Sakshi Guest Column On India Own Astronaut Into Space, See Details Inside - Sakshi
Sakshi News home page

పరువు దక్కించుకునే ప్రయాణమా?

Published Fri, Jul 7 2023 3:47 AM | Last Updated on Fri, Jul 7 2023 11:41 AM

Sakshi Guest Column On India own astronaut into space

భారత్‌ సొంతంగా ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. అలాంటప్పుడు ‘నాసా’ ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమిటి? యూఏఈ, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారు. మన వ్యోమగాములను కూడా పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది.

ఏదోలా మానవుడిని అంతరిక్షంలోకి పంపటం మన ప్రాధమ్యం కాదు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని మోదీ 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేరలేదు. దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా బహుశా ఇలా మన వ్యోమగామిని అక్కడికి పంపనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన ఒప్పందాలు చాలానే జరిగాయి. వాటిల్లో అంతరిక్ష రంగానికి సంబంధించినవి కూడా రెండు ఉన్నాయి. ఒకటేమో శాంతి యుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణకు ఉద్దేశించిన ‘ఆర్టి మిస్‌ అకార్డ్స్‌’. (ఆర్టిమిస్‌ అనేది ఒక గ్రీకు దేవత పేరు.) అమెరికాలో భారతీయ రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నీల్సన్  సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండో ఒప్పందం... 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌) పంపే భారతీయ వ్యోమగామికి అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రాయోజకత్వం వహించడం! భారత్, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలు దౌత్యపరంగా, సైన్స్ పరంగా చారిత్రాత్మకమైన వని వర్ణిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కుదుర్చుకున్న 2008 నాటి భారత్‌– అమెరికా అణు ఒప్పందంతో వీటిని పోలుస్తు న్నారు. అయితే వాస్తవం దీనికి చాలా భిన్నం. 

భారత్‌ సొంతంగానే ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కార్యక్రమం ఒకవైపు నడుస్తూండగానే అమెరికా ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి నిర్వహించిన విలేఖరుల సమా వేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ– ‘‘ఆర్టిమిస్‌ అకార్డ్స్‌లో భాగం కావాలన్న నిర్ణయం ద్వారా అంతరిక్ష సహకారంలో నేడు మేలిమి ముందడుగు వేశాం. క్లుప్తంగా చెప్పాలంటే భారత్‌ – అమెరికా భాగ స్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదు’’ అని వ్యాఖ్యానించారు. 

భారత్‌లోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ‘‘మనం నర్సరీ రైమ్స్‌ పాడుకుంటున్న సమయంలోనే జాబిల్లి ఉపరితలంపై మనిషి కాలిడేలా చేసిన అమెరికా లాంటి దేశం జాబిల్లిపై ప్రయోగాల విషయంలో మన నుంచి సమాచారాన్ని, నైపుణ్యాన్ని ఆశిస్తోందంటే అంతకంటే గర్వకారణమైన విషయం ఇంకోటి ఉంటుందా?’’ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, అంతరిక్ష, అణుశక్తి రంగాల పర్యవేక్షకులైన జితేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్య ఇది.

అంతేకాదు, ఆర్టిమిస్‌ ఒప్పందం అంతరిక్ష రంగానికి సంబంధించిన కీలక టెక్నాలజీల దిగుమతిపై ఉన్న నియంత్రణలు తొలగేందుకు మార్గంగా మారతుందని కూడా ఆయన అన్నారు. ఫలితంగా భార తీయ కంపెనీలు అమెరికా మార్కెట్ల కోసం కొత్త కొత్త ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సత్తా సంపాదిస్తాయని చెప్పారు. 

ఆర్టిమిస్‌ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం లేదా ట్రీటీ, ప్యాక్ట్‌ కాదు. ఆర్టిమిస్‌ కోసం భారతీయ నైపుణ్యాన్ని, సమాచారాన్ని కూడా కోరడం లేదు. జాబిల్లిపై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఆర్టిమిస్‌ లక్ష్యం. కీలక టెక్నాలజీల దిగుమతిపై నియంత్రణలు తొలగించే ప్రస్తా వన కూడా ఆర్టిమిస్‌ ఒప్పందంలో లేదు. నాసా వెబ్‌సైట్‌లో, జూన్‌ 23 నాటి నాసా పత్రికా ప్రకటనలో ఉన్న సమాచారం ప్రకారం... అంత రిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం అన్వేషించడం, ఈ అన్వే షణకు సంబంధించి కొన్ని సాధారణ నియమ నిబంధనలు మాత్రమే ఉన్నాయి.

పారదర్శ కత, అంతరిక్షంలో సిబ్బందికి సహకారం, ఖగోళ వస్తువుల నమోదు, శాస్త్ర సమాచారాన్ని విడుదల చేయడం, అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సుస్థిర పద్ధతుల్లో అంతరిక్షాన్ని వాడు కోవడం వంటివి. మంత్రి చెప్పిన ప్రకారం, ఒకవేళ నాసా భారత్‌ సహ కారాన్ని కోరుతున్నా... లేక దిగుమతులపై నిబంధనలను సడలించిందన్నా... నైజీరియా, రువాండా, బెహ్రాయిన్, కొలంబియా, ఈక్వడార్‌ వంటి దేశాలతో కూడా నాసా ఇదే తరహా ఒప్పందాలు చేసుకుంది. 

భారతదేశం ఆర్టిమిస్‌ అకార్డ్‌లో భాగమైన 27వ దేశమన్నది గుర్తుంచుకోవాలి. పైగా ఈ ఒప్పందాలన్నీ స్వచ్ఛందమైనవే. ఆర్టిమిస్‌ అకార్డ్‌ ఉద్దేశం బయటకు కనిపిస్తున్న దానికంటే చాలా భిన్నమైంది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మరోసారి అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దీన్ని సృష్టించిందనాలి. చైనాతోపాటు ప్రైవేట్‌ అంతరిక్ష కంపెనీలు అనేకం మనుగడలోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందం ఒకటి అవసరమైంది. ఈ ఒప్పందాల ద్వారా అంతరిక్ష రంగానికి సంబంధించిన కొత్త నియమ నిబంధనలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది.

అంతరిక్ష రంగానికి సంబంధించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో రూపొందిన చట్టాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఈ కాలానికి తగ్గ ట్టుగా మార్చాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశాలను ముందుగానే పసి గట్టిన చైనా, రష్యా, జర్మనీ, యూరోపియన్  స్పేస్‌ ఏజెన్సీ వంటివి ఆర్టి మిస్‌కు దూరంగానే ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

ఆర్టిమిస్‌ ఒప్పందంలో పదాలను చాలా తెలివిగా ఉపయోగించారు. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీకి (ఐక్యరాజ్య సమితి సిద్ధం చేసింది. 1967 జనవరి 27వ తేదీ నుంచి దేశాల ఆమోద ముద్రను ఆహ్వానిస్తున్నది)  కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెబుతూనే కొన్ని కొత్త విష యాలను ఇందులోకి చేర్చారు. ఈ ఒప్పందంలో వ్యోమగాముల రక్షణ వంటి విషాయల్లో ఐక్యరాజ్య సమితి ఒప్పందంతోపాటు ఖగోళ వస్తువుల వల్ల కలిగే నష్టానికి బాధ్యులపై 1972లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందానికీ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

కానీ... ఆర్టిమిస్‌లో అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సహజ వనరుల వినియోగానికి సురక్షిత ప్రాంతాల ఏర్పాటు (ఐక్యరాజ్య సమితి ఒప్పందాలకు భిన్నంగా) వంటి ఆలోచనలను జొప్పించారు. ఆర్టిమిస్‌ అకార్డ్‌ భవిష్య త్తులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి చేసే అంతరిక్ష ఒడంబడికలోని ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఉద్దేశించిన ట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బహుముఖీన సిద్ధాంతాలను తోసి రాజన్నారు. భారత్‌ ఇవేవీ ఆలోచించకుండా దౌత్యపరమైన వలలో చిక్కుకుంది. దేశీయంగా ఎలాంటి చర్చ జరపకుండా, అంతరిక్ష చట్టం ఏదీ చేయకుండా ‘ఊ’ కొట్టేసింది. 

అమెరికాతో కుదిరిన అంతరిక్ష ఒప్పందాల్లో ఇంకోటి వచ్చే ఏడాది నాసా భారతీయ వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం. ఇది కూడా చాలా చిత్రమైందనే చెప్పాలి. ఎందుకంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్‌ ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నలుగురు వ్యోమగాములు రష్యాలో శిక్షణ కూడా పొందుతున్నారు. అమెరికా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమ గాములను పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది.

ఎందుకు చేయలేదంటే, మానవుడిని అంతరిక్షంలోకి పంపటం ఇస్రో ప్రాధమ్యం కాదు కాబట్టి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇప్పటివరకూ 21 దేశా లకు చెందిన 269 మంది వ్యోమగాములు అక్కడికి వెళ్లారు. అమెరికా, యూరోపియన్  దేశాలను మినహాయించినా యునైటెడ్‌ అరబ్‌ ఎమి రేట్స్, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు భారత్‌ సొంతంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడికి వ్యోమగామిని పంపేందుకు తొందర పడటం ఎందుకు? భారత్‌ స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేర లేదు. అందుకే దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా, పరువు దక్కించు కోవడానికి బహుశా ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమ గామిని పంపనున్నారు.

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement