సూచించారు. క్లౌడ్జ్ ప్రతినిధి సుమంత్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిస్క్‌ను రూపొందించామని, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులన్నింటి సమాచారం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా ఈ యాప్‌ను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, డౌన్‌లోడ్ చేసుకున్నాక నెట్ లేకపోయినా పనిచేస్తుందని వివరించారు. డిజిటల్ తెలంగాణ ఆవిష్కరణలో భాగంగా ఏడాది కింద డిస్క్ తయారీ కోసం క్లౌడ్జ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లౌడ్జ్ ప్రతినిధి శ్యామల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
డిస్క్‌లో ఏముంటాయి?
- ఇంటర్‌లోని దాదాపు అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు
- బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, సమాధానాలు
- ఒక్కో అంశానికి సంబంధించిన సినాప్సిస్, కాన్సెప్ట్‌ల వివరణ
- ముఖ్యమైన 5,000 వీడియో పాఠాలు
- ఇంటర్ బోర్డు పాత ప్రశ్న పత్రాలు..
- ఎంసెట్, జేఈఈ, నీట్, సీఏ–సీపీటీలకు అవసరమైన సమాచారం
- సందేహాల నివృత్తికి అందుబాటులో నిపుణుల బృందం
- విద్యార్థి సన్నద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు
డిస్క్ ప్రత్యేకతలు..
- ఇంటర్నెట్ లేకపోయినా సమాచారం అందుబాటులో ఉంటుంది.
- డెస్క్‌టాప్‌తో పాటు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లలోనూ లభిస్తుంది.
- ‘డెస్క్ తెలంగాణ’అని టైప్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.