
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్పూరు మండలం చిన్న పెండ్యాల మీడియా సమావేశంలో రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో.
కేసీఆర్ వెంట ఉండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని, కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. కేసీఆర్ వెంట తిరిగి ఆస్తులు కూడ బెట్టుకున్నావ్. అలాంటి ఆలోచన నాకు లేదు. ఉమ్మడి వరంగల్ కు, స్టేషన్ ఘనపూర్ కు నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు.
కడియంకు సిగ్గుండాలి..
కేసీఆర్ చేసిన పనులను తామే చేశామని చెప్పుకోవడానికి కడియం శ్రీహరికి సిగ్గుండాలని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి,. స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధికి కడియం అడ్డుపడ్డారని, 100 పడకల ఆస్పత్రి ప్రారంభాన్ని సైతం ఆపారని పల్లా మండిపడ్డారు.