దేశంలో 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులన్నీ కులీన వర్గాల కోసమే చేపట్టేవారనీ, తాము అధికారంలోకి వచ్చాకే పేదల సంక్షేమం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామనీ కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. జాతీయ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం స్వాతంత్య్రానంతరమే మొదలైంది. ఈ దార్శనికతే... టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమించింది. తర్వాతి ప్రభుత్వాలు ఈ పరంపరను కొనసాగిస్తూ తెచ్చిన... ప్యాసింజర్ రిజర్వేషన్, టెలిఫోన్, బ్యాంకింగ్ సేవల్లో కంప్యూటరీకరణ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేవలం డిజిటల్ టెక్నాలజీ ముందంజ ప్రాతిపదికగా, గత ప్రభుత్వాల హయాంలోని టెక్నాలజీలను చిన్నచూపు చూడటం తగదు.
అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. తాను సాధించిన అనేక విజయాలకు తోడుగా పేదలకు ప్రయోజనం కలిగించడానికి టెక్నాలజీని విస్తా రంగా ఉపయోగించడాన్ని అది ఎత్తిచూపుతోంది. గత వారం ఢిల్లీలో డ్రోన్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ... గతంలో, వర్తమానంలో టెక్నాలజీ ఉపయోగంలో ఉన్న వ్యత్యాసాలను పోల్చి చెప్పారు. 2014కు ముందు టెక్నాలజీని పేదల వ్యతిరేకిగా చిత్రించేవారనీ, దీన్ని ప్రజల సమస్యలలో ఒక భాగంగా పరిగణించేవారనీ మోదీ అభిప్రాయపడ్డారు.
తాము అధికారంలోకి రాకముందు పాలనలో టెక్నాలజీని ఉపయోగించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వాతావరణం ఉండేదనీ, దీని ఫలితంగా పేదలూ, మధ్య తరగతి ప్రజలూ అధికంగా బాధలకు గురయ్యేవారనీ మోదీ పేర్కొ న్నారు. గత పాలనా కాలాల్లో టెక్నాలజీని కులీనుల ప్రయోజనాల కోసం ఉద్దేశించినది మాత్రమే అని భావించేవారనీ, కానీ తమ ప్రభుత్వం టెక్నాలజీని ముందుగా ప్రజారాశులకు అందుబాటులోకి తెచ్చిందనీ చెప్పారు. అయితే ప్రధాని ప్రకటనలో రెండు అశాలు న్నాయి. ఒకటి: తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే భారత్ పరి పాలనలో టెక్నాలజీని వాడటం మొదలెట్టింది. రెండు: 2014కు ముందు ప్రభుత్వాలు వాడిన టెక్నాలజీ ఫలితాలు పేదలకు అందు బాటులో ఉండేవి కావు.
టెక్నాలజీ గురించి ఇలా సాధారణీకరించడం లేదా డిజిటల్ టెక్నాలజీ కోణం నుంచి మాత్రమే టెక్నాలజీని అంచనా వేయడం లేదా 2014కు ముందూ, 2014 తర్వాతా అనే చట్రంలో మాత్రమే టెక్నాలజీని అంచనావేయడం అనేది సమస్యాత్మకమే అని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి లేదా అంతకుముందు కూడా టెక్నాలజీతో భారతదేశం సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉండేది. మహాత్మాగాంధీ కాలం నుంచే సై¯Œ ్స, టెక్నాలజీ ఉపయోగం అనేది ప్రజల సంభాషణల్లో భాగమై ఉండేది. అయితే గాంధీ టెక్నాలజీ వ్యతిరేకి అని తప్పు ఆరోపణలకు గురవడం మరో విషయం. శ్రామిక ప్రజలను పక్కకు నెట్టి యంత్రాలను వాడటాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించారు తప్ప టెక్నాలజీని కాదు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ విషయానికి వస్తే... ప్రజల సంక్షేమానికీ, జాతీయ అభివృద్ధికీ, శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం గురించీ నెహ్రూ గొప్పగా ప్రబోధించారు.
ఈ దార్శనికతే... పరిశోధనా శాలలు, టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమిం చింది. అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ వంటి పలు అంశాల్లో సాంకేతిక జ్ఞానం ఆనాడే పురుడు పోసుకుంది. గత 75 సంవత్సరాల సాంకేతిక అభివృద్ధిలో భారత్‌ను సమున్నతంగా నిలపడంలో ఈ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయని ఎవరూ మర్చిపోకూడదు. దీనికి ఇటీవలి తిరుగులేని ఉదాహరణ కోవిడ్ టీకాలు!
రాజీవ్ గాంధీ హయాంలో 1980లలో టెక్నాలజీ వినియోగం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజీవ్ ప్రారంభించిన టెక్నాలజీ మిషన్లు నూనె గింజల నుంచి రోగనిరోధకత వరకు పలు రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాయి. ఆ సమయంలోనే యావత్ ప్రపంచం పర్సనల్ కంప్యూటర్ విప్లవానికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సాక్షీభూతమై నిలిచింది. టెలిఫోన్ సర్వీసులు, బ్యాంకింగ్, వాతావరణ అంచనా వంటి ఎన్నో ప్రజోపయోగ రంగాల మెరుగు దలకు ఈ పరిణామాలను సృజనాత్మకంగా ఉపయోగించు కోవడానికి అనేక ప్రాజెక్టులను దేశంలో మొదలెట్టారు.
ప్యాసింజర్ రైల్వే రిజర్వే షన్, డిజిటల్ టెలికామ్ స్విచ్, బ్యాకింగ్ రంగంలో కంప్యూటరీకరణ, సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ అభివృద్ది వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ప్రజలకు పర్సనల్ కంప్యూటర్ వంటి ఉపకరణం కావాలనీ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను వీరికి అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందనీ సూచించేవి కావు. ఎందుకంటే ఆనాటికి భారత్‌లో ఇంటర్నెట్ ఉనికిలోనే ఉండేది కాదు. అయినప్పటికీ సగటు మనిషికి మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఎంతగానో మేలు చేశాయి. ఎయిర్‌లై¯Œ ్స రిజర్వేష¯Œ లో కంప్యూటరీకరణకు ఎంతో ముందుగా ఈ ప్రాజెక్టులు ఉనికిలోకి వచ్చాయి. కాబట్టి ఆనాటి టెక్నా లజీ ప్రయోజనాలు మొదటగా కులీన వర్గాలను లక్ష్యంగా చేసుకో లేదన్నది నిజం.
కాబట్టి 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులు, భావనలు అనేవి కులీన వర్గాలకు సంబంధించినవే తప్ప అవి పేదలకు ప్రయోజనం కలిగించలేదనడం చాలా తప్పు. అయితే ఆనాటి కొత్త ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవచ్చు. అంత కచ్చితంగా అవి పని చేయకపోయి ఉండవచ్చు. కానీ భారతీయ సాంకేతిక జ్ఞాన ప్రయా ణంలో ఇవి కీలకమైన మూలమలుపులుగా నిలిచాయి.
మొబైల్ ఫోన్ల ధరలు తగ్గడం, తక్కువ డేటా ప్రైజ్‌లతో ఇంటర్నెట్ ప్రాప్యత తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, ఛోటా రీజార్జ్ వంటి మార్కెటింగ్ ఆవిష్కరణలు గత రెండు దశాబ్దాల కాలంలో డిజిటల్ టెక్నాల జీలనూ, వాటి అప్లికేషన్లనూ బాగా ముందుకు తీసుకుపోయాయి. లక్ష్యంగా పెట్టుకున్న సబ్సిడీల పంపిణీకి ప్రభుత్వాల చేతికి ఆధార్ ఆవిష్కరణ గొప్ప ఉపకరణాన్ని అందించింది. అయితే బయోమె ట్రిక్స్ ఆధారిత ఐడెంటిఫికేషన్ సిస్టమ్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీతో సమ్మేళనం వంటివి ఒక్క సబ్సిడీల పంపిణీకి మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అప్లికేషన్ల కల్పనకు దారితీశాయి.
తాము సాధించిన గొప్ప విజయాల్లో జామ్ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) ఒకటని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పు కుంటోంది. యూపీఐ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్ వ్యాప్తిని కూడా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ దీన్ని సాధించడం కోసమే పెద్ద నోట్ల రద్దు వంటి చేదుమాత్రను దేశమంతటికీ తినిపించాల్సి వచ్చిందని ప్రభుత్వం నేటికీ ఒప్పుకోవడం లేదు.
పైగా డిమాండ్ ఆధారిత వృద్ధి ఫలితంగా ఈ కొత్త ఆవిష్కరణలు ముందుకు రాలేదని గ్రహించాలి. మరోవైపున ఆధార్ ఉపయోగం ఎంత సర్వవ్యాప్తిగా మారిపోయిం దంటే... కంపెనీలు, బ్యాంకులు వంటి వాటితో యునీక్ ఐడెంటిఫి కేషన్ నంబర్‌ను షేర్ చేయాల్సి రావడం గురించి విద్యావంతులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే వినియోగదారులు తమ ఐడీ నంబర్లను ఎవరికీ షేర్ చేయవద్దని ‘ఉడాయ్’ ప్రజలకు బోధిస్తూ మెసేజ్ పంపింది కానీ ఆ మరుక్షణమే ప్రభుత్వం దాన్ని తొలగించడం గమ నార్హం. ఏదేమైనా ఇది మరింతగా గందరగోళాన్ని ఏర్పర్చింది. బయో మెట్రిక్స్, క్లోనింగ్, ఫిషింగ్ వంటి వాటి కారణంగా ప్రత్యక్ష నగదు బదలాయింపు వ్యవస్థలో తప్పుడు కేసులు బయటపడుతున్నాయి.
పెద్దనోట్ల రద్దు అనేది డిజిటల్ పేమెంట్ల వైపుగా ప్రజలను బలవంతంగా మళ్లించినట్లే, ఆన్‌లైన్ క్లాసులు, ఇ–హెల్త్ వంటి అప్లికేషన్ల కోసం డిజిటల్ ఉపకరణాలను మరింతగా ఉపయోగించేలా కరోనా మహమ్మారి యావన్మంది ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. ఈ రెండు కేసుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నాసిరకం కనెక్టివిటీ, డివైజ్‌ల ప్రాప్యత తీవ్ర అవరోధాలను కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు గానూ తమ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం విద్యార్థులు ఊళ్లలో చెట్లమీదికి ఎక్కుతున్న ఫొటోలు, బయోమెట్రిక్ ఆథరైజేషన్ కోసం పెద్దలు పడుతున్న పాట్లు వైరల్ అయి డిజిటలైజేషన్ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసిపడేశాయి.
ప్రతి గ్రామాన్నీ ఫైబర్ ఆప్టిక్స్‌తో కనెక్ట్ చేసే ప్లాన్ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఇకపోతే ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ నిదానంగా అంతరించే వైపు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్‌తో, ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఏర్పడుతున్న సమస్యలు ఒకవైపూ... ప్రతిచేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి క్షేత్రంలో డ్రోన్, ప్రతి ఇంట్లో సౌభాగ్యం అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాద రూపంలోని ప్రచారార్భాటం మరోవైపూ దేశంలో సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి.
వ్యాసకర్త: దినేష్ సి. శర్మ, సైన్స్ విషయాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment