![Brs Mlc Kavitha Warning To Congress Government](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/kavitha1.jpg.webp?itok=g_o5O09l)
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.
‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.
అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్‌లు మాయమయ్యాయి.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.
రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment